తెల్ల పావురం - అచ్చంగా తెలుగు
 తెల్ల పావురం
 శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటివృత్తి రీత్యా నెల్లూరు నుంచి విజయవాడకు మకాం మార్చాం. అద్దె ఎక్కువైనా ఫర్వాలేదని ఒక మంచి డీసెంట్ లొకేషన్ లో ముందు, వెనుక ఖాళీ స్థలం ఉండే ఓ అపార్ట్మెంట్ పెంట్ హౌస్ లో అద్దెకు దిగాం. వారం రోజులపాటు వస్తువులు, పుస్తకాలు అన్నీ సర్దుకోవడంలో మునిగిపోయాం.

ఆరోజు శెలవు రోజే అయినా... అలవాటు ప్రకారం పొద్దున్నే మెలకువ వచ్చేసింది. హాల్లోకి వచ్చేసరికి మా అమ్మ ఈనాడు ఆదివారం పుస్తకంలోని పదవినోదం నింపుతోంది. ఆఫీసుకు వెళ్లే హడావుడి లేదు కనుక మామూలుగా హాల్లో కూర్చుని పేపర్ చూస్తూ టీ తాగే అలవాటున్న నేను, ఆరోజు మా ఫ్లాట్ ఉత్తర భాగంలో ఉన్న ఖాళీ స్థలంలో టీ తాగుదామనుకుని కుర్చీ తీసుకుని, ఆ వైపు ఉన్న మెష్ డోర్ తీసుకుని బయటకు వెళ్ళబోయాను. ఇంతలో మా అమ్మ "ఒరే ఒరే అటు వెళ్ళకురా.... పావురాలెగిరిపోతాయి" అంది. పావురాలెక్కడివమ్మా? అన్నాను ఒకింత ఆశ్చర్యంతో. "మన బాల్కనీలోకి రోజూ పావురాలొస్తున్నాయి రా... వాటికేదో నాలుగు బియ్యపు గింజలు వేస్తున్నాను రోజూ... తినెళ్ళిపోతాయ్. నువ్విప్పుడు అటెళ్ళావంటే అవి ఎగిరిపోతాయి రా" అభ్యర్థనగా అంది అమ్మ. నేను ఆ ఇల్లు అద్దెకు తీసుకున్నదే ఎప్పుడైనా ఆరుబయట అలా హాయిగా కూర్చుని కాఫీయో, టీయో తాగుతూ రోడ్డుమీద వచ్చే పోయే వాళ్లను చూస్తూ పరిసరాలను ఆస్వాదించవచ్చు, ఎప్పుడైనా కాస్త అటూ ఇటూ పచార్లు చెయ్యొచ్చు అని. ఇప్పుడు అమ్మేమో అటువైపు వెళ్లొద్దంటోంది. కొంచెం నిరుత్సాహంగా అనిపించినా... సరే అమ్మ ముచ్చట కాదనడం ఎందుకని హాల్లోనే కూర్చున్నాను. 

మరో వారం గడిచాక నేను అలాగే హాల్లో కూర్చుని ఏదో వ్రాసుకుంటూ ఉంటే... ఉత్తరం వైపున్న మెష్ డోర్ తీసుకుని మా అమ్మ హాల్లోకి వచ్చింది. వచ్చీరాగానే నన్ను చూసి ఉత్సాహంగా "మొదట్లో ఓ అయిదారు పావురాలు వచ్చిపోతూ ఉండేవిరా.... ఇప్పుడు ఇంచుమించు ఇరవై పాతిక వరకూ వచ్చి తిని పోతున్నాయి." ఏదో తెలియని ఆనందం మా అమ్మ మాటల్లో...20 పాతిక పావురాలు అనేటప్పటికీ నేను కూడా ఉత్సాహంగా లేచి మెష్ డోర్ దగ్గరికి వెళ్లి చూశాను. గుంపుగా పావురాలు బియ్యం ఏరుకు తింటున్నాయి. మా బాల్కనీలో అన్ని పావురాలను ఒక్కసారి చూసేటప్పటికి నాక్కూడా ముచ్చటనిపించి ఫోటో తీద్దామని ఫోన్ చేతికి తీసుకుని మెష్ డోర్ తెరవబోయాను. ఇంతలో మా అమ్మ "ఒరేయ్ నువ్వటెళ్లకు అవి ఎగిరిపోతాయ్" అంటూ నన్ను వారించింది. సరే అని నేను కూడా మెష్ డోర్ ఇవతలి నుంచే ఫోటో తీసుకున్నాను. అలవాటు ప్రకారం ఆ ఫోటోను సోషల్ మీడియాలో ఉంచి మా అమ్మ వాటికి ప్రతిరోజూ బియ్యం వేస్తున్న వైనాన్ని నాలుగైదు వాక్యాలలో వివరించాను కూడా.

ఆరోజు ఆఫీస్ కి వెళ్ళాక ఏదో విషయం మాట్లాడడానికి ఓ మిత్రుడు ఫోన్ చేశాడు. మాటల్లో నా సోషల్ మీడియా పోస్ట్ విషయం ప్రస్తావనకొచ్చింది. " అన్నా పావురాలకు గింజలు వెయ్యొద్దని అమ్మకు చెప్పన్నా. పాడు పావురాలు వాటి వల్ల శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు." అన్నాడు. నేనది తీసుకొచ్చి మా అమ్మకి చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లోనూ పావురాలకు బియ్యం వెయ్యొద్దని గట్టిగా చెప్పాను. మా అమ్మ కూడా సరేనంది.

ఆ తర్వాత రెండు మూడు రోజులు నేను మా అమ్మ యాక్టివిటీని గమనించలేదు. ఓ రోజు పొద్దున్నే నేను హాల్లో కూర్చుని ఉంటే మా అమ్మ వచ్చి సోఫాలో నా పక్కన కూర్చుంది మెష్ డోర్ వైపే చూస్తోంది. అక్కడ నాలుగైదు పావురాలు వచ్చి గింజలు లేకపోవడం చూసి మళ్లీ ఎగిరెళ్ళిపోతున్నాయి. మళ్లీ కొద్దిసేపటికి మరికొన్ని వచ్చి చూసుకుని వెళ్ళిపోతున్నాయి. అది చూసి మా అమ్మ దిగులుగా... "పాపం అవి వచ్చి గింజలు లేకపోవడం చూసి వెళ్ళిపోతున్నట్టున్నాయిరా... " అంది. ఆ పావురాలకు బియ్యం వెయ్యలేకపోవడం మా అమ్మను బాధిస్తోందని నాకనిపించింది.

మరో రెండు రోజుల తర్వాతనుకుంటాను... నేను ఆఫీసులో ఏదో పనిలో ఉండగా మా ఆవిడ హడావుడిగా ఫోన్ చేసింది. " అత్తమ్మ కళ్ళు తిరుగుతున్నాయంటోంది. చెమటలు పడుతున్నాయి. నీరసంగా ఉంది." అన్నది సారాంశం. నేను హుటాహుటిన ఇంటికి బయల్దేరి వచ్చి అమ్మకు బీపీ చెక్ చేశాను. లో బిపి ఉంది. వెంటనే దగ్గరలో ఉన్న ఓ కార్పొరేట్ ఆసుపత్రికి పరుగు తీశాం. వాళ్ళు ఏవేవో పరీక్షలు చేసి యాంజియోగ్రామ్ చెయ్యాలన్నారు. సరే కానిమ్మన్నాం. అదృష్టవశాత్తు యాంజియోలో ఎలాంటి ఇబ్బంది లేదు. మూడు రోజుల తర్వాత డిశ్చార్జై హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తూ ఉండగా మా అమ్మ పావురాలు వస్తున్నాయా? అని అడిగింది. " నీరసంగా. పొద్దున్నే వచ్చి పోతున్నాయి" మా ఆవిడ సమాధానం. నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ కొద్ది కాలంలోనే మా అమ్మకు ఆ పావురాలతో ఒక ఎమోషనల్ బాండింగ్ ఏర్పడిందేమోననిపించింది నాకు. ఇంత పెద్ద ఇబ్బందిని తప్పించుకుని క్షేమంగా ఇంటికి తిరిగి వస్తున్న వేళ.... ఆమె పావురాల గురించే ప్రశ్నిస్తోందంటే... ఆమె అనారోగ్యానికి కూడా ఖచ్చితంగా వాటికి నాలుగు బియ్యపు గింజలు వెయ్యలేకపోతున్నానే... అన్న దిగులే కారణమై ఉంటుందని నాకు అనిపించింది. నేను చిన్నగా మా అమ్మ చేతిని నా చేతిలోకి తీసుకున్నాను. చేతి మీద ఐవీ కానులా తీసిన గుర్తు, అది గుచ్చిన చోట ఎర్రగా గడ్డ కట్టిన రక్తపు చార. చెయ్యి కూడా కొద్దిగా వాచి ఉంది. నాకు మనసంతా ఏదోలా అయిపోయింది. ఉబికి వస్తున్న కన్నీటిని అదిమి పట్టుకుని చిన్నగా మాట పెకలించుకుని చెప్పాను... " రేపట్నుంచి పావురాలకు బియ్యం వెయ్యమ్మా..." అని. కొన్ని క్షణాలు నా వైపు అలాగే చూసి నిస్సత్తువ వల్లనేమో కారులో అలా వెనక్కి వాలింది.

పొద్దున నేను నిద్రలేచేటప్పటికే అమ్మ పావురాలకు బియ్యం వేస్తోంది. తర్వాత వచ్చి నా పక్కన కూర్చుంది. ఏవో మామూలు మాటలు మాట్లాడుకున్నాం. ఆ తర్వాత కొద్ది రోజులకు నెమ్మదిగా పొద్దున్నే ఆమె మకాం బాల్కనీలోకి మారిపోయింది. పావురాలకు బియ్యం వేసి అవి ఏరుకు తింటూ ఉంటే వాటిని చూస్తూ.... ఏ పేపరో, పుస్తకమో చదువుకోవటమో లేదా తల దువ్వుకోవడమో చేస్తూ ఉండేది. మేమెవరిమైనా అటువైపు వెళ్ళగానే బిలబిలమంటూ ఎగిరిపోయే పావురాలు మా అమ్మ అక్కడే కూర్చుని ఉన్నా ఎటూ కదలకుండా, బెదరకుండా గింజలు ఏరుకు తినడం చూసి ఆశ్చర్యపోయాను. ఓరోజు పొద్దున్నే మా అమ్మ బాల్కనీ తలుపు తీసుకుని హాల్లోని నా దగ్గరికి వచ్చి "వాటికి ఆ బియ్యం సయిస్తున్నట్టు లేదురా. సజ్జలు, జొన్నలు వంటివేమైనా తెప్పించు." అని చెప్పింది. "ఓహో... వాటికి స్పెషల్ మెనూ కూడానా?" అంటూ నవ్వాను. ఆ రోజే కొన్ని సజ్జలు, జొన్నలు తెప్పించాను. మళ్లీ ఓ రెండ్రోజుల తర్వాత మా అమ్మ ఆనందంగా చెప్పింది "గింజలు మార్చి మార్చి వేస్తూ ఉంటే అవి చక చక తినేస్తున్నాయిరా..." అని. కుమార్తెలు లేని నాకు మా అమ్మ ఆ క్షణంలో ఓ బుజ్జి పాపాయిలాగా కనిపించింది. ఆ తర్వాత నెలలో మా ఆవిడ వ్రాసి నా చేతికిచ్చిన పచారీ సామాన్ల చీటీలో సజ్జలు, జొన్నలు కూడా చోటుచేసుకుని ఉండడం గమనించాను. అప్పటినుంచి మా సామాను పట్టీలో అవి కామనైపోయాయి.

కొన్నాళ్లకు ఓ రోజు అందరం నిద్రకుపక్రమించే వేళ మా అమ్మ " ఒరే... ఆ పావురాలు మొదట్లో ఓ ఇరవై పాతిక వస్తూ ఉండేవా... ఇప్పుడు ఒక్కో రోజు పది పన్నెండు, ఒక్కో రోజు 15 అలా వస్తున్నాయిరా. మిగతా పావురాలు ఏమైపోయాయో అర్థం కావడం లేదు." అంది. ఆ తర్వాతి రోజు ఆఫీసులో.... మా కొలీగ్ ఒకరు "పావురాళ్ల మాంసం పక్షవాతానికి బాగా పనిచేస్తుందని ఓ నమ్మకం సార్. బహుశా దానికోసం ఎవరైనా పావురాలు పట్టుకెళ్తూ ఉన్నారేమో?" అన్నారు. ఆ రాత్రికి ఆ మాటే నేను మా అమ్మతో అంటే.... "అరే... వాళ్ల పక్షవాతం పాడుగానూ... వాళ్ల జబ్బు నయం చేసుకోవడానికి ఈ బుజ్జి పావురాలే దొరికాయా?" అని మా అమ్మ ఆగ్రహాన్ని, ఆవేదనను వెల్లడించింది.

అలా కొన్నాళ్లు గడిచాక ఓ రోజు మా అమ్మ నాతో దిగులుగా " ఒరే ఆ పాపిష్టోళ్లు పావురాలన్నీ పట్టుకు తినేసినట్టున్నార్రా...‌. ఓ తెల్లటి పావురం తప్ప మరేవీ రావటం లేదు. అయితే ఆ తెల్ల పావురం ఎంత ముద్దుగా ఉంటుందనీ? దీన్నైనా ఎవరూ పట్టుకు పోకుండా ఆ దేవుడు కాపాడితే బాగుండు." అన్నది. ఓ రోజు పొద్దున నేను కూడా ఆ పావురాన్ని చూడడం తటస్థించింది. పావురం మా అమ్మ చెప్పిందానికంటే ఇంకా ముద్దుగా ఉంది. తెల్లటి రెక్కలు మెడవరకూ బూడిద రంగు. దాన్ని చూడగానే ఎవరికైనా బహు ముచ్చటేస్తుంది. ఆ తర్వాత కొన్నాళ్ళకు మేము మా తమ్ముడి కుటుంబంతో కలిసి అన్నవరం దేవస్థానానికి వెళ్ళాం. దర్శనమై బయటకొచ్చాక అందరం ఆ సత్య దేవుణ్ణి ఏమేం కోరుకున్నామో మాట్లాడుకుంటూ వస్తున్నాం. మా అమ్మ వంతు వచ్చేసరికి, మా అమ్మ చెప్పిన మాట " స్వామీ నా ఆయుష్షును కూడా తీసుకుని ఆ బుజ్జి పావురాన్ని కాపాడు. అని కోరుకున్నాన్రా." అని చెప్పింది. ఆశ్చర్య పోవడం మా వంతైంది. "ఇంతమందిమి కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్లం ఉండగా నీకు ఆ పావురం యోగక్షేమం కావాల్సొచ్చిందా?" అంటూ అందరం కలిసి అమ్మని ఆటపట్టించాం కూడా.

అన్నవరం నుంచి తిరిగొచ్చాక ఓరోజు పొద్దున్నే బాల్కనీలోకి తొంగి చూసి అక్కడి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాను నేను. మా అమ్మ కుర్చీలో కూర్చుని ఉంది. తన కాళ్లకు దగ్గరగా కొన్ని గింజలు ఉన్నాయి. ఆ తెల్ల పావురం ఆ గింజలను ఏరుకు తింటోంది. మా అమ్మ దానితో " ఏంటే నిన్న నాలుగ్గింజలే తిని ఎగిరిపోయావ్? మధ్యలో ఊరెళ్ళానని అలిగావా ఏంటి?" అంటూ అడుగుతోంది. అది చూసి నేను పెద్దగా నవ్వుతూ‌... " ఏంటమ్మా దాంతో మాట్లాడుతున్నావ్?" అంటూ బాల్కనీలోకి వెళ్లాను. విచిత్రంగా అప్పటివరకూ మా అమ్మ కాళ్ల దగ్గరి గింజలు నిర్భయంగా ఏరుకు తింటూ ఉండిన పావురం నా అలికిడి కాగానే తుర్రున ఎగిరిపోయింది. "ఒరే‌... తినేదాన్ని తరిమేసావు కదరా?" అంటూ మా అమ్మ చిరుకోపం ప్రదర్శించింది. "మళ్లీ వస్తుందిలేమ్మా" అంటూ నేను నవ్వుతూ జరిగిన విషయం మా ఆవిడకి, పిల్లలకి కూడా చెప్పి నవ్వుకుని మా అమ్మను ఆటపట్టించాం. మా తమ్ముళ్ళక్కూడా ఫోన్లో విషయం చెప్పి సరదాగా నవ్వుకున్నాం. మా అల్లరికి మా అమ్మ కూడా కాస్త సిగ్గుపడింది.

కొన్ని రోజుల తర్వాత ఓ రోజు రాత్రి మా అమ్మ మా ఆవిడతో "ఈ పూటకి కాసింత మజ్జిగన్నం, ఊరగాయ బద్ద చాలే. చపాతీలు, కూరలు నేను తినలేను." అని కొద్దిగా మజ్జిగన్నం తిని పెందరాడే పడుకుండిపోయింది. నేను అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉండగా "ఒరే నాన్నా..." అన్న మా అమ్మ పిలుపు విని ఉలిక్కిపడి నిద్రలేచాను. "గుండెల్లో ఏదో భారంగా ఉందిరా. ఎవరో గట్టిగా అదిమి పట్టుకున్నట్టుగా అనిపిస్తోంది. ఇంత ఏసీలో కూడా చెమటలు పట్టేస్తున్నాయ్." అంది. వెంటనే బీపీ చెక్ చేశాను. చాలా తక్కువగా ఉంది. హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లాం. కొద్దిసేపటికే అమ్మ కోమాలోకి వెళ్ళిపోయింది. పరీక్షలు, చికిత్సలు చేశారు. " పెద్దావిడ ట్రీట్మెంట్ కి రెస్పాండ్ కావడం లేదండీ. మరో 48 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేం." అన్నారు డాక్టర్ గారు కళ్లద్దాలు సవరించుకుంటూ. ఊరి నుంచి మా తమ్ముళ్ళు, మరదళ్ళు కూడా వచ్చేశారు. డాక్టరు చెప్పినట్టుగా 48 గంటలు కూడా గడవలేదు. అందరం ఉబికి వస్తున్న దుఃఖాన్ని అదిమి పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఒకరినొకరు సముదాయించుకునే పరిస్థితి కూడా లేదు. ఎలాగోలా డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ పూర్తిచేసుకుని ఇంటికి వచ్చాం. విషయం తెలిసి విజయవాడలోని మిత్రులు, ఊళ్ళ నుంచి రావాల్సిన దగ్గరి బంధువులు అందరూ వచ్చేశారు. ఒకటిన్నర మూడు రాహుకాలం దాటేశాక ఆరోజు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. బంధువులు, స్నేహితులు అందరూ విషణ్ణ వదనాలతో అమ్మతో తమ జ్ఞాపకాలను, ఆప్యాయమైన ఆమె పలకరింపును, ఆతిథ్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఆ తెల్ల పావురం ఎగురుకుంటూ గ్రౌండ్ ఫ్లోర్లో అమ్మ పార్థివ దేహాన్ని ఉంచిన చోటుకు వచ్చేసింది. మొదట ప్రహరీ గోడమీద వాలి అక్కడి నుంచి అమ్మను ఉంచిన ఆ అద్దాల పెట్టె మీదకు చేరింది. ఒక్కసారిగా అక్కడంతా నిశ్శబ్దం ఆవరించింది. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా ఆ పెట్టె మీద అలాగే కొద్దిసేపు నుంచుని ఎలా వచ్చిందో అలా ఎగిరరెళ్ళిపోయింది.

ఆ తర్వాత దశదినకర్మలు అవన్నీ యధావిధిగా పూర్తయిపోయాయి. వచ్చిన వారందరూ అమ్మ ఆత్మీయ పలకరింపును, పెట్టే గుణాన్ని స్మరించుకునే వారే. కొన్నాళ్ళకు దుఃఖాన్ని దిగమింగుకుని మేమందరం చిన్నగా రొటీన్ లో పడ్డాం. ఆ తెల్ల పావురం మళ్లీ కనిపించలేదు. మొదట్లో కొద్ది రోజులు "ఆ తెల్ల పావురం ఏమైపోయిందో.... దాన్ని కూడా ఎవరైనా పట్టుకు తినేశారేమో" అనుకుంటూ ఉండేవాళ్ళం. నెమ్మదిగా అందరం దాని విషయం మర్చిపోయాం.

అమ్మ పోయి ఏడాదైపోయింది. తిధి ప్రకారం సంవత్సరీకం చేయ తలపెట్టాం. దగ్గర చుట్టాలను, స్నేహితులను ఆహ్వానించాం. ఆ సంవత్సరీకం రోజు పంతులుగారు మంత్రాలు చదువుతున్నారు. మేము ముగ్గురం అన్నదమ్ములం పంతులు గారి ఎదురుగా కూర్చుని క్రతువు నిర్వహిస్తున్నాం. ఆడాళ్లు, పిల్లలు వచ్చిన వాళ్లను పలకరిస్తున్నారు. సన్నిహితులు కొందరు భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో బాల్కనీలోకి ఆ తెల్ల పావురం వచ్చింది. అటూ ఇటూ తిరుగుతోంది. పంతులుగారు చెప్పిన క్రతువు నిర్వహిస్తున్న నా కళ్ళలో ఆ దృశ్యం పడింది. వెంటనే మా ఆవిడ్ని కేకేసి దానికి నాలుగు గింజలు వేయమన్నాను. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. మా ఆవిడ కొన్ని గింజలు తీసుకెళ్లి వేసింది. కానీ ఆ పావురం వాటి వైపు కూడా చూడలేదు. క్రతువు జరుగుతున్న వైపే ఉంది దాని చూపుంతా. అలా చూస్తూ కాసేపు అటూ ఇటూ తిరిగి సరిగ్గా మా కార్యక్రమం పూర్తయ్యేటప్పటికి ఎక్కడికో ఎగిరెళ్ళిపోయింది. మళ్లీ కనిపించలేదు. బహుశా మరో ఏడాదికి వస్తుందేమో చూడాలి. అప్పటివరకూ ఎదురు చూడటం తప్ప మేం చేయగలిగిందేమీ లేదని మాకు తెలుసు.

No comments:

Post a Comment

Pages