పురాణ కధలు - బసవ పురాణం - 27 - అచ్చంగా తెలుగు

పురాణ కధలు - బసవ పురాణం - 27

Share This
పురాణ కధలు-బసవ పురాణం-27
  పి.యస్.యమ్. లక్ష్మి


27  కన్నడ బ్రహ్మయ్య కధ
వీర శైవ మతం అత్యున్నత స్ధాయిలో వున్న రోజులలో కన్నడ బ్రహ్మయ్య అనే వీరశైవ భక్తుడు వుండేవాడు.  ఆయన చోర వృత్తిని తన సంపాదనా మార్గం కింద ఎన్నుకున్నాడు.  దానితో వచ్చే ధనాన్ని శైవ భక్తుల కోసం ఖర్చు చేసేవాడు.  ఆయన దొంగతనానికి అవసరమైన వస్తువులన్నీ తీసుకుని ఎవరింటికైనా దొంగతనానికి వెళ్ళినప్పుడు అక్కడి పూజా మందిరము వగైరాల వలన వారు శైవ భక్తులుగా తోస్తే, దీపాలు వెలిగించి, ఇంటి వారిని లేపి తన పేరు కన్నడ బ్రహ్మయ్య అని,  తను ఎందుకు వచ్చాడో అన్నీ చెప్పి వారి ధన ధాన్యాలు భద్ర పరచుకోమనీ,  తాను శివ భక్తుల ఇంట దొంగతనం చేయననీ, తనుండగా శివ భక్తుల ఇంట ఎటువంటి దొంగతనం జరగదనీ, ఒక వేళ అలాంటి పనికెవరైనా తలపడ్డా తాను వారిని అడ్డుకుని ఆ ఇంటివారిని కాపాడతాననీ చెప్పి వెళ్తాడు.  వారు శివ పూజలు చేసేవారు కానిచో వారి ఇంట మొత్తం దోచుకుని వెళ్ళి జంగమ భక్తులకి సమారాధనలు చేసేవాడు.

ఒకసారి వారింటికి అధిక సంఖ్యలో శివ భక్తులు వచ్చారు.  వారికి ఆతిధ్యమివ్వటానికి తన దగ్గర సరిపోయే సంభారాలు లేవు.  తనకి చేతనైన పని ఎక్కడన్నా దొంగతనం చేసి తగిన ధనమూ, వస్తువులూ తీసుకొద్దామనుకుంటే తగిన సమయం లేదు.  వెంటనే వస్తువులు సమకూర్చుకోవటానికి తగిన మార్గం రాజుగారి ఖజానాలో దొంగతనం చెయ్యటమేననుకుని తన సామాను తీసుకుని ముందుగా మంత్రి బసవేశ్వరుని ఇంటికెళ్ళి ఆయనకి సంగతి చెప్పి, ఆయనకి కూడా దొంగతనానికి కావలసిన సామాను ఇచ్చి, ఆయనను కూడా తీసుకుని రాజుగారి ఖజానా దోచుకోవటానికి వెళ్ళారు..  వారు ఖజానాకి కన్నము తవ్వి లోపల ప్రవేశించారు.  కన్నము తవ్వగా వచ్చిన సున్నము, బ్రహ్మయ్య అడుగు పెట్టిన చోట వున్న మన్ను మేలిమి బంగారంగా మారింది.  అతను లోపలకెళ్ళి ఒక పెట్టె తెరిచి కొంత సొమ్ము తీసుకుని పెట్టె మూసి వేయగానే, ఆ పెట్టెలో అతను చేసిన ఖాళీ తిరిగి నిండిపోయేది.  అతను ఎక్కడ దొంగతనం చేసినా అదే విధంగా జరిగేది.  అది అతనికున్న భక్తి మహిమ.  
రాజుగారి ఖజానాలో దొంగతనం చేసిన దొంగలను భటులు పట్టుకోబోగా బ్రహ్మయ్య ఎవరికీ దొరకక పారిపోయాడు.  భటులు బసవన మంత్రిని పట్టి తెచ్చి రాజుగారికి కబురందించారు  బసవన్న మహా మంత్రి అయివుండీ, ఖజానాని దోచుకోవటానికి ఒక దొంగకి తోడు వచ్చాడని.   రాజు కూడా, పట్టపగలు ధనాగారం దోచుకోవటానికి వచ్చిన బసవన్న ఇంకేమైనా చేయగలడు..అయినా ధనము కావాలంటే తనని అడిగితే ఎంతైనా ఇచ్చేవాడు కదా, బసవన్న ఎందుకిలా చేశాడోనని   అతనిని విచారించటానికి  వెళ్ళాడు..  అక్కడ ఏ కొంచెం తరగని ధనాగారం, పైగా మేలిమి బంగారంగా మారిన కన్నం తవ్విన సున్నం, బ్రహ్మయ్య అడుగుల కింద మట్టి చూసి ఆశ్చర్యంగా బసవన్న మంత్రిని ఆ బంగారమంతా ఏమిటని అడిగాడు.

బసవన మంత్రికి బ్రహ్మయ్య గురించి తెలుసుగనుక జరిగినదంతా చెప్పి, బ్రహ్మయ్య పరమ నిష్టాగరిష్టుడు.  శివ భక్తుడు.  ఆయన చోర వృత్తిలో సంపాదించిన దానితో శివ భక్తుల అవసరాలు తీరుస్తాడు.  అదేమి చిత్రమోగానీ, ఆయన దొంగతనం చేసిన చోట ఎటువంటి లోటూ వుండదు.  ఆయన దొంగిలించిన వస్తువులన్నీ రెట్టింపుగా వారికి చేరుతాయి.  ఇప్పుడు తన ఇంటికి వచ్చిన అసంఖ్యాక శివ భక్తులకు సదుపాయాలు సమకూర్చటానికి అత్యవసరమైన ధనం కోసం మన ధనాగారం దోచుకోవటానికి వచ్చి నా సహాయమర్ధించాడు.  నేను కూడా ఏమీ అనలేక అతనిని అనుసరించాను.  జరిగిన చిత్రము మీరు చూశారు కదా.  ఆయన దోచుకుని వెళ్ళిన తర్వాత కూడా మన ధనాగారంలో కొంచెంమైనను సొమ్ము తరగలేదు.  పైపెచ్చు ఇంకా మేలిమి బంగారం పోగుపడ్డది.  రాజా, భక్తుల చరిత్రము, వారు నడచు త్రోవ పరమ పవిత్రమైనవి. వాళ్ళొక్కోసారి అధర్మంగా ప్రవర్తించినా, అది వేరొకరికి పరమ ధర్మమవుతుంది. ఒకరికి వచ్చిన కష్టము వేరొకరికి సుఖము కలిగించవచ్చు.  అందుకే  “అధర్మో ధర్మతాంప్రజేత్”  అనే నానుడి వచ్చి వుండవచ్చు.  అదంతా అలా వుండనీయండి.  కన్నడ బ్రహ్మయ్య మహాత్మ్యం చెప్తాను. భక్తులు ఆకలితో అతని ఇంటికేవేళ వస్తారో ఆ సమయంలో రాత్రనక, పగలనక తన పనిముట్లతో దొంగతనానికి బయల్దేరుతాడు.  కన్నము తవ్వి లోపలకి వెళ్ళి ఆ ఇంటి వారు శివ భక్తులైతే అక్కడ దొంగతనం చెయ్యకుండా వెళ్ళిపోతాడు.  కాకపోతే వారి ధనము తీసుకు వచ్చి జంగమార్చన గావిస్తాడు.  కన్నము తవ్వేటప్పుడుగానీ, లోపలకెళ్ళి ధనము దొంగిలించే సమయంలోగానీ అతను అదృశ్యుడుగానే వుంటాడు.  ఇతడు దొంగిలించినంత మాత్రాన ఆ ఇంటివారి ధనము తరగదు.  అదేమి చిత్రమోగానీ అతను ధనము తీసుకు వెళ్ళిన తర్వాత కూడా ఆ ఇంటిలో ధనమేమాత్రము తరగకుండా అదే విధముగా వుంటుంది.  భాగ్యవంతులు అతనిన  పిలిచి జంగమార్చనకు అనేక ధన సంపత్తులిస్తామన్నాగానీ తాను దొంగిలించిన సొమ్ము తప్పితే వేరేవారిచ్చే అతి చిన్న కానుకను కూడా స్వీకరించేవాడు కాదు.  బసవేశ్వరుని మాటలు విని రాజు ఏమీ చేయలేక, తన ధనమింకా వృధ్ధి చెందటం చూసి సంతోషంతో వెళ్ళాడు.  

***

No comments:

Post a Comment

Pages