శ్రీధరమాధురి - 107 - అచ్చంగా తెలుగు

శ్రీధరమాధురి - 107

Share This

శ్రీధరమాధురి - 107

(పూజ్యశ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు)


 గాయత్రి, సావిత్రి, సరస్వతి...

ఈ దివ్యమైన స్వరూపాల గురించి పురాణాలలో అనేక కల్పనలు ఉన్నాయి.
ఈ ముగ్గురు దివ్య మూర్తుల గురించిన కల్పనలు ఏమిటో అర్ధం చేసుకునే ప్రయత్నమూ, కాస్తంత వేదాంతం, బోలెడంత వాస్తవం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.
కల్పనలు...
శైవానికి సంబంధించిన గ్రంధాల ప్రకారం గాయత్రిని సదాశివుని యొక్క దేవేరిగా భావిస్తారు. విత్ర అనే అసురుని యొక్క కుమారుడైన వేత్రాసురుడిని సంహరించడానికి పార్వతి అమ్మవారు గాయత్రీ స్వరూపాన్ని తీసుకున్నారని నమ్ముతారు. కాబట్టి సదాశివుని లాగానే ఆమెకు ఐదు తలలు, పది చేతులు ఉంటాయి. ఆమె పది కన్నులు, ఆకాశం, పాతాళాన్ని కలిపిన దశదిశలలాగా కనిపిస్తాయి.
మరికొన్ని గ్రంధాల్లో గాయత్రి బ్రహ్మయొక్క భార్య అని, బ్రహ్మ గాయత్రికి తెలియకుండా సావిత్రిని వివాహం చేసుకున్నప్పుడు ఆమె అందరు దేవతలను శపించిందని,  చివరికి వారందరూ బుజ్జగించగా, ఆమె సావిత్రిని తన సోదరిగా అంగీకరించిందని చెబుతారు. 
అనేక గ్రంథాలలో సరస్వతి బ్రహ్మ యొక్క పత్ని అని, ఆమె ఇప్పటికీ ఆయన నుంచి వేదాలను నేర్చుకుంటోందని చెబుతారు. ఆమె కలియుగాంతానికి జ్ఞానాన్ని పొందుతుందని కూడా చెబుతారు.
వేదాంతం...
దైవం అంటే విశ్వ చైతన్యం. దైవం అనేక రూపాలను ధరించినప్పుడు, ప్రతి ఒక్క రూపానికి, ఒక్కొక్క స్థాయిలో చైతన్యం (జ్ఞానం) ఉంటుంది. అది వ్యక్తిగత చైతన్యానికి దగ్గరగా లేక దూరంగా ఉండవచ్చు.
అనేక స్థాయిల్లో ఉన్న దైవం యొక్క ధర్మాలు, బాధ్యతలు పై స్థాయిలో ఉన్న దైవం కంటే తక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ స్ధాయిలో వారి ఉనికికి ఉన్న ప్రత్యేక కారణాలకు తగినట్లుగా వారు పనిచేస్తారు.
ఈ ఆకృతి 'శ్రీ చక్ర మేరువు' లాగా ఉంటుంది. శిఖరంలో ఉన్న బిందువే పరమ దైవం. అనేక స్థాయిలలో ఉన్న దైవాలు, విశ్వ చైతన్యం యొక్క అనేక తలాలను సూచిస్తాయి. ఆయా దైవాలు వారి నుంచి ఆశించిన ధర్మాలను నిర్వర్తిస్తాయి. అందుకే, దైవం యొక్క ఆధిపత్య క్రమాలు ఉన్నయన్నమాట.
విశ్వాన్ని సమర్ధవంతంగా నిర్వహించడానికి, అనేక చైతన్య క్రమాలకు(స్ధాయిలకు) అనేక బాధ్యతలు కేటాయించబడ్డాయి, దాన్ని అనుసరించి వారు పని చేయాలి.
వాస్తవం...
ఒక ఆలోచన జనించి, కార్య రూపం దాల్చినప్పుడు 'గాయత్రి' అందుకు సంబంధించిన దైవం.
'న గాయత్రియః పరమం జపం.'
గాయత్రి మంత్రం కంటే ఉన్నతమైన మంత్రం ఏమీ లేదు. ఈ మంత్రం జపించాలన్న ఆలోచన యొక్క మూలం ఆమే. కాబట్టి ఆమె మెదడుకు అంటిపెట్టుకొని ఉంటుంది. ఆమె ఎల్లప్పుడూ ఆలోచనా స్వరూపంగా ఉంటుంది.  ఈ మంత్రానికి సంబంధించినంత వరకు ఆమే ప్రాథమిక శక్తి కనుక, ఈ ఆలోచనా ప్రక్రియ గాయత్రి ద్వారా ప్రభావితమవుతుంది.
ఇప్పుడు ఈ మంత్రం వచ్చి మన నాలుకపై కూర్చుంటుంది. కొన్నిసార్లు మనం ఈ మంత్రం మన నాలుక యొక్క కొనపై ఉంటుందని అంటాము. ఇక్కడే ఈ గాయత్రి అమ్మవారు సావిత్రిగా రూపాంతరం చెందుతారు. ఇప్పుడు ఈ మంత్రం యొక్క శుద్ధీకరణను సావిత్రి అమ్మవారు చేస్తారు. ఇప్పుడు సావిత్రిగా గాయత్రి యొక్క పాత్ర, పవిత్ర పరచడం, ఇది నాలుక పై జరుగుతుంది.
ఆ తర్వాత సరస్వతి వస్తుంది. ఆలోచనగా ఆమె గాయత్రి, సావిత్రిగా ఆమె మన నాలుకపై కూర్చుని మన ఆలోచనలను పవిత్రం చేసింది, ఇప్పుడు దాన్ని వ్యక్తీకరించాలి. ఆలోచించిన, పవిత్రపరచిన దాన్ని, సరస్వతి వెల్లడిస్తుంది. అందుకే ఆమెను 'వాగ్దేవి' అంటారు.
లలిత సహస్రనామంలో ఆమె మూడు స్వరూపాల్లోనూ ఉంటుంది. అందుకే ఆమెను 'శ్రీ మద్వాగ్భవకూట స్వరూపిణి' అని‌ పిలుస్తారు. ఆమెను సంపూర్ణంగా లలితాసహస్రంలో ఉంచారు. అమె, గాయత్రి, సావిత్రి, సరస్వతిల కూటమి (సంయోగము).

****

No comments:

Post a Comment

Pages