'వైకుంఠ ఏకాదశి' విశిష్టత - అచ్చంగా తెలుగు

'వైకుంఠ ఏకాదశి' విశిష్టత

Share This

 'వైకుంఠ ఏకాదశి' విశిష్టత

-సుజాత.పి.వి.ఎల్


ముక్కోటి ఏకాదశిని 'వైకుంఠ ఏకాదశి' అని అంటారు. కాల పరిగణంలో తెలుగువారిది చాంద్రమానం. వైకుంఠ ఏకాదశి సౌర మాన ప్రకారం జరుపుకునే తెలుగువారి పండుగలలో ఇది ఒకటి. శ్రీ మహా విష్ణువు వైకుంఠం నుండి మూడు కోట్ల దేవతలతో భోలోకానికి దిగి వచ్చాడు కాబట్టి దీనికి 'ముక్కోటి ఏకాదశి' అని పేరొచ్చింది. అందుచేతనే ఈ ఏకాదశి మూడుకోట్ల ఏకాదశులతో సమానమైనది.

ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణoలోకి రాబోయే ముందు వచ్చే ధర్మానుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ ఏకాదశి రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని వుంటాయని, వైష్ణవాలయాలల్లో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనానికి వేచి ఉంటారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజు శ్రీ మహా విష్ణువు గరుఢ వాహనరూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి దర్శనమిస్తాడు. అందుకే ఈ ఏకాదశి 'ముక్కోటి' అయినది.

ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయని పురాణాలు చెబుతున్నాయి.

విష్ణు పురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్నా, మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలు తెరిచాడనీ, తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న వారికి, విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు కోరారు. అందుచేతనే ఆరోజు వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవాలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. ఈ ముక్కోటి ఏకాదశి నాడు భక్తులు ఉత్తర ద్వారం గుండా వెళ్లి దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో వైకుంఠ ద్వారం పేరిట ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచడం జరుగుతుంది.

పద్మ పురాణం ప్రకారం కృతయుగంలో చంద్రావతి అనే నగరం రాజధానిగా చేసుకుని 'ముర' అనే రాక్షసుడు రాజ్యపాలన చేస్తుండే వాడు. ఆ రాక్షసుడి దురాగతాలను భరించలేక దేవతలు, ఋషులు శ్రీ మహావిష్ణువు దగ్గరికెళ్లి శరణు వేడుకొనగా అంతట శ్రీహరి ఆ రాక్షసుడ్ని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికా ఆశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశిస్తాడు. ఈ విషయాన్ని గ్రహించిన మురాసురుడు సాగర గర్భంలోకి వెళ్లి దాక్కుంటాడు. ఆ మురాసురుడ్ని ఎలాగైనా బయటికి రప్పించేందుకు ఉపాయాన్ని పన్నిన శ్రీ మహా విష్ణువు గుహలో నిద్రపోతున్నట్లు నటిస్తాడు. ఇదే అదనుగా భావించి మురాసురుడు నెమ్మదిగా గుహలోకి వచ్చి విష్ణువును మధించేందుకు కత్తి పైకెత్తుతాడు. వేంటనే విద్యుత్ వేగంలా ఒక శక్తి ఉద్భవించి మురాసురుడ్ని సంహరిస్తుంది. ఆ విధంగా దేవతల్ని రక్షించిన ఆ శక్తికే 'ఏకాదశి' అని నామకరణ చేయడం జరిగిందని పురాణాలు తెలుపుతున్నాయి.
వైకుంఠ ఏకాదశినే 'పుత్రద ఏకాదశి' అని కూడా అంటారు. ఈ పుత్రద ఏకాదశి గొప్పదనాన్ని వివరించే కథ ఒకటుంది.

పూర్వం 'సుకేతుడ'నే మహారాజు భద్రావతి రాజ్యాన్ని పరిపాలిస్తుండేవాడు. అతని భార్య పేరు 'చంపక '. మహారాణి అయినా, గృహస్థు ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తూ అతిధులను, అభాగ్యులను గౌరవిస్తూ, భర్తను పూజిస్తూ, ఇంకా ఎన్నో పుణ్య కార్యాలు, వ్రతాలు, నోములూ చేస్తూ ఉండేది. కానీ, ఆ దంపతులకి పుత్రులు లేకపోవడం జీవితంలో తీరని లోటుగా మారింది. వారిరువురూ పుత్ర కాంక్షతో ఎన్నో తీర్థాలు సేవిస్తుండగా, ఒక పుణ్య తీర్థం వద్ద కొందరు మహర్షులు కూడి తపస్సు చేసుకుంటున్నారనే వార్త తెలుసుకొని, వారిరువురు అక్కడికి వెళ్లి ''మాకు పుత్ర భిక్ష పెట్టమని'' ప్రార్థిస్తారు. ఆ మహర్షులు మహారాజు వేదనను గ్రహించి ''మీరు పుత్రద ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన యెడల మీకు సంతాన భాగ్యం కలుగుతుందని, పుత్రుడు పుడతాడని'' దీవిస్తారు. వెంటనే ఆ దంపతులు భక్తి శ్రద్ధలతో ఆ వ్రతాన్ని చేస్తారు. కొద్దికాలానికి పండంటి పుత్రుడు కలుగుతాడు. అనంతరం ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడై యువరాజై, చక్కని పరిపాలన గావిస్తాడు.

అందుచేత వైకుంఠ ఏకాదశి రోజున నియమ నిష్టలతో వ్రతమాచరించే వారికి, విష్ణుమూర్తిని మనఃస్ఫూర్తిగా స్తుతించే వారికి పుణ్యఫలముతో పాటు కార్యాను సిద్ధి చేకూరుతుందని పురాణాలు చెబుతున్నాయి.
****


No comments:

Post a Comment

Pages