తస్మాత్ జాగ్రత్త! జాగ్రత్త! - అచ్చంగా తెలుగు

తస్మాత్ జాగ్రత్త! జాగ్రత్త!

Share This

 తస్మాత్ జాగ్రత్త! జాగ్రత్త!

(మా జొన్నవాడ కథలు)

- డా.టేకుమళ్ళ వెంకటప్పయ్య (9490400858)ఉదయం 9 గంటల సమయం. పైగా ఆరోజు శుక్రవారం కూడా! జొన్నవాడ గుడిలోకి వచ్చిపోయే జనంతో కిటకిటలాడుతూ ఉంది. అప్పుడే పిచ్చిగడ్డం, జడలుగట్టినతల, చినిగిపోయిన కుళ్ళువాసన వస్తున్న గుడ్డలతో ఒకడు అమ్మణ్ణి ఆలయంలోకి అడుగు పెడుతున్నాడు. దేవళం వాకిట్లో పూలమ్మేవాడు "రేయ్..పిచ్చోడా...లోపలికి పోవద్దు. బయటికి బో!" అని కసురుకున్నాడు. పూలవాడి వైపు అదోలా చూసి మెల్లిగా గుళ్ళోకి దూరిపోయాడు. “గాలి సోకిన వాళ్ళు వచ్చారంటే ఒక అర్ధంపర్ధం ఉంది. పిచ్చినాయాళ్ళు కూడా గుడిలోకి వస్తున్నారు ఖర్మ! పెసాదం తేరగా వస్తే మింగడానికి. ఆమడ దూరం గొడతా ఉంది వాడి వాసన!  థూ.. “ అనుకుంటూ తన పనిలో మునిగి పోయాడు.

గుడిలో అంతా హడావుడిగా ఉంది. దర్శనానికి, ప్రసాదాల దగ్గరా అంతా ఒకటే జనం. ధర్మదర్శనానికి కొండవీటి చేంతాడంత క్యూ ఉంది. ఈ పిచ్చోణ్ణి చూసిన పిల్లలు భయపడి తల్లిదండ్రుల వద్దకు వచ్చి "అమ్మా! దేవళంలోకి బూచోడొచ్చాడు" అంటున్నారు. పిచ్చోడు ఇదేమీ పట్టించుకోకుండా ధర్మదర్శనం క్యూలో నిలబడ్డాడు. వాడి దగ్గర నుండి భయంకరమైన వాసన. వొళ్ళంతా బూడిద పూసుకున్నట్టు తెల్లని సున్నం ఉంది. చొక్కా సరిలేదు. అంతా చిరుగులే! మోకాళ్ళ వరకూ చిన్న తుండు గుడ్డ కట్టుకున్నాడు. అందరూ బయటికి వెళ్ళమని గోల చేస్తున్నారు. ఈగోడవకు సహాయ పూజారి చింతామణి అక్కడ ఏమైందా అని బయటకు వచ్చి చూశాడు. ఎక్కడో చూసినట్టుంది వాణ్ణి. కానీ గుర్తు రావడంలేదు. "ఏయ్! ఎవరు నువ్వు? భక్తులకు అంతరాయం కలిగిస్తున్నావు. పక్కకు నిలబడు!" అని గద్దించాడు. "చింతామణీ! నన్ను మరచిపోయావా?" అని అడిగాడు. చింతామణికి గుర్తురాక గుండుపై గోక్కుంటూ నిలబడ్డాడు. పిచ్చివాడు క్యూలో నుంచీ బయటకు వచ్చి " చింతామణీ నీ మాటెందుకు కాదనాల చెప్పు? అందరూ దర్శనం చేసుకున్న తర్వాతనే చూస్తాలే దేవుణ్ణి. నాదేవుడెక్కడికి బోతాడు" అని పెద్దగా నవ్వుతూ పక్కకు తొలిగి ఒక మండపంలో దూరంగా కూర్చున్నాడు. భక్తులంతా హమ్మయ్యా! అని ఊపిరి పీల్చుకున్నారు. 

చింతామణి లోపలికి వెళ్ళి ప్రథాన పూజారి యాజులు గారికి విషయం చెప్పాడు. ఆయన "చూద్దాం లే వాడే పోతాడు. ప్రసాదం కోసమే వాడి గోలని నా అనుమానం. ఇదిగో ఈ ప్రసాదం తీసుకెళ్ళి వాడికివ్వు,  ఇచ్చి గలభా చెయ్యకుండా వెళ్ళమన్నానని చెప్పు. తినేసి వాడి దార్న వాడే పోతాడు" అంటూ కొంచెం ఎక్కువగానే పులిహోర, దద్ధోజనం పొట్లాలు చింతామణికిచ్చాడు. "సామీ వాణ్ణి చూస్తా ఉంటే… ఎక్కడో వాణ్ణి చూసినట్టే అనిపిస్తా ఉంది" అనగానే, ఏంకాదులే ఇచ్చి బయటకు దయచెయమను. ఎవరైనా ఈవిషయం రెడ్డిగారికి  చెప్పారంటే  గోలగోలవుతుంది." అన్నాడు.

"దేవుడి దర్శనం కాకుండానే పెసాదమేంది చింతామణీ.. నేనొప్ప… శివయ్యను చూసి దణ్ణం పెట్టుకున్న తర్వాతే పెసాదం! ఆ.." అన్నాడు. తీసుకోవడాని ససేమిరా ఒప్పుకోలేదు. వెనక్కి తీసుకెళ్ళి చింతామణి ఈ విషయం వెంటనే యాజులు గారికి చెప్పాడు. సరే! నువ్వూర్కో! నేను మాట్లాడతాలే తర్వాత ఆడ్నే గూకోనీ…. ఆ యెదవని" అన్నాడు. తర్వాత పనిలో పడిపోయి ఇద్దరూ ఈవిషయం మర్చిపోయారు. పిచ్చోడు మాత్రం మండపంలో అలాగే కూర్చొని ఉండిపోయాడు. మధ్యాన్నం 12 గంటల వరకూ నెల్లూరు నుంచీ యింకా చుట్టుప్రక్కల ఊళ్ళనుంచీ జనం కారల్లో, ఆటోల్లో, బస్సుల్లో వస్తూనే ఉన్నారు. ఒంటిగంటకు జనమంతా వెళ్ళిపోయాక చింతామణి ఆ పిచ్చోడికోసం చూస్తే ఇంకా అక్కడే ఉన్నాడు. 

ఒక్కసారి యాజులుగారికి చెప్పి వాడు దర్శనం చేసుకొని వెళ్ళిపోతే గుడి మూసేద్దామన్న నిర్ణయంతో చింతామణి పిచ్చోడి దగ్గరకు వస్తూ ఉండగా గుడి వాకిట్లో వెనకనుంచీ "సామీ! ప్రెసిడెంటుగారు బంధువులతో గుడికి వస్తా ఉన్నారంట. 10 నిముషాల్లో వస్తారంట. గుడి ముయ్యొద్దని చెప్పమన్నారు" అన్నాడు రెడ్డిగారి తలమనిషి రొప్పుతూ. పిచ్చోడు దర్శనానికి లేవడం చూసి "కూర్చో! కూర్చో! దేవళం ప్రెసిడెంటుగారు వస్తున్నారట. వాళ్ళు వెళ్ళిన తర్వాతే నీ దర్శనం" అన్నాడు. ఆ మాట విని “ఎవురూ వెంకురెడ్డా? సరేలే!” అన్నాడు. పిచ్చోడికి ఆయన పేరెలా తెలిసిందా అని ఆశ్చర్యంగా . చూస్తూ ఈ విషయం చెప్పడానికి గుడిలోపలికి వెళ్ళాడు చింతామణి. యాజులు గారు అప్పటికే అన్నీ సర్దేసి గుడికి తాళాలు వేయడానికి రెడీగా ఉన్నాడు. విషయం చెప్పేసరికి "సరే!” అని హడావుడిగా మళ్ళీ అన్నీ సరి చేసుకుని తయారుగా నిల్చున్నాడు. "చింతామణీ! ఆ పిచ్చోణ్ణి దూరంగా ఒక మూలగా రెడ్డిగారి కంట బడకుండా కూచోబెట్టు ఈలోపల" అని ఆర్డరేశాడు.

మరో ఐదు నిముషాల్లో వెంకురెడ్డి బంధు సమేతంగా పది మందితో రెండు కార్లల్లో దిగారు. యాజులు, చింతామణి హడావుడిగా ఎదురేగి కుశల ప్రశ్నలు వేసి లోనకు తీసుకొచ్చారు.   యాజులు గుడిలోపలికి తీసుకుని వెళ్తుండగా వెంకురెడ్డి "మూడే మూడు ప్రదక్షిణాలు చేసి వస్తాం యాజులుగారూ!" అన్నారు. యాజులు గుడిలోపలికి వెళ్తూ చింతామణిని వాళ్ళతో ఉండమన్నాడు. వారంతా  మొదటి ప్రదక్షిణ చేస్తూ ఉండగా రెడ్డిగారి కన్ను ఒక మూలగా గోడకానుకుని మండపంలో కూర్చున్న పిచ్చోడిమీద పడింది. ఎవరా అన్నట్టు చూశాడు. చింతామణి కంగారు పడుతూ "వాడు మొండోడు సామీ! పంపిచ్చేస్తాలే! తమరు కానీయండి" అన్నాడు. అందర్నీ అక్కడే ఉండమని వెంకురెడ్డి పిచ్చోడికి దగ్గరగా వెళ్ళాడు. పిచ్చోడు తలెత్తి "నమస్కారం వెంకురెడ్డీ బాగుండావా?" అన్నాడు. అంతే విన్న వెంటనే షాక్ అయ్యాడు. అదే పలకరింపు! నుదిటిమీద పెసరగింజంత పుట్టుమచ్చ. మనసులో ఆయనే అనుకుని "నువ్వు శేషారెడ్డివి కదా!" అన్నాడు. అవును రెడ్డీ!" అన్నాడు. రెడ్డిగారు మీరంతా ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి అని సైగచేసి, పిచ్చోడి ప్రక్కన్నే కూర్చొండి పోయాడు. "ఏందిది శేషారెడ్డీ! ఇలా అయిపొయ్యావు?" అన్నాడు. "ఏముంది రెడ్డీ. భవభందాలన్నీ తెగిపొయ్యాక ఇంకా ఈ దుస్తులూ ఆడంబరాలు అవసరమంటావా? దేశం మొత్తం తిరిగాను రెడ్డీ.. అన్ని దేవళాలూ చూశాను. రేపు కాశీకి బోతున్నా.  ఇంకెక్కడికి కదిలే పనేలేదు. అక్కడే ఉండిపోదామని పోతూ పోతూ ఒక్కసారి అమ్మణ్ణి, మన శివయ్య దర్శనం కోసం వచ్చా!" అని నవ్వాడు.

“వెంకురెడ్డి రా! దర్శనం చేసుకుందాం” అని శేషారెడ్డిని చెయ్యిపట్టుకుని లేవదీసి తనతోబాటూ ప్రదక్షిణం చేయించి ప్రక్కనే ఉండి దైవదర్శనం చేయించాడు.  ప్రసాదం తీసుకున్న శేషారెడ్డి  వెంకురెడ్డి గారికి చెయ్యెత్తి నమస్కరించి “చాలా సంతోషం రెడ్డీ.. నువ్ పిల్లాపాపలతో బాగుండాల! కానీ ఒక్క విషయం చెప్తుండా! విను! సంపదః స్వప్న సంకాశాః యౌవనం కుసుమోపమ్. విధుఛ్చచంచల ఆయుషం. తస్మాత్ జాగ్రత  జాగ్రత" అంటూ వెర్రి నవ్వొకటి నవ్వి చరచరా బయటికి వెళ్ళిపోయాడు. రెడ్డి "యాజులుగారూ! శేషారెడ్డి ఏమన్నాడు?"  అని అడిగాడు. యాజులు గారు ఎవరో వేదాంతి అనుకుంటా "మన సంపదలన్నియు ఒక కలవంటివి, అంటే అశాశ్వతాలు.  యౌవనం పూవుతో సమానం అంటే ఎపుడు వాడి నశిస్తుందో తెలియదు. ఆయుష్షు మెరుపుతీగవలె చంచలమైనది.  కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి! అంటున్నాడు" అని చెప్పి “ఇంతకీ ఎవరు రెడ్డిగారూ! ఆ శేషారెడ్డి? ఆ పిచ్చివాణ్ణి మీరు చేయిబట్టుకుని దర్శనం చేయించారు. మీకు గతంలో పరిచయం ఉన్న మనిషా?” అని అడిగాడు.

వెంకురెడ్డి ఒక్కసారి నిట్టూర్చి "అప్పటికి మీరు ఇంకా చేరలేదు. పది సంవత్సరాల క్రితం సంగతి. మీ ముందు పూజారి శివావధాన్లుగారున్నారు ఇక్కడ. శేషారెడ్డి నెల్లూరులో పెద్ద కోటీశ్వరుడు. పెళ్ళాం పిల్లలూ అంతా మెడ్రాసు నుండి కార్లో వస్తూ ఒకేసారి ప్రమాదవశాత్తు మరణించారు. విరక్తి చెందిన శేషారెడ్డి ఆస్తి మొత్తం నెల్లొరులోను, ఇక్కడా ఉన్న దేవాలయాలకు రాసిచ్చేశాడు. ఆయన ఇక్కడకు వచ్చినప్పుడు అమ్మణ్ణిని చూసేందుకే  ఇక్కడ ఒక ఇల్లు కొనుక్కున్నాడు. అంత భక్తుడు! విధి విలాసం అలా అయింది.  మీరు ఇప్పుడు ఉంటున్న ఇల్లు, చింతామణి ఉంటున్న అవుట్ హవుసు ఆయనవే! ఇప్పుడు వేదాంతిగా మారి దేశాలు పట్టుకుని తిరుగుతున్నాడు" అనగానే చింతామణి "అవును సామీ గుర్తొచ్చింది..ఆయన్ను ఒకటి రెండు సార్లు చూశాను. ప్రతి శుక్రవారం పూజకు వచ్చేవాడు" అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయి చూశారు.

“శేషారెడ్డి చెప్పింది అక్షరాలా నిజం! కానీ నేను ఈ భవబంధాలను తొలగించుకోలేకపోయినా, ఎప్పటికైనా కనీసం  ఆ చింతనకైనా రాగలనా? చూడాలి" అని మనసులో అనుకుంటూ దేవాలయం బయటకు వచ్చాడు.

-0o0-No comments:

Post a Comment

Pages