దానకర్ణుడు - అచ్చంగా తెలుగు

దానకర్ణుడు

కర్లపాలెం హనుమంతరావు


స్థానిక బాబు!

పేరు ఎంత చిత్రమో మనిషి అంతకన్నా విచిత్రం. ముఫ్ఫై ఏళ్ళకిందట తగిలిందీ క్యారెక్టరు నాకు.. నెల్లూరుజిల్లా ఓ మూరమూల పల్లె చెరువుపల్లెలో బ్యాంకు మేనేజరుగా ఉద్యోగం చేసే రోజుల్లో!


పొగాకు పండిస్తుంటారా ఊరు చుట్టుపక్కల ప్రాంతాల్లో.  పోగాకు బోర్డు, మా బ్యాంకు, పోలీస్ స్టేషను, ఓ ఉప తపాలా కార్యాలయం, చిన్నసైజు ప్రాథమిక పాఠశాల.. ఇవీ ఆ ఊళ్లోని  ప్రభుత్వసంబంధ సంస్థలు. పోలీస్ స్టేషనులో కానిస్టేబులుగా పనిచేయడానికి వచ్చినవాడు స్థానిక బాబు తండ్రి. 


బదిలీలు ఎక్కడికి వచ్చినా అతని కుటుంబం మాత్రం చెరువుపల్లెలోనే! మంచినీళ్ళుకూడా సరిగ్గా దొరకని ఆ మారుమూల పల్లెమీద ఆ పోలీసాయనకు ఎందుకంత ప్రేమంటే.. బూబమ్మ అని సమాధానం  చెప్పాల్సుంటుంది. 


బూబమ్మ మొగుడు దుబాయ్ లో పనికని వెళ్ళి మళ్లీ తిరిగి రాలేదు. వంటరి ఆడది. వయసులో ఉన్నది. ఎట్లా కుదిరిందో జత! పబ్లిగ్గా పగటిపూటే బూబమ్మ ఇంటికి వచ్చిపోతుండేవాడు పోలీసాయన. ఎన్ని ఫిర్యాదులు వెళితేనేమి.. బూబమ్మని మాత్రం వదిలింది లేదా పోలీసుబాబు. కట్టుకున్నదానిమీద మూడోరోజుకే మొహంమొత్తే  పురుషపుంగవులు దండిగా ఉన్న రోజుల్లో.. ఉంచుకున్న మనిషిమీద అంత ప్రేమ పెంచుకోవడం అంటే.. స్థానికబాబు ‘బాబు’ది విచిత్రమైన క్యారక్టరనేగా అర్థం! అబ్బ లక్షణాలే పుణికిపుచ్చుకున్నాడంటారు బిడ్డ కూడాను. పోలీసాయనకు, బూబమ్మకు పుట్టిన బిడ్డ స్థానిక బాబన్నది బహిరంగ రహస్యమే! బూబమ్మ మొగుడు పనిమాలా దుబాయినుంచొచ్చి బూబమ్మను చంపడానికి కారణం ఈ స్థానిక బాబేనని ఊళ్ళో అనుమానం. తల్లి పోయినా బిడ్డ  పోలీసాయన పంచ పట్టుకుని వదలకపోవడంతో ఆ అనుమానం వట్టిది కాదని  తేలిపోయింది.  


పోలీసాయన బతికున్నంత కాలం స్థానిక బాబు దర్జా చూడాలి.  పాముకాటు తగిలి ఆయనగారు పోయిన తరువాత అతని కుటుంబమూ ఊరొదిలి వెళ్ళిపోయింది. స్థానిక బాబుని ఊరుకు వదిలిపోయింది. అప్పటికా యతిమతం బిడ్డకి పదిహేనేళ్ళు.  


ఏ తల్లయినా  జాలిదలచి ఇంత పెడితే తినడం.. బట్టలిస్తే కట్టుకోడం.. పోలీసాయన పోయిన పాడుబడ్డ క్వార్టర్సులో కాళ్ళు ముడుచుకు పడుకోడం.. ఇదీ స్థానిక బాబు దినచర్య.  


అమ్మా అయ్యా లేని అనాథ పిల్లలందరి కథలాగే ఉంది కదా స్థానిక బాబు కథా! ఇందులో ప్రత్యేకత ఏముందంటారా? అక్కడికే వస్తున్నది.


స్థానిక బాబు చేతిలో ఎవరైనా పాపమని ఓ రూపాయేస్తే .. అందులో ఓ పావలాకి బిళ్ళలు కొని బడికెళ్లే పిల్లలందరికీ పంచిపెడతాడు! పొగాకు చేలో  పని దొరికి నాలుగు రూకలు కంటబడటం పాపం..అందులో సగం పాపల గాజులు, పూసలు, బొట్టు బిళ్ళల్లాంటి  అలంకరణలకు అర్పణం! నీళ్లబావి దగ్గరో.. చేలగట్లమీదో  నిలబడి వచ్చే పోయే ఆడంగుల వెంటబడి మరీ పందేరాలు చేస్తాడు. ‘వద్దం’టే ఏడుస్తాడు. ఐనా మొండికేస్తే  అమ్మలక్కల బూతులకి దిగుతాడు. కొట్టడానికి వస్తే తన్నులు తింటానికైనా సిద్దమేకానీ.. ఇచ్చిన సామాను ఎదుటివాళ్ళు తీసుకున్నదాకా పీకిపాకాన పెట్టడం మాత్రం ఖాయం.


అక్కడికీ ఎవరో పోలీసు స్టేషనులో కంప్లయింటుకూడా ఇచ్చారు. ఐనా ఏమని లోపలేయాలి  పోలీసులు? దొంగతనాలా? చేయడు. ఆడవాళ్ళని అల్లరి పెట్టడాలా?వేలేసి ముట్టనుకూడ ముట్టడు సరికదా.. ఏడిపించేటప్పుడు ‘అక్కా! అక్కా!’ అని ఏడుస్తాడు! పోనీ.. ఎవరిమీదైనా  కాలుదువ్వే గుణమున్నదా? కోపమొచ్చినప్పుడు తనమీద తప్ప తన ప్రతాపం ఎదుటి మనిషిమీదెప్పుడూ చూపించి ఎరగడు!  కొట్లాటలంటే తగని భయం. శాంతిభద్రతలకు ఏ విధంగా విఘాతం కలిగిస్తున్నాడని కేసు బుక్ చేసి కొట్లో వేయాలి?! అక్కడికీ ఊరిజనాలని సంతృప్తి పరచాలని ఏదో స్యూసెన్సు కేసుకింద .. వూరికే బెదిరించడానికని..  రెండురోజులు లాకప్పులో వేసేసారు స్టేషనాఫీసరు. చెరలో ఉన్నప్పుడు హోటల్నుంచి భోజనం తెప్పించి పెడితే.. అందులోని పప్పు, కూర.. ఎస్సైగారిని తినమని ఒకటే పోరు. ఆయన తిన్నట్లు నటించిందాకా ఏడుపులు.. పెడబొబ్బలు! రెండు తగిలించినా వెనక్కి తగ్గలేదా మొండిఘటం! ఒకసారా..  రెండుసార్లా? భోజనం, చాయ్ వచ్చినప్పుడల్లా అదే రచ్చయితే పాపం ఎస్సైగారు మాత్రం  తట్టుకొనేదెట్లా?  ఆ తలనొప్పి పడలేక  విడుదల చేసేసారు చివరికి. అప్పట్నుంచీ ఎవరైనా స్థానిక బాబుమీద కంప్లయింటు ఇవ్వడానిగ్గాని వస్తే.. ఏదో సర్ది చెప్పి పంపించడమే! వేరే యాక్షన్లు.. సెక్షన్లు  లేవు పోలీసుల వైపునుంచి.


చెరుకుపల్లి బాంబే హైవేమీదుంటుంది. నెల్లూరునుంచి వెళ్ళే వాహనాలన్నీ ఆ ఊరుమీదనుంచే  వెళ్ళాలి. రోడ్లు ఎప్పుడూ రద్దీనే. బస్సులు స్టాండులో ఆగినప్పుడు కొబ్బరిపుల్లల చీపురుతో బస్సు కదిలిందాకా శుభ్రం చేసేవాడు స్థానిక బాబు. ప్రయాణీకులు జాలిపడి ఇచ్చిన డబ్బుల్తో జీళ్ళు, పళ్ళులాంటివి కొనేవాడు. తరువాత వచ్చిన బస్సులో ఎక్కి కనబడ్డవాళ్లకిచ్చి తినమని బలవంతం చేసేవాడు. ముక్కూమొగం తెలీని మనిషి. అందునా గలీజుగా ఉండే శాల్తీ ఇచ్చేవి  ఎవరైనా ఎందుకు తీసుకుంటారు? తింటారు?  ఎవరు తీసుకోకపోయినా బండి దిగడే స్థానిక బాబు! ఊరికే తీసుకోడం చాలదు. దాచుకుంటే కుదరదు.  తన కళ్లెదుటే నోట్లో వేసుకోవాలి! పారేస్తే   తిరిగి ఏరుకుని వచ్చి మరీ తినమని బలవంతం చేస్తుంటే ఏం చేయాలి?


స్థానిక బాబు సంగతి తెలిసిన బస్సు డ్రైవర్లు, కండక్టర్లు.. సాధ్యమైనంతవరకు అతను బండి ఎక్కకుండా చూసుకునేవారు. కన్నుగప్పి ఎక్కితే మాత్రం అతనిచ్చిన చెత్తను కళ్ళుమూసుకునైనా నోట్లో వేసుకోవాల్సిందే ప్రయాణికులు! లేకపోతే ఏమవుతుందో  ముందే హచ్చరించేవాళ్ళు బస్సు సిబ్బంది.


ఎలా వచ్చిందో .. స్థానిక బాబు విషయం  దినపత్రికల్లో వచ్చింది. జిల్లా ఎడిషన్లలో.. ఫొటోలతో సహా! విలేకర్లు చేసిన ఇంటర్వ్యూల్లో  ప్రయాణీకులనుంచి స్థానిక బాబును గురించి చాలా ఫిర్యాదులే వచ్చాయి. విషయం జిల్లా కలెక్టరుగారి దాకా వెళ్లడం.. స్థానిక బాబును నెల్లూరు  పిచ్చాసుపత్రికి తరలించడం జరిగాయి ఒకసారి.


నిజానికి స్థానిక బాబుకి ఏ పిచ్చీ లేదు.. ఆయాచిత దానాలతో జనాలని పూర్తి స్పృహలో ఉన్నప్పుడే వేపుకుతినడం తప్ప. పిచ్చిలేని వాళ్లను పిచ్చాసుపత్రివాళ్ళు  మాత్రం ఎంతకాలమని భరించగలరు? పథ్యంగా ఇచ్చే మందుల్ని.. ఆహారాన్ని తోటి మానసిక రోగులకు బలవంతంగా తినబెట్టడం..  తినడానికి మొరాయిస్తే  తన్నడానిక్కూడా పస్తాయించకపోవడం! అక్కడికీ స్థానిక బాబు కాళ్లకి చేతులకి గొలుసులు వేసారు ఆసుపత్రివాళ్ళు. కానీ ఆహారం ఇవ్వడం తప్పనిసరికదా! తనకని ఇచ్చిన ప్లేటులో సగం  తెచ్చిన మనిషి తింటేనేగాని.. మిగతా సగం తను తినేవాడుకాదు స్థానిక బాబు. ఎన్నడూ లేని ఈ కొత్త అనుభవంతో బెంబేలెత్తి పోయింది ఆసుపత్రి సిబ్బంది మొత్తం. రోజూ ఈ బాధలు భరించేకన్నా అనధికారికంగా రోడ్డుమీద వదిలేసి.. తప్పించుకుని పారిపోయినట్లు రికార్డులో రాసుకోవడం మేలనుకున్నారు మెంటలాసుపత్రి అధికారులు. అదే చేసారు.


స్థానిక బాబు ఏరియా ఆఫ్ ఆపరేషన్ చెరువు పల్లే. ఎక్కడ  వదిలేసినా చెరువులో చేపలాగా చివరికి చెరువు పల్లిలోనే తేలడం అతనికి అలవాటు. స్థానిక బాబు లేని రెండునెలల్లో ఊళ్లో ఎన్నడూ లేనిది గుళ్ళో అగ్నిప్రమాదం జరగడం, ఊరు ఒక్క బావినీరూ ఉప్పులకు తిరగడం,  గుండ్రాయిలా  తిరిగే సర్పంచి చిలకలయ్య ఆరోగ్యం గుండాపరేషనుదాకా విషమించడంతో   యాంటీ- సెంటిమెంటొకటి బైలుదేరింది. స్థానిక బాబును  కదిలిస్తే ఊరుకేదో మూడుతుందన్న భయం పెరిగి ఊడలు దిగింది జనం మనసుల్లో! మునుపటిలా  అతని జోలికెళ్ళడం పూర్తిగా తగ్గించేసారీసారి జనం అందుకే. 


ఊరి సెంటిమెంటుతో ఫ్లోటింగు పాప్యులేషనుకేం సంబంధం? బస్సులో నాలుగు రూకలు జమవగానే  స్థానిక బాబు జీళ్ళు, పళ్ళ ప్రహసనం మళ్లీ మొదలు! కథ ఇక్కడ ఉన్నప్పుడే నేను చెరువుపల్లికి బదిలీమీద వెళ్ళింది. స్థానిక బాబు సంగతులు అప్పటికి నాకూ పూర్తిగా తెలీవు.


ఆర్థిక సంవత్సరాంతం. బ్యాంకు పద్దుల్ని సమీక్షించే పనుల్లో ఉన్నాం. బ్యాంకు కాతాలను సరిచూడటమంటే ఒక్క రుణకాతాలను సమీక్షించడమే కాదు.. డిపాజిట్ కాతాలనూ  సరిచూసుకోవాలి. గడువు ముగిసిన తరువాత కూడా మూడేళ్ళవరకు ఎవరూ వచ్చి క్లెయిమ్ చేయని డిపాజిట్లని హెడ్డాఫీసు పద్దుకి బదిలీ చేయాలని అప్పట్లో రిజర్వు బ్యాంకు రూలు. కాతా ఒకసారి బదిలీ అయిన తరువాత హక్కుదారులు వచ్చి క్లెయిమ్ చేసినా .. వాటిని తిరిగి చెల్లించడానికి బోలెడంత తతంగం నడపాలి. కాతాలను పైకి పంపించేముందు ఒకటికి రెండుసార్లు తరచి చూసుకునేది అందుకే.


ఆ పనిలో ఉన్నపుడే బైటపడిందా డిపాజిట్! చనిపోవడానికి మూడేళ్ళముందు పోలీసాయన చేసిన డిపాజిట్ అది. స్థానిక బాబు పేరున పాతిక వేలు. డిపాజిటరు మేజరయిన తరువాత వడ్డీతో సహా మొత్తం  నేరుగా అతనికే చెందే నిబంధనతో ఉందది. జత చేసిన స్కూలు సర్టిఫికేట్ ప్రకారం స్థానిక బాబుకి  ఏ ఎనిమిదేళ్లో ఉన్నప్పుడు చేసిన  పదేళ్ల  డిపాజిట్! మెచూరయికూడా మూడేళ్ళు దాటిపోయి ఉంది. వడ్డీతో కలిసి గడువు తేదీనాటికే  దాదాపు లక్ష రూపాయలుపైనే ఉంటుంది.  ఈ మూడేళ్లకు అదనంగా మరో పాతిక వేలు! 


రికార్డుల ప్రకారం స్థానిక బాబు   మూడేళ్లకిందట మేజరే.  అయినా  ఆ సొమ్ము ఎందుకు చెల్లించలేదో?! స్థానిక బాబుకి బహుశా ఈ డిపాజిట్ సంగతి తెలిసుండదు. తెలిసుంటే తీసుకుని  ఈ పాటికి ఎప్పుడో అవగొట్టేసుండేవాడే! అప్పటి బ్యాంకు మేనేజరుగారు ఎందుకు ఈ విషయంలో చొరవ చూపించనట్లు? బ్యాంకు ప్రారంభంనుంచి స్వీపరు పనిచేస్తున్న ఆంజనేయులద్వారా అసలు విషయం బైటపడింది.


డిపాజిట్ మొత్తాన్ని అప్పగించాలని అప్పటి మేనేజరుగారు భావించినా .. సర్పంచి చిలకలయ్యగారొచ్చి  సైంధవుడిలా అడ్డుపడ్డారుట. ' ఆ పిచ్చాడి చేతిలో ఇంతమొత్తం పడితే .. ఊరు మొత్తాన్ని ఉచిత దానధర్మాలతో గడగడలాడించేస్తాడు సార్! అ గోలను తట్టుకోవడం నా వల్లకాదు. నేను చెప్పేదాకా  డిపాజిట్ విషయం అలాగే గుట్టుగా ఉంచ’మని చిలకలయ్యగారు  వత్తిడి చేసారుట . గ్రామ సర్పంచిగారి మాట తీసేసే ధైర్యం అప్పటి మేనేజరుగారు చూపించలేదు కాబట్టే   ఇప్పుడు వ్యవహారం మొత్తం నా నెత్తిమీదకొచ్చి పడింది!


అక్కడ డిపాజిటరు చేతిలో చిల్లిగవ్వలేక బస్టాండులో అడుక్కుతింటూ.. పాడుబడ్డ కొంపలో కాలక్షేపం చేస్తుంటే.. ఇక్కడ అతగాడికి న్యాయంగా దక్కాల్సిన సొమ్ము తొక్కిపెట్టడం న్యామమేనా? బ్యాంకువాళ్ళకు  ఆ హక్కు ఎక్కడుంది?!


ఆ రాత్రంతా నాకదే మధన.పాతమేనేజరుగారి దారిలోనే పోయి ఆ డిపాజిట్టును హెడ్డాఫీసుకి బదిలీ చెయ్యడమా? మానవత్వపు  కోణంలో.. బ్యాంకు ధర్మంగా ..  స్థానిక బాబును పిలిచి సొమ్ము స్వాధీన పరచడమా? రెండోదే ఉత్తమ మార్గమని మనసు పోరుతోంది. పోనీ..  సర్పంచిగారిని పిలిచి సలహా అడిగితేనో? మొదటిదానికే ఆయన మొగ్గు చూపుతారని తెలుస్తూనే ఉంది. ఎలాగూ తనాసలహా పాటించదలుచుకోనప్పుడు పిలిచి ఎందుకు అదనంగా కొరివితో తల గోక్కోవడం! 


మర్నాడు స్థానిక బాబును పిలిపించి డిపాజిట్  స్వాధీనపరుస్తూ 'వృథాగా ఎందుకు డబ్బు తగలేయడం? బ్యాంకులోనే ఉంచుకో! అవసరానికి సరిపడా తీసుకుని వాడుకో! మంచి బట్టలు వేసుకో! కడుపునిండా తిను! నిశ్చింతగా ఉండు! ఊరి జనాలను వేధిస్తే నీకు వచ్చే ఆనందం ఏముంది?' అంటూ మందలింపులతో కూడిన సలహా ఒకటి పారేసాను  నా ధర్మంగా.


'హిఁ.. హిఁ.. హిఁ' అని నవ్వాడు ఎప్పట్లాగానే. 'మొత్తం  కావాల్సిందే!' అన్నాడు చివరికి మొండిగా!


ఫార్మాలిటీసన్నీ పూర్తి చేసి లక్షా చిల్లర అతని సేవింగ్సుకాతాలో వేసి పాసుబుక్ ఇవ్వడం మినహా ఇంక నేనుమాత్రం చేయగలిగేదేముంది? ఆ పనే చేసాను. 


అప్పటికప్పుడు యాభై వేలు డ్రా చేసుకుని  మా స్టాఫు చేతుల్లో తలా ఓ వెయ్యి పెట్టాడు. 'తీసుకోక పోతే ఏడుస్తాడు. బ్యాంకునొదిలిపెట్టడు సార్!'అని   ఆంజనేయులు గొడవ పెడుతుంటే  తీసుకోక తప్పింది కాదు. ' 'హిఁ.. హిఁ.. హిఁ' అనుకుంటూ అతగాడటు  వెళ్ళగానే ఇటు మళ్ళా అందరం అతని కాతాలోకే ఆ సొమ్ము జమ చేసాసాం! 


స్థానిక బాబు చేతిలో డబ్బు పడ్డట్లు ఉప్పందింది ఊళ్లో. సర్పించిగారొచ్చిచాలా నిష్ఠురంగా మాట్లాడారు. 'చేతిలో చిల్లికానీ లేనప్పుడే ఊరును అల్లల్లాడించేసాడు వెధవ. ఇప్పుడింత డబ్బంటే వాణ్ని పట్టడం మాతరమవుతుందా? వాడి ప్రాణాలను గురించైనా ఆలోచించుండాల్సింది సార్ మీరు!’ అనంగానే నివ్వెర పోవడం నా వంతయింది. నా కా కోణం తట్టనందుకు బాధేసింది. భయమేసింది.  పోలీస్ స్టేషనాఫీసరుగారితో నాకు కొద్దిగా పరిచయం ఉంది. ఆయన దగ్గరీ విషయం కదిపితే నవ్వుతూ కొట్టిపారేసారు 'రాజుకన్నా మొండివాడు బలవంతుడంటారు. వాడంతట వాడు లొంగితే తప్ప మా తుపాకులుకూడా వాడినేం చెయ్యలేవులే సార్!' అని భరోసా ఇచ్చిన మీదట మనసు కాస్త కుదుట పడింది. 


అంత డబ్బు చేతిలో పడ్డా స్థానిక బాబు వింతప్రవర్తనలో  ఏ మార్పూ లేదు. చిరుగుల చొక్కా జేబులోనే డబ్బుకట్టలు కుక్కుకుని తిరగడం! ఇదివరకు స్కూలు పిల్లలకు ఇచ్చే పైసా బిళ్ళలకు బదులు పుల్లల ఐస్  క్రీములు కొనిస్తున్నాడిప్పుడు.  ఆడవాళ్ళనుకూడా  వట్టి బొట్టుబిళ్ళలు, హెయిర్ బేండ్లతో సరిపెట్టకుండా రవిక గుడ్డలు, పౌడరు డబ్బీలతో  వెంటబడి తరుముతున్నాడు. కాకా హోటల్లో భోజనం చేసేటప్పుడు పక్క విస్తరిలో అనుపాకాలు వేసి తినమని బలవంతపెట్టడం ఇదివరకు మల్లేనే సాగుతున్నదికానీ.. ఇదివరకు మల్లే జనం చీదరించుకోవడం బాగా తగ్గించేసారు. సర్పంచిగారే చొరవ చేసి వాడు రాత్రిళ్లు పడుకునే పాడుబడ్డ పోలీసు క్వార్టర్సుని బాగు చేయించారు కూడాను. 


మునపటంత ముదనష్టంగా లేదు ఇప్పుడు స్థానిక బాబు జీవితం. స్థానిక దర్జీ పుణ్యమా అని వంటిమీదకు నదురైన దుస్తులు అమిరేయి. స్థానిక బాబు జీవితంలో వచ్చిన ఈ మంచిమార్పుకు కొంతవరకు నేనూ కారణమే! ఆ ఊహ నా అహాన్ని కొంత సంతృప్తి పరిచిన మాటా నిజమే!


కొత్త ఎపిసోడ్ లో విచారించదగ్గ విషయం ఒక్కటే. స్థానిక బాబు చపలచిత్తంమాత్రం  భద్రంగా అలాగే ఉండడం! రోజూ పొద్దున్నే బ్యాంకుకు రావడం.. ఓ రెండువేలు డ్రా చేసుకుపోవడం! ఆ డబ్బంతా ఏమవుతుందో! మళ్ళా మర్నాటికి వట్టి చేతులతో హాజరు! ఈ లెక్కన కాతా ఖాళీ అవడానికి ఇంకెన్నో రోజులు పట్టకపోవచ్చు!


సర్పంచిగారొక సారి బ్యాంకుకొచ్చినప్పుడు చెప్పిన విషయాలు వింటే షాకవక తప్పదెవరికైనా!


'స్థానిక బాబు  దానగుణం ఇప్పుడు కొత్త ఏరియాలకు పాకింది సార్! సరిగతోటల్లోకి పోయి పేకాటరాయుళ్లకు డబ్బు పంచిపెడుతున్నాడు. సాయంకాలం అవడం పాపం..   సారాదుకాణం ముందుచేరి అడిగినాళ్లకి,అడగనాళ్లక్కూడా మందు పోయిస్తున్నాడు! ఊరు మళ్ళా పాతమంగలం అయేట్లుంది. అందుకే అన్నది.. మీరు మరీ అంత ముక్కుసూటిగా పోకుండా ఉండాల్సిందని అప్పట్లో!' 


సర్పంచిగారి నిష్ఠురాలు చూస్తుంటే దీనికంతటికీ నేనే బాధ్యుణ్ణి అనేటట్లున్నారు. బ్యాంకు మేనేజరుగా నా ధర్మం నేను నిర్వర్తించడంకూడా తప్పే?! ఆ మాటే ఆయనతో అంటే కాస్త వెనక్కి తగ్గారుకానీ ఆయనగారి మనసులో ఇంకా ఏదో నలుగుతోంది. ఆ ముక్క చెప్పడానికే  పనిగట్టుకొని వచ్చినట్లుంది. 'సరే!అయిందేదో అయింది సార్! ఇప్పుడా పాత పంచాంగాలిప్పుకుంటూ కూర్చొంటే ఫలితమేముందికానీ..  ఇకముందైనా ఆ మిగతా సొమ్ము ఏదో వంకతో బిగబట్టేయండి సార్! వాడి తిండితప్పలు.. మంచిచెడ్డలు ఏదో విధంగా మనం చూసుకుందాంలేండి! రేపు వాడికేదన్నా నిజంగా ముంచుకొస్తే.. ఆదుకోడానికైనా అక్కరకొస్తుందా సొమ్ము. అసలా పొద్దు ఆ పోలీసాయన ఈ ఉద్దేశంతోనే వీడి పేరనీ డిపాజిట్టు చేసింది ' అని  వెళ్ళిపోయారు సర్పంచిగారు. 


ఆయన అన్నమాటలోనూ సబబుంది. కోట్లు కోట్లు దేశంసొమ్మును కొల్లగొట్టి పెద్దమనుషులుగా చెలాయిస్తున్నవాళ్ళను చూస్తున్నాం. ప్రజాహితంకోసం ఒక్క పైసా విదల్చని పరమపీనాసి సన్నాసులు  సైతం ఆర్భాటపు వేడుకల్లో దానకర్ణులన్న పేరు కాపీనంకోసం ఒక్క పైసా ఇచ్చి వందరూపాయల కీర్తిలాభం కొట్టేయడమూ చూస్తున్నాం. అడక్కుండానే దానమిస్తానని వెంటబడి వేధించే చిత్రమైన దానకర్ణుణ్ణి మాత్రం ఈ చెరువుపల్లిలో తప్ప బహుశా ఇంకెక్కడా చూడబోమేమో! మూడేళ్ళుండి పోయే సర్కారు ఉద్యోగిని. నాకిదంతా అవసరమా? రేపు నిజంగానే ఈ స్థానిక బాబు ప్రాణానికేదైనా ఐతే జీవితాంతం ఆ అపరాదభావనతో కుమిలి చావాల్సింది నేనే!  ఇంకీ కథ ఇక్కడితో ముగించడం మంచిదనిపించింది.


మర్నాడు డబ్బు డ్రా చేసుకోవడానికని వచ్చిన స్థానిక బాబుతో   'బ్యాకు వడ్డీలెక్కలో పొరపాటు జరిగి పెద్దమొత్తం నీ కాతాలో పడిందయ్యా! ఇప్పుడు సరిచేసాం.  ఇదే నీ చివరి మొత్తం. ఏం చేసుకుంటావో నీ ఇష్టం' అంటూ ఓ  రెండువేలు అతని చేతిలో పెట్టి పాసుబుక్కు వెనక్కి తీసేసుకున్నాం. ఎప్పటిలాగానే 'హిఁ.. హిఁ ..హిఁ' అని నవ్వుకుంటూ డబ్బులు పుచ్చుకుని  వెళ్ళిపోయాడు. అప్పటికి నిజానికి అతగాడి కాతాలో ఇంకా యాభౖవేలకు పైగానే సొమ్ముంది.


స్థానిక బాబు తరుఫున ఏదైనా మానసిక వికలాంగుల సంస్థకు విరాళమిచ్చి అవసరమైనప్పుడు అతగాడిని ఆదుకునే బాధ్యత అప్పగించాలన్నది ఎప్పట్నుంచో సర్పంచిగారి ఆలోచన. 


ఒక వారంరోజుల సెలవుమీద నేను మా ఊరుకి వెళ్ళి తిరిగి వచ్చేసరికి వ్యవహారమంతా పూర్తిగా తలకిందులయిపోయి ఉంది!


బాంకు కాతాలోని సొమ్మంతా డ్రా అయిపోయింది! ఎంతసొమ్ము చూపెట్టుకుంటూ ఊళ్లో తిరిగాడో కానీ.. బస్టాండు వెనకాల  పొదల్లో సగంశవమై తేలాట్ట స్థానిక బాబు. పొద్దున పొద్దున్నే ఏవో మూలుగులు వినబడుతుంటే అనుమానం వచ్చి వెళ్ళి చూసారుట అటువైపుకి బయలుకి వెళ్లే ఆడంగులు.  కొనూపిరితో కొట్టుమిట్టాడుతున్న స్థానిక బాబు కనిపించాట్ట! అతగానికేమైనా అయితే ఊరికే వినాశనమని గదా ఊళ్లో జనం భయం! పనులు మానుకుని మరీ  అందుకే నెల్లూరు పెద్దాసుపత్రిలో చేర్పించారుట అందరూ కలసి స్థానిక బాబుని. అన్నింటికన్నా విచిత్రం .. మొదట్నుంచి స్థానికబాబు మంచి చెడ్డలు చూసిన సర్పంచి చిలకలయ్యగారీ సందట్లో ఊళ్లోనే  లేకపోవడం!  మూడోసారి గుండెపోటొచ్చిందని చెన్నయ్ అపోలోలో చేరి అప్పటికి నాలుగో రోజు. 'ఎంత ఖర్చైనా సరే.. మళ్ళీ మనుషుల్లో పడేటట్లు చెయ్య'మని ఆయనగారి బంధుబలగమంతా పెద్దడాక్టర్లను పట్టుకుని ఒక పట్టాన వదల్లేదుట అక్కడ! 'డబ్బు పోస్తే పాడైపోయిన గుండెకాయలు  బాగవుతాయిటయ్యా?  పేషెంటుకి ఇప్పట్టున  కావాల్సింది కరెక్టుగా సెట్టయి ..  పనిచేసే గుండెకాయ. అదెక్కడుందో ముందు వెళ్ళి  పట్టుకు రండి.. పోండి' అని కూకలేసారట చికాకు తట్టుకోలేక డాక్టర్లు. 


ఇన్ని వివరాలు  చెప్పిన క్యాషియర్ గుప్తా మరో అనుమానమూ అర్థాంతరన్యాపదేశాలంకారంలో   నసుగుతూ వెళ్లగక్కాడు  ‘.. ఆ మర్నాడే స్థానిక బాబు బస్టాండు వెనకాల పొదల్లో సగంశవమై తేలడమూ!.. అదీ  సర్పంచిగారి భార్య చూడామణమ్మగారి  కంటనే పడడమూ!’


‘స్థానిక బాబుకి డబ్బిచ్చినందుకు మీతో అన్ని నిష్ఠురాలు పోయారుగదా  సర్పంచిగారు! వాళ్ళబ్బాయి  సాంబశివరావే దగ్గరుండి, మాతో దెబ్బలాడి మరీ డబ్బంతా ఆ దానకర్ణుడిచేత  డ్రా చేయించాడు సార్!’ అంటో ఇంకో స్టేటుమెంటుకూడా అంటించాడా గుప్తా!


‘అదంతా ఏమోగానీ.. స్థానిక బాబు  బతకడం అసాధ్యమని  తేల్చేసిన నెల్లూరి ఆసుపత్రి డాక్టర్లకు  చెన్నయ్ లో సర్పంచిగారు ఎడ్మిటయిన ఆసుపత్రితో కూడా ఎప్పట్నుంచో లింకులున్నాయని ఊరంతా ఒకటే గుసగుసగా ఉంది సార్!’ అన్నాడీ పక్కనుండి క్లర్కు  ఏడుకొండలు మరంత రెచ్చిపోతూ.


‘ఊరికి అరిష్టం తప్పాలంటే ఎట్లాగైనా ఆ స్థానిక బాబుని ఊరి పొలిమేరలు దాటనీయద్దనికదా  ఊరిపెద్దల కట్టడి పంచాయితీలో! అందుకే.. స్థానిక బాబు గుండెకాయని సర్పంచిగారికి మార్చాలని కూడా తీర్మానం చేస్తిరి!  ఇప్పుడిట్లా మళ్ళా తిరకాసుగా మాట్లాడితే  ఎట్లా?’ అంటూ కోపానికొచ్చాడు ఆంజనేయులు.


 ఆంజనేయులు మాటంటే ఊరి సెంటిమెంటుకు నిలువుటద్దమే! అదట్లా ఉండనీయండి!  బయోలాజికల్ గా స్థానిక బాబు గుండెకాయ ఎలాంటి ఇబ్బంది లేకుండా చిలకలయ్యగారికి సెట్టవడమే పెద్ద వింత!


‘ఇందులో వింతేముంది సార్! అంతా ఆ వీరభద్రయ్య చలవ. ఊరికి మళ్ళా  చెడ్డరోజులు రావద్దని మా వీరభద్రసామి  తలచాడు. అందుకే ఏ అడ్డంకులూ రాకుండా దయతలచాడు’ అంటో రెండు చెంపలు టపటపా వాయించుకున్నాడు తూర్పువైపున్న   గుడి వంక భక్తిగా  చూసుకుంటూ ఆంజనేయులు!


రోగి తాలూకు బంధువుల సమ్మతి అవసరమని ఆసుపత్రి వర్గాలు రూలు చెప్పినప్పుడు 'నా అన్న వాళ్లెవరూ లేని అనాథ సార్ వాడు! సర్పంచిగారే ఇంతకాలం వాడిని ‘తండ్రి’లా సాకింది!  స్థానికబాబే గనక స్పృహలో ఉంటే ' హిఁ.. హిఁ.. హిఁ' అని నవ్వుకుంటూ తన గుండెకాయ పీకి సర్పంచిగారికి పెట్టిందాకా  వేధించుండేవాడు. వాడు అపర దాన కర్ణుడు' అనేసిందిట  సర్పంచిగారి సహధర్మచారిణి!


ఇన్నేళ్లయినా నాకింకా  ఆ స్థానిక బాబు క్యారెక్టరు మరపుకురాలేదంటే కారణం.. మనసుని కరిగించే అతగాడి  దానగుణం! దాన్నంటి పెట్టుకునుండే ‘హిఁ.. హిఁ.. హిఁ’ అనే హాసస్వరం!  


‘తండ్రి దగ్గర్నుంచి పుణికిపుచ్చుకున్నాడా రెండు గుణాలు!’ అంటాడాంజనేయులు.


‘నిజమో.. కాదో.. తెలియాలంటే ముందా తండ్రెవరో తేలాలిగా?’ అంటాడు క్లర్కు ఏడుకొండలు.

***

No comments:

Post a Comment

Pages