అమ్మవారి శేషవస్త్రం - అచ్చంగా తెలుగు

అమ్మవారి శేషవస్త్రం

Share This




అమ్మవారి శేషవస్త్రం

(మా జొన్నవాడ కథలు)

 డా.టేకుమళ్ళ వెంకటప్పయ్య (9490400858)

 

              "ఒసే సుబ్బక్కా... అటుజూడు.. ఆ మాలచ్చమ్మ వయ్యారం చూశావటే.. ఎప్పుడో సవచ్చరం క్రిందట గొన్న చీరె. కొత్త చీరె కట్టుకున్నట్టు ఏం ఎగ్జిమిషన్ చేస్తున్నాదో చూశావా?"

"అవునవును..రంగమ్మా.. దానెవ్వారం మనకు కొత్తా ఏంది చెప్పు? అందరూ దాని చీర  చూసేదాకా ఎచ్చులు పడతానే ఉంటాది. కొత్త కోక సమచ్చరందాకా ఉతకదు.  కొత్త కరుకు మాసిపోద్దని. బిల్డప్పులు చానా ఉన్నాయి దీని దెగ్గిర…"

ఇంతలో మాలచ్చమ్మ దేవళంలో ప్రదక్షిణాలు జేసి నాలుగ్గాళ్ళ మంటపంలోకి రానే వచ్చింది.

"ఏం సుబ్బక్కా..బాగున్నారా?"

" బాగున్నాం. నువ్వెట్టున్నావు?"

" పసుప్పచ్చ చీర కట్టుకుంటే మొగా..ఆడా..అందరూ నన్నే చూస్తుంటారే! పాడు..సిగ్గుగా ఉంటాదే!"

"వేరేది కట్టుకోని రాకపొయ్యావా..అప్పుడెప్పుడో  గొన్న చీర కదా యిదీ…"

"లేదు మద్దినే… మా ఆయన చీరలు వద్దయ్యా మొగుడా! అంటే వినడు. నెల నెలా ఏదో ఒకటి కొంటానే ఉంటాడు"

"అవునా.. మరెప్పుడూ చిలకాకు చీరే కడతా ఉంటావేంది? వారానికి రెండ్రోజులు?"

" అదా.. అదీ.. అదంటే… మా మావకు తెగిష్టం..  ఇంక వస్తానక్కా... కాస్తా పనుంది" అంటూ మెల్లిగా జవాబు చెప్పకుండా జారుకుంది.

"చూసినావంటే దాని ఎదవ సెకలు.... వందల వందల చీరలున్నట్టు… మాటలు మాత్రం కోటలు దాటతాయి" ఇద్దరూ నవ్వుకుంటూ దేవళంలో నుంచీ బయటబడ్డారు.

***

         

          మాలక్షమ్మ మొగుడు కిష్టయ్య రాత్రి అన్నం తిన్నాక, పవళింపుసేవలో ఉండగా గట్టిగా పట్టుకుంది మొగుణ్ణి. "మావాళ్ళు లేనోళ్ళేం గాదు. మా నాయనకు పెద్ద ఫర్నిచర్ షాపుంది. అయిన సంబంధమని, మా అమ్మ తమ్ముడివని, మంచోడివని.. డబ్బులేకపోయినా నీకు కట్టబెట్టారు. నా గొంతు కోశారు. అంతా నా కర్మ!

ఏమయ్యిందే నీకిప్పుడు? ఏం లోటు జేశాను. కూటికి లేదా గుడ్డకు లేదా?”

ఏమయ్యోవ్.. ఒక్కటే మాట విను..మంచి పట్టుచీర కొంటానని ప్రమాణం చేసి నెలయింది. కొనేదుందా లేదా? లేకపోతే మా పుట్టింటికి పోతానేను. "

"కొంచెం ఆగవే! రకరకాల చీరలున్నా ఇంకా ఏదో ఒకటి తెమ్మని సతాయిస్తానే ఉంటావు. దాని బదులు ఏదైనా పనికొచ్చే వస్తువు కొనుక్కుంటే ఇంట్లో ఉపయోగం కదా!"

"నాకదంతా దెలవదు..నీకు సుక్కురారం వరకూ గడువిస్తా ఉండా!.. తేలేదా.. అంతే...శనివారం పొద్దన్నే బస్సెక్కుతా! నువ్ మళ్ళీ ఆడకొచ్చి పిలిచినా ఈ తూరి వచ్చేదేలే... అంతే.. "

"ఓసి నీ దుంపదెగ ఆగవే డబ్బూ దస్కం చూస్కోవద్దూ..ఇప్పటికిప్పుడు పట్టుచీరంటే ఎట్టనే!"

మంచంలో గొణుక్కుంటూ  కోపంగా అటు దిరిగి  పడుకుంది.

 

***

              అనుకున్న  శుక్రవారం రానే వచ్చింది  కిష్టయ్యకు దిగులు మొదలయ్యింది. చేతిలో డబ్బుల్లేవు.  మాలక్ష్మి పట్టు చీరె కొనమని పట్టుబట్టింది. ఉత్తుత్తి బెదిరింపులా అనుకుంటే ఒక సారి అట్టాగే పుట్టింటికి బొయ్యి ఇరవై రోజులు రాలేదు. కూటికి నానా ఇబ్బందీ పడ్డాడు. ఆలోచిస్తూ, ఈ గండం గట్టెక్కిచ్చమని కామాక్షమ్మకు దణ్ణం పెట్టుకుందామని దేవళంలోకి దూరాడు.

              దర్శనం అయింతర్వాత దిగులుగా ఒక అరుగుమీద కూర్చున్నాడు. హెడ్మాస్టరు ప్రకాశంగారు కనపడి "ఏరా..కిష్టయ్యా.. ఇంట్లో కొంచెం కొయ్య పనులున్నాయి. నాలుగైదు రోజుల పనుంది. నువ్వైతే బాగా చేస్తావని వేరే వాళ్ళకు చెప్పలేదు. రమ్మని పిలవంపించాను గదా! రాబల్లేదట్రా.. చెప్పు?  వారం రోజుల్లో మళ్ళీ బళ్ళు తీస్తారు. అప్పుడు కుదరదని చెప్పా కదా!"

"సామీ.. రేపు పొద్దున్నే వస్తాను. నిన్నటితో పెద్దిరెడ్డింట్లో పన్లన్నీ అవజేసుకున్నాను"

ప్రకాశం ధ్యానం చేసుకుంటూ అక్కడే కూర్చున్నాడు. ఇంతలో అమ్మవారి శేషవస్త్రాలు అమ్మకానికి పెట్టారు. అక్కడికి వెళ్ళి నిలబడ్డాడు. కొత్త చీరె ఎర్రటి ఎరుపు రంగు పట్టుచీర నాలుగు వేలని చెప్పాడు.

కిష్టయ్య ప్రకాశం దగ్గరకు వెళ్ళి చూస్తూ నిలబడ్డాడు.

"ఏంట్రా! ఏమైంది? రేపొస్తావుగదా!"

" వస్తనయ్యా..కానీ చిన్న మనవి..”

"ఏందో చెప్పు?"

“ఏంలేదయ్యా.. నాలుగు వేలు అర్జెంటుగా కావాలి. ఎలాగూ మీ యింట్లో వారం పనుందిగదా! ఆడ అమ్మతున్నారే..ఆపట్టు చీర కొనకపోతే మా ఆడోళ్ళు పుట్టింటికి పోతానని గలభా జేస్తున్నారయ్యా.."

ఉన్నోళ్ళమ్మాయిని జేసుకుంటే ఇదే వచ్చిన తంటా! గంతకు తగ్గ బొంతనే ఎతుక్కోవ్వాల!”  అని అంటూ ప్రకాశం దేవళంలో చీరలమ్మే వాడి దగ్గరికి వచ్చి "ఒరేయ్.. పట్టు చీర కిష్టయ్యకు ఇవ్వు. నేను మా వాడితో ఇప్పుడే డబ్బులు పంపిస్తాను" అన్నాడు

"అట్నే సార్.." అని ప్యాక్ చేసి ఇచ్చాడు.

ప్రకాశం ఆనందానికి అవధుల్లేవు. "అయ్యా… రేప్పొద్దన్నే ఎనిమిదో గంటకి మీ ఇంటి కాడ ఉంటా! ఇంక మళ్ళీ అడ్మాన్సు కూడా అడగను. పనయింతర్వాతే డబ్బులివ్వండి" అని నమస్కారం చేసి "చానా మేలు చేశారయ్యా.." అంటూ వెళ్ళాడు.

***

              మాలచ్చమ్మ ఆనందానికి అవధుల్లేవు. 'ఇన్నాళ్ళూ నాకు పట్టుచీర కొత్తదిలేదని అంతా ఎగతాళి చేస్తారా? ఇప్పుడు చెప్తా వాళ్ళ పని ' అని గొణుక్కుంది.

              ప్రక్కరోజు సాయంత్రం -  చక్కగా ముస్తాబయి కొత్త పట్టుచీర కట్టుకుంది. దార్లో కనబడిన వాళ్ళనంతా పలకరించి అత్తా.. అక్కా.. చెల్లీ... పిన్నమ్మా.. ఎట్టుండారు?" అని పనున్నట్టుగా అందరినీ పలకరించింది. మాలక్షమ్మ బిల్డప్ అందరికీ తెలిసిందే కాబట్టి అటు తిరగ్గానే నవ్వుకునేవాళ్ళు. మాలక్ష్మికి మాత్రం ఇవేమీ పట్టవు. అందరూ తన కొత్త పట్టు చీర చూశారా లేదా అని చీర సర్దుకుంటూ మాట్లాడేది.   దేవళంలో అయితే అందరూ చూస్తారుగదా  అని తిన్నగా అక్కడికి దారి తీసింది.

              సుబ్బమ్మ, రంగమ్మ, సూరమ్మ అంతా అక్కడే ఉన్నారు. అందరూ దూరం నుంచే మాలక్షమ్మను గమనించారు.

"ఒసేవ్! బిల్డప్ మాలచ్చి వచ్చింది రా.. రా..! మనకు మాంచి కాలక్షేపం. కొత్త పట్టుచీర!” అంటూ రంగమ్మను పిలిచి ఒకచోట మండపంలో సెటిల్ అయ్యారిద్దరూ. మాలక్ష్మి మొదటి ప్రదక్షిణం అప్పుడే వీళ్ళిద్దర్నీ గమనించింది. దొరికారు ఇప్పుడు చెబ్తా మీపని..నాకు పట్టుచీరలే లేనట్టు మాట్లాడతారా? అనుకుంటూ గబగబా ప్రదక్షిణాలు రెండూ చేసేసి గుడిలోపలికి సర్రున బోయి,  సర్రున దర్శనం చేసుకుని మండపం దగ్గరకు వచ్చేసింది. 

          అక్కడ కూర్చోగానే మాలక్ష్మికి తలతిరిగినట్టనిపించింది. అక్కడ స్థంభానికి ఆనుకుని కూర్చుని అలా కూర్చున్నది. రంగమ్మా, సుబ్బమ్మలకు విషయం అర్ధం కాలేదు. ఇంకా మొదలు పెట్టలేదే సోది అనుకుంటూ నవ్వుతూ చూస్తున్నారు. మాలక్షమ్మకు కళ్ళుమూతలు పడుతున్నట్లనిపించింది. తనే మొదలుపెడదామని లోపలే నవ్వు  ఆపుకుని…సుబ్బమ్మ "ఏమే! మాలచ్చీ… కొత్త చీరనుకుంటా! ఎంత బాగుందే!" అనింది.

          మాలక్ష్మి మెల్లిగా కళ్ళు తెరిచి "అవును కొత్తదే! అది సరే గానీ… మీ ఆయన జేబులో పొద్దున ఐదొందలు కొట్టేశావుగదా!" అనింది. ఉలిక్కిపడింది సుబ్బమ్మ. దీనికెలా తెల్సింది అనుకుంది. ఇంతలో రంగమ్మ "అన్నీ చూసినట్టే చెప్తున్నావే" అంది నవ్వుతూ. "అవును రంగమ్మత్తా.. పొద్దున మీ ఆయన నెల్లూరికి పనికి బొయింతర్వాత నువ్వు దేవరపాళెం ఎందుకు పొయినావు?" అని అడిగింది. ఈసారి ఆశ్చర్యపోవడం రంగమ్మ వంతయింది. "ఆడ…. ఆడ… మా మరిది..చెల్లెలు ఉన్నారని చూడ్డానికి పొయినా గానీ నువ్వెప్పుడు చూశావు?" అనగానే "మరిది భార్య రమణమ్మ కాన్పుకు పుట్టింటికి బోయిందిగదా! మరిదిని చూడ్డానికి బొయినట్టున్నావు?" అంది. అరే! మాలచ్చమ్మ ఉత్త వెర్రిబాగుల్ది అనుకున్నాం కానీ ఇదేందిది?  సూదికోసం సోదికిబోతే అన్నట్టుగా రహస్యాలన్నీ అట్నే చెప్పేస్తా ఉంది అనుకుని,  ఇద్దరూ మెల్లిగా అక్కణ్ణుంచీ జారుకున్నారు.

          దారిలో వాళ్ళకు మాలక్షమ్మ మొగుడు కిష్టయ్య కనబడ్డాడు. రంగమ్మ ఊరుకోకుండా “నీ పెళ్ళానికి అప్పుడప్పుడూ దేవుడు వంటిమీదకొస్తున్నట్టున్నాడు. జరిగింది కళ్ళకు కట్టినట్టు చెప్తా ఉంది. జాగ్రత్తగా ఉండు కిష్టయ్యన్నా! ఆడా ఈడా తిరిగావనుకో! అంతే నీపని!” అని నోరు జారింది.  కిష్టయ్యతో అలా ఎందుకు చెప్పావని బాగా తిట్టింది సుబ్బమ్మ.  కిష్టయ్య "హమ్మో! ఇదొకటుందా దీని దగ్గర… జాగ్రత్తగా ఉండాలి" అనుకుంటూ యిల్లు చేరుకునే సరికి మాలక్షమ్మ ఇంకా రాలేదు.

          కొంతసేపటికి గుడిలో మెలుకువ వచ్చి లేచి  ‘అవునూ.. వీళ్ళిద్దరేరీ?’  అనుకుంటూ ఇల్లు చేరగానే 'మావా! గుళ్ళో తలతిరిగి పడిపోయాను. బాగా నిద్దర పట్టేసినట్టుంది’ అంది. పెళ్ళాం వంటిమీద అమ్మవారి చీర గమనించాడు కిష్ట య్య. అమ్మవారి శేష వస్త్రం!

***

              ఆదివారం కూరల సంతలో రంగమ్మ, సుబ్బమ్మలు కనిపించగానే మహాలక్ష్మి "నిన్న దేవళంలో ఉన్నట్టుండి ఎందుకో నిద్దర పట్టేసింది. లేచి చూసేసరికి మీరిద్దరూ లేరు. ఇంతకీ మా ఆయన ఎర్రపట్టు చీర తెచ్చాడు చూశారా? లేదా అనింది." అంటూ మామూలుగా మాట్లాడింది. అవిషయాలేవీ ఎత్తకుండా మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయారు. నిన్న ఏమైంది మాలచ్చికి? రంగమ్మ కావాలని దేవరపాళెం సంగతి పరోక్షంగా ఎత్తినా దాన్ని గురించేమీ మాట్లాడలేదు.  మాలక్షమ్మకు నిన్న తమ స్వంత విషయాలు తెలియడం నిజంగానే దేవుడి మాయా? ఎంత బుర్ర గోక్కున్నా అర్ధంకాలేదు వాళ్ళకు.

***

 

          మహలక్షమ్మ చెల్లెలికి పెళ్ళి కుదిరింది.  ఊరు ఊరంతా చాటింపు వేసింది. గొప్ప సంబంధం. చెల్లెలు మంచి అందగత్తె, డిగ్రీ పూర్తిచేసింది.  సినిమా యాక్టరులాగా ఉంటుందన్న కారణంగా కట్నం తక్కువే కానీ, పెళ్ళిలో బంగారం బాగా పెడుతున్నామని, అమెరికాలో సాఫ్టువేరు ఇంజినీరుకిచ్చి చేస్తున్నారని, లక్ష రూపాయలు జీతం అని ఊరంతా చెప్పి సంబరం చేసింది. పెళ్ళవగానే వారంలోనే ఇద్దరూ ఫారిన్ వెళ్ళాలట. పెళ్ళికి వారం ముందుగానే నెల్లూరు వెళ్ళి తెగ హడావుడి చేసింది.  షాపింగులూ గట్రా మంచి కాలక్షేపంగా ఉంది మాలక్షమ్మకు.

              పెండ్లి రోజు రానే వచ్చింది. మాలక్షమ్మే పెళ్ళి పెద్ద కావడంతో అన్ని పనులు మీదేసుకుని చేస్తున్నది. పెండ్లి వారి విడిది పైన మేడ మీద ఇచ్చారు. రాత్రి పెళ్ళిముహూర్తానికి వేరే కొత్త పట్టు చీర కట్టుకుందామని, సాయంత్రం ఎర్రపట్టు చీర బయటికి దీసి కట్టుకుని గొప్పగా అందరికి చూపిస్తున్నది.

          ఎదురుకోల, వరపూజ, ఇంకా గంట ఉందనగా మాలక్ష్మి వాళ్ళకు ఇవ్వవలసిన వరపూజ సామాన్లు, అవీ తీసుకుని, ఒక పెద్ద ముత్తైదువతో మేడ మీదకు వెళ్ళింది. ఎందుకో తల తిరుగుతున్నట్లనిపించి, ప్రక్కనామెకు సామాను చేతికిచ్చి, గోడకానుకోని నిలబడి గమనిస్తూ నిలబడి ఉంది. 

              పెండ్లి కుమారుడు ఎదురుగా కుర్చీమీద కూర్చొని ఉన్నాడు. ప్రక్కన వాళ్ళ అమ్మా నాన్నా ఉన్నారు. ఇంకా వాళ్ళ బంధువులు పాతిక మంది గదిలో ఉన్నారు. ప్రక్కనామె వాళ్ళకివ్వాల్సిన సామాను ఇచ్చి ‘పదవే మాలచ్చీ పోదాం’ అంది.

              మాలక్ష్మికి పెండ్లి కుమారుణ్ణి చూసింది. అంతే! "ఒరేయ్..దిక్కుమాలినోడా! నువ్వు ఇంతకు ముందే చాలా మందిని ఇలా పెళ్ళి చేసుకుని మోసం చేశావు  కదరా! నిజం చెప్పు?" అంటూ సివంగిలా పరుగెత్తుకుని వెళ్ళికాలర్ పట్టుకుంది. పెళ్ళివారంతా హడలిపోయారు. మాలక్ష్మి అరుపులు విని కిష్టయ్య పైకి వచ్చాడు. అందరూ వింతగా చూస్తున్నారు. కిష్టయ్యకు గతంలో రంగమ్మ చెప్పిన విషయం గుర్తొచ్చి..అత్తామామకు చెవిలో విషయం చెప్పాడు.  పెండ్లి కొడుకు ఏమీ మాట్లాడకుండా మిడిగుడ్లేసుకుని చూస్తూ ఉండడం వల్ల పెండ్లికి  వచ్చిన వాళ్ళంతా విస్తుపోయారు.  పెండ్లి వారు అడిగిన దానికి సరయిన సమాధానం ఇవ్వకపోయే సరికి  ఆరోజు రాత్రికి జరగాల్సిన పెళ్ళి ఆగిపోయింది.  తర్వాత ప్రక్కరోజు మహాలక్ష్మిని అడిగితే నిన్న తనేం మాట్లాడిందో తనకే తెలీదని, గుర్తులేదని చెప్పింది అందరికి.

              నాలుగు రోజుల తర్వాత పేపర్లో వార్త, ఫొటోలు చూసి అంతా నివ్వెరపోయారు.  నిత్య పెళ్ళికొడుకుగా పెళ్ళిళ్ళు చేసుకుంటూ, ఫారిన్లో ఉద్యోగం అని చెప్పి మోసం చేస్తూ, డబ్బు, నగలు తీసుకుని పారిపోతూ ఉండే బ్యాచ్‌ని పట్టుకుని పోలీసులు అరెస్టు చేసినట్టు ఉంది. 

          జొన్నవాడలో తనను ఇప్పుడందరూ అంత గౌరవంగా ఎందుకు చూస్తున్నారో… మాట్లాడుతున్నారో.. మహాలక్షమ్మకు మాత్రం ఈనాటికీ అర్ధంకావడం లేదు.

-0o0-

 

No comments:

Post a Comment

Pages