గర్వాతిశయాలు - అచ్చంగా తెలుగు

గర్వాతిశయాలు

రచన సి.హెచ్.ప్రతాప్

(చరవాణి: 95508 51075) 

 



నర్మదా నదీ తీరంలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి తపోదీక్ష చేస్తున్న విద్యారణ్య స్వామి వద్దకు దీపకుడు  అనే పేరు గల  శిష్యుడు వచ్చి  తనను శిష్యుడిగా స్వీకరించి విద్యాదానం చేయాల్సిందిగా ఆర్ధించాడు. అతనిని అన్ని పరీక్షలు నిర్వహించి., అతనిలో సుగుణాలను నిర్ధారించుకున్నాక విద్యారణ్య స్వామి దీపకుడిని తన శిష్యుడిగా స్వీకరించి విద్యాబోధన ప్రారంభించారు.


దీపకుడు స్వతాహాగా ఎంతో తెలివైన వాడు. గురువు చెప్పిన విషయాన్ని వెంటనే ఆకళింపు చేసుకొని మన మదిలో నిక్షిప్తం చేసుకొనేవాడు. మిగితా శిష్యుల కంటే అతనికి ఎక్కువ తెలివితేటలు వున్నాయన్న కించిత్ గర్వం పాళ్ళు అతనిలో పొడచూపసాగింది.


ఒక రోజు విద్యాబోధన జరుగుతుండగా గురువుపై నీకెంత విశ్వాసం వుందని సాటి శిష్యుడు అడగగా " నా విశ్వాసం ఆకాశమంతగా అవధులు లేనిది" అని గర్వంగా జవాబిచ్చాడు దీపకుడు. దానిని విన్న గురువు చంద్రునిలో వున్న మచ్చ చందాన అతనిలో కొద్ది కొద్దిగా పొడసూపుతున్న గర్వాన్ని వెంటనే నిర్మూలించాలని నిర్ణయించుకున్నారు. ఒకరోహు విద్యారణ్యస్వామి దీపకుడిని పిలిచి  ఒక ప్రదేశం చూపించి అక్కడ చిన్న కుటీరం నిర్మించి అందులో మురళీధరుని విగ్రహ ప్రతిష్ట కోసం ఒక వేదిక కూడా నిర్మించి, ఈ పనంతా ఒక పక్షం రోజులలో పూర్తవ్వాలని ఆదేశించారు.


అందరి శిష్యులలోకెల్లా తనకే ఈ మహత్తర అవకాశం ఇచ్చినందుకు కించిత్ గర్వించాడు దీపకుడు. వెంటనే కుటీర నిర్మాణం పని ఆరంభించాడు.


అనుకున్నట్టుగానే పక్షం రోజులలో కుటీర నిర్మాణం పూర్తయ్యింది. తాని అనుకున్నదానికంటే ఎంతో అందంగా నిర్మాణం పూర్తిచేసానై కించిత్ గర్వించాడు దీపకుడు. వెంతనే దానిని గురువుకు చూపించాడు.దానిని చూడగానే పెదవి విరిచేసారు విద్యారణ్యస్వామి.


" కట్టడం నిర్మాణం బాగానే వుంది కాని, నువ్వు నేను చెప్పినట్లు కాకుండా ఇంకొక ప్రదేశంలో కట్టావు. ఇక్కడ వాస్తు అసలేమాత్రం మంచి దికాదు. కాబట్టి ఇక్కద కుటీరాన్ని పీకివేసి ఆ ప్రదేశంలో కుటీరం పున: నిర్మించు " అని ఆదేశించారు గురువు.


ఎక్కడ పొరపాటు జరిగిందో అర్ధం కాలేదు దీపకుడికి. తాను గురువు ఆజ్ఞలు సక్రమంగానే విన్నాడే ! ఆయన చూపించిన ప్రదేశంలోనే నిర్మాణం కుడా చేపట్టాడు. మరి అది తప్పెలా అయ్యింది?"


సరే, ఈసారి జాగ్రత్తగా గురువు ఆజ్ఞలు పాటించి సరైన ప్రదేశంలోనే కుటీర నిర్మాణం చేపట్టాలని ధృఢంగా నిశ్చయించుకున్నాడు. పక్షం రోజుల్లో నిర్మాణం పూర్తి చేసి గురువు గారికి చూపించాడు.


మళ్ళీ గురువు పెదవి విరిచారు. క్రితం సారి లాగానే "అరెరె . ఈ సారి కూడా నువ్వు పరధ్యానంలో వుండి నా మాటలు సరిగ్గా వినలేదు.వాస్తు అసలు సరిగ్గా లేని ప్రదేశం లో మళ్ళీ కుటీరం నిర్మించి అనవసరంగా నీ సమయాన్ని, ధనాన్ని వృధా చేసావు" అంటూ ఇంకొక ప్రదేశం చూపించారు.


ఈ సంఘటన ఇలా ఒక పది సార్లు పునరావృతమయ్యింది. ఎక్కడ కట్టినా అది తాను చూపించిన సమయం కాదంటున్నారు గురువు గారు.


అప్పటికి తన విద్యాభ్యాసానికి విరామం ఇచ్చి ఆరు నెలలు అయ్యింది. మిగితా శిష్యులందరూ కొత్త కొత్త పాఠాలు నేర్చుకొని ముందుకు వెళ్తుండగా తన పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు వుంది.


 పైగా ఆరు నెలల శారీరక శ్రమ వలన పూర్తిగా అలిసిపోయాడు. మొదట్లో సౌమ్యంగా వివరించే గురువు ఇప్పుడు కోపగించుకోవడం, ఈసడించుకోవడం, దుర్భాషలాడడం చేస్తున్నారు. ఇక అక్కడ వుంటే తన చదువు కొనసాగదని నిర్ణయించుకున్న దీపకుడు ఒకనాటి అర్ధరాత్రి ఆ ఆశ్రమాన్ని విడిచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు.


ఇది గ్రహించిన గురు భార్య అతని వద్దకు వచ్చి ఆశ్రమం వదిలి వెళ్ళకుండా అడ్డుకుంది.  నువ్వే అందరి ముందు ఎంతో ధైర్యంగా, నమ్మకంగా నీ గురువు పట్ల నీ విశ్వాసం ఆకాశమంత సువిశాలమైనదని ప్రకటించావు. ఈ విశ్వాసం ఎంతటిదని మాత్రమే గురువు నిన్ను పరీక్షిస్తున్నారు. ఈ పరీక్ష ఎంత జటిలమైనదైనా నువ్వు తట్టుకొని నిలబడినప్పుడే నువ్వు విజయం సాధించినట్లు లెక్క." అతనిని ఓదార్చింది గురుపత్ని అసలు విషయం తెలుసుకున్న దీపకుని హృదయంలో అజ్ఞాపు పొరలు వీడి జ్ఞానోదయమయ్యింది.ఆశ్రమాన్ని, గురువు సన్నిధిని వీడబోయి తానెంత తప్పు చేయబోయాడో తెలిసివచ్చేసరికి పశ్చాత్తాపంతో దుఖించాడు. వెంటనే వెళ్ళి గురువు పాదాలపై పడి కన్నీళ్ళతో అభిషేకించి క్షమార్పణలు వేడుకున్నాడు. గురువు అతడిని లేవనెత్తి ప్రేమతో హత్తుకొని ఆశీర్వదించారు. నాటి నుండి దీపకుడి విద్యాభ్యాసం నిరాఘాటంగా సాగింది.


***

No comments:

Post a Comment

Pages