బళ్లో పడెయ్యడం అను అక్షరాభ్యాసం కథ - అచ్చంగా తెలుగు

బళ్లో పడెయ్యడం అను అక్షరాభ్యాసం కథ

Share This

 బళ్లో పడెయ్యడం అను అక్షరాభ్యాసం కథ

-      కర్లపాలెం హనుమంతరావు

-      E-mail: karlapalwm2010@gmail.com

ఇప్పుడంటే బిడ్డ తల్లి కడుపులో ఎదుగుతుండగానే.. కన్నవాళ్లు యమ కంగారుగా ఏ కాన్వెంటులో సీటు దొరుకుతుందా అని వేట మొదలుపెడుతున్నారు. అర్థశతాబ్దం కిందట పిల్లల చదువుకు తల్లిదండ్రులు మరీ అంత గత్తరపడే వాళ్లేం కాదు. 

 

బిడ్డను అయిదేళ్ల వరకు ఇంటా బయటా హాయిగా డుకోనిచ్చి .. అయిదేళ్ళు నిండగానే చేతికి పలకా బలపం ఇచ్చి బళ్లో కుదేసివచ్చేవాళ్లు. సామాన్యులు ఇంత సాధారణంగా జరుపుకునే పిల్లల అక్షరాభ్యాస కార్యక్రమం కలిగినవాళ్లు కాస్త ఆర్భాటంగానే చేయడం రివాజు. డబ్బుండి చేసినా, లేకుండి చేసినా ఇద్దరు నిర్వహించేదీ ఒకే కార్యకలాపం. దాని పేరే అక్షరాభ్యాసం. గతంలో మన తెలుగునాట పిల్లలను పాఠశాలలో ఎట్లా వేసేవారో.. ఆ తతంగందానికి వెనుక ఉన్న ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని గురించి సూక్ష్మంగా తెలుసుకొనేందుకే ఇక్కడ ఈ వ్యాసం. 

 

ధర్మశాస్త్రాలు ఈ తతంగానికి రకరకాల పేర్లు నిర్దేశించాయి. తెలుగువాళ్ల మూలరుషిగా భావించే విశ్వామిత్రుడు బిడ్డను బళ్లోవేసే తంతుకు విద్యారంభం అని పేరు పెట్టారు. అదే సంస్కారం గోపీనాథభట్టు విరచిత సంస్కార రత్నమాల ప్ర్రకారం- అక్షరారంభం! అక్షర స్వీకరణగా వశిష్టుడు పేర్కొంటేమార్కెండేయుడు 'అక్షర లేఖనం'అనే పేరు ఖాయంచేశాడు. ఎవరే పేరుతో పిలుచుకున్నా  పిల్లలకు  అక్షరాలు దిద్దబెట్టే శుభకార్యం మాత్రం ఒకటే!

 

తమాషా ఏమిటంటేవీరమిత్రోదయస్మృతిచంద్రికసంస్కార రత్నమాలయాజ్ఞవల్క్య స్మృతికి వ్యాఖ్యానం చెప్పిన అపరార్క వ్యాఖ్య లాంటి అర్వాచీన గ్రంథాలలో ప్రముఖంగా ప్రస్తావనకొచ్చిన అక్షరాభ్యాస సంస్కారం అసలు గృహ్యసూత్రాలలోనే కనిపించకపోవడం! విశ్వామిత్రబృహస్పతి వంటి రుషుల పేర్లు ఈ వ్యవహారంలోకి లాగడం వెనక దీనికి పురాతన సంప్రదాయవాసన అంటగట్టడానికేనంటూ పి.వి. కాణే వంటి ఆధునికులు విమర్శిస్తున్నారు కూడా. ఎడ్యుకేషన్ ఇన్ ఏన్షియంట్ ఇండియా గ్రంథం రాసిన డాక్టర్ అ.స. అత్లేకర్ అభిప్రాయం ప్రకారం భారతీయుల  అక్షర జ్ఞానాన్ని క్రీ.శ. ఏడుఎనిమిది శతబ్దాలకు ముందు కాలంలోకి తీసుకుపోలేం. 

 

ఇండియన్ యాన్టిక్వెరీ గ్రంథ కర్త డాక్టర్ బూలర్ అయితే మన దేశస్తులకు వర్ణమాలను గురించి తెలియడం క్రీ.పూ 800 తరువాతే తప్ప ఎట్లాంటి పరిస్థితుల్లోనూ  అంతకన్నా ముందైతే కాదు. ప్రాచీన లిపి మాల అనే మరో గ్రంథం ఉంది. దాని కర్త పండిత గౌరీశంకర్ హీరాచంద్ర లెక్కన ఈ దేశవాసులకు అక్షరాలు రాసే లేఖనకళ వంటబట్టిందే క్రీ.పూ 16 -12 శతాబ్దాల ప్రాంతంలో. అందరూ పండితులే. అందరివీ పరిశోధనలే! ఏటి కొకరు కాటి కొకరు ఇట్లా బండిని ఈడుస్తుంటే ఇహ కథ ముందుకు నడిచేదెట్లాఅందుకే ఆ గందరగోళాలకు పోకుండా ఇంచక్కా   మనవైన సంప్రదాయాలు ఈ అక్షరాభ్యాస తతంగాన్ని గూర్చి  ఏ వింతలూ విశేషాలు చెబుతున్నాయో.. రవ్వంత తెలుసుకుందాం!

 

ఏ విషయం తెలుసుకున్నాఎంత గొప్పవారైనా ఆరు నెలలు గడిస్తే అంతా మరుపుకొస్తుందాంటూరు. అట్లాంటి మతిమరుపు జాడ్యానికి మందుగా  బ్రహ్మదేవుడు అక్షరాలను సృష్టించాడని బృహస్పతి స్మృతి ఉవాచ. ('షాణ్మాసికే తు సంప్రాప్తే భ్రాంతిస్సంజాయతే యతః । ధాత్రాక్షరాణి సృష్టాని పత్రా రూఢాన్యతః పురా॥- అనే శ్లోకానికి అర్థం ఇదే)

 

కృష్ణయజుర్వేద సంహిత రెండో కాండలో  అంతకు మించిన తమాషా మంత్రం ఇంకోటుంది. 'యాప్ర లిఖతే తస్యైఖలతిఃఅని ఆ మత్రం. అంటే ఆడవాళ్లు ఈడేరిన తరువాత పలకా బలపం చేతబడితే .. ఆ పాపానికి పరిహారంగా బట్టతల గల బిడ్డ పుడతాడని బెదరగొట్టడమన్న మాట. ఆ లెక్కన ఇప్పుడు ఎక్కడ చూసినా అర్థ బోడిగుండు శాల్తీలే దర్శనమియ్యాలి.. కదా! ఏదో అప్పటి సంప్రదాయాలు అప్పటివి అని సరిపెట్టుకునేవారికి ఏ పేచీ ఉండదు. 

 

కాలం గురించి ఎన్ని కయ్యాలు జరిగినాహిందువుల మనోభావాల ప్రకారం, ప్రప్రథమ లేఖకుడు వినాయకుడు. వ్యాసమహర్షి చెప్పుకుపోతుంటే మహా భారతం మొత్తం పూసపోకుండా రాసుకుపోయింది ఆ మహాశయుడే కదా! మరి వ్యాసుడి కాలం సుమారు 5000 ఏళ్ల కిందటిదా?అని అడిగితే  ఉన్న  శాస్త్రవేత్తల్లో సగం మంది బుర్రలు అవునన్నట్లే ఆడిస్తున్నప్పుడు  మన అక్షరజ్ఞాన కాలం  గురించి కుస్తీలింకా అవసరమా?

 

చౌలం అంటే ఉపనయనం. అది ముగించుకున్న తరువాతనే ఈ అక్షరాభ్యాస కార్యక్రమం! అలాగని మరి  సాక్షాత్తూ కౌటిల్యుడంతటి రాజగురువే నియమం విధించాడు. రాజకుమారుడు 'వృత్త చౌల కర్మా లిపిం  సంఖ్యానం చ ఉపయంజీతవృత్తోపనయనస్త్రయీ మాన్వీక్షికీం చ శిష్టేభ్యో నార్యా  మధ్యక్షేభ్యో దండనీతింవక్తృ ప్రవక్తభ్యఃబ్రహ్మచర్యం చా షోడశాద్వర్షాత్అతో గోదానం దారకర్మ చ'-అన్నాడు. వడుగు అయిన తరువాత అక్షరాలు నేర్చుకోవడంగణితం.. ఉపనయనం అయిన తరువాత  వేదాధ్యయనం చేయడంఅన్వీక్షకివార్త, దండనీతులు పదహారో ఏడు వరకు (అంటే గోదానవ్రతం అయే వరకు).. ఆ తరువాతనే పెళ్లి ముచ్చట. ఈ నియమం ప్రకారమే వాల్మీకి లవకుశులకు ఒక్క వేదం మినహాయించి  సమస్త విద్యలు చౌలం అయిన తరువాత నేర్పించాడని ఉత్తర రామాయణంలో భవభూతి చెప్పిన మాట. 'నివృత్త చౌల కర్మణోశ్చ త్రయోస్థయీవర్జ మితరాస్తి స్రోవిద్యాః సావధానేన మనసా పరినిష్ఠాపితాః'లిపి పరిజ్ఞాతుడైన తరువాతే రఘువంశ మహారాజు అజుడు సాహిత్యసముద్రంలోకి ప్రవేశించినట్లు కాళిదాసు రఘువంశంలో అనే మాట. చంద్రాపీడ మహారాజు ఆరేళ్లకు విద్యామందిర ప్రవేశం చేసి పదహారేళ్ల వరకు ఎట్లా గడిపాడోఎన్ని రకాల కళలు అభ్యసించాడో బాణుడు కాదంబరిలో వివరంగా చెప్పుకొస్తాడు.  

 

చదువులు నేర్చుకోవడం సరేఏ వయస్సు నుంచి నేర్చుకోవాలన్న విషయం మీదా కీచులాటలే మళ్లీ. వీ. మి (విశ్వామిత్ర)నీతి   ప్రకారం ఐదవ ఏట నుంచి. పండిత భీమసేన్ వర్మ రాసిన 'షోడశ సంస్కార విధిఅనే గ్రంథంలో పేరు తెలియని ఒక స్మృతికర్త మతాన్ని బట్టి ఐదు నుంచి ఏడో సంవత్సరం వరకు ఎప్పుడైనా నిక్షేపంగా అక్షరాభ్యాస కార్యక్రమం ముగించుకోవచ్చు. ఇదే ఆ రోజుల్లో 'పంచమే సప్తమేవాబ్దేసిద్ధాంతంగా ప్రసిద్ధి. 

 

ఉపనయనాన్ని రెండో జన్మగా భావిస్తుంది ఆర్షధర్మం. ఆ సందర్భంలో విద్యాభ్యాస శుభకార్యం కూడా ముగించుకోవచ్చని బృహస్పతి అభిభాషణం. మార్గశిరమాసం మొదలు జ్యేష్ఠమాసం వరకు మధ్యలో ఎప్పుడైనా అక్షరాలు దిద్దబెట్టవచ్చని  విశ్వామిత్ర (వీ. మి) నీతి చెబుతూనే ఆషాఢం నుంచి కార్తీకం మధ్య కాలం మొత్తాన్నీ నిషిద్ధ కాలంగా నిర్దేశించింది. 'అప్రసుస్తే నిద్రాం త్యజతి కార్తిక్యాం తయోః సంపూజ్యతే హరిఃఅని విష్ణు దర్మోత్తరం. సూర్యభగవానుడు ఉత్తరాయన పుణ్యకాలంలో ఉన్నప్పుడు అక్షరాభ్యాసం శుభదాయకమని వశిష్ఠుని వాక్కు. ఉద్గతే భాస్వతి'.అపరార్కుడుస్మృతిచంద్రిక కర్తలిద్దరూ మార్కండేయ పురాణోక్తులను పేర్కొంటూ ఐదో ఏట కార్తీక శుద్ధ ద్వాదశి నుంచి ఆషాఢ శుద్ధ ఏకాదశి లోపలే  ఈ కర్యక్రమాన్ని కడతేర్చుకోవాలని హితవు చెప్పారు. కాకపోతే ఒకటే షరతు. పాడ్యమిషష్ఠిఅష్టమిపూర్ణిఅమావాస్య, రిక్త తిధులైన చవితినవమిచతుర్దశులను వదిలిపెట్టడం క్షేమకరమని హెచ్చరించడం.  శని మంగళ వారాలు కూడా చదువుల ఆరంభానికి శుభదాయకం కాదన్నది నాటి కాలపు సమాజంలోని గాఢవిశ్వాసాలలో ఒకటి.  రవికుంభ రాశులకు చదువుల ప్రారంభానికి కలసిరావు. లగ్నాత్తు ఆష్టమంలో గ్రహాలేమీ లేకుండా చూసుకొని ముహూర్తం నిర్ణయించుకోవాలనీ పెద్దలు చెప్పేవాళ్లు. ఇట్లాంటి జ్యోతిష నియమాలు ఒకటా.. రెండా! పట్టించుకొనే వాళ్లు పట్టించుకొనేవాళ్లు. పట్టింపులేని వాళ్లు పిల్లల చేతిలో పలకా బలపం పెట్టి బడికి తోలేసేవాళ్ళు.  ముహూర్తం చూసుకుని గానీఅక్షరం నేర్పించని వాళ్ల ఇళ్లల్లో ఎంత మంది చదువు సాములు నేర్చి పండిత ప్రకాండులయ్యారో.. ఆ లెక్కలు తీసేవాళ్లు అప్పుడూ లేరు. ఇప్పడసలే ఉండరు. 

 

ఇహ అక్షరాభ్యాస విధానం గురించి కూడా కొద్దిగా తెలుసుకుందాంఓం ప్రథమంగా  బిడ్డకు అభ్యంగ స్నానంఆపైన వస్త్ర భూషణాదుల అలంకరణవిఘ్నేశ్వరునికి పూజసరస్వతీదేవికి అర్చన! అటు పిమ్మట వెదురు చేట నిండానోవెండి పళ్లెం నిండుగానో సన్నబియ్యం పోసి దానిని రెండే రెండు గీతలతో మూడు భాగాలుగా విభజన చేసి పై భాగంలో 'ఓమ్' .. రెండో భాగంలో 'నమఃశివాయ' .. మూడో గడిలో 'సిద్ధం నమఃఅని మూడేసి సార్లు  పురోహితుడు బిడ్డ చేత రాయించి నమస్కారం చేయిస్తాడు. విఘ్నేశ్వరసరస్వతీ శ్లోకాలు చదివిస్తాడు. ఇక్కడి ‘ ఓం నమశ్శివాయజైన సంప్రదాయం నుంచి పుట్టుకొచ్చిన తతంగమన్నట్లు కొందరి భావన. కాదు.. పరమేశ్వరుడికి 'సిద్ధఅనే నామాంతరం ఉందికాబట్టి 'ఓం నమశ్శివాయ సిద్ధం నమఃఅనే ప్రార్థన వ్యవహారంలో 'ఓం నమః శివాయ సిద్ధం నమఃగా మారిందనే ప్రతివాదనా కద్దు. నృసింహపురాణం ప్రకారం దైపప్రార్థనలు అనంతరం గురుపూజ ఒక విధి. గర్గ వచనం ప్రకారం,అజ్యాహుతులతో సరస్వతిహరిలక్ష్మివిఘ్నేశసూత్రకారులకు స్వవిద్యను ఉద్దేశించి హోమం చెయ్యడం మరో విధి. ఇప్పుడీ ఆచారాలకు సమయమేదీఉన్నా శ్రద్ధ ఏదీబిడ్డకు మంచి పబ్లిక్ పాఠశాలలో అడ్మిషన్  సాధించడమే వంద యజ్ఞాలు నిర్వహించిన పెట్టు లాగుంది చదువుల గత్తర.

 

ఇస్లాం మతంలో కూడా ఈ విద్యారంభానికి నకలైన 'బిస్మిల్లాఖానిఅనే శుభకార్యం ఉంది. వాళ్లూ ఐదో ఏట, నాలుగో నెలనాలుగో రోజు బిడ్డచేత అక్షరాభ్యాసం చేయిస్తారు. ఏసియాటిక్ బెంగాల్ గ్రంథంలో (శాహజహాం) లో మొగల్ చక్రవర్తి హుమయూన్‌ కు  ఈ తరహా అక్షరాభ్యాసంతదనంతరం ఉత్సవం జరిగినట్లు ఒక ప్రస్తావన కనిపిస్తుంది. 

 

'శూద్ర కమలాకరంలో సైతం ధనుర్విద్యఛురికాబంధనాల ప్రస్తావన వచ్చినప్పుడు శుభదినాలలో ప్రారంభించాలనే నియమం కనిపిస్తుంది పునర్వసుపుష్యమిభరణిహస్త, స్వాతిచిత్ర, కృత్తిక,మఘరోహిణిఉత్తరాత్రయంశ్రవణధనిష్ఠమూలమృగశిరపుబ్బరేవతి-ఈ నక్షత్రాలలో ధనుర్విద్యారంభం శుభదాయకమని 'ధనుర్విద్యాదీపికచెబుతోంది. 'సర్వాయుధ నగామాత్ర..లాంటి మంత్రాలు కొన్ని కద్దు. వీటితో లక్ష్మీ నారాయణులను పూజించి తొట్టతొలుత ఒక బాణమోఛురకత్తో  తూర్పు దిశకు వదలడం  ఆయుధ విద్యలకు సంబంధించిన విద్యారంభం.


(మూలఃభారతీయ సంస్కారములు -అక్షరాభ్యాసము)

No comments:

Post a Comment

Pages