సుడిగాలి రాజు - అచ్చంగా తెలుగు

సుడిగాలి రాజు

భావరాజు పద్మిని"ఏరోయ్, ఇదిన్నారా? మన నర్సాపురం జిల్లా ఐపోద్దంట! ఇంక మనం జాయిగా ఇక్కడే బోల్డు ఉజ్జోగాలు పట్టేయచ్చు! మారాజుల్లా బతికెయ్యచ్చు!" 

వలంధర రేవులో బెంచీ మీద కూర్చుని, టీ తాగుతా, గోదారినే చూస్తా ఉన్న గోపీ, సూరిబాబు పెద్దగా పట్టించుకోలేదా మాటల్ని! ఎందుకంటే, ఆ చెప్పింది సుడిగాలి రాజు కనుక!

దర్భారేవు దగ్గరుండే రాజుకి పనీపాటా చెయ్యకండా సుడిగాల్లాగా ఊళ్లో వార్తలన్నీ మోసుకురాడం పరిపాటండి. ఆయ్! అందుకే ఆడికి సుడిగాలి రాజని, గాలిరాజని పేరెట్టేసి పిలుస్తా ఉంటారండి మా నర్సాపురవోఁళ్లు!

ఎవరెన్ని పేర్లెట్టి ఆటపట్టించినా పట్టించుకునే సొబావం కాదు రాజుది. అందుకే వోడి దారి వోడిదే!

"ఏరా! ఉజ్జోగాలొత్తే మటుకు నువ్ జేత్తావేటి? పాతికేళ్లనుంచి బలాదూర్ తిరుగుతున్నోడివి! ఈరోజున జిల్లా వొచ్చినా, ఉజ్జోగాలొచ్చినా నీకేం తేడా పడుద్ది?" ఎటకారవోడేడు సూరిబాబు‌.

"అంతేలేరా! అన్నట్టు మీ పెదనాన్న గోరి కూతురు మొన్న టెంత్ తప్పిందంటగా! ఇంకో ఏడాది ఇంటోనేనా?" తన్నెవరైనా ఓ మాటంటే, ఆడి నోరెలా మూయించాలో బాగా తెల్సు గాలిరాజుకి.

"ఎవడా సెప్పింది! పళ్లు రాలగొట్టలి అలాగన్నోడికి! పోయిందొక్క సబ్జెక్టే, సప్లిమెంటరీ రాసి పాసైంది, భీమారం కాలేజీలో ఇంజినీరింగ్ జేర్పిత్తన్నాం!" ఆవేశంగా అన్నాడు సూరిబాబు.

"దీన్నే, ఎరేసి సేపని వల్లోకి లాగడవంటారు!" తాపీగా అన్నాడు గోపీ! ఏం జరిగినా చీవలు జస్తాయన్నంత నింపాదిగా ఉంటానే మజ్జమజ్జలో ఒక మాటేస్తా ఉంటాడు గోపీ!

దానితో గోపీగాడి మీదకి దృష్టి మళ్లిన గాలిరాజు, "ఏరోయ్! మీ తమ్ముడిని ఆ సకినేటిపల్లి సంబంధం పిల్ల ఒద్దందంటగా! ఇది వందో సంబంధం అనుకుంటా! ఇంకాడికి పెళ్లవుద్దా, లేక జీవితాంతం పెళ్లికాని ప్రసాదులా మిగిలిపోతాడా?" అన్నాడు దెప్పుతా.

"దాందేవుందిరా, ఉజ్జోగాలు సేయకండా పెళ్లాం డబ్బుల్తిని, ఊళ్లో జనాలందర్నీ పంటికిందేసుకు నవిలేకంటే... పెళ్లిగాప్పోయినా ఆడి డబ్బులోడు సంపాయించుకు తింటం నయం గదా! ఏటంటావు?" లేచి టీ గ్లాసు పడేస్తా, గాలిరాజు కళ్లలోకి సూటిగా చూస్తా అని, "వస్తానొరే, పనుంది" అంటా బయల్దేరాడు గోపీ.

గోపీ ఎళ్లిన వొంకే నోరుతెరుచుకు జూస్తా "తక్కువోడేం కాదీడు!" అనేసాడు గాలిరాజు. 

గోదారొడ్డున టీలమ్ముకునే జాలరోళ్ల కుర్రాడు ప్రభు అటుగా పోతాంటే, 'కనీసం వీడికి కాస్త టీ పోయిస్తేనన్నా కాసేపు నోరు మూస్తాడు' అనుకుని ప్రభు ని పిలిచి, టీ, రెండు బిస్కెట్లు ఇప్పించాడు సూరిబాబు. ఎళ్తన్న ప్రభు ని కేకేసి,

"ఒరే, ప్రభూ! దూరంగా అక్కడ కనిపించేదెవర్రా? కళ్యాణి గారమ్మాయి గౌరి కదూ! పక్కనా కుర్రాడెవర్రా? ఇద్దరూ ఓ, ఇకయికలు పకపకలూ ఏందిరా?" టీ లో బిస్కెట్ ముంచుకుంటా అడిగాడు గాలిరాజు.

"అబ్బాయ్ కాదండీ బాబయ్యా! అమ్మాయేనండి బాబూ! పేరు హనీ అంట. పట్నం నుంచి మన సీతారాంపురం కాలేజీలో సదూకోటానికొచ్చింది. బాబుడు హెయిరుకి తోడు పాంటు సొక్కా తొడుక్కోడంతో మీకు కళ్లానలేదు! రోజూ ఇక్కడకొచ్చి కాసేపు కబుర్లాడుకుని టీతాగి ఎళ్తంటారు!" 

ప్రభు గాడి మాటలకు సూరిబాబు పగలబడి నవ్వుతాంటే, ఉక్రోషం ముంచుకొచ్చింది గాలిరాజుకి. 

అసలే తినబోతున్న కాజా నోటికాడ్నుంచి లాక్కున్నట్టు, అందబోతన్న వార్త చేజారిపోడంతో గిలగిలలాడతన్న రాజు, దిగ్గున లేచి ఊళ్లోకి బయల్దేరాడు.

పాతశివాలయం‌ సెంటర్లో బుజం బుజం రాసుకుంటా నించుని కబుర్లాడుకుంటా గుళ్లోకి పోతన్న తన స్నేహితులు సురేష్, హరీష్ లను చూడగానే గాలిరాజు కోపం ఇట్టే ఎగిరిపోయింది. కళ్లింతజేస్కుని గమ్మున ఆళ్ల ఎనకే ఎళ్లిపోయాడు.

"ఏటీ! నేను సూత్తాంది నిజఁవే! ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి‌మీద వాలకూడదనే మీరిద్దరూ చెట్టాపట్టాలేసుకు తిరుగుతన్నారా? పైగా గుళ్లోక్కూడానా? ఎలాక్కలిసారూ?" దర్శనం ముగించుకొనొచ్చి చెప్టా మీద కూర్చున్న ఆళ్లని, ఇంక ఉండబట్టలేక అడిగేసాడు గాలిరాజు.

"ఒరే గాలిదుమారంగా! ఇది నీ పున్నెవేరోయ్! నారదులోరి కయ్యాల వల్ల లోకకల్యాణం జరిగినట్టు ఎప్పుడో నీ పుణ్యవా అని విడిపోయిన మేవు నీవల్లే కల్సాంరా!"

"నావల్లేటీ? అయ్యబాబోయ్, నాకేం దెల్సూ?"

"పోయినవారం సెంటర్లో నువ్వు బజ్జీలు తినేటప్పుడు ఏవయిందిరా?"

"అదే, మన వాసంతి వచ్చింది. హైదరాబాదులో ఉజ్జోగం చేసుకుంటా ఉందంట. ఇద్దరు పిల్లలంట. కలిగినోళ్లేనంట. నన్ను గుర్తుబట్టి పలకరించింది. ఆ పిల్ల గురించేగా మీరిద్దరూ పోట్లాడుకుని దూరమైంది." అమాయకంగా మొహం పెట్టి అన్నాడు గాలిరాజు.

"అంతేనా? ఆ తర్వాత ఇంకేం జరగలేదా? బాగా గుర్తుచేసుకు చెప్పొరే!" గాలిరాజు కళ్లలోకి చూస్తా అన్నాడు హరీషు.

"అంటే... అంటే... ఆ తర్వాత మన దాక్షారం శీనుగాడు కనబడ్డాడు. ఎవరని అడిగితే..." చెబూతూ సందేహంగా చూస్తా ఆగిపోయాడు గాలిరాజు.

"ఆ దాక్షారం శీను గాడు ఎవరో కాదు, మా పెదనాన్న కొడుకే! వాసంతి నీతో చదూకుందని, తన‌కోసం మేమిద్దరం గొడవపడ్డామని... చెప్పి ఊరుకుంటే, నీ బండారం బయటపడేది కాదు, మేవిద్దరం కలిసే ఆళ్లం కాదు. కానొరే, మా స్నేహం ఓర్వలేక, మా ఇద్దరికీ మధ్యన తంపులు పెట్టింది కూడా నువ్వేనని నోరు జారావు చూడు! అదేరా మా తప్పు మమ్మల్ని తెలుసుకునేలా చేసింది!" అన్నాడు సురేష్.

"ఒరే గాలిరాజూ! స్నేహం చాలా గొప్పదిరా! ఏ కారణమూ, కులము, మతము, చూడకుండా రెండు మనసుల్ని అల్లి జీవితాంతం తోడుగా సాగేలా చేస్తుంది. ఇద్దరు పచ్చగా ఉంటే ఓర్వలేని నీలాంటోడు ఊరికొకడుంటే చాలొరే! బంధాలన్నీ భగ్గుమంటాయి. అప్పుడంటే తెలీనితనం వల్ల నీ మాటలు నమ్మి నా ప్రాణ మిత్రుడైన హరీష్ ని దూరం చేసుకున్నాను. ఇక జీవితాంతం వాడి చెయ్యొదల్ను!" అని హరీష్ అంటుండగా, అక్కడికి పరిగెట్టుకుంటా కన్నబాబు వచ్చాడు.

"ఒరే గాలిరాజూ! మొన్న ఆ సూరమ్మ గారింటికి వెళ్లి జానకమ్మగారు ఆవిడనేదో అందని చాడీలు చెప్పావంట కదా. ఇద్దరూ మంచినీళ్ల పంపు దగ్గర కొట్టుకుని, అసలు విషయం తేల్చుకుందామని మీ ఇంటిమీదకొచ్చారు. ఆళ్లిద్దరికీ సర్ది చెప్పి పంపేసరికి మా తలప్రాణం తోక్కొచ్చింది.  దీనితో ఇసిగిపోయిన నీ పెళ్లాం, పనీపాటా లేకండా ఊళ్లో అందరికీ గొడవలు పెడతా, పోసికోలు కబుర్లు చెబుతా తిరిగే నీతో కాపురం చెయ్యలేనని చెప్పి, బస్సెక్కి పుట్టింటికి వెళ్లిపోయింది. మరెలాగ బతిమాలి తెచ్చుకుంటావో నీ ఇష్టం!" అన్నాడు వగరుస్తా. 

"ఒరేయ్! సుడిగాలిగా! గాలి ఊపిరి పోస్తుంది. సుడిగాలి ఊపిరి తీసి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కొంపలు కూల్చే పన్లు మానకపోతే శివయ్య సాక్షిగా చెబుతున్నా... చెరపకురా చెడేవు! ఇకనైనా మారకపోతే, ఓ‌ జీవితకాలం వృథా అవుతుంది. మేం చెప్పేది చెప్పాము, అటుపైన నీ ఖర్మ!" అని చెప్పి సురేష్ తో కలిసి బయల్దేరాడు హరీష్.

కాళ్లావేళ్లా పడి పెళ్లాన్ని ఎనక్కి తెచ్చుకున్న గాలిరాజు, అసలు బుద్ధి మానుకోలేక, గుట్టుగా సోషల్ మీడియాలో నాలుగు ఫేక్ అకౌంట్లు తెరిచాడు‌. షరా మామూలే!

***

No comments:

Post a Comment

Pages