రాతలు - చేతలు - అచ్చంగా తెలుగు

                                                                 రాతలు - చేతలు

శెట్టిపల్లి అరుణా ప్రభాకర్


కథాకంఠీరవ కామేశ్వర్ రావు గారికి ఘనంగా సన్మానం ఏర్పాటు చేశారు.ఆయన కథలు వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటాయని పేరు.మనవాళ్ళకు కథలు వాస్తవంగా ఉండాలి, వాస్తవాలు కథల్లాగా ఉండాలి. కథలు అద్భుతంగా ఉంటే ‘అంతా చెత్త, ఎక్కడైనా జరుగుతాయా’ అని కొట్టి పారేస్తారు. నిజంగా(కథలో కాదు) పక్కింటి భార్యా భర్తలు తిన్నారు, షికారుకెళ్లారు, పడుకున్నారు అన్నట్టుంటే ఆ ముచ్చట మాత్రం నచ్చదు. అతను ఆమెని కొట్టాడా, ఆమె ఎదురు తిరిగిందా, ఇద్దరూ వీధిన పడ్డారా- అంటే చూసుకోండిక, ఆ ముచ్చట్లు వినటానికి రెండు చెవులూ చాలవు.కంఠీరవుడు మాత్రం యధార్థ సంఘటనల్ని కరకరా నమిలి మింగేసి బ్రేవుమని గొప్పగొప్ప కథల్ని కక్కేస్తాడని చెప్పుకుంటారు పాఠకులు.అతని కొత్త కథ ‘చెట్టుకింద ముష్టోళ్ళు’ బాగా క్లిక్ అయింది.కొన్ని సాహిత్య సంఘాలు అవార్డు కూడా ఇచ్చాయి.ఇదిగో ఇప్పుడీ సన్మానం.రాసే వాళ్ళకి రాసేపని. అవార్డులిచ్చే వాళ్ళకి అవార్డులిచ్చే పని. సన్మానాలు చేసే వాళ్ళది సన్మానాలు చేసేపని. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలిగా!.సభలో  జనం నిండుగా ఉన్నారు. అందుకు ఎవరి కారణాలు వాళ్లకుంటాయి మరి.కథాకంఠీరవుడు తనకున్న ఒకేఒక్క సూటు, టైతో ఠీవిగా వేదిక మీద కూర్చుని ఉన్నాడు. ఆఫీసులో మీటింగయినా, రచయితగా సభలకి వెళ్ళినా అదే ఆహార్యం. ‘మీకింతకన్న అక్కర్లేదం’టది ఆయన భార్య.సమయానికి శాలువా కప్పవలసిన పెద్దమనిషి రాలేదు. ఆలస్యంగా రాకపోతే అంత పెద్దమనిషి కాదనుకుంటారేమోనని ఆయనా, అంతకన్నా పెద్దమనుషులు సభలో ఉన్నా అసలు పెద్దమనిషి రానందున, తక్కువ పెద్దమనిషితో పని జరిపిస్తున్నారేమోనని సభికులు అనుకుంటారేమోనని సంకోచంలో నిర్వాహకులు!.ఊరికే ఉండటం ఎందుకని వాళ్ళతో వీళ్లతో నాలుగు మాటలు మాట్లాడిస్తున్నారు వేదిక మీద.ఈ కాస్త ఆలస్యంతో అంత పెద్దరికం రాదనుకున్నాడేమో, ఆ పెద్ద మనిషి అప్పటికీ రాలేదు.కంఠీరవానికి గర్జించాలనిపించింది, కాకపోతే నిర్వాహకుల అనుమతితో.తర్జన భర్జనలు పడి ఆ పెద్దమనిషి వచ్చే లోపల మాట్లాడితే తప్పేముందని మైకిచ్చారు.“నేను..... “ఒకసారి సింహావలోకనం చేశాడు.మేకలు ’మే’ అంటూనే ఉన్నాయి. కాపర్లు కలుగజేసుకుని ‘నిశ్శబ్దం’ అని చెప్పారు.ఎవరెవరో మాట్లాడితే చెవులప్పగించి విన్న వాళ్ళకి తాను మాట్లాడేటప్పుడే క్రికెట్ స్కోరెంతో ఎందుకు తెలుసుకోవాలనిపించిందో, అప్పుడే గబుక్కున రాజకీయాలు ఎందుకు గుర్తుకొచ్చాయో, చార్జ్ అయిపోతే అప్పటికప్పుడే మొబైల్ చార్జి చేసుకోవాలని ముందు సీట్లో కూర్చున్నతను ఎందుకు ఆరాట పడుతున్నాడో కామేశానికి అర్థం కాలేదు.“... నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని బాగా గమనించి, వాస్తవాలు గ్రహించి కథలు రాయడం అలవాటుగా చేసుకున్నాను...” అంటూ కొనసాగించాడు.“...ఈ ‘చెట్టుకింద ముష్టోళ్ళు’ అట్లా రాసిందే. రోజూ ఆఫీసుకు కార్లో వెళ్ళేటప్పుడు కిటికీలోంచి అన్నీ గమనిస్తూ ఉంటాను. ఒక నాడు ట్రాఫిక్ సమస్య వల్ల వేరే దోవలో వెళ్ళాను. అప్పుడు చూశాను, ఒక చెట్టుకింద ఈ ఇద్దరు ముసలాళ్లని. ఒక మగాయన, ఒక ఆడమనిషి!. రోజూ అదే తోవలో వెళ్తూ వాళ్ళని జాగ్రత్తగా కొన్ని రోజులపాటు గమనించాను. వాళ్ళగురించి కథ రాస్తే బావుంటుందనిపించింది. దగ్గర్నించి పరిశీలించి రాశాను కాబట్టే ఆ కథ అంతగా నచ్చింది అందరికి... “ఇంకా చాలా చెప్పి మంచినీళ్లు తాగి కూర్చున్నాడు.అవతల సన్మాన దాత బయలు దేరాడు. ఇంకా కొంత టైమ్ పట్టవచ్చు.ఆపద్బాంధవుడిలా ఒకాయన తానూ మాట్లాడతానని వచ్చాడు.పేరు శేషాచలం అట. పరిచయం చేసుకున్నాడు. సాహిత్యాభిమాని. కామేశంగారు తన అభిమాన రచయిత అట.నిర్వాహకులు సంతోషంగా వేదిక మీదికి పిలిచి మాట్లాడమన్నారు.“అందరికీ నమస్కారం. స్నేహితులారా, నేను రిటైర్అయి విశ్రాంతి తీసుకుంటున్నాను. ఊరికే ఉండటం దేనికని అవసరం అయిన వాళ్ళకు చేతనయిన సహాయం చేస్తుంటాను. ‘చెట్టు కింద ముష్టోళ్ళు’ కథ రాసిన కామేశ్వర్ రావు గారికి సన్మానం అని తెలిసి సంతోషంతో వచ్చాను. ఇంత గొప్ప కథ రాసిన కామేశ్వర్ రావు గారికి నా అభినందనలు. ఈ సందర్భంగా నా అనుభవం మీతో పంచుకుందామని అనిపించింది. అదేమిటంటే... కామేశ్వర్ రావు గారు ఆ కథలో చెప్పిన ఇద్దరు ముసలాళ్ళు భార్యా భర్తలు. ముసలాయన పెద్దగా చదువుకోలేదు. ప్రైవేటులో పనిచేసి కుటుంబాన్ని పోషించుకున్నాడు. కూతురు పెళ్ళయి ఎక్కడో ఉంటుంది. కొడుకు పెళ్లయిన తరువాత కొడుకు, కోడలు ఈ ముసలాళ్ళని సరిగ్గా పట్టించుకోలేదు. చివరికి ఇంటినుంచి కూడా వెళ్లగొట్టారు. పాపం ఇద్దరూ దిక్కులేని వాళ్ళయారు. కామేశ్వర్ రావు గారు చూసిన చెట్టుకింద చేరి యాచిస్తూ, పక్కన ఫ్యాక్టరీ ఆవరణలో పాత షేడ్డులో ఉంటున్నారు. ముందుగా ఏమీ చెప్పలేదు కానీ నేను గుచ్చిగుచ్చి అడిగిన మీదట తమ కథంతా చెప్పారు. వాళ్ళకోసం ఏదయినా చెయ్యాలనిపించింది. కొడుకు అడ్రెస్ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కొడుకునీ, కొడల్నీ కూర్చోబెట్టి నచ్చజెప్పాను. వినకపోతే చట్ట ప్రకారం చర్య తీసుకునే అవకాశం ఉందని బెదిరించాను. ఇద్దరూ తమ తప్పు తెలుసుకున్నారు. తల్లిదండ్రులను మనస్ఫూర్తిగా ఇంట్లోకి ఆహ్వానించారు. ఇప్పుడాదంపతులిద్దరూ కొడుకూ, కోడలు దగ్గర హాయిగా ఉన్నారు. ఒక మంచిపని చేసిన సంతృప్తి నాకు దక్కింది“ అని ముగించాడు.సభికులంతా చప్పట్లు కొట్టారు.అప్పుడే సన్మానం చెయ్యడానికి పెద్దమనిషి హాల్లోకి ప్రవేశించాడు.గొప్పకోసం, బిరుదులకోసం రాసే కామేశానికి సన్మానం చెయ్యాలా, ప్రాక్టికల్ గా రియాక్టయ్యే శేషాచలాన్ని సన్మానించాలా అనే గొప్ప సందిగ్ధంలో నిర్వాహకులు తలలు పట్టుకున్నారు.

****

No comments:

Post a Comment

Pages