ఇక్ష్వాకు వంశ మూల పురుషుడు "మాంధాత" - అచ్చంగా తెలుగు

ఇక్ష్వాకు వంశ మూల పురుషుడు "మాంధాత"

Share This

 ఇక్ష్వాకు వంశ మూల పురుషుడు "మాంధాత"

అంబడిపూడి శ్యామసుందరరావు 


హిందూ పురాణాలప్రకారము మాంధాత ఇక్ష్వాకు (సూర్య వంశానికి)చెందిన రాజు ఈయన ప్రస్తావన భారతము లోని వానపర్వం, ద్రోణపర్వం మరియు శాంతి పర్వాలలో వస్తుంది మాంధాత చాలా పురాతన కాలం నాటి రాజు అందుకే మనము ఏవైనా పాతకాలం నాటి విషయాలను చెప్పేటప్పుడు మాంధాత కాలము నాటివి అని చెప్పటం అలవాటు అయింది. ఈ మాంధాత పుట్టుక చాలా విచిత్రమైనది ఈయన తండ్రి పేరు యువనాశ్వుడు. మాంధాత పుట్టుక చాల విచిత్రమైనది ఈయన తండ్రి యువనాశ్వునికి చాల కాలము సంతానము లేదు ఒకసారి వేటకు వెళ్ళి భృగు మహర్షి ఆశ్రమానికి వెళతాడు భృగుమహర్షి యువనాశ్వునిచే పుత్రకామేష్టి జరిపిస్తారు. ఈ క్రమంలో మంత్రించిన నీటిని ఒక కుండ లో ఉంచుతాడు ఆ మహర్షి, అయితే అంతకు ముందు ఉపవాస దీక్ష లో ఉన్న రాజు దాహమై ఆ రాత్రి తెలియక కుండలో ఉన్న నీరు త్రాగుతాడు. మరుసటి రోజు ఉదయాన రాత్రి జరిగిన విషయాన్నంతా భృగుమహర్షికి చెప్పాడు. అప్పుడు భృగుమహర్షి ఆయనతో ‘రాజా! ఆ మంత్రజలాన్ని నీ భార్యచే తాగించాలన్నది నా ఉద్దేశం. అప్పుడు దేవేంద్రుడు కి సమానమైన కొడుకు పుట్టే వాడు".అని ఋషి చెప్తారు."జలాన్ని ఎవరు తాగితే వారి గర్భంలో కుమారుడు జన్మించుట తథ్యం. కాబట్టి నీ భార్య గర్భంలో జనించవలసిన వాడు నీ శరీరంలోనే జన్మిస్తాడు. ఇది తప్పదు "అని చెబుతాడు.యువనాశ్వుని ఉదరభాగము ఎడమ వైపు కోసి మగశిశువును బయటకు తీస్తారు అంటే అంత పురాతన కాలము లోనే మనము చెప్పుకొనే సిజేరియన్ కాన్పులు ఉన్నాయన్నమాట.తర్వాత యువనాశ్వునకు సూర్యుని లాంటి కొడుకు పుడతాడు. దేవతల సహాయంతో మొత్తానికి కొడుకు పెరుగుతాడు .ఇంద్రుని చూపుడు వేలు ద్వారా అమృతాన్ని తాగి క్రమంగా పెరిగి పదమూడు జానలంత వాడయ్యాడు. అందుకే ఆయనకు మాంధాత అని పేరు స్థిరపడింది


చిన్నతనం నుంచే సాహసాలు చేయడం, యుద్ధాల్లో చేసే పోరాటాలను ఎంతో ఆసక్తిగా నేర్చుకుని అందరిలోనూ మేటిగా నిలిచేవాడు. ఇతడు ఎంతటి బలవంతుడటంటే.. 12వ ఏటలోనే రాజ్యాభిషిక్తుడవుతాడు..మాంధాత మంచి శక్తి వంతమైన రాజుగా ఎదుగుతాడు ప్రజలను పన్నుల భారములు ఏమి లేకుండా పరిపాలిస్తుంటాడు మొత్తము ప్రపంచాన్నీ ఒక్క రోజులో జయిస్తాడు.భూలోకమే కాకుండా పాతాళ లోకము,సగము స్వర్గ లోకాన్నికూడ జయిస్తాడు.ఆ విధముగా ముల్లోకాలను జయించిన రాజుగా కీర్తి గడించాడు.మూడు లోకాలను జయించిన ఇంకా ఏదో చేయాలని విపరీతంగా యుద్ధాలు చేస్తారు.జీవితములో తృప్తి ఉండదు .అని చెప్పడానికి ఈయన జీవితం ఉదాహరణ.సుభిక్షంగా ధనిక రాజ్యముగా మాంధాత రాజ్యము ఉంటుంది.మాంధాత కాలంలో కరువు వచ్చినప్పుడు సహజంగా కురవలసిన వర్షాలు కురువవు అప్పుడు తన బాణాలను ప్రయోగించి వర్షాలను కురిపిస్తాడు. దీన్ని వరుణ విద్య అంటారు మాంధాత కొన్ని వందల అశ్వమేధ యాగాలను రాజసూయ యాగాలను చేసాడు. మాంధాత పరమ శివ భక్తుడు శక్తి దేవతకు అనేక మందిరాలు నిర్మించి భక్తితో కొలిచేవాడు.మాంధాత చంద్ర వంశానికి చెందిన యాదవ రాజైన శసవిందు కుమార్తె బిందుమతిని వివాహమాడాడు వీరికి ముగ్గురు కుమారులు యాభై మంది కుమార్తెలు ఉన్నారు కుమారులైన పురుకుత్స, అంబరీష,ముచుకుందులు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు గడించారు.


ఆ కాలములోనే లాంకాధీశుడైన రావణాసురుడు కూడా బలవంతుడు శక్తివంతుడైన రాజు బ్రహ్మ చేత వరాలను పొంది అహంభావంతో సాధుజనులను ముని పుంగవులను హింసించేవాడు చివరకు మాంధాత పైకి యుద్దానికి వస్తాడు ఇద్దరి మధ్య భీకర పోరు సాగుతుంది మాంధాత రావణుని సైన్యములోని అకంపనుడు, మహోదరుడు, విరుపాక్షుడు వంటి అనేక మంది యోధులను సంహరించగా రావణుసురుడే నేరుగా మాంధాతతో తలపడతాడు. ఇద్దరు కూడా దివ్యాస్త్రాలతో యుద్ధము సాగిస్తారు రావణుడు మాంధాతపై ఆధిపత్యము సాధించటానికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగా మాంధాత పాశుపతాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ విధముగా ఇద్దరు శక్తివంతమైన అస్త్రాలను ప్రయోగించగా ముల్లోకాలను వీటి నుండి రక్షించ టానికి ఋషులు పులస్త్యుడు,గాలవ్యుడు కల్పించుకొని ఇద్దరినీ యుద్ధమును విరమించుకొమ్మని చెపుతారు. ఆ ఋషులు రావణాసురుడు భవిష్యత్తులో మాంధాత వంశములో జన్మించే కారణజన్ముడైన సాక్షాత్తు విష్ణు మూర్తి అవతారమైన శ్రీరాముని చేతిలో మరణించ వలసి ఉన్నది అని మాంధాతతో చెప్పి యుద్దము నుండి విరమింపజేస్తారు. విషయము తెలియక పోయిన మాంధాత పరాక్రమానికి వెరచి రావణుడు కూడా యుద్దము నుండి విరమిస్తాడు.


తరువాతి కాలములో శ్రీరామ జననము శ్రీ రాముడు అరణ్య వాసములో ఉండగా రావణాసురుడు సీత ను అపహరించటం శ్రీరాముడు లంకపై దాడి చేసి రావణుని సంహరించటం మన అందరికి తెలిసినదే కానీ పెద్ద వింతైన విశేషము ఏమిటి అంటే రావణాసురుని ఓడించిన మాంధాత రావణాసురుని బంధువు అయిన లవణాసురునిచే వధింపబడ్డాడు ఇంకా ఆశ్చర్యకరమైన విషయము ఏమిటి అంటే పరమశివుని భక్తుడైన మాంధాత శివుడు లవణాసురునికి ఇచ్చిన పాశుపతాస్త్రము చేత సంహరింప బడ్డాడు. ఏది ఏమైనప్పటికి మాంధాత పురాతనకాలం నాటి కాలానికి అందని గొప్ప చక్రవర్తిగా పురాణాలలో కీర్తింపబడ్డాడు. 

***

No comments:

Post a Comment

Pages