మల్లికార్జున శతకము - యల్లాప్రగ్గడ వేంకట సుబ్బారావు - అచ్చంగా తెలుగు

మల్లికార్జున శతకము - యల్లాప్రగ్గడ వేంకట సుబ్బారావు

Share This
మల్లికార్జున శతకము - యల్లాప్రగ్గడ వేంకట సుబ్బారావు

పరిచయం: దేవరకొండ సుబ్రహ్మణ్యం కవి పరిచయం:

మల్లికార్జున శతకకర్త యెల్లాప్రగ్గడ వేంకట సుబ్బారావు సిరిపూడి, రేపల్లె తాలూకా నివాసి. ఆరువేల నియోగి బ్రాహ్మణుడు.ఈకవి గురించి మనము గతంలో పరిచయం చేసుకొన్న శ్రీవేంకటేశ్వర శతకం లో చర్చించాము.

శతక పరిచయం:

"శ్రీగిరిమల్లికార్జున! విచిత్రవిలాస!నగాత్మజాధిపా!" అనే మకుటంతో రచింపబడిన ఈశతకం భక్తిరస ప్రథాన శతకం. ఉత్పలమాల వృత్తంలో రచింపబడిన ఈశతకంలో నూట ఎనిమిది పద్యాలున్నాయి. ఈశతకంలోని పద్యాలని భాష సంస్కృతాంధ్ర మిళితమై అనర్గళంగా సాగిపోతుంది. భక్తి వైరాగ్య వేదవేదాంత నీతి బోధక పద్యాలు ఈశతకంలో మనం చూడవచ్చును.
చివరిపాదమున "గ"కార ప్రసముచే శతకము మొత్తము గకార ప్రాసయందే కూర్చబడినది
కొన్ని పద్యాలను చూద్దాము.

ఉ. శ్రీగిరిజావధూమణి వసింపగ నర్ధశరీరమందునా
వాగాధినేతముఖ్యసురవారము భక్తిభజింపభక్తర
క్షాగణనీయతత్తపరతఁ గ్రాలెడుదైవతామౌళి! శంకరా!
శ్రీగిరిమల్లికార్జున! విచిత్రవిలాస!నగాత్మజాధిపా!

ఉ. నాగవిభూష! భక్తగణనాయకపోష గిరీంద్రకన్యకా!
భోగకృదాత్మవేష! సురపుంజసమర్పితదివ్యభాష యో
యోగిజనాత్మతోష! విలయోచితభావజవేష! శంకరా!
శ్రీగిరిమల్లికార్జున! విచిత్రవిలాస!నగాత్మజాధిపా!

ఉ. నాగసురారి భంగ! కరుణారసపూరనిజాంతరంగ! పు
న్నాగసుమావళీమిళిత నవ్యజటాలసదుత్తమాంగ నా
నాగమకోటివర్ణితశుభాస్పదదివ్యనిజాంగ! శంకరా!
శ్రీగిరిమల్లికార్జున! విచిత్రవిలాస!నగాత్మజాధిపా!

ఉ. రాగమునన్ను వీడదు, విరాగముగల్గగఁబోదుసుంతయున్
భోగమునందుకాంక్షవీడఁబోదు, నికేవిధినున్నుఁగొల్వగా
రాగలనయ్య? శంకర! నిరాకృతుఁసేయకనన్ను కావుమో
శ్రీగిరిమల్లికార్జున! విచిత్రవిలాస!నగాత్మజాధిపా!

కొన్ని నీతి భక్తిరస పద్యాలను చూద్దాం.

ఉ. మూగకువాక్యపద్ధతియు ంYర్ఖునకున్ రసభావదీపనం
బేగతిఁగల్గు? నట్టులే రమేశసఖా! భవదీయభక్తి దు
ర్భాగ్యునకబ్బునెట్లు? నిరపాయలసత్సుకృతంబుకల్గకే
శ్రీగిరిమల్లికార్జున! విచిత్రవిలాస!నగాత్మజాధిపా!

ఉ. వాగురలందవుల్కొనిన వన్యమృగంబులరీతినింద్రియా
ద్యాగతబంధనాళిఁబడి యందుబయల్పడఁజాలకెంతయున్
లోగమనంబుడీల్పడు విలోలతమానవమాత్రుడిచ్చలున్
శ్రీగిరిమల్లికార్జున! విచిత్రవిలాస!నగాత్మజాధిపా!

ఉ. త్యాగముసర్వకర్మలనధఃకరణంబొనరించిమించునా
త్యాగినిపోలడేనరుడు దైవతవైభవమమృతత్వమున్
చేఁగొనునంచుఁదెల్పుశృతి శీఘ్రమెత్యాగమునాకొసంగవే
శ్రీగిరిమల్లికార్జున! విచిత్రవిలాస!నగాత్మజాధిపా!

ఉ. త్యాగమెసర్వసద్గుణనిదానము ఉత్తమలోకప్రాప్తికిం
దాగణనీయసాధనము నావిలసిల్లుసర్వలోకమున్
త్యాగముఁగాంచిపెంపెసగి ధన్యతఁగాంచును త్యాగమూర్తివౌ
శ్రీగిరిమల్లికార్జున! విచిత్రవిలాస!నగాత్మజాధిపా!

ఉ. ఈగయదెంత? దానగల యీశ్వరతేజమదెంత చూడగా
నీగతిచోద్యమైతనరు నీవిలసజ్జగమందుసర్వజీ
వాగతతేజమొక్కటిగనై చనుతత్వవిచారమొప్పినన్
శ్రీగిరిమల్లికార్జున! విచిత్రవిలాస!నగాత్మజాధిపా!

ఉ. భూగగనానిలాగ్నిజల భూతగణంబునురూపొనర్చి త
ద్భాగవిశేషసంఘటన పద్ధతిజీవులనంతకోటులౌ
లాగునసృష్టిఁజేసిన విలాసము నెన్నఁదరంబె! శంకరా!
శ్రీగిరిమల్లికార్జున! విచిత్రవిలాస!నగాత్మజాధిపా!

ఉ. భూగతప్రాణిసంఘములు పొల్పురహించుటవృద్ధిగాంచుటల్
బాగఱిరూపుమాయుట విలాసమునీకగులోకనాటకం
బీగతిఁజెన్నుమీరుటకుఁ బ్రీతివహించెదునర్తకాగ్రణీ
శ్రీగిరిమల్లికార్జున! విచిత్రవిలాస!నగాత్మజాధిపా!

ఉ. రాగబంధహేతువు విరాగము ముక్తికికారణంబు నౌ
భోగవివర్జితుందగుచు పూజ్యతఁగాంచునుమానవుండు తా
నేగతినేని నీపదవి నిర్మలభక్తి సమాశ్రయించినన్
శ్రీగిరిమల్లికార్జున! విచిత్రవిలాస!నగాత్మజాధిపా!

ఉ. సోగకనుల్ మెరుంగునును చూడ్కులనీనగమేనికాంతులా
తీగమెఱంగులన్ గవిసి దిద్దిరంబుగనొప్పు మోహినిన్
వేగమెకాంచిమానసిక విభ్రమమొందితిగాదె శంకరా
శ్రీగిరిమల్లికార్జున! విచిత్రవిలాస!నగాత్మజాధిపా!

ఉ.నాగగణేశభూష! సురనాయకసన్నుతవేష! పార్వతీ
భోగకృదాత్మతోష! సురపుంజసమర్చితదివ్యభాష! నే
త్రాగతవహ్నిసంతపితదర్పకరోష! గనేశపోష! యో
శ్రీగిరిమల్లికార్జున! విచిత్రవిలాస!నగాత్మజాధిపా!

ఇటువంటి అద్భుతమైన పద్యరత్నాలతో అలరారే ఈశతకం అందరూ తప్పక చదవవలసిన శతకం.
మీరూ చదవండి మీ మిత్రులచే చదివించండి.

***

No comments:

Post a Comment

Pages