విడువుము మనసా వీరిడిచేతలు - అచ్చంగా తెలుగు

విడువుము మనసా వీరిడిచేతలు

Share This
విడువుము మనసా వీరిడిచేతలు
(అన్నమయ్య కీర్తనకు వివరణ)

డా.తాడేపల్లి పతంజలి 

రేకు: 0337-03  సం: 04-216

పల్లవి: విడువుము మనసా వీరిడిచేతలు

తడయక శ్రీహరి దలచవొ యికనుచ.1: నానాడే యెనబది నాలుగులక్షలు

యోనుల వెడలితి నొక్కడనే

ఆనిన భోగములందలివే పో

కానము యికనేమి గడియించేముచ.2: నలుగడ నటు పదునాల్గు లోకములు

వెలయజొచ్చితిని వెడలితిని

కలిగినదేదో కలుగనిదేదో

తెలియ దేమిటికిదిరిగేమోచ.3: భువిలోజేసితి పుణ్యముబాపము

కవిసి యాఫలము గైకొంటిని

యివల శ్రీవేంకటేశుడిరతలో

తవిలి యేలగా ధన్యుడనైతి భావం

పల్లవి:

ఓ మనసా !  వెర్రివాని చేతలు విడువుము.

ఇకనైనా ఆలస్యము చేయక శ్రీహరిని తలుచుకో.చ.1:

 ప్రతి దినము(దినమనగా ఇక్కడ జన్మ అని లక్ష్యార్థం) ఎనుబది నాలుగులక్షల యోనులందు ఒక్కడినే పుట్టాను.

నేను పొందిన భోగములు ఆ యోనులందే ఉన్నాయి కదా !

ఏమిచూసుకోలేదు. ఈ జన్మ చక్రంలో ఇక ఏమి సంపాదించాము?

చ.2:

 నాలుగు దిక్కులలోను,  అటు పదునాల్గు లోకములలోను (భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహాలోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము  అతలము, వితలము, సుతలము, రసాతలము, మహాతలము, తలాతలము, పాతాళము ) ప్రవేశించాను. బయటకు వచ్చాను.కలిగినదేదో కలుగనిదేదో తెలియదు. ఎందుకు తిరిగేమో తెలియదు.

చ.3:

 ఈ భూమిలో పుణ్యముచేసాను.పాపము చేసాను.

వ్యాపించి ఆ ఫలమును స్వీకరించాను.  శ్రీవేంకటేశుడు ప్రేమతో  పరిపాలించగా ధన్యుడనయ్యాను.

***

No comments:

Post a Comment

Pages