బొమ్మల బ్రహ్మయ్య - అచ్చంగా తెలుగు

                                         బొమ్మల బ్రహ్మయ్య

(మా జొన్నవాడ కథలు)

               - డా.టేకుమళ్ళ వెంకటప్పయ్య  (9490400858)


 

              "ఛీ! ఛీ! ఏంబతుకో! ఏందో...ఈరోజూకూడా ఒక్క బొమ్మకూడా  అమ్ముడుబోలేదు" అంటూ రాత్రి 8 గంటలవేళ ఇళ్ళు చేరుకుని, ఒక మూల చేరగిలబడ్డాడు దిగాలుగా బ్రహ్మం.

              "ఏమయ్యా! ఈరోజుకూడా ఏం రాలేదా డబ్బులు. ఓరి బగమంతుడో ఏంజెయ్యాల్రా.. దేవుడా!  అయ్యా! కొడుక్కి కాన్మెంటు ఇస్కూల్లో ఫీజు గట్టాలంట. ఇంట్లో తిండి సామాన్లు అయిపొయి వారం దాటింది. మనం తిన్న తినకపొయినా ఇస్కూల్లో ఫీజు గడితే గదా చెప్పు!" అని సత్తు కంచంనిండా వేడి వేడి గంజిలో పచ్చిమిరక్కాయ్ వేసి ఇచ్చింది. తాగాక ప్రాణం లేచొచ్చింది. "కాలే కడుపుకు మండే గంజంటే ఇదే గావాల. పెద్దోళ్ళు ఊర్కే చెబ్తారా!" అని గొణుక్కుని నవ్వుకున్నాడు.

              "నవ్వుకుంటున్నావా! ఓరినా పిచ్చి మొగుడో! నూకలు ఇమ్మని అడిగితే, బొమ్మల బ్రహ్మయ్య బొమ్మలమ్మేదీ లేదు నా బాకీ తీర్చేదీ లేదని పెంచిల్శెట్టి నానా మాటలన్నాడు  తెలుసా! రేపన్నా జూడు సామీ! నీకు పున్నెముంటాది. పస్తులుండలేను. నా కొడుకుని దీసుకొని మా అమ్మోళ్ళింటికి బొమ్మంటావా చెప్పు నా దారి నేను జూసుకుంటా! " అంది రత్తమ్మ కళ్ళనీళ్ళతో.

          ఏమి జెయ్యాలో తోచక రచ్చబండ కాడ హరికత ఉందని,  వసారాలో నులకమంచం, దిండు వేసి "నువ్వు బడుకోవే రత్తీ...అల్లాడదాకా బొయెస్తా!" అనగానే జాగర్తయ్యోవ్! పురుగుబుట్రా ఉంటాయి. కిర్రుచెప్పులేస్కోని బో! అని తలుపేసుకుంది.

              రచ్చబండ కాడికి చేరే సరికి హరికథ "శివకల్యాణం" మంచి రసపట్టులో ఉంది. హరిదాసు పిట్టకథలు చెబుతూ తెగ నవ్విస్తున్నాడు. ఈజొన్నాడోళ్ళకు తేరగా వస్తే చాలు. వేలం వెర్రిగా వొస్తారు జనాలు అనుకుంటూ కూచోడానికి జాగా కోసం చుట్టూ చూశాడు.  పక్కనే ఉన్న మర్రిచెట్టు క్రింద ఒక సన్యాసి కూర్చుని హరికథ వింటున్నాడు. పెద్ద పెద్ద విబూధి పట్టీలు. మెడలో పెద్ద రుద్రాక్ష మాలలు వేసుకు న్నాడు.  వృద్ధుడైనా మొహంలో బ్రహ్మ తేజస్సు ఉట్టిపడుతోంది. వూళ్ళో ఎప్పుడూ చూళ్ళేదే ఈన్ను అనుకుంటూ పరీక్షగా చూస్తూ ఉండగా "బ్రహ్మం... ఇట్టారావయ్యా..ఇక్కడ గూచో!" అన్నాడు. రచ్చబండ క్రింద చోటులేకపోవడంతో ఇష్టంలేకపోయినా అక్కడే కూర్చున్నాడు. "నన్ను తెలుసా సామీ!" అన్న మాటకు ఫక్కున నవ్వి.. అన్ని వూళ్ళు నావే గదా! శివయ్యకు తెలియని వాళ్ళెవరు బ్రహ్మమా! చెప్పు?" అన్నాడు. "ఎక్కడుంటావు?" అన్న ప్రశ్నకు " సన్నాసోడిని… నన్ను ఊళ్ళో ఉండనిస్తారా! చెప్పు! వూరి చివర.. ఎక్కడో కొసాన పడుకోవడమే!" అని బ్రహ్మం వైపు చూస్తూ "బ్రహ్మం! కష్టాల్లో ఉన్నట్టున్నావు నిజమేనా?" అన్న ప్రశ్నకు, కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా ఆప్యాయంగా పలకరిస్తే ప్రాణం లేచొస్తుంది. "అవును సామీ! నా బాధలు పగోడిగ్గూడా వొద్దనే వొద్దు" అన్నాడు దణ్ణం పెట్టి. "అరె.. అలా దిగులు పడమాక! మాలాంటోళ్ళం ఉన్నది దేనికి చెప్పు? జీవితంలో బాధలు ఎక్కువగా ఉన్నప్పుడు శ్రీ కృష్ణుణ్ణి స్మరణకు తెచ్చుకోవాలి. అందుకే "కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే| ప్రణత క్లేశ నాశే గోవిందాయే నమో నమః" అనే మంత్రాన్ని అనుకుంటూ ఉండాలి” అనగానే అదేంది  సామీ.. విబూధి రేఖలు వొంటినిండా రాచుకుని కృష్ణుడి మంత్రం జపం జెయమంటున్నారు" అని ఆశ్చర్యంగా అడిగాడు. “కృష్ణుడు, రాముడు, శివుడు, విష్ణువు అని మీరు పెట్టుకున్న పేర్లేనయ్యా! శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః.యధాశివమయో విష్ణు రేవ్వం విష్ణుమయశ్శివః, యధాంతరం పశ్యామి తధామే స్వస్తిరాయుషి అంటే తెలుసా బ్రహ్మం! అన్న మాట విని తెలియదన్నట్టు తల అడ్డంగా ఊపాడు. వినుశివుడు విష్ణురూపము. విష్ణువు శివరూపము. శివుని హృదయం విష్ణువు. విష్ణు హృదయం శివుడు. శివుడు విష్ణుమయము. విష్ణువు శివమయము. వీరిమధ్య భేదము చూడని నా ఆయుస్సునకు భద్రముండుగాక. భేదమును చూచానో నా ఆయుస్సునకు ముప్పే" అని అర్థము. కాబట్టి భేదాలు మానుకో! నేను చెప్పిన మంత్రాన్ని ఇదుగో కాగితం మీద వ్రాశాను. రోజూ చదువుకో!” అని ఇచ్చాడు. కాగితం అందుకుంటూ ఆయన చేతి వేళ్ళు తగలగానే బ్రహ్మానికి ఏదో మంచుముక్క  తగిలినట్టనిపించి చటుక్కున వెనక్కు లాక్కున్నాడు. "ఈమాత్రం దానికే!" అని పెద్దగా నవ్వాడు.   రేపు నరసింహకొండ వైపుబో! పదిహేనురోజుల్లో వినాయక చవితి రాబోతున్నది. తర్వాత దసరా వస్తుంది. మొదట విఘ్నేశ్వరుని విగ్రహాలు భారీ సైజులో చేసుకో! ఇంటికే వచ్చి కొనుక్కుంటారు. తర్వాత పార్వతమ్మ విగ్రహాలు దసరాలో అమ్ముడు పోతాయి. శుభం! అని నుదురుమీద విభూతి రాచి పొయిరా! బ్రహ్మం!" అన్నాడు. హరికథ అయినట్టుంది. సామితో మాట్టాడతా ఉంటే  గంటసేపు ఎట్టా గడిచిపొయిందో తెలీలా అనుకుంటూ లేచాడు బ్రహ్మం.  అందరూ ఇంటి దారి పట్టారు.

              శివయ్య చెప్పినట్టు ప్రక్కరోజు అనూహ్యంగా బొమ్మలన్నీ అమ్ముడుబొయినాయి. అలాగే పెద్ద పెద్ద విఘ్నేశ్వరుని విగ్రహాలు వినాయకచవతి పందిళ్ళలో పెట్టుకోడానికి తయారు చేసాక ఎక్కడలేని గిరాకీ వచ్చింది. అలాగే దసరా విగ్రహాలు కూడా వందల సంఖ్యలో తయారు చేసి అమ్మాడు.  బ్రహ్మం పూరిగుడిసె బదులు చిన్న భవంతి  లేచింది. బ్రహ్మం ఆరోజునుండి శివయ్య స్వామికోసం వెదుకుతున్నాడు. కానీ కనిపించనేలేదు.

          ఒకరోజు అమ్మణ్ణి దర్శనం చేసుకుని దేవళం బయటికి వచ్చాడు.  దేవళం ప్రక్కన శివయ్యస్వామి కనిపించేసరికి ఆశ్చర్యంతో క్రింద బురద మట్టి ఉన్నదికూడా లెక్కపెట్టకుండా నేలమీదకూర్చుండిపోయి కాళ్ళమీద వాలిపోయాడు. "నాయనా! బ్రహ్మం!  లే..లే! నువ్వు కష్టపడి పనిచేయడంవల్ల మాత్రమే స్థితిలో ఉన్నావు. నేను చేసిందేమీ లేదు" అన్నాడు. శివయ్య స్వామిని ఇంటికి తీసుకుని వెళ్ళి భక్తి శ్రద్ధలతో భోజనం పెట్టించాడు. శివయ్య సాయంత్రం  ఐదింటి వరకూ  విశ్రాంతి తీసుకుని వెళ్తూ "నాయనా! బ్రహ్మం! నీకు మంచి భవిష్యత్తుంది. నువ్వు గొప్ప ధనవంతుడవు కాగలవు. కాళహస్తిలో మురుగన్ స్థపతి అని ఒకాయన ఉన్నాడు. రేపు అక్కడకు వెళ్ళి అతని దగ్గర శిష్యునిగా చేరి శిల్పాలు చెక్కడంలోను, దారు శిల్పాలు చెక్కడంలోను శిక్షణ తీసుకో. అతను పెద్దవాడయ్యాడు. అతని తర్వాత నువ్వే! శుభం!" అని వెళ్ళిపోయాడు. 

              ఉదయం ఎనిమిదయింది. కాళహస్తి లో రాహుకేత పూజకై భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. బ్రహ్మం కాళహస్తీశ్వరుని దర్శించుకున్న తర్వాత ఎందరినో అడిగి మురుగన్ స్థపతి ఇళ్ళు తెలుసుకొని అక్కడకు చేరుకున్నాడు. ఆయన ఒక పడక కుర్చీలో కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. బ్రహ్మం వెళ్ళి కాళ్ళకు నమస్కరించగానే "ఎవరు నాయనా నువ్వు?" అని ప్రశ్నించాడు. నా పేరు బ్రహ్మం స్వామీ! నేను జొన్నవాడ నుండి వచ్చాను.." అంటూ ఉండగానే మురుగన్ లేచి ఒక్కసారి ఆలోచనలో పడి ఇలా చెప్పాడు. "నిన్న సాయంత్రం సుమారు ఐదుగంటల ప్రాంతంలో అనుకుంటా...అంతకుముందెప్పుడూ చూడని ఒక స్వామి దేవాలయ ప్రాంగణంలో నిలబడి ఉన్నాడు. నా దగ్గరకు వచ్చి "మురుగన్! రేపు ఉదయం ఒకతను వస్తాడు. అతనికి నీకొచ్చిన విద్య నేర్పించు. అతనే నీ వారసుడు!" అని చెప్పి గబగబా వెళ్ళిపోయాడు" అనగానే అతనెలా ఉంటాడని అడిగిన ప్రశ్నకు మురుగన్ అచ్చుగుద్దినట్లు శివయ్య స్వామిని వర్ణించేసరికి ఆశ్చర్యపోయాడు.

              మురుగన్కు మగ సంతానంలేకపోవడం వల్ల, అతని భార్య ఇటీవలే కాలం చెయ్యడం వల్ల బ్రహ్మాన్ని జొన్నవాడలో ఇళ్ళు బాడుగకు ఇచ్చి, తన భవంతికి మారమని చెప్పాడు. బ్రహ్మం రెండేళ్ళు ఒక్క నిమిషం కూడా వృధా చెయ్యకుండా శిల్ప విద్యలో ఆరితేరాడు. ఎక్కడ గుడిగోపురాలు కట్టాలన్నా బ్రహ్మం స్థపతి రావలసిందే!  అలా కొంతకాలం గడించింది.  బ్రహ్మం కొడుకు అమెరికాలో ఉద్యోగమని వెళ్ళిపోయాడు. మురుగన్ ఒకరోజు గుండెపోటని చెప్పి ప్రాణం విడిచాడు. మురుగన్ విద్యకే కాదు అతని ఆస్తికీ వారసుడయ్యాడు. కాలం ముప్పై సంవత్సరాలు దొర్లింది. బ్రహ్మానికి అరవై యేళ్ళు వచ్చాయి. బ్రహ్మం శివయ్య స్వామి జాడకోసం సమయం దొరికినప్పుడల్లా  జొన్నవాడకు వెళ్ళి చూస్తూనే ఉన్నాడు. కానీ ఎక్కడా కనిపించలేదు.

              ఒకరోజు బ్రహ్మం సువర్ణముఖీ నదిలో స్నానం చేస్తూ ఉండగా ప్రక్కనే స్నానం చేస్తూ "ఎలా ఉన్నావు బ్రహ్మం!" అని ప్రశ్నించే సరికి ఆశ్చర్యపడ్డాడు. ఇంటికి తీసుకుని వెళ్ళి  తన ఇంటిలోనే ఉండమని ఎంత బ్రతిమిలాడినా ఒప్పుకోలేదు. ఆతిధ్యం మాత్రం స్వీకరించాడు. శివయ్య తనకు సెలవిప్పించమని కోరగా భార్యాభర్తలిద్దరూ కాళ్ళమీద పడి "మాకు ఇంత చేసిన మీకు ఏదైనా సేవ చేయాలని ఉంది. మీరు ఒప్పుకుంటె తప్ప కాళ్ళు వదిలేది లేదు అని గట్టిగా పట్టుకున్నాక శివయ్య  " చిరునవ్వు నవ్వి ఒక్కసారి ఆకాశంలోకి చూసి "చూడు నాయనా! బ్రహ్మం! నీవింతగా ప్రాధేయపడుతున్నావు కాబట్టి నీ కోరిక మన్నించి నీకు ఒక పని అప్పగించదలచాను. " అనగానే "చెప్పండి స్వామీ! ఎంత కష్టమైన కార్యమైనా చేస్తాను" అన్న మాటలు విన్న శివయ్య నవ్వి "రేపు ఉదయం ఎనిమిది గంటలకు కాళహస్తీశ్వర ఆలయానికిరా! అక్కడ చెబుతాను" అని వెళ్ళిపోయాడు.

          వద్దని వారించినా వినకుండా రత్నమ్మ ప్రక్కరోజు భర్తను అనుసరించింది. ఇద్దరూ ప్రదక్షిణాలు పూర్తిచేసి వాయులింగం దర్శించడానికి గర్భగుడిలోకి వెళ్ళారు. బ్రహ్మం స్థపతి రావడంతో పూజారి గౌరవంగా అభిషేకం ఏర్పాటు చేశాడు. అభిషేకం జరుగుతున్నది. నమకం చమకం చివరి వరకూ ప్రక్కనే ఉన్న బ్రహ్మం చివరిలో "ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి.. సదాశివోమ్.. ఓం శాంతిః  శాంతిః శాంతిః" అన్న మంత్రం చదివాక రత్నమ్మకు కనిపించలేదు. ప్రక్కనే నేలమీద ఆయన పట్టుధోవతీ, పై పంచ కనిపించడంతో ఆశ్చర్యానికి లోనయింది.  అందరూ "ఓం నమశ్శివాయ!" అని గట్టిగా అరుస్తున్నారు. రత్నమ్మ కళ్ళలోనుండి నీళ్ళు ధారాపాతంగా కారుతూ ఉండగా, ఆయన ధోవతి పైపంచె తీసుకుని  బయటికి పరుగున చేరుకుని బ్రహ్మం అనుచరులిద్దరిని చూసి "ఆయన ఇటు వచ్చారా?" అని అడిగింది. లేదు లేదు అన్నారు వాళ్ళు ఎక్కడికి పోయి ఉంటాడా అని భయపడుతూ ఉండగా ఇంతలో బయట ఏదో కలకలం వినిపించి, భక్తులంతా ధ్వజస్తంభం దగ్గర చేరి  పైకి చూస్తూ నమస్కరిస్తూ ఉండగా,  వీరు కూడా బయటకు వెళ్ళి చూశారు. రాజహంసలాంటి తెల్లనిపక్షి ఒకటి ధ్వజస్తంభం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేసి ఆకాశంలోకి ఎగిరి పోయింది.

          రత్నమ్మ ఎంతో ధనం ఖర్చుచేసి బ్రహ్మం కోసం మనుష్యులను పెట్టి తెలుగునేలంతా వెదికించింది. కానీ ఏమీ లాభం లేకపోయింది.

No comments:

Post a Comment

Pages