నాయకుడు - వినాయకుడు - అచ్చంగా తెలుగు
నాయకుడు..వినాయకుడు
-ప్రతాప వెంకట సుబ్బారాయుడు


నాయకుడు లేని సమాజం, వినాయకుడు లేని పూజ ఉండదు. 
మనుషులు ఒక తాటిమీద, పద్ధతిగా నడవాలంటే నాయకుడు అవసరం. నాయకులకు పద్ధతులు అవసరం లేదు. వాళ్ళు ఇస్టారాజ్యంగా వ్యవహరిస్తారు. అందుకే ఎలాగోలా పదవి సాధించి, దానితో చేయకూడని పనులన్నీ చేస్తూ చిద్విలాసం ఒలికిస్తారు. నాయకులకు పదవి అంటే ప్రాణంతో సమానం నిజానికి అంతకంటే ఎక్కువ. పదవి లేకపోతే బతికి ఉన్నా చచ్చినట్టే భావిస్తారు. పదవిలోకి రావడానికి, వచ్చాకా నానారకాల గడ్డి కరుస్తారు. 
పదవి అనేది ఎంత ముఖ్యమో పురాణ ముఖంగా మనకు ఇంద్రుడు, వినాయకుడు తెలియజేస్తారు. స్వర్గసౌఖ్యాలకు అలవాటైన ప్రాణం కదా, ఇంద్రుడు ఒకరి వల్ల తన పదవికి ఎసరు రాబోతోందంటే, ఎంతకైనా తెగించి వాళ్ల భరతం పట్టి తన పదవిని కాపాడుకుంటాడు. మన నాయకులైనా అంతే కదా! ముఖ్యంగా ఎన్నికలయ్యాకా మెజార్టీ సాధించడానికి జరిగే బేరసారాలు, ఆశపెట్టే తాయిలాలు మనకు తెలియనివి కాదు. అప్పుడు గవర్నర్ల పాత్ర ఉన్నట్టుండి గొప్ప ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయి పదవి పోతోందనుకున్నప్పుడు దాన్ని అంటి పెట్టుకుని ఉండడానికి ఎంతటి వీరప్రయత్నాలు చేస్తారో మన మెమరీలో హిస్టరీ కన్నా బలంగా నాటుకుపోయిందన్నది నిఖార్సయిన వాస్తవం.
అగ్రజుడినైన తనకు విఘ్న ఆధిపత్యం ఇమ్మని కుమారస్వామి వెళ్లి తండ్రినడిగితే మూడు కోట్ల నదుల్లో పుణ్యస్నానం చేసి తన వద్దకు ఎవరు ముందు వస్తే, వాళ్లకి ఆ ఆధిపత్యం ఇస్తానంటాడు శివుడు. ఆ మాట వినడంతోటే నెమలి వాహనం మీద రివ్వున ఆకాశంలోకి దూసుకుపోయాడు కుమారస్వామి. ఉమాసుతుడు మాత్రం పదవి సులువుగా ఎలా సాధించాలో తెలిసిన నాయక లక్షణాలు కలిగినవాడయ్యే ’నాన్నా, ఇంత భారీకాయంతో, ఎలుక వాహనం మీద అన్ని నదులకు వెళ్ళి మునగలేనని తెలిసి కూడా మీరలా చెప్పడం భావ్యమా?’ అని ముఖం దీనంగా పెట్టి, జాలిగా అన్నాడు. అందరికీ భోళాశంకరుడైన శివుడు తన కుటుంబసభ్యుల పట్ల మరింత అపేక్ష చూపించడంలో ఆశ్చర్యమేముంది? కొడుకు మాటలకు కరిగిపోయి ’కుమారా, నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణం చేస్తే మూడు కోట్ల నదుల్లో పవిత్ర స్నానమాచరించినట్టే’ అని సెలవిచ్చాడు. ఇంకేం వక్రతుండుడు తెలివిగా తండ్రి చెప్పినట్టు చేసి, సులువుగా పదవిని సాధించి దేవతలకు, మనకు ఆరాధ్యుడయ్యాడు. విఘ్నేశ్వరుడిగా ప్రథమ పూజలందుకుంటున్నాడు. మన నాయకుడు సరిగ్గా ఇదిగో ఈ విషయం మీదే పట్టు సాధించి, ఎన్నికలప్పుడు కల్లబొల్లి కబుర్లతో, నోటి కొచ్చిన వాగ్దానాలు చేసి, పాదయాత్రలు, సహపంక్తి భోజనాలు చేస్తూ, జనాలతో ‘మనవాడు’ అనిపించుకుని దండిగా ఓట్లేయించుకుని, పదవిని పొంది ఆ తర్వాత కంటికి కానరానంత దూరమైపోతాడు. అయితే అవినీతి, అక్రమాలకు ఆలవాలమై ఎప్పుడూ పేపర్లలో కనిపిస్తూనే ఉంటాడన్నది జగమెరిగిన సత్యం. ఎంతైనా మనవాడు కదా, అ‘క్రమం’గా ఎంత ఎదిగాడన్నది తెలుసుకోడానికేగా మనం డబ్బులిచ్చి మరీ పేపర్లు కొనేది, ఛానల్లో వార్తలు చూసేది. అక్ర’మార్కు ’డని ఎవరైనా సాక్ష్యాధారాల్తో నిరూపిస్తే, తను నిరపరాధినని, తనంటే గిట్టనివారు, ప్రతిపక్షం పన్నిన కుట్ర అని రెండుమూడు రోజులు అరుస్తాడు, కేకలేస్తాడు, రంకెలేస్తాడు. ఆ తర్వాత అది చప్పబడి పోతుంది. మరో నాయకుడికి అలాంటి అవకాశం, మనకో హాట్ అంశం కావాలి కదా మరి! రోజులు చప్పగా సాగిపోతే ఎలా??
పదవి పొందే ముందు ఆర్ధికంగా అర్భకుడిగా ఉన్నవాడు పర్వతాకార సుమోగా ఎలా పెరిగాడో మనకి అనవసరం. ప్రజాస్వామ్యంలో అయిదేళ్లకోసారి ఓట్లేయడం మన హక్కు. అది పక్కా నెరవేరుస్తాం. ఎవరెలా ఎదిగితే మనకేం. మనవల్ల ఒకరు అభివృద్ధిలోకి రావడంకన్న మనకింకేం కావాలి?
ఏదేమైనా పుట్టినందుకు మనకో నాయకుడు, వినాయకుడు కావాలి. దట్సిట్. 
***

No comments:

Post a Comment

Pages