అనసూయ ఆరాటం - 12 - అచ్చంగా తెలుగు

అనసూయ ఆరాటం - 12 

చెన్నూరి సుదర్శన్  


వారం రోజుల్ల పిల్లలు ఉషారుగ లేచి బడికి పోబట్టిండ్లు. అనసూయ పానం జరంత నిమ్మలమైంది. 

కోర్స్ పకారం దినాం వచ్చి సూదులు ఇత్తాబోయిండు ఖాన్‌సాబ్. 

కోర్స్ పూర్తైనంక మల్ల పరీచ్చలు చేయించిండు రాజయ్య. దేవుని దయవల్ల పిల్లలు పమాదం నుండి తప్పిచ్చుకున్నరని ఖాన్‌సాబ్ చెప్పంగనే శాన సంబురపడ్డదు. 

అనసూయ దగ్గర ఫీజు తీసుకోవద్దని.. తనే ఇత్తనని ఖాన్‌సాబ్‌కు ఫీజు ఇచ్చిండు రాజయ్య.  అప్పుడప్పుడు వచ్చి తండ్రి లేని పిలగాండ్లను సూత్తావుండు మని బతిలాడిండు.    

“సార్  నువ్వు గితగనం చెప్పాల్నా .. నాకు తెల్వదా..” అన్నడు ఖాన్‌సాబ్. “రేపు నేను బలానికి కొన్ని టానిక్కులు తీస్కచ్చిస్త. మీరు బేఫికరగ ఉండుండ్లి” అని భరోసా ఇచ్చిండు ఖాన్‌సాబ్. 

***

సదువు.. సదువు అంటాంటే పొలగాండ్లకు పానం మీదికత్తాంది. మరి సదువకుంటే ఎట్ల.. అని పరేషాన్ల పడ్డది అనసూయ. ‘ఏంప్యాసైతరో.. ఏంపాడో..’ అని మిడ్కబట్టింది.

అనసూయ మిడ్కినట్టే జర్గింది.

ఆదిరెడ్డి పదిల ఫేలయ్యిండు. తల్కాయె పట్టుకున్నది అనసూయ. ఆదిరెడ్డిది ఆవగింజంతైనా తప్పులేదను కున్నది. పాపం.. తాప, తాపకు పానం కూషైతాంటే వాడు మాత్రం ఏంచేత్తడని  తనకు తానే సదిరి చెప్పుకున్నది. 

7

సురేందర్ ములుగుకు తబాదల మీద జనానను తీస్కోని వచ్చిండు.  

అనసూయకు కొండంత బలమచ్చింది. ఆదిరెడ్డి సదువు సంగతి తమ్ముడు సూసుకుంటడని తెగసంబుర పడ్డది.

సురేందర్‌కు ఇద్దరు పిల్లలు. కొడుక్కు నాలుగేండ్లు..  బిడ్డకు రెండేండ్లు. సురేందర్ పెండ్లాం పేరు ప్రమీల. తనూ పదోటి ఫేలయ్యింది. గప్పుడే పెండ్లి చేసుకొనుడు.. పిల్లలు గనుట్ల సదువు అటకెక్కింది. 

ఒక రోజు ములుగు టెలీఫోన్ ఆఫీసుల డూటీ మీదున్న సురేందర్ తానకు పదో తరగతి సదివే బడిపొలగాండ్లంత వచ్చి.. సురేందర్‌ను టూచన్ చెప్పుమని బతిలాడబట్టిండ్లు. వాల్ల లెక్కల సారు చెప్పేది సమఝైత లేదని ఏడ్పు మొకాలేసు కున్నరు. వాల్లను సూత్తాంటే సురేందర్‌కు పాపమని పిచ్చింది. తను ములుగుల సదువు కున్నప్పుడు లెక్కలు బాగ చేసెటోడు. ఊల్లె అంతా లెక్కల సురేందర్ అని పిల్సేటోల్లు. సార్లు సుత సురేందర్ అంటే మస్తు ఇట్టపడేటోల్లు. 

సురేందర్ ఒప్పుకునే దాక ఆఫీసునుండి పొలగాండ్లు కదల కచ్చిండ్లు. సురేందర్‌కు సుత లెక్కలు మీద పట్టు ఔసురం. తను ఏ.పి.ఎస్.సి. జూనియర్ లెక్చరర్ నౌకరి కోసరం పరీచ్చలు రాసిండు. రేపు ఒక వేళ పరీచ్చలల్ల పాసైతే ఇంటర్వ్యూ ఉంటది. అప్పుడక్కరకత్తదను కున్నడు. ‘సరే..’ అన్నడు. పిల్లలంతా సంబురంగ లబ్బరు చెండు లెక్క ఎగురుకుంట పోయిండ్లు.

సురేందర్ కాలనీల తమ ఇంట్లనే టూచన్ షురు చేసిండు. పదో తరగతి సదివే ఆడపిల్లలకు పత్తేకంగా ఒక బాచి.. మగపొలగాండ్లకు ఒక బాచి. గట్లనే ఇంటరు సదివే వాల్లకు సుత రెండు బాచిలు సేసిండు. పొద్దుగాల ఇంటరోల్లకు.. చెప్పి ఆఫీసుకు పొయేటోడు సురేందర్. పొద్దుమూకి పదో తరగతోల్లకు చెప్పెటోడు. ఊల్లె.. కాలేజీ, బడి ఒక్క దాంట్లనే నడుత్తై. పొద్దుగాల బడి.. పగలు ఇంటరు. గందుకే ఆ సౌలతెంబడి టూచన్ చెప్పేటోడు సురేందర్.

పనిల పనని ప్రమీలను సుత పదో తరగతి ఆడపిల్లల బాచిల కూకోమన్నడు. ఆదిరెడ్డి మగ పొలగాండ్ల బాచిల కూకోమన్నడు. 

సురేందర్ గడియ ఇరాం లేకుంట కట్ట పడ్డడు. ఆ యాడాది బడి పదో తరగతి.. కాలేజీ ఇంటరు పిలగాండ్లంతా నూటికి నూరు మంది పాసైండ్లు. ఊల్లె సురేందర్ పేరు మారు మోగి పోయింది. ప్రమీల, ఆదిరెడ్డి సుత ఫస్టున పాసిండ్లు.

పదో తరగతి నతీజలు రాంగనే స్వీటు కొనుక్కొని బుచ్చయ్య, సమ్మయ్య తాతయ్యలకు చెబుదామని సంబురంగ ఉర్కిండు ఆదిరెడ్డి. 

దుకాన్ల బుచ్చయ్య, సమ్మయ్య  ఒకలెకెదురుంగ ఒకలు పదురుకొని కూకున్నరు. ఏదో బైస్ నడ్తాంది. ఆదిరెడ్డిని సూడంగనే..

”ఎటో వచ్చినౌ” అని ఈసడిచ్చుకుంట అడిగిండు బుచ్చయ్య.

“తాతయ్యా.. నేను పదోటి పాసైన” అన్కుంట ఇస్వీటు డబ్బమూత తెర్సి తీసుకోమన్నడు.

“బాగనే పొడుగు చేసినవ్ గని ఇంకా ఎన్నేండ్లు ఇంటింటి రాజులను కూకోబెట్టి మేపాలె..” అని కైక్కుమన్నడు సమ్మయ్య.

ఆదిరెడ్డి బీర్పోయిండు. ఏమనాల్నో..! తెల్వకచ్చింది.

“చూడు ఆదిరెడ్డి.. మీనాయ్న మీద గౌరువం తోటి ఇన్నాళ్ళూ మీకు సాయం చేత్తానం. ఇంకా ఎన్ని దినాలు మైనకు సరిపడే సామాన్లు  పంపాలె. నువ్వు ఇంకా చిన్న మొల్లివనుకుంటనవా? “ అన్కుంట ఆదిరెడ్డి చేతిల కెల్లి ఇస్వీటు డబ్బ తీస్కోని కింద పెట్టిండు. 

“మేము ఇస్వీటు తినాలంటే నువ్వొక పని చెయ్యాలె ఆదిరెడ్డీ.. మీ అమ్మను, తమ్మున్ని, చెల్లెను తీస్కోని మీ అమ్మమ్మ ఊరు జంగాలపల్లికు పో.. మీ చిన్నాయ్న చేత్తానట్టు కౌలుకు పొలాలు మాట్లాడుకొని బతుకుండ్లి. లేదంటవ్.. మీ సొంతూరు శాయంపేటకన్నా పోండ్లి. ఆడ మీ చిన్నాయ్న పుల్లారెడ్డి ఉండనే ఉండె.. నీకు సుత కౌలుకిప్పిత్తడు” 

ఆదిరెడ్డి కండ్లల్ల నీళ్ళు నిండినై. ఇస్వీట్లు తిననీ.. లేకుంటే మోరీల పారబోసుకోనీ.. అని మన్సుల గులుక్కుంట వాపసు మర్రిండు.

ఇంటికి వచ్చుడు వచ్చుడే.. అనసూయ మీద పడి చిన్న పోరని లెక్క ఏడ్వబట్టిండు ఆదిరెడ్డి.

కొడుకు పాసైండు.. తన కట్టాలు తీరినై అనుకుంటాంటే. వీడేంది ఏడుత్తాండని అనసూయ బిత్తిరి పోయింది.

“ఏమైంది కొడుకా ఎవరేమన్నరు..” అని ఆదిరెడ్డి గదుమ పట్టుకొని అడుగసాగింది.

“అమ్మా.. మనం ఇల్లు ఖాళే చెయ్యాల్నట. మీ అమ్మమ్మ ఊరికి పోయి బతుకుండ్లి. ఇంకా ఎన్నాల్లు మీకు చిల్లర సామాను పంపాలే.. అని బుచ్చయ్య తాత కోపం చేత్తాండు” ఎక్కెక్కి పడి ఏడ్సుకుంట చెప్పిండు ఆదిరెడ్డి.

అనసూయ బొండిగెల రాయి పడ్డది. నిలబడ్డకాన్నే బట్టల మూట లెక్క కూలపడ్డది.

అనిమిరెడ్డి, జయమ్మలు భయపడుకుంటచ్చి అనసూయ భుజం మ్మీద వాలిండ్లు. రెండు చేతుల్తోటి పిల్లలను దగ్గరికి తీసుకున్నది. కొంగు మొకం మ్మీద కప్పుకొని.. 

“నేనేం సేత్తురో.. కొడుకా.. 

 మన బతుకులు.. ఆగమైనైరా కొడుకా..

 మీ అయ్య సచ్చి.. ఏలోకాన ఉన్నడో కొడుకా..

 మన కట్టాలు తీర్సంగ వత్తడా కొడుకా..” అని వల్లిచ్చుకుంట ఏడ్వబట్టింది.

అనసూయ ఏడ్పు విని బతుకమ్మ,  సురేందర్‌లు ఉర్కచ్చిండ్లు.

అనసూయ జరిగిందంతా ఏడ్పు రాగంతోనే.. చెప్పింది. 

“నేను పిల్లలను తీస్కోని గాపల్లెటూరుకు పోయి ఏం బతుకాలే.. ఎట్ల బతుకాలె తమ్ముడూ. ఆనాడే మీ బావ కాట్టంల అందరం కట్ట కట్టుకొని పడి సత్తే పీడ బోయేది” అని నోట్లె కొంగు పెట్టుకొని కుమిలి, కుమిలి ఏడ్వబట్టింది అనసూయ.

“సూడు అనసూయా.. కట్టాలు మనుషులకు కాకపోతే మానులకత్తయా.. దైర్నం చేసుకోవాలె. నిన్ను చూసి పిల్లలు పురంగ బెంగటిల్లుతరు” అని బతుకమ్మ సముదాయించబట్టింది.

  “అక్కా.. నువ్వు ఎక్కడికీ పోవద్దు. పిల్లల భవిషత్ కరాబైతది. నేనొక మాట చెపుత కాదనద్దు” అడిగిండు సురేందర్. 

బతుకమ్మ ముక్కు మీద ఏలేసుకొని కొడుకును సూడబట్టింది. 


No comments:

Post a Comment

Pages