పలికేటివేదమె ప్రమాణము (21-02-22) - అచ్చంగా తెలుగు

పలికేటివేదమె ప్రమాణము (21-02-22)

Share This

 పలికేటివేదమె ప్రమాణము

(అన్నమయ్య కీర్తనకు వివరణ)

డా.తాడేపల్లి పతంజలి 
రేకు: 0336-03 సం: 04-210


పల్లవిపలికేటివేదమె ప్రమాణము

తలచిన వారికి తత్వము సుండీ


.1: నరహరి యజాండనాయకుడు

సురలితనినే సంస్తుతించిరి

పురుషోత్తముడిదె భూమికి యీ

హరి గొలువనివా రసురలు సుండీ


.2: కమలారమణుడె ఘనుడు

అమరు‌లె మ్రొక్కుదు రాతనికి

విమతులదునిమె విష్ణుడు

తమిబూజించక తగు గతి లేదు


.3: భావజజనకుడు బ్రహ్మము

సోవగగొలిచిరి శుకాదులు

శ్రీవేంకటపతిచెలువుడు

దైవశిఖామణిదలచరో బుధులు


భావం

పల్లవి:


 శ్రీ హరిని తలచిన వారికి తత్వజ్ఞానం కలుగుతుంది.ఇది వేదము  పలికే ప్రమాణము .


చ.1:


నరసింహుడని, బ్రహ్మాండ నాయకుడని దేవతలు శ్రీ హరిని పొగిడారు.

ఈ  భూమిలో సర్వవ్యాపియైన పురుషోత్తముడు శ్రీ హరియే.

ఈ హరిని కొలువనివారు రాక్షసులు సుమా !


చ.2:

లక్ష్మీదేవికి ఇష్టమైన వేంకటేశుడు ఘనుడు.

దేవతలే అతనికి  మ్రొక్కుతుంటారు.

విష్ణుదేవుడు విరుద్ధ మతముకలిగిన శత్రువులను నశింపచేసాడు..

అతనిని ప్రేమతో, కుతూహలముతో  పూజించక పోతే   గతి లేదు.


చ.3:

మన్మథ జనకుడయిన శ్రీహరి  బ్రహ్మము.

అతనిని శుకుడు మొదలయిన వారు ప్రత్యక్షంగా ,అందంగా కొలిచారు.

శ్రీవేంకటేశ్వరుడు సుందరుడు. భక్త ప్రియుడు.

దైవశ్రేష్ఠుడు. అతనిని  పండితులు తలుచుకోండి.విశేషాలు

తత్త్వజ్ఞానం


మనం చూస్తూ ఉన్న ఈ ప్రపంచ  స్వభావం ఏమిటో లోతుకు దిగి విచారణ చేస్తూ పోతే దాని ఫలితంగా ఏర్పడే యధార్థమైన జ్ఞానమేదో అది తత్త్వజ్ఞానం


 ప్రపంచం ప్రస్తుతం మనకు నామరూపాత్మకంగా భాసిస్తున్నది. ఇది ఆపాతతః  భాసించటమే గాని లోతుకుదిగి చూస్తే ఇది నామరూపాత్మకం కాదు. సచ్చిదాత్మకమైన   పరమాత్మేనని, అదే మన అజ్ఞాన వశాత్తూ ఇలా రూపాంతరంలో భాసిస్తున్నదని తేలిపోతుంది.    ఇలా తేల్చుకొనే జ్ఞానమే తత్త్వజ్ఞానం. ఇదే జీవిత పరమార్థానికి దారితీసే జ్ఞానం.   దీనికి భిన్నమైనదంతా తత్త్వజ్ఞానం కాదు. మిథ్యా జ్ఞానమే.బ్రహ్మము

బ్రహ్మమనగా బృహత్తు - పెద్దది. బృంహణం - అన్నిటినీ ఇముడ్చుకొనేది. పరమాత్మ నిర్గుణమైన శుద్ధ చైతన్యం.    మాయాశక్తి ఇందులో ఓతప్రోతమై (నిలువుగాను, అడ్డముగాను అంతట వ్యాపించుట) నిష్క్రియమై ఉంటుంది. అదే   సక్రియమైతే బయటికి వచ్చి నిర్గుణమైన బ్రహ్మం సగుణంగా మారుతుంది. అప్పుడది బ్రహ్మకాదు బ్రహ్మా. (బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు) 


***

No comments:

Post a Comment

Pages