తరిగొండ నృసింహ శతకము - తరిగొండ వెంగమాంబ - అచ్చంగా తెలుగు

తరిగొండ నృసింహ శతకము - తరిగొండ వెంగమాంబ

Share This

తరిగొండ నృసింహ శతకము - తరిగొండ వెంగమాంబ

పరిచయం: దేవరకొండ సుబ్రహ్మణ్యం 


కవయిత్రి పరిచయం:

తరిగొండ వెంగమాంబ 18 వ శతాబ్దానికి చెందిన తెలుగు కవయిత్రి, తిరుమల వేంకటేశ్వర స్వామి భక్తురాలు. వెంగమాంబ చిత్తూరు జిల్లా, గుర్రంకొండ మండలములోని తరిగొండ గ్రామములో వాసిష్ఠ గోత్రీకుడైన కానాల మంగమాంబాకృష్ణయా మాత్య అను నందవరీక బ్రాహ్మణ దంపతులకు 1730లో జన్మించింది.

వెంగమాంబ బాల్యంలో తన తోటి పిల్లల్లాగా ఆటలాడుకోక ఏకాంతంగా కూర్చొని భక్తి పారవశ్యంలో మునిగి తేలేది. ఆ చిరు ప్రాయంలోనే అనేక భక్తి పాటలను కూర్చి మధురముగా గానము చేసేది. తండ్రి ఆమె భక్తిశ్రద్ధలను గమనించి ఆమె నైపుణ్యమును సానబెట్టుటకు సుబ్రహ్మణ్య దీక్షితులు అనే గురువు వద్దకు శిక్షణకు పంపినాడు. దీక్షితులు ఆమె ప్రతిభను గుర్తించి తనకు తెలిసిన పరిజ్ఞానమంతా వెంగమాంబకు బోధించాడు. అనతి కాలములోనే వెంగమాంబ ప్రశస్తి నలుమూలల పాకడముతో తండ్రి ఆమె విద్యాభ్యాసాన్ని మాన్పించి తగిన వరుని కోసం వెతకడం ప్రారంభించాడు.

ఇంటి పనులలో సహాయము చేయమని తల్లి చెప్పినపుడు తన సేవ భగవంతునికే అర్పణమని వెంగమాంబ తిరస్కరించింది. అనేక మంది వరులు ఆమెను చూచి చాలా అందముగా ఉన్నదనో, చాలా తెలివైనదనో నెపములతో పెళ్లి చేసుకొనుటకు సమ్మతించలేదు. చివరకు ఇంజేటి వెంకటాచలప్ప వెంగమాంబను చూసి ముగ్ధుడై ప్రేమలో పడి ఆమెను వివాహమాడుటకు అంగీకరించాడు. తండ్రి వివాహం జరిపించాడు. వివాహానంతరము వెంకటాచలప్ప ఆమె భక్తి మౌఢ్యాన్ని వదిలించే ప్రయత్నం చేసాడు కానీ వెంగమాంబ అతనిని దగ్గరికి రానివ్వలేదు.

ఈమె తిరుమలలో ఆలయానికి ఉత్తరాన 15 కి.మీ. దూరాన దట్టమైన అడవులలో తుంబురు కోన వద్ద యోగాభ్యాసం చేస్తూ గడపినట్లు తెలుస్తున్నది. ఈమెకు వేంకటేశ్వరుడు కలలో కనిపిస్తూ ఉంటాడని అనేవారు. తిరుమలలో ఉత్తర వీధిలో ఉత్తర దిశలో ఉన్న వనంలో (ప్రస్తుతం ఉన్న ఒక పాఠశాలలో) ఈమె సమాధి ఇప్పటికీ ఉంది. ఈమె ప్రతిరాత్రి ఊరేగింపుగా తన ఇంటిముంగిటికి వచ్చే భోగ శ్రీనివాసమూర్తికి వెండి పళ్ళెంలో ముత్యాల హారతి ఇస్తూ ఉండేదట. ఇందుకోసం ఒక్కొక్కదినం నగిషీలు చెక్కబడిన వెండిపళ్ళెంలో ఒక్కొక్క దశావతార ఘట్టాన్ని సమర్పించేదట. ఈ విషయం సా.శ. 1890లో ఈస్ట్ ఇండియా కంపెనీవారు తయారు చేసిన కైంకర్య పట్టీ వలన తెలుస్తున్నది. ఈమె తన జీవితాంతం శ్రీవేంకటేశ్వరుణ్ణి ఆరాధించింది. చివరకు సా.శ.1817 ఈశ్వర సంవత్సరం శ్రావణ శుద్ధ నవమినాడు తరిగొండ వెంగమాంబ వేంకటేశ్వరస్వామిని స్మరిస్తూ సజీవ సమాధి చెందింది.

వెంగమాంబ రచనలన్నీ వేదాంతము, భక్తి ప్రధానమైనవే. ఈమె రచనలలో ముఖ్యమైనవి

1. వేంకటాచల మహాత్మ్యం, 2. అష్టాంగ యోగసారము (పద్య కావ్యాలు), 3. ద్విపద భాగవతము (ద్వాదశ స్కంధము), 4. రమా పరిణయము, 5. రాజయోగామృత సారము, 6. వాశిష్ఠ రామాయణము (ద్విపద కావ్యాలు),7. శ్రీకృష్ణ మంజరి, 8. తరిగొండ నృసింహ శత కము (శతకాలు), 9. నృసింహ విలాసము, 10. శివలీలా విలాసము, 11. బాలకృష్ణ నాటకము, 12. విష్ణు పారిజాతము, 13. రుక్మిణీ నాటకము, 14. గోపీ నాటకము, 15. చెంచు నాటకము, 16. ముక్తి కాంతా విలాసము, 17. జలక్రీడా విలాసము (యక్షగానాలు)  మరియు 18. తత్వ కీర్తనలు (తెలుగు వికీపీడియా నుండి)

శతక పరిచయం:

"తరికొండనృసింహ దయాపయోనిధీ" అనే మకుటంతో చంపకోత్పలమాల వృత్తములలో 103 పద్యములలో రచింపబడిన ఈశతకం భక్తిరస ప్రధానమైనది. దీనిలో రాజయోగసార్ది గ్రంధములలో వివరించబడిన శరీరయోగ ముద్రారహస్యములు తెలుపబడినవి. కొన్ని పద్యములులలో వ్యాకరణ ఛందో దోషములు కనిపిస్తున్నాయి.
ఇప్పుడు కొన్ని పద్యాలను చూద్దాము.

ఉ. శ్రీరఘురామ మీకృపను జెల్వముమీఱఁగ శ్రీగణేశునిన్
వారిజగర్భునిన్ భవుని వాణిని దుర్గను క్షేత్రపాలకున్
సారెకు సర్వదేవతల సత్కవిశూరుల నెల్ల భక్తి నిన్
గోరి భజింతునయ్య తరికొండనృసింహ దయాపయోనిధీ

చ. కరుణయులేక కొందఱు వికల్పకవిత్వ మటంచుఁ బల్కినన్
సరగున నీవు వారలకు సమ్మత్ఁ జెప్పి పరాకుసేయకే
పరువడితోను నీశతకపద్యములింక ధరిత్రిమీఁదటన్
గురుతుగ నిల్పవయ్య తరికొండనృసింహ దయాపయోనిధీ

ఏడవపద్యం నుండి 16 వ పద్యము వరకు దశావతారవర్ణన పద్యాలలో కొన్న్ని చూద్దాము.

చ. పరగఁగ దేవదానవులు వార్థిమధింపఁగఁబూనినంత మం
ఫరగిరి గ్రుంగఁగాఁ దెలిసి దానికిఁ గచ్ఛపరూప మెత్తియున్
సరసత మూపునన్నిలిపి సర్వజగంబులు మోచినాఁడవౌ
గుఱుతుగ నన్నుఁ బ్రోవు తరికొండనృసింహ దయాపయోనిధీ

చ. ఫెళఫెళ నుక్కుకంబన బిట్టుగఁ బుట్టి హిరణ్యకశ్యపున్
జెలువుగ గర్భగోళమును జించి సమంచిరరక్తధారలన్
గళగళఁ ద్రావి డింభకునిఁ గాఁచినదేవుఁడవంచుఁ జాలఁగాఁ
గొలిచితినయ్య నినుఁ దరికొండనృసింహ దయాపయోనిధీ

రాజయోగ రహస్యములను ఈకవియిత్రి చాలా చక్కని సరళమైన భాషలో వివరించారు.
కొన్ని చూద్దాం

చ. కొలఁకులమద్యమందు నొకకోమలియున్నది దానిలోపలన్
సలలితవహ్నిమండలము చంద్రదివాకరమండలంబులున్
అలవడ నాఱుచక్రముల కావల నందొక సారసంబులో
గులుకుచునుండు హంస దరికొండనృసింహ దయాపయోనిధీ

చ. అరయఁగఁ జేతనుండును గణాధిపుఁడున్ యమరాజసంగమున్
యిరవుగ బ్రహ్మవిష్ణులు మహేశుఁడు రుద్రుఁడు సర్వలోకముల్
సరసిజభవాండమునఁ జక్కగనుండును యాయజాండమున్
గురుతుగ నాత్మనుండుఁ దరికొండనృసింహ దయాపయోనిధీ

ఉ.కంఠములోనినాళ మతికాంతిగ వెల్గెడిరీతిఁ జూచి యా
కంఠముమీఁద రెండు బలుకాటుకకొండలమధ్యమందు శ్రీ
కంఠునిఁ గాంచి యంత లయకాలుని వేగమె ధిక్కరించి వై
కుంఠముఁ జేరవచ్చుఁ దరికొండనృసింహ దయాపయోనిధీ

రాజయోగ రహస్య వివరణమే కాక అనేక నీతి వైరాగ్య బోధనలు కూడా మనకు ఈశతకంలో కనిపిస్తాయి.
పరమ భక్తురాలు, బహు గ్రంధ రచయిత్రి రచించిన ఈశతకం సర్వదా పఠనీయం. మీరు చదవండి మీ మిత్రులచే చదివించండి.

***

No comments:

Post a Comment

Pages