ఈ దారి మనసైనది - 46 - అచ్చంగా తెలుగు

ఈ దారి మనసైనది - 46    

అంగులూరి అంజనీదేవి


    

        పాకాలకి వెళ్లగానే కారుని నేరుగా హాస్పిటల్ వైపు పోనిచ్చాడు అనురాగ్.

కారుని ఓ పక్కకి పార్క్ చేసి, దిగి హాస్పిటల్లోకి ప్రవేశించాడు. 

నేరుగా ఓ.పి. రూంలోకి వెళ్లాడు. 

అక్కడో క్షణం నిలబడి చుట్టూ చూశాడు. 

అక్కడున్న కుర్చీల నిండా పేషంట్లు కూర్చుని వున్నారు.

చిన్నా, పెద్దా, ముసలి, ముతక అనే తేడా లేకుండా, పేద, ధనిక అన్న వ్యత్యాసం లేకుండా అందరు అక్కడ కుర్చీలలో కూర్చుని తమ నెంబరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు లోపలకి వెళ్లటానికి సిద్ధంగా వున్నారు. వాళ్లలో ఎక్కువగా గర్భవతులు వున్నారు.

డా|| మన్విత అన్న నేమ్ బోర్డుకి కాస్త ఎడంగా ఒక పక్షి తన నోటితో మేతను తెచ్చి పిల్ల పక్షుల నోట్లో పెడ్తున్న సీనరీ వుంది. ఆ సీనరీ అద్భుతంగా అన్పించింది అనురాగ్ కి.

దాని పక్కన ఓ ఫొటో ప్రేమలో ప్రార్థన' అని వుంది ఆ ఫొటో ప్రేమలో వున్న ప్రార్థన పై నిలిచాయి.

“ఓ భగవంతుడా !”

ఇతరుల అనారోగ్య పరిస్థితుల పై నా వృత్తి, అభివృద్ది ఆధారపడి వుండడం నాకు చాలా విచారకరం... అయితే వారిని ఆరోగ్య వంతులుగా తీర్చిదిద్దే బృహత్కరమైన అవకాశాన్ని నాకు ప్రసాదించావు. ఇది నీవు నా పై వుంచిన బాధ్యతగా స్వీకరించాను.

ఈ బాధ్యతను పరిపూర్ణంగా నిర్వహించగల శక్తిని నాకు ప్రసాదించు.

మధ్యవర్తిగా నాకు నీవు ఈ బాధ్యతను అప్పగించినా అన్ని పరిస్థితులను చక్కదిద్దే ఆది దేవుడవు నీవే ... నీ పై నా విశ్వాసము ఇలాగే వుండునట్లు ఆశీర్వదించు. 

నా దగ్గరకు వచ్చే రోగులకు ఆయురారోగ్యాలు ప్రసాదించు.” అని వున్న ఆ ఫోటో ఫ్రేమ్ వైపు చూస్తూ అలాగే నిలబడ్డాడు.

అక్కడా గదిలో రాజు, బంటు తేడా లేదు. ఒకరిని చూడగానే లేచి తన సీటు ఇచ్చి నిలబడే మర్యాదలు వుండవు. ఎవరి బాధలు వాళ్లవి. ఎవరి ఆత్రుత వాళ్లది. 

కొన్ని హాస్పిటల్స్లో రిప్రజంటేటివ్లు, నర్సుల దయాదాక్షిణ్యాల మీద డాక్టర్ దగ్గరికి వెళ్లినట్లు అక్కడ కూడా కొద్ది సేపు వెయిట్ చేసి లోపలకి వెళ్తున్నారు.. 

రిప్రజంటేటివను లోపలకి పంపిన నర్స్ తలతిప్పి అక్కడ నిలబడి వున్న అనురాగ్ వైపు చూసింది.

వెంటనే అనురాగ్ ...

“డా|| ధీరజ్ రెడ్డిని కలవాలి... ఇదిగోండి నా విజిటింగ్ కార్డు...” అంటూ చేయి చాపి విజిటింగ్ కార్డు ఇవ్వబోయాడు.

ఆ మాత్రం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడకపోతే నర్సుల రెస్పాన్స్ ఏ విధంగా వుంటుందో హౌస్ సర్జన్ పిరియడ్లో దగ్గరుండి చూశాడు.

“ ఆ డాక్టరు గారు లేరు సర్! హైదరాబాదు వెళ్లారు. డా|| మన్వితా మేడమ్ గారున్నారు.” అంది వినయంగా

“ డా|| దీక్షిత లేరా?” అన్నాడు వెంటనే ... 

“లేరు ...” అంది. . 

దీక్షితను చూడాలని వుంది.

“మరి మన్విత ఒక్కతే ఇంత ఓ.పి.ని మెయిన్టెయిన్ చేస్తుందా? ఇంత డెడికేషన్ మన్వితలో ఎలా వచ్చింది?” అని మనసులో అనుకుంటూ ... దీక్షిత ఎందుకు రాలేదో అడుగుదామనుకునే లోపలే...

“డా|| మన్వితా మేడమ్ గారిని కలవాలంటే ఇంకా కాస్త టైం పస్తుంది. లోపలున్న పేషంటు బయటకి రాగానే రెండు అర్జంట్ కేసులు వెయిట్ చేస్తున్నాయి.” అని ఆ నర్స్ అంటుంటే ... | కోడలున్న గదిలోంచి బయట కొచ్చిన వర్ధనమ్మ ఓ.పి. రూమ్లో  వున్న అనురాగ్ని చూసింది.

“ఎప్పుడొచ్చావు అనురాగ్ ! బాగున్నావా ?” అంటూ అప్యాయంగా అనురాగ్ దగ్గరికి వచ్చి పలకరించింది. 

వర్ధనమ్మను చూడగానే సొంత ఇంట్లో వున్న ఫీలింగ్ కలిగినట్లు అమె ప్రశ్నలకి చిరునవ్వుతో సమాధానం చెప్పాడు.

“ రా ! అనురాగ్ ! ఇక్కడే నా కోడలు కూడా వుంది. చూద్దువు గాని...” అంటూ పక్కగదిలోకి తీసికెళ్లింది. .

ఆ గదిలోకి వెళ్లగానే కృష్ణవేణమ్మను చూసి షాక్ తిన్నాడు.

“కూర్చో అనురాగ్ !” అంటూ అక్కడున్న కుర్చీ పై చేతులు వేసి అతనికి దగ్గరగా జరిపింది వర్ధనమ్మ.

“ ఆంటికి ఏమైంది మామ్మా” అంటూ కృష్ణవేణమ్మనే చూస్తూ కుర్చీలో కూర్చున్నాడు.

పాకాల వచ్చాక మన్విత అభ్యున్నతి చూసి ఒకరకంగా షాకయితే ఇప్పుడు కృష్ణవేణిని చూసి ఇంకోరకంగా షాకయ్యాడు అనురాగ్.

“పెళ్లికి వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది అనురాగ్ ! అంతా మా వీధిలో వాళ్లే ... అందరి పరిస్థితి ఇంచుమించు ఇలాగే వుంది. ఒకరు చనిపోయారు. అడ్రైవర్దే తప్పులాట సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తూ ఇంతమందిని వికలాంగుల్ని చేశాడు. వాడు చావలేదు కాబట్టి అలాంటి వాళ్లను ఏ కోర్టులు, ఏ పోలిస్ స్టేషన్లు శిక్షిస్తాయో తెలియదుకాని... నా కోడలికైతే ఒక కాలు తీసి వేసి రాడ్ వేస్తారట ...” అంది బాధగా వర్ధనమ్మ.

కృష్ణవేణమ్మ కాలు వైపు చూశాడు

అప్పట్లో ఎప్పుడు చూసినా మన్విత మీద కేకలేస్తూ ... మన్విత కోసం వెళ్లే పిల్లల్ని సైతం భయపెడ్తూ “మా పిల్ల వెంట తిరుగుతూ, మా పిల్లను కూడా తిప్పుతారు. మీకు ఇల్లూ -వాకిలీ లేదా? వెళ్లండి ! వెళ్లండి ” అంటూ అరిచేది 'అమ్మో ! మన్విత వాళ్ల మమ్మీ అంటే మాకు భయం. ఇంట్లో ఆడన్విదు, ఎండలో ఆడనివ్వదు, వెన్నెల్లో ఆడనివ్వదు. కాళ్లకి, చేతులకి తాళ్లు కట్టుకొని కూర్చోవాలట ... ఏం తోచక ఒక రోజు వీడియో గేమ్స్ ఆడుతుంటే దాన్ని విరగొట్టేసింది. పైగా మన్వితను ఎప్పుడు చూసినా కొడుతుంది - తిడుతుంది. వాళ్ల మమ్మీ అంటే దానికి చచ్చేంత భయం ... సరదాగా తిరగాలన్న భయమే. ఆడుకోవాలన్నా భయం...” అని అనేవాళ్లు.

ఆ కృష్ణవేణమ్మ ఈ రోజు తను ఏనాడు ప్రేమగా చూసుకోని కూతురున్న హాస్పిటల్లో వుండి, ఆ కూతురందిస్తున్న వైద్య సేవలో కోలుకుంటుంటే జీవితం ఇంత చిన్నదా అన్పిస్తోంది అనురాగ్ కి.

అంతే కాక .. ఒకసారి మన్విత

“ కడుపులో బిడ్డ పెరగాల్సినతంత పెరిగాక పుట్టక తప్పదు కాబట్టి పుట్టాను కాని ... పుట్టాక ఇంత ప్రేమ రాహిత్యంతో పెరుగుతానని ముందు తెలిసుంటే నేను మా అమ్మకడుపులో వున్నప్పుడే నన్ను నేనుఆత్మహత్య చేసుకొని వుండే దాన్నేమో అనురాగ్...” అన్న మాటలు గుర్తొచ్చాయి. 

గుర్తు రావటమే కాదు... అలాంటి మన్వితకు ఈ ఎదుగుదల, ఈ మనుగడ ఒక్క రోజులో వచ్చింది కాదు. దాని వెనుక ఎంతో మానసిక సంఘర్షణ, గందరగోళం, ఆత్మ విశ్వాసం వున్నాయి... నిన్నటి గురించి ఆలోచించకుండా రేపటి గురించి మదన పడకుండా, ఏ యంత్రమూ పనిచేయనంత గొప్పగా పనిచేస్తున్నా అ సాధారణ వ్యక్తామె. దీన్ని బట్టి చూస్తుంటే ప్రేమతో తను అనుకున్న లక్ష్యాన్ని సాధించి, జీవితాన్ని ప్రేమించటం ఎలాగో మన్వితకి చేతనైనంతగా ఎవరికి చేతకాదేమో అనిపిస్తోంది అనురాగ్.. 

కృష్ణవేణమ్మ ఎప్పుడు కళ్లు విప్పిందో తెలియదు. అనురాగ్ని చూడగానే బోరున ఏడ్చింది.

" చూశావా అనురాగ్ ! నా పరిస్థితి ఎలా మారిపోయిందో ! నా అత్తగారి మీద, ఆడపడుచుల మీద, నా భర్త మిద నా కున్న కోపాన్ని నా కడుపున పుట్టిన మన్విత మిరాద తీర్చుకుంటూ, కొడుకు తప్ప కూతురు పనికిరాదని మన్వితను చిన్న చూపు చూసిన “పాపమే' నన్నిలా కష్టపెడ్తుందేమోననిపిస్తోంది.” అంటూ ఏడుపు గొంతుతో చెబుతున్న కృష్ణవేణి వైపు జాలిగా చూశాడు అనురాగ్.

“ ఏడవకండి ఆంటీ! మీకేం కాదు. యాక్సిడెంటలుగా జరిగేవన్నీ “మన పాపాలే అనుకొని బాధపడ్డే ఎలా? ఎన్నో జరుగుతుంటాయి. అవన్నీ దేవునికి తెలియకుండా జరిగేవికావు. అన్నీ ఆయనే చూసుకుంటాడు. బాధపడకండి!”అంటూ ఓదార్చాడు. ప్రశ్చాత్తాపమనే ముళ్ళు పొడుస్తోంది అనురాగ్ ! అంతే ! ఇంక వేరే రకమైన బాధలేం లేవు. ఎందుకంటే ఇప్పుడు నాకు నా కూతురు వుంది. ఖరీదైన మందులు వాడి నన్ను బ్రతికించింది. నా అత్తగారేమో నేను ఊహించని దయతో నాకు సేవలు చేస్తోంది. వీళ్ల అభిమానాన్ని, మానవత్వాన్ని తట్టుకోలేక పోతున్నాను... వీళ్లనుచూస్తుంటే కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్లనిపిస్తోంది...” అంటూ ఆగిందికృష్ణవేణి.

ఇంకా ఏం చెబుతుందోనని శ్రద్దగా చూస్తున్నాడు అనురాగ్.

ఈ ప్రేమలు ఆవిరైపోతున్నాయని, అనుబంధాలు అంతరించి పోతున్నాయని ఇప్పుడు ఎవరన్నా నేను ఒప్పుకోను ... నాకు ఇప్పుడు అన్ని విలువలు తెలుస్తున్నాయి. ఏది ప్రేమో, ఏది కాదో అర్థమవుతోంది. మానవ సంస్కారం మృగ్యమైపోతున్న ఈ రోజుల్లో నా కూతురు, నా అత్తలాంటివాళ్లు చాలా అవసరం ... నా కూతురు మూర్తీభవించిన సంస్కారంలా, కదులుతున్న మణిలా తిరుగుతుంటే నా దిష్టి తగిలేలా వుంది. ఇంతకన్నా తృప్తి, గౌరవం ఏ తల్లికైనా వుంటుందా?” అందికృష్ణవేణి.

ఆమెతో మాట్లాడుతూ అక్కడే కూర్చున్న అనురాగ్ కి దీక్షితను త్వరగా చూడాలని వుంది. తను వచ్చినట్లు కాల్ చెయ్యకుండా దీక్షితను సర్ప్రయిజ్ చెయ్యాలని కూడా వుంది.

" నా దొక్కటే కోరిక అనురాగ్! ”అంది ఏడ్వటం ఆగిపోయి, ముక్కుతుడుచుకుంటూ

" ఏమిటో చెప్పండి ఆంటీ!” అన్నాడు వినయంగా, మృదువుగా...

“ఇకడుండే పెద్ద డాక్టరు తెలుసుగా నీకు?” అంది.“ తెలుసు. డా|| ధీరజ్ రెడ్డి ...” అన్నాడు.

“ ఆ డాక్టరు వల్లనే నా కూతురు ఇన్ని మెట్లు ఎక్కగలిగింది. ఇంకా సంతోషించతగ్గ విషయం ఏమిటంటే వాళ్లిద్దరు ప్రేమించుకున్నారు. వాళ్ల ప్రేమగురించి నాకు చాలా కాలంగా తెలుసు. ఇంకా ఆలస్యం చెయ్యకుండా వాళ్లు పెళ్లి చేసుకోవాలన్నదేనా కోరిక... కానీ ఎందుకో మౌనంగా వున్నారు. ఆ డాక్టరేమో హైదరాబాద్లో ఓ హాస్పిటల్ పెట్టి ఎక్కువగా అటే వుంటున్నారు...” అంది కృష్ణవేణి.

కొత్త విషయాన్ని వింటున్నట్లు అనిపించినా ... విన్న విషయం మాత్రం అనురాగ్ కి సంతోషం కలిగించినట్లు అతని ముఖం వెలిగింది.

“తప్పకుండా ... మీ కోరిక నెరవేరుతుంది ఆంటీ ! మీరేం వర్రీ కాకండి !” అన్నాడు అనురాగ్. | హాయిగా ఫీలయింది కృష్ణవేణి. ఆమెకిప్పుడు ఓదార్పే కాదు, ఆనందం కూడా కావాలి... తాను అనుకున్నది జరిగితే ఎవరికైనా ఆనందంగా వుంటుంది. అలా జరిగితే బాగుండని చూసే చూపే-ఎదురు చూపు...

ఓ.పి. అయిపోవడంతో నేరుగా పై కెళ్లింది డా|| మన్విత. ఈవినింగ్ రౌండప్పుడు తప్ప మిగతా టైంలో ఆమె పేషంట్ల గదుల్లోకి వెళ్లదు. ఏదైనా అర్థంట్ అయితే మాత్రం ఓ.పి లో వున్నా కూడా వెళ్లి చూస్తుంది.

ఆ విషయం వర్ధనమ్మకు తెలుసు. అందుకే కోడలు దగ్గర కూర్చుని వున్న అనురాగ్ దగ్గరికి వెళ్లి మన్విత పైకి వెళ్లినట్లు చెప్పింది. 

వెంటనే దీక్షిత గుర్తొచ్చింది అనురాగ్ కి. ఇక ఎక్కువ సేపు ఆగలేక... తను మన్విత దగ్గర వున్నానని వెంటనే వచ్చి కలవమని చెబుదామని దీక్షితకి కాల్ చేశాడు. దీక్షిత సెల్ కి కాల్ వెళ్లలేదు. ఎప్పటిలాగే 'కూ' అంటూ కట్ అయింది.

ఇంకోసారి చేశాడు. అలాగే అయింది.

వర్థనమ్మతో కలిసి పైకెళ్లటానికి మెట్లెక్కుతూ మొబైల్ ని పాకెట్లో పెట్టుకుంటూ ...

మన్విత గదిలోకి అడుగుపెట్టాడు. 

అనురాగ్ని చూడగానే మన్విత షాక్ తిన్నది.

అనురాగ్ ఈ టైంలో ఇండియా రావటం ఏమిటి? దీక్షితకి పెళ్లి అయినట్లు తెలిసి వచ్చాడా? లేక క్యాజువల్గా వచ్చాడా? అసలు తను చూస్తున్నది అనురాగ్నేనా? అర్థం కాక అలాగే చూస్తోంది మన్విత.

“ ఏంటా చూపు మన్వితా ! నేను, అనురాగ్ని ...” అన్నాడు ఆమెనే చూస్తూ నవ్వుతూ ... 

అతని చూపు, నవ్వు చూస్తుంటే దీక్షితకి పెళ్లి అయినట్లు అతనికింకా తెలియలేదని తెలిసిపోయింది మన్వితకి.

“కూర్చోండి అనురాగ్? ఎప్పుడొచ్చారు? ఎలా వున్నారు?” అంది తను కూడా నవ్వుతూ మన్వితా ... 

అదే నవ్వుతో ఆమె ప్రశ్నలన్నిటికి సమాధానాలు చెబుతూ సోఫాలో రిలాక్స్గా కూర్చుని...

“మీ హాస్పిటల్లో ఓ.పి. చూస్తుంటే సిటిలో హాస్పిటల్స్ ని  మించి కన్పిస్తోంది. ఇక్కడ ఇంత బాగా ప్రాక్టీస్ నడుస్తుందని మొదట్లో నేను ఎక్స్ పెక్ట్ చెయ్యలేదు... బహూశా చుట్టు పక్కల పల్లెల వాళ్లంతా ఇటే వస్తున్నట్లున్నారు ...” అన్నాడు అనురాగ్.

“ అవును ! కానీ ... డా|| ధీరజ్ ఇక్కడ వుండట్లేదు అనురాగ్ !అయన లేక పోవటం వల్ల ఫ్యూచర్లో ఈ హాస్పిటల్ ఎఫెక్ట్ పడొచ్చు. ఇప్పటికే ఆయన లేని టైంలో కొన్ని క్రిటికల్ కేసుల్ని హైదరాబాదు, వరంగల్ పంపుతున్నాను. వాళ్లనలా పంపుతుంటే ... నా పొజిషన్ బాగలేక నేను పి.జి చెయ్యనందుకు బాధపడ్తున్నాను...” అంది మన్విత.

ఆమె ముఖంలోని బాధను చూడలేక...

“ ఆయన ఈ హాస్పిటల్ ని వాళ్ల తాతగారి ఆశయాలతో పెట్టి, ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారని విన్నాను...” అన్నాడు అనురాగ్.

“మీరు విన్నది కరక్టే ! ఆ ఉద్దేశంతోనే ఈ హాస్పిటలని నాకు అప్పజెప్పారు. అయన హైదరాబాదులో హాస్పిటల్ పెట్టారు. అది బాగా నడుస్తోంది...”

దీన్ని బట్టి చూస్తుంటే ... మెడిసిన్ చదివిన చాలా మంది మొదట్లో ఎలా వున్నా తర్వాత మాత్రం వ్యాపార దృక్పదంతో ఆలోచిస్తారని అర్థమవుతోంది. ప్రస్తుతం వీళ్లిద్దరి బిజినెస్ కాని, ఆలోచనలు కాని బాగున్నాయి... బహూశా పెళ్లయ్యాక ఈ హాస్పిటల్ ని ఎవరికైనా అప్పజెప్పి మన్విత కూడా హైదరాబాదు వెళ్తుందేమో... ఏది ఏమైనా కృష్ణవేణి ఆంటీ కోరిక త్వరగా నెరవేరబోతోంది. అని మనుసులో అనుకుంటూ ...

" దీక్షిత ఎలా వుంది మన్వితా ?బాగుందా? తన మొబైల్ ఎందుకో కాల్ వెళ్లటం లేదు ... ఈ మధ్యన చాలా సార్లు ట్రై చేశాను. ఇప్పుడు కూడా వెళ్లలేదు...” అన్నాడు.

మన్విత మాట్లాడలేదు.. ఆమె మాట్లాడకపోవటాన్ని చాలా క్యాజువల్గా తీసుకుంటూ...

" మమ్మీకి ఈ మధ్యన హార్ట్ స్ట్రోక్ వచ్చింది మన్వితా ! తెలియగానే బయలు దేరి వచ్చాను. ఇప్పుడు ఓ.కే. షి ఈజ్ ఆల్ రైట్.” అన్నాడు అనురాగ్.

మన్వితలో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేవు.

రోగుల్ని ప్రతి రోజు చూసి, చూసి రోగాలు రావటం, పోవటం అతి సహజం అన్నట్లుగా వుంది. 

కాకపోతే మందుల కంపెనీల వాళ్లు మందుల రేట్లు పెంచటం వల్ల సామాన్య మానవులకి రోగాలు తగ్గే అవకాశం తగ్గుతోంది. కల్తీ మందుల వల్ల, కల్తీ వైద్యం వల్ల ఎటొచ్చీ పేదవాళ్లే బలైపోతున్నారు. ప్రియబాంధవిలాంటి వాళ్లకి అలాంటి ఇబ్బందులేం వుండవు. ఖరీదైన హాస్పిటల్స్, ఖరీదైన మందులు, వాళ్లు పిలవగానే పలికే అధునిక వైద్యం దొరుకుతుంది. భయపడాల్సిందేమిలేదు.

కానీ ... ప్రియబాంధవి అంటీతో ఒకప్పుడు తనకున్న దగ్గరితనం గుర్తొచ్చి అలాంటి మంచి మనిషికి హార్ట్ ఎటాక్ రావటం “ఏమిటి అన్నట్లుగా బాధతో మనసుకి నొప్పి అన్పించింది మన్వితకి...

“ ఏమిటి మన్వితా ఆలోచిస్తున్నావ్?” అన్నాడు డా|| అనురాగ్.

“ ఏం లేదు అనురాగ్ ! ఆంటీ గురించి ... ఇప్పుడెలా వుంది?”అంది.

బాగుంది. మొన్నటి వరకు హైదరాబాదు 'ఉషాముళ్లపూడి' హాస్పిటల్లో వున్నది. నేనొచ్చాక నిన్ననే. వరంగల్ తీసుకొచ్చాం ...” అన్నాడు అనురాగ్.

మన్విత వింటోంది. 

మన్విత వైపు చూస్తూ...

“దీక్షిత మొబైల్ కి కాల్ వెళ్లటం లేదు. నేనొచ్చినట్లు చెప్పి వాళ్ల ఇంటికి ఎవరినైన మనిషిని పంపగలవా మన్వితా ! తను వచ్చాక తనతో కలిసి నేను వాళ్ల ఇంటికి వెళ్తాను ...” అన్నాడు అనురాగ్ నేరుగా వాళ్లఇంటికి వెళ్లాలంటే మొహమాట పడున్నవాడిలా .....

మన్విత మాట్లాడలేదు. 

దీక్షిత గురించి అనురాగ్కి చెప్పాలని లేదు మన్వితకి .

చెబితే అతనెంత డిస్టర్బ్ అవుతాడో ... కోలుకోటానికి ఎంత టైం పడుందో ఆమెకు తెలుసు. అసలా బాధ నుండి కోలుకోవటం కూడా అంత సులభం కాదని తెలుసు. అందుకే ఊరెళ్లిందని చెబితే నమ్మి ఎప్పటిలాగే అతను స్టేట్స్ వెళ్లి పోతాడని, ఆ తర్వాత రోటిన్లో పడి మరచిపోతాడనుకొంది.

ప్రస్తుతం తను ఒక డాక్టర్గా మనుషుల్నే కాదు... మనసుల్ని కూడా రక్షించాల్సిన అవసరం ఎంతైనా వుంది.

“ నీకు తెలియదా అనురాగ్! దీక్షితకి పెళై ఢిల్లీ వెళ్లింది.” అంది. టక్కున అక్కడే వున్న వర్ధనమ్మ ... ఏమిటో దీక్షిత అయినా అంత కార్డు ముక్క వెయ్యొచ్చుగా... స్టేట్స్ వెళ్లిన వాళ్లతో డబ్బు రిలేషన్ వుంటేనే గుర్తుంచుకుంటున్నారు. లేకుంటే వాళ్లలా ఫ్లైట్ ఎక్కగానే మరిచిపోతున్నారు అనుకొంది వర్ధనమ్మ మనసులో..

ఇది నిజమా అన్నట్లుగా షాకై మన్విత వైపు తిరిగాడు అనురాగ్.

మాటలు రాని దానిలా ... అతని కళ్లలోని భావాన్ని భరించలేక నేల వైపు చూడసాగింది. ఆమె కళ్ళెత్తి పైకి చూసే లోపలే అతనక్కడ నుండి లేచి చక చక కిందకి దిగాడు.

మన్విత తేరుకొని, బయటకొచ్చి కిందకి తొంగి చూసే లోపలే అతని కారు కదిలి మలుపు తిరిగింది. మెరుపులాంటి ఆ వేగానికి మన్విత కళ్లు తిరిగాయి.

ఇదేమి తెలియని వర్ధనమ్మ కోడలికి అన్నం పెట్టాలని, ఒక బాక్స్ లో పెట్టుకొని నెమ్మదిగా కిందకి దిగింది.

అనురాగ్ అలా వెళ్లి పోవటంతో మన్వితకి ఏం చేయాలో తోచలేదు. మనసు మనసులో లేదు.

అనురాగ్ కి వచ్చిన కష్టం మాటలతో తీరేది కాదు. 

డబ్బు చూపిస్తే తృప్తి పడి పారిపోయేది కాదు. 

అదొక ఆకలి. దావానలంలాంటి ఆకలి.

ఎంతో కష్టపడి వండుకున్న ఆహార పదార్థాన్ని తిందామని కూర్చునే లోపలే దాన్ని వేరెవరో లాక్కుని తింటుంటే ఆ ఆకలిని ఎలా భరించాలి? మళ్లీ సిద్దం చేసుకునేంతవరకు ఆ ఆకలి తట్టుకుంటుందా? తట్టుకో లేకనే కదా ఈ చావులు !

అంటే? దీక్షిత తనకి దక్కలేదన్న బాధలో అనురాగ్ ఏమైనా చేసుకుంటాడా?

ఆశ్చర్యపోనవసరం లేదు. 

ఆ బాధ అలాంటిది. ఎంత తలవిదిలించి మరిచిపోదామన్న ...వున్న చోట వుండనివ్వదు.

ఉదయంచే సూర్యునిలా, ఉదయాన్నే పలకరించే చిరునవ్వులా, ఆత్మీయమైన చేతి స్పర్శలా గుండెలోతుల్ని తడూతూనే వుంటుంది.

గుర్తొచ్చినప్పుడు తృప్తి పడటం, భావావేశం కలిగినప్పుడు కలవరించటం, భావోద్వేగం కలిగినప్పుడు విలవిల్లాడటం... మాట్లాడక పోయినా, కన్పించకపోయినా పాదాలకి కళ్ళు వచ్చినట్లు వెతుక్కోవటం...

అలా ఇన్నాళ్ళ-కోపంలో, ఆనందంలో, దు:ఖంలో, ఏకాంతంలో కలిసిపోయిన వాళ్లు ఇక మన వాళ్లు కాదని తెలిశాక ఆ అనుభూతుల్ని, భావాలని, మనసు తలుపుల చాటున ఓ చిలకొయ్యకి తగిలించి... ఏమో కానట్టు మిగిలి పోవాలంటే సాధ్యం కాదు.

అనురాగ్ ని తనిప్పుడెలా కాపాడాలి? 

మన్విత మనసంతా మహాసముద్రం అయింది.

జీవితమంటే ... సుఖం, దు:ఖం, ప్రేమ, అనురాగం, క్రోదం, శాంతం, ఆరోగ్యం, అనారోగ్యం, ధనం, దరిద్రం, ఆపదలు ... వీటి కలయికే జీవితం. వీటిల్లో ఏదో ఒకటే జీవితం అనుకుంటే ఎలా ?

ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని ఓడించి జీవితంలో గెలవాలి... జీవించటం కానీ, జీవితాన్ని ప్రేమించటం కాని, కొన్ని సందర్భాల్లో ఎవరూ ఎవరికి నేర్పరు. ఎవరికి వాళ్ళే నేర్చుకోవాలి.

అందుకే భగవద్గీతలో .... ప్రతి వ్యక్తిని తన ధర్మాన్ని నిర్వర్తించి ఫలితం కై నిశ్చింతగా వుండమంటారు.

కానీ ... ప్రతి చోట ‘ఫలితానికే ప్రాధాన్యత ఇస్తూ అశించింది, ప్రేమించింది దొరకకపోతే క్రుంగిపోతుంటారు ప్రేమ' పేరుతో మానసికంగా కుమిలి కృశించి పోతుంటారు.

కాళిదాసు 'కుమార సంభవం' లో ఒకచోట

" వికారా హౌతౌ నతి విక్రయిస్తే ”

యేషాంన చేతాంసి తన ఏవధీరా : అని అంటాడు.

అంటే వికారాన్ని పెంపొందించే కారణాలు ఎన్ని వున్నా ... వాటి మధ్య ఎవరు వికారాన్ని పొందరో వారే ధీరలు అని.

అనురాగ్ కి ఇప్పుడు చాలా ధైర్యం కావాలి. మనోనిబ్బరం కావాలి. మనో వికారాన్ని జయించే ఆత్మ స్థయిర్యం కావాలి.

కోడలకి అన్నం తినిపించి పైకి వచ్చింది వర్థనమ్మ 

నానమ్మను చూడగానే .

“నానమ్మా ! నేను వరంగల్ వెళ్తున్నా ... ప్రియాబాంధవి ఆంటీకి ఆరోగ్యం బాగలేదని అనురాగ్ చెప్పాడు కదా ! వెళ్లి చూసి వస్తాను.” అంది మన్విత.

" మరి హాస్పిటల్ ఎవరు చూస్తారు ?” అంది వర్ధనమ్మ

“డా|| ధీరజ్ రెడ్డి ఇంకో గంటలో హైదరాబాదు నుండి వస్తున్నారు. కాల్ చేశారు. నేవెళ్లోస్తా ... జాగ్రత్త ...” అంటూ చక, చక మెట్లు దిగింది మన్విత.

అంతలో ... అమె మొబైల్ కి కాల్ రావడంతో - స్క్రీన్ మీద పేరు చూసి వెంటనే ఆన్ చేసింది.

" హలో చెప్పు సంజనా !” అంది మన్విత.

“ నీతో మాట్లాడాలి మన్వితా ? ఎక్కడున్నావ్?” అంది సంజన. 

“వరంగల్ వెళ్తున్నా ... ' వే' లో వున్నా ... అంది మన్విత. 

“వరంగల్ దేనికి? ” అంది సంజన

“డా|| అనురాగ్ వాళ్ల మమ్మీకి ‘హార్ట్ అటాక్ వచ్చిందట. అది తెలిసి స్టేట్స్ నుండి అనురాగ్ వచ్చాడు. నేను అంటీని చూడటానికి వెళ్తున్నా...” అంది మన్విత..

సంజన మాట్లాడకుండా మౌనంగా వుంది. 

“మాట్లాడు సంజనా! ఆగిపోయావేం?” అంది మన్విత.

“ అక్కడ కొచ్చాక అన్ని విషయాలు నీతో మాట్లాడతాను. ఫోన్లో వీలుకాదు ...” అంటూ కాల్ కట్ చేసింది సంజన.

“దీని బొంద ఏం మాట్లాడుతుంది నాతో ... ఉస్మానియాలో చేస్తున్నా ఆ పి.జి మానేసి నా దగ్గర కొచ్చి కూర్చుని ఓ.పి. చూస్తానని మాట్లాడదు కదా!” అని తన జోకుకి తనే నవ్వుకుంటూ ...

బస్ దిగి ఆటో ఎక్కింది మన్విత..

ఆటో దిగి, అటో అతనికి డబ్బులిచ్చి ... గేటు తీసుకొని, లోపలకి వెళ్లింది. అక్కడ అంత పెద్ద ఇంట్లో ...హాలు కాని, కిచెన్ కాని, మిగతా రూములు కాని నిర్మానుష్యంగా అన్పిస్తున్నాయి. చాలామంది ఇళ్లు ఇలాగే అన్పిస్తాయి. .

ఒక ప్రియబాంధవి రూంలో మాత్రం ... ఫ్యాన్ గాలికి కర్టన్ కదులుతూ మనిషి వున్నట్లు సైగ చేసింది.

నేరుగా లోపలకి వెళ్లి ప్రియబాంధవిని నవ్వుతూ పలకరించింది. మన్విత. పాలనురగలాంటి తెల్లని బెడ్ మధ్యలో రెండు దిండ్ల సపోర్ట్తో వెనక్కి వాలి కూర్చుని ... వాల్మీకి రామాయణం పుస్తకంలోకి చూస్తున్న ప్రియబాంధవి తల తిప్పి మన్వితను చూసింది.

మన్వితను చూడగానే ప్రేమారా ఆహ్వానిస్తున్నట్లు కనురెప్పల్ని కదలించి ...

“కూర్చో మన్వితా !” అంది ప్రియబాంధవి. కూర్చుంది మన్విత.

ప్రియబాంధవికి మన్విత పట్ల ఇప్పుడెలాంటి వ్యతిరేకమైన భావం కాని, భయంకాని లేవు. అనురాగ్ ప్రేమకోసం వచ్చిందేమోనన్న అనుమానం కూడా లేదు.

కారణం మన్వితను డా|| ధీరజ్ ప్రేమిస్తున్నాడని, అందుకే అమెను చేరదీశాడని లోక ప్రచారం ... అది ఆనోటా, ఈనోటా పాకి ప్రియబాంధవి చెవిని సోకింది.

మన్విత ప్రక్కకి తప్పుకుంటే దీక్షిత తన కోడలై పోతుందని అనుకొంది. అలా అని మన్విత అంటే చిన్న చూపేమిలేదు. ఆమె దగ్గర మన్వితకి వుండే మర్యాద మన్వితకి వుంది.

“ ధీరజారెడ్డి, మీ నానమ్మ బావున్నారా ? ” అంటూ కుశల ప్రశ్నలు వేసింది ప్రియ బాంధవి.

“బావున్నారు ఆంటీ ! మీ ఆరోగ్యం ఎలా వుంది?” అంటూ అభిమానంగా చూసింది మన్విత.

" ఏ టైంలో ఏమో అన్నట్లుగా భయంగా వుంది మన్వితా!” అంది తన కొచ్చిన స్ట్రోక్ ని గుర్తు చేసుకుంటూ ప్రియబాంధవి. అప్పటికప్పుడే ఆమె ముఖంలో దిగులు ప్రవేశించటం గమనించింది మన్విత.

“అలాంటి భయాలేమి పెట్టుకోకండి ఆంటీ ! ఇలాంటి గొప్ప, గొప్ప పుస్తకాలను చదువుతున్నారు. ఇంకా మీకు భయమేంటి?” అంది నవ్వుతూ ఆమె భయాన్ని తేలిగ్గా తీసేస్తూ మన్విత.

వెంటనే పుస్తకం వైపు చూసింది ప్రియబాంధవి.

“ ఇది నిజంగా గొప్ప పుస్తకమే మన్వితా ! ఇందులో సకల సుగుణాభిరాముడైన ఆ శ్రీరామచంద్రుని పేరు వినగానే శత్రువుల గుండెలు భయంతో వక్కలవుతాయి. అయన పాలనలో ధర్మం నాలుగు పాదాలమీద నడిచింది. అంతే కాక... అన్న అడుగు జాడలలో తమ్ములు ఎలా నడవాలో, తమ్ములపై ఎంతటి ప్రేమానురాగాలు అనకువ వుంటాయో, పితృవాక్యాన్ని ఎలా పాలించాలో, పరాక్రమాన్ని ఎవరితో, ఎక్కడ, ఏ విధంగా చూపించాలో, భార్యాభర్తలు ఎలా వుండాలో, నమ్మిన బంటు ఎలా వుంటాడో, స్నేహధర్మాన్ని ఎలా నిర్వర్తించాలో, సకల ఐశ్వర్యాలు, సమస్త సదుణాలు వున్న ఒక మహాపరాక్రమశాలిని, అదిషడ్వర్గాలు ఎలా అణచివేస్తాయో చెప్పిన మనోవైజ్ఞానిక శాస్త్రం ... ఈ వాల్మీకి రామాయణం...” అంటూ తన్మయత్వంతో, భక్తి భావంతో చెప్పింది ప్రియబాంధవి.

ఆమెను ఏ మాత్రం డిస్టర్బ్ చెయ్యకుండా విన్నది మన్విత. 

ఆమె చెప్పేది వింటున్నా... మధ్యలో అనురాగ్ గుర్తిస్తున్నాడు. 

వెంటనే అనురాగిని చూడాలని వుంది మన్వితకి... 

ఎందుకు చూడాలనివుందో ఆమెకే అర్థంకానిస్థితి అది. 

అనురాగ్ గురించి ప్రియబాంధవిని అడిగింది మన్విత.

అనురాగ్ పేరు వినగానే ప్రియబాంధవి ముఖంలో మార్పు కన్పించింది.

" అనురాగ్ పాకాల వెళ్లి వచ్చినప్పటి నుండి అదోలా వున్నాడు మన్వితా ! ఆ గదిలోంచి బయటకి రావటం లేదు. ఏం జరిగిందో తెలియదు. నేను కూడా అడగలేదు. ఎందుకంటే .....” అంటూ ఆగి పోయింది ఆలోచనగా...

ఏం చెబుతుందోనని ఎదురు చూస్తోంది మన్విత. 

మన్వితకి అనురాగ్ విషయం టెన్షన్ గా వుంది.

“అనురాగ్ చిన్న పిల్లాడు కాదుగా ... అన్నం కలిపి, ముద్దలు పెట్టి, నిద్రపోయేదాక పక్కనే కూర్చుని వీలైతే ఓ మంచి కథో, అలోచనో చెప్పి వాడి మనసులో మాట కనుక్కోటానికి ...” అంది నిష్ఠూరంగా, తన కొడుకు తనతో ఏం చెప్పటం లేదన్న బాధను లోలోన దాచుకుంటూ...

దీక్షిత అంటే ప్రియబాంధవికి ప్రాణమని తెలుసు మన్వితకి, కోడలు స్థానంలో దీక్షితనే వూహించుకొందామె.

ఒక్కోసారి వాస్తవం కన్నా ఊహనే మనిషికి వూరట కల్గిస్తుంది. అమెను ఆ వూహలోనే వుండనీ ... ఇప్పుడీ చేదు వార్త విన్పిస్తే తట్టుకోలేక మళ్లీ స్ట్రోక్ రావొచ్చు. ప్రస్తుతం అమె ఆరోగ్యం గురించి కూడా అలోచించటం తన బాధ్యత అనుకొంది మన్విత.

“ చెప్పు మన్వితా ? అక్కడేమైనా జరిగిందా?” అంది. ఆందోళనగా ...

మన్వితకి తెలియకుండా అక్కడేం జరగదని అమె నమ్మకం. ఎందుకంటే దీక్షిత , మన్విత ఒకే హాస్పిటల్లో వుంటారు కాబట్టి ...

“ అక్కడేం జరగలేదాంటీ ! ఇంత సేపు మేము పాకాల సరస్సు దగ్గరికి వెళ్లాం... అక్కడంతా బాగా తిరిగాం. పచ్చని చెట్లు, చుట్టూ గుట్టలు, మధ్యలో నీటితో ప్రకృతినంతా తన ఒడిలో నింపుకున్నట్లు అకడ ఎంతసేపు తిరిగిన ఇంకా తిరగాలనిపించి, ఎక్కువ సేపు అక్కడే గడిపాం ...” అంది మన్విత ఏదో ఒకటి చెప్పి ఆమెను సమాదాన పరచాలన్న ఉద్దేశంతో ....

“ అంత బాగుంటుందా అక్కడ? ” అంది ఆసక్తిగా ముందుకి వంగి ప్రియబాంధవి.

“ అవు నాంటీ ! 1218 సంవత్సరంలో కాకతీయ రాజు గణపతి దేవుడు దాన్ని నిర్మించిన నాటి నుండి దినదినాభివృద్ధి చెందుతూ ప్రకృతి అందాలతో గొప్పగా ఆకర్షిస్తోంది. 3500 ఎకరాల అటవీ ప్రాంతమైన అక్కడ ఎన్నో సుగంద ఔషద లక్షణాలు గల మొక్కలున్నాయి... ఇతర రాష్ట్రాల నుండి ప్రతి వేసవిలో ఆయుర్వేద నిపుణులు వచ్చి మొక్కలుతీసికెళ్తారు. అంతేకాక ... ఆ పరిసర అటవీ ప్రాంతంలో రకరకాల వన్య ప్రాణులు రక్షణ పొందుతున్నాయి. అక్కడికి కొంతమంది ప్రతి నిధులు, విదేశీయులుతో పాటు వివిధ రాష్ట్రాలకి చెందిన వేలాదిమంది పర్యాటకులు వచ్చి ఆ ప్రాంతంలోని దృశ్యాలను తమ కెమెరాల్లో అందిస్తుంటారు. అలాగే పాకాలమిద వున్న మమకారంతో అనురాగ్ ఒక్కటి కూడా మిస్ కాకుండా తన కెమెరాలో బందించుకున్నాడు.” అంటూ పాకాల సరస్సు హిస్టరీ చెప్పి.... 

అనురాగ్ ఎందుకలా వున్నాడో “నిజం' తెలియకుండా చేసింది మన్విత.

“ అవునా !! ” అన్నట్లు శ్రద్ధగా విన్నది ప్రియబాంధవి.

“బహూశా అనురాగ్ అలిసిపోయివుంటాడు ఆంటీ ! నేను వెళ్లి కలుస్తాను. మీరు రెస్ట్ తీసుకోండి !” అంటూ ఆ గదిలోంచి బయటకి నడిచి ... మెట్లక్కి పైనున్న అనురాగ్ గది వైపు వెళ్లి తలుపు తట్టింది.

తలుపు తీసి ఎదురుగా వున్న మన్వితను చూసి షాక్ తిన్నాడు అనురాగ్..

ఎందుకొచ్చింది మన్విత?

“ అంత సడన్ గా వచ్చేస్తే నేనేమనుకోవాలి అనురాగ్ ! ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఆ తొందరలో నువ్వేమైపోతావోనని వెంటనే బయలు దేరి వచ్చాను.” అంటూ తన మనసులో ఎంత కంగారు పడిందో పైప్తి వ్యక్తం చేస్తూ, అతన్ని దాటుకుంటూ వెళ్లి, లోపల కుర్చీలో కూర్చుంది..

ఆమె చొరవ, కాలుమీద కాలు వేసుకొని కూర్చున్న తీరు నేను అన్నిటల్లో అధికురాలిని, ఆత్మవిశ్వాసమే నా ఆయుధం అన్నట్లుంది.

ఆమెకి ఎదురుగా కూర్చున్నాడు అనురాగ్. 

ఆమె మాట్లాడుతున్నా పరద్యానంగా వున్నాడు...

“ఇలా గదిలో ఒంటరిగా కూర్చోవటం, పలకరిస్తున్నా స్పందించ కుండా వుండటం, జీవితం శూన్యమైనట్లు భావించటం, ఎవరికి రానికష్టం నీకే వచ్చినట్లు ఏమిటీ వాతావరణం? మనసు గాయపడ్డ వాళ్లు, జీవితంలో దెబ్బతిన్నవాళ్లు ఇలాగే వుంటున్నారా?” అంది మన్విత.

“దీక్షిత నాకు చెప్పకుండా పెళ్లి చేసుకోవటం నీకు న్యాయంగా అన్పించిందా?” అని మాత్రం అన్నాడు అనురాగ్.

అప్పుడు చూసింది అతని కళ్లలోకి... 

అతని కళ్లు బాగా ఏడ్చినట్లు ఎర్రగా వున్నాయి. 

ఆశ్చర్యపోతూ ఒక్క క్షణం అతని కళ్లలోకి చూసింది.

అనురాగ్ ఏడ్చాడా ! ఇది నిజమా ! అనురాగ్ కూడా ఏడుస్తాడా ? దేని కోసం ఏడ్చాడు? ప్రేమ కోసమేగా ? ప్రేమ అనే ఆయుధం ఆడా, మగా తేడా లేకుండా ఏడిపిస్తుందా? బాధిస్తుందా? ఆ బాధముందు ఎవరైనా చిన్న వాళ్లేనా ?  

సడన్ గా  అర చేతుల్లో ముఖాన్ని దాచుకొని, కదిలి, కదిలి ఏడవటం మొదలు పెట్టాడు అనురాగ్.

ఆ ఏడుపు చూస్తుంటే మరింత నిశ్చేష్టయై అలాగే చూస్తోంది మన్విత.

ఆ ఏడుపు మెల్లగా కదిలే మందాకినిలా లేదు. 

ఉదృతంగా ఉరికే సెలయేరులా వుంది. 

అది కడలి ప్రవాహంలా మారింది. 

మన్విత కూర్చున్న చోటు నుండి ఒక్క ఇంచైనా కదలలేదు. 

అలాగే కూర్చుని అనురాగిని చూస్తోంది.

పోటెత్తిని వరదగోదారికి - అనురాగ్ కి పెద్ద తేడా ఏం కన్పించలేదు.

“బాధ పడ్తున్నావా అనురాగ్?” అంది మెల్లగా మన్విత 

అతను మాట్లాడ లేదు.

బాధను దాచుకోలేని పసి పిల్లాడిలా అతని భుజాలు, వీపు బలమైనా గాలికి కదిలే చెట్టు మొదలులా కదులుతున్నాయి.

Page 190-205

మనసులో ఏర్పడ్డ యుగుండం తీరం దాటి, తుఫానుగా మారి కుండపోత వర్షం కురిసినట్లు అతని మనసు బోరున ఏడుస్తోంది

“మగవాడివి నువ్వే ఇంత బాధ పడితే దీక్షిత ఇంకెంత బాధ పడాలి?”

“బాధ వుంటే ఇలా చేస్తుందా?” అన్నాడు తలెత్తి సూటిగా మన్వితనే చూస్తూ ....

" బాధపడే మనసు నీ ఒక్కడికే వుందనుకోకు అనురాగ్! తను కూడా బాధ పడింది! కానీ ...ఈ పెళ్లి నిన్ను మోసం చెయ్యాలనో, నువ్వుంటే ప్రేమ లేకనో, నిన్ను మించిన వాడు దొరకడం వల్లనో చేసుకోలేదు. పరిస్థితులకి తలవంచి, తప్పని పరిస్థితులు ఎదురై నిన్ను వదులు కొంది.” అంది మన్విత.

“ ఏమిటా పరిస్థితులు?” అడిగాడు వెంటనే. 

జరిగింది మొత్తం చెప్పింది మన్విత.

మాటలతో వ్యక్తం చెయ్యలేని బాధ అతని ముఖంలో కన్పించింది.

“ప్రతి ఒక్కరు అంతే అనురాగ్ ! కావాలని ఎవరూ దేన్ని వదులుకోరు. ముఖ్యంగా తప్పదనుకుంటేనే ప్రేమను వదులు కుంటారు. నీకు తెలుసో లేదో ఒకరిని ఇష్టపడి వేరొకర్ని పెళ్లిళ్లు చేసుకునే అమ్మాయిలు కాని, అబ్బాయిలు కాని కోకొల్లలుగా వున్నారంటే దానికి కారణాలు అంత పెద్దవేం కాదు. అతి చిన్నవి, అతి సున్నితమైనవే వుంటాయి. అందుకే ఒకరి కోసం ఒకరు అంతంత టైం వేస్ట్ చేసుకొని, అలోచనలను, భావాలను షేర్ చేసుకొని ఈ మనిషి నా మనిషి అన్న ఫీలింగ్ ని పెంచుకొని కూడా చివరకి ఏమి కానట్లు విడిపోతున్నారు. కానీ ... అవే జీవితాలను ఒక్కోసారి ఎక్కువగా డిస్టర్బ్ చేస్తాయి ...” అంది నెమ్మదిగా జ్ఞానిలా మన్విత.

“ కానీ ... దీక్షితను నేనెలా మరిచిపోవాలి ?” అన్నాడు.

" మరిచిపోవటం అంత కష్టమా ?నిన్ను నేను మరచిపోలేదా?” అంది.

వూహించని ఆ మాటలకి దిమ్మతిరిగింది అనురాగ్ కి .... 

సలసల కాగుతున్న నూనె వచ్చి ఒంటి మీద పడ్డట్లు ఫీలయ్యాడు. వెంటనే తేరుకొని...

“ దీన్ని బట్టి చూస్తుంటే లైఫ్ ని డిస్టర్బ్ చేసుకోవాలని ఎవరికీ వుండదని తెలిసి పోయింది ... దీక్షిత లాగే నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు మన్వితా? ” అన్నాడు.

అంత బాధలో కూడా అతను తన బాధను పక్క అడుగుతుంటే నవ్వొచ్చింది మన్వితకి.

మన్విత నవ్వుతుంటే ...

" నవ్వకు మన్వితా ! ఇప్పుడు నేను అనుభవిస్తున్న బాధలో ఒకప్పుడు నువ్వు పడిన బాధకన్పిస్తోంది. ఇంత బాధను నువ్వెలా తట్టుకున్నావు?” అన్నాడు.

" నువ్వు కూడా తట్టుకుంటావు... నీలో వుండే ఎనర్జీకి ఈ ప్రేమ గోల్ కాకూడదు ... బాధలో జీవించటం మరిచిపోయి ...మరోగోల్ ని సృష్టించుకో... ఆ గోల్  ని అచీవ్ చేయటానికి ఫోకస్ద్ గా పని చెయ్యి. అప్పుడు స్టేట్స్ లో నీకు కొత్త స్నేహితులు, కొత్త అభిరుచులు పెరుగుతాయి. ముఖ్యంగా ఈ వయసులో విరహం వుండకూడదు. మనలో వున్న ఎనర్జీనంతా ఆ విరహంతో వేస్ట్ చేసుకోకూడదు. ఏది సాధించాలన్నా ఎనర్జీ అవసరం. కుమిలి పోతూ, కుళ్లి పోతూ మేధస్సును నాశనం చేసుకోకూడదు. ప్రేమ, క్షమ ఎంతో శక్తివంతమైనవి అనురాగ్! అని ఎప్పుడూ మనతో వుండాలి...” అంది మన్విత.

అనురాగ్ మాట్లాడలేదు..


No comments:

Post a Comment

Pages