చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 13 - అచ్చంగా తెలుగు

చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 13

Share This

 చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల)  - 13

అనువాద కర్త : గొర్తి వేంకట సోమనాధ శాస్త్రి(సోమసుధ) 

ఆంగ్ల మూలం :  The Moonstone Castle Mystery

నవలా రచయిత : Carolyn Keene

 


(జోనీ హోర్టన్ గురించి ముగ్గురు అమ్మాయిలు అడిగే ప్రశ్నలకు న్యాయవాది కుపితుడవుతాడు.  మరణించిన హోర్టన్ మనుమరాలు న్యూయార్క్ లో ఉన్నట్లుగా ఒక పత్రంలో ఉందని, దానిని బట్టే తాను హోర్టన్ వారసురాలిగా ఆస్తిని ఆ అమ్మాయికి అప్పగించినట్లు చెబుతాడు అతను.  తాను తప్పుడు వ్యక్తికి ఆస్తిని అప్పచెప్పినట్లుగా అనిపించి న్యాయవాది కలవరపడతాడు.  నాన్సీ యింటికి ఫోను చేసి, తాము సేకరించిన సమాచారాన్ని అందజేస్తుంది.  తరువాత ....)


నాన్సీ ఆమెకు గుడ్ బై చెప్పగానే, బెస్ ఆమెను సమీపించి  తానొక సలహా యివ్వదలచుకొన్నట్లు చెప్పింది. "బోవెన్ దంపతులకు ఫోను చేసి, జరిగిన కథను  చెప్పాలని నీకు అనిపించటం లేదా?" 


నాన్సీ అడ్డంగా తలూపింది.  "నేను వాళ్ళతో మాట్లాడుతాను.  కానీ ‌మనకు తెలిసిన ‌విషయాన్ని వాళ్ళకు చెప్పను.  వాళ్ళు మోసగాళ్ళు అయ్యే అవకాశం ఉంది.  ఇన్ని ఏళ్ళుగా  వాళ్ళు ఆడిన ఆటేమిటో ఊహించలేను కానీ దేన్నీ పూర్తిగా విశ్వసించవద్దని నాన్న చెబుతుంటారు.  వాళ్ళకి ఈ కేసులో ఏవైనా ‌వివరాలు చెప్పే ముందు మనం దీనిలోని అసలు ‌నిజాన్ని తెలుసుకోవలసి ఉంటుంది.  కానీ ‌వాళ్ళని దీనిపై ‌ఒక ప్రశ్న కూడా అడగదలుచుకోలేదు."


న్యూయార్క్ లో ఉన్న ఆ దంపతులకు నాన్సీ ఫోను చేసింది.  వారికి చెప్పటానికి తన దగ్గర విషయాలేమీ లేవని, అయితే వాళ్ళను మిషనరీలుగా‌ ఆఫ్రికాకు పంపిన సంస్థ ద్వారా తప్పిపోయిన తమ మనుమరాలికి చెందిన క్లూ ఏమన్నా తెలుసుకున్నారేమో కనుక్కొందుకు తాను ఫోను చేసినట్లు చెప్పింది. వారు సేకరించిన సమాచారాన్ని ఖచ్చితంగా మిసెస్ ‌హోర్టన్ కు తెలియజేసి ఉంటారు. "ఆ సమూహం ‌పేరేమిటి?" ఆమె అడిగింది.


ఆ సంస్థ పేరు ఆఫ్రికన్ బ్రదర్‌హుడ్ సొసైటీ అని బోవెన్ చెప్పాడు.  "దురదృష్టవశాత్తూ, కొన్నేళ్ళుగా ఆ‌ సంస్థ ఉనికి లేకుండా పోయింది.  అందువల్ల వారితో ఎలాంటి సంబంధాలు లేవు."


పదిహేనేళ్ళ క్రితం ఆ సంస్థలో పనిచేసిన ఎవరినైనా ప్రస్తుతం కనిపెట్టడం దుస్సాధ్యమని గ్రహించి, "ఇది చాలా దురదృష్టం" అని నాన్సీ అంది.  "సరె! ప్రస్తుతానికి నేను ఉంటాను. విలువైన సమాచారమేమన్నా తెలిస్తే, నేను మీకు ఫోను చేస్తాను."


ఆమె మిగిలిన అమ్మాయిలను కలిసాక, వారు ఈ కేసును ప్రతి కోణం నుంచి చర్చించారు.  నాన్సీ దీర్ఘంగా నిట్టూర్చింది.  "ప్రస్తుతం ‌నేను చేయవలసిన ‌ఉత్తమమైన పని కొంతకాలం హోర్టన్ కేసును‌ నా బుర్ర నుంచి దులిపేయటమే!"


బెస్‌ యికిలించింది.  "అదెలా‌ చేయాలని అనుకొంటున్నావు?"


  "ఈత కొట్టి.  మనం తిరిగి ఆ కోట‌ దగ్గరకు ‌వెడదామా? దాని లోపల ఎవరైనా అక్రమంగా నివసిస్తున్నారేమో చూడాలనుకొంటున్నాను.  అలా ఎవరైనా ఉంటే మన కేసుకి ఎలా ఉపయోగపడతాడో చూడాలి."


"పదండి పోదాం" చెప్పింది జార్జ్.


బెస్ మాట్లాడలేదు. చివరకు ‌ఆమె‌ చిన్నగా తన అభిప్రాయం చెప్పింది.  "నాన్సీ! నువ్వు ఫోను మాట్లాడుతున్నప్పుడు, ఈ మోటెల్లోని ఒక ఊహా సుందరుడైన యువకుడు తనతో టెన్నిస్ ఆడమని కోరాడు"  అంటూ ఆమె దూరంగా ఉన్న ఆటస్థలం వైపు చూసింది.  "కానీ నేను మీతో వస్తాను" అని జోడించింది.


నాన్సీ, జార్జ్ పగలబడి నవ్వారు.  "భలే సరదాగా చెబుతున్నావే!" అంది జార్జ్.  "నువ్వు ఆ అబ్బాయితో కోర్టులో దిగకుండా ఉండలేవుగా!"


"అదేమీ తప్పుడు ఆలోచన కాదని నీకు తెలుసు" నాన్సీ చెప్పింది.  "లాంగ్ వ్యూ దగ్గర ‌బెస్ గూఢచారిగా‌ వ్యవహరించకపోతే, గూఢచర్యాన్ని‌ అభిలషించే వారిని‌ మోసగించినట్లే అవుతుంది.  బెస్! ముందుకెళ్ళు.‌ టెన్నిస్ ఆడుకో! నేను, జార్జ్ ‌మూడు గంటల్లోగా తిరిగి రాకపోతే, ‌అప్పుడు నువ్వు, నీ‌ వెనుక ఉన్న దెవరో అతను‌ మా కోసం వస్తారు."


బెస్‌ కళ్ళు ఉత్సాహంతో ‌మెరిసి, హుషారుగా తలెత్తింది.  "అలాగే! అతని పేరు అలెన్ రైడర్!"  గబుక్కున బదులిచ్చింది.


జార్జ్ గాలి ఎగబీల్చింది.  "చూడు.  వచ్చే ముందు అతను సీమన్ గ్రూపు మనిషి కాదని నిర్థారించుకో!"


బెస్ ఆవేశంతో కాలిని నేలకేసి కొట్టింది.  "జార్జ్! నీ జుట్టు కుదుళ్ళలోంచి ఊడి వచ్చేలా లాగిన సందర్భాలు ఉన్నాయి!" అంటూ దూకుడుగా‌ వెళ్ళిపోయింది.


నాన్సీ, జార్జ్ ‌యికిలిస్తూ తమ గదికి వెళ్ళిపోయారు.  వారు తమ బట్టలు ‌విప్పి, ఈత బట్టలు వేసుకుని, వాటి మీద పొట్టి లాగులు, చొక్కాలు వేసుకొన్నారు.  వాటర్ప్రూఫ్  సంచులలో ‌చుట్టిన తువ్వాళ్ళను కందకం ‌మీదుగా మోసుకెళ్ళటానికి వీలుగా సర్దుకొన్నారు.


పాత కోట గురించి తమకు ఏమి తెలియబోతుందో అన్న ఉద్వేగంతో  అమ్మాయిలు ఇద్దరూ కారులో బయల్దేరారు.  ఇద్దరూ చలన సేతువుకి చేరుకోవటానికి ‌కొంచెం ముందు,‌ జార్జ్ పగలబడి నవ్వింది.  "నాన్సీ! నువ్వు, నేను మూర్ఖులం కావచ్చు."


"ఖచ్చితంగా," అని నాన్సీ ఒప్పుకొంది.  " కానీ ఏది నీ బుర్రలో ఈ ఆలోచన పెట్టింది? "


పురాతన ‌కాలంలో కొన్ని చలన సేతువులు కందకానికి దూరం నుండి కానీ, కోట లోపల నుండి కానీ నియంత్రించే విధంగా నిర్మించేవారని తాను విన్నట్లు జార్జ్ వివరించింది.  " ఈ వంతెన కిందకు దిగి ఉన్నప్పుడు, ఇష్టం లేని సందర్శకుడు లేదా శత్రువు దీనిని సమీపిస్తే, రోడ్డు అడుగున ఉన్న రహస్య యంత్రాంగం ఏదో పని చేసి ఆ వంతెన తక్షణమే స్వతస్సిద్ధంగా పైకి లేచేలా‌ చేసేది.  అలాంటి రహస్య యంత్రాంగమేదో యిటు పక్కన ఉండి ఉండవచ్చు.  అలా ఉండి ఉంటే, మనం వంతెన దగ్గరకు నడిచినప్పుడు కోటలో ఎవరూ ఉండనవసరం లేదు.  మనం ఆ యంత్రాంగం పని చేయకుండా ఆపేసి, వంతెన పైకి ఎక్కవచ్చు!"


"నువ్వు అన్నది నిజమే కావచ్చు" అని నాన్సీ అంగీకరించింది.  "కానీ కోటలో ఎవడో ఉండి వంతెనకు కట్టి ఉన్న ఆ పెద్ద యినుప గొలుసులను కిందకు వదులుతున్నాడేమోనని యిప్పటికీ నాకు అనిపిస్తోంది.  అదే వ్యక్తి ‌ ఈ కందకంలోకి నీళ్ళను వదులుతూండవచ్చు."


"సరే! ప్రస్తుతం వంతెన పైకి కట్టేసే ఉంది గనుక మనం ‌ఈదుకొనే ఆ కోట‌ వైపుకు వెళ్ళాలి" చెప్పింది జార్జ్.


అలా వెళ్ళే ముందు కందకం అంచునే నడిచి వెళ్ళి ఈ నీటి సరఫరాకి మూలం ఎక్కడుందో చూద్దామని నాన్సీ సూచించింది.  " కోటకు ఎదురుగా ఉంది గనుక, బహుశా అది నదే అయి ఉంటుంది."


అమ్మాయిలు తాము వేసుకొన్న పొట్టి లాగులు, చొక్కాలు కారులో వదిలేసి, ఈత దుస్తుల్లో కందకం అంచునే తిరుగుతూ చూసారు.  డీప్ రివర్ నుంచి కొత్తగా తవ్విన కాలువను వాళ్ళు కనుగొన్నారు.


"ఇక్కడికి వచ్చే సందర్శకులను ఎవరో దూరంగా ఉంచాలని  చూస్తున్నట్లు ఖచ్చితంగా చెప్పగలను" నాన్సీ వ్యాఖ్యానించింది. వెంటనే చిరునవ్వు ‌నవ్వింది.  "కానీ నాన్సీ డ్రూ, జార్జ్ ఫియానే అన్న వ్యక్తులను ఉంచలేరు!"


"మనం ఎక్కడ నుంచి ఈది అటు వెళ్దాం?" జార్జ్ అడిగింది.


నాన్సీ ఆ ప్రాంతమంతా తనిఖీ చేసి చలన సేతువుకి కొద్ది దూరంలో, అయితే మంచిదాన్ని నిర్ణయించింది.  వాళ్ళు వెనక్కి నడిచారు.  


అమ్మాయిలు మడమ లేని తమ కాలిబూట్లను వాటర్ ప్రూఫ్ సంచులలో ఉంచి, నీటిలో దిగి వేగంగా అవతలి వైపుకి ఈదుకెళ్ళారు.  కందకం లోంచి అవతల గట్టు ఎక్కారు.  తరువాత సన్నని కాలిబాటలో రాతి గోడకు ఉన్న గుమ్మంలోంచి ఖాళీ ప్రదేశానికి పరుగెత్తారు.  తమ బట్టలు ఆరే లోపున తమ నెవరూ చూడకూడదని వాళ్ళ ఆలోచన. ఆ ప్రాంతం ఒకప్పుడు అందమైన పూలతోట అన్న ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి.  ఎత్తుగా పెరిగిన గడ్డి, కలుపు మొక్కల మధ్యన యింకా అందమైన పూలు ఉన్నాయి.


 నిశ్శబ్దంగా ఉన్న గాలిలో నుంచి దయ్యం గొంతుని  తలపించే మగ కంఠం అకస్మాత్తుగా ప్రతిధ్వనించింది.  మెల్లిగా కానీ స్పష్టంగా ఆ హెచ్చరిక ‌వినిపించింది.  "ఈదు . . కొంటూ . . వెన . . క్కి పొండి! ఇక్కడ ‌మీ కోసం ‌మృత్యువు ఎదురు చూస్తోంది!"


 ***


అరిష్టదాయికమైన ఆ హెచ్చరిక మరొకసారి వినిపించలేదు.  నాన్సీ, జార్జ్ భయంతో ఆగి గమనించారు.  కానీ వాళ్ళకు ఎవరూ కనపడలేదు.  


  "ఆ మనిషి యొక్క స్వరం కోటలోంచి వచ్చిందా, లేక బయటినుంచా?" జార్జ్ అడిగింది.


(సశేషం)

No comments:

Post a Comment

Pages