నెత్తుటి పువ్వు -38 - అచ్చంగా తెలుగు

 నెత్తుటి పువ్వు -38 

మహీధర శేషారత్నం 


అన్నం తిని శంకరం బయటికి వెళ్ళిపోయాడు. పార్వతి వంటిల్లు సర్దుకుని టి.వి. చూస్తూ కూర్చుంది. ఏదో పాతసినిమా! సరోజ కూడా వచ్చి హాల్లో కూర్చుని టి.వి. చూడ్డం మొదలు పెట్టింవది. జియో ఫ్రీ వచ్చాక సరోజ నాగరాజు కొనిచ్చిన సెల్లో తప్ప టి.వి. చూసి చాలా కాలమయింది. శంకరం ఇంట్లో లేనప్పుడు పార్వతితో కూడా కలిసి చూడ సాగింది.

ఏదో! శోభన్ బాబు సినిమా! షరా మామూలే. ఇద్దరు భార్యలు, ఒకటే మొగుడికోసం కొట్టుకోవడం.

పార్వతికి విసుగొచ్చింది. “నువ్వు చూస్తే చూడు సరోజా! నేను పోయి పడుకుంటాను” అంటూ లేచింది పార్వతి.

“వద్దు వదినా! నాకూ విసుగ్గా ఉంది, నేను పోయి పడుకుంటాను” అంది ఆవలిస్తూ. 

“మేం సాయంత్రం సినిమాకెడుతున్నాం. వస్తావా?” బాగుండదని అడిగింది పార్వతి.

సరోజ ముఖంలో ఒక ఆనందరేఖ దోబుచులాడింది. “లేదొదినా! అంతసేపు కదలకుండా కూర్చోలేను. నడుం నొప్పిగా ఉంటుంది” అంటూ క్షణంలో వెళ్ళిపోయింది.

“ఇదుగో! తలుపేసుకో నీవైపు నీకు నిద్ర పట్టినా! అరిచింది పార్వతి. 

అలాగే వదినా! అంటూ ఠక్కున లోపల గొళ్ళెం పెట్టేసుకుంది సరోజ.

ఆ అమ్మాయి ఎప్పుడు సాయంత్రం అవుతుందా! నాగరాజును ఎప్పుడు రమ్మందామా! అని అత్రంగా ఉంది. 

వాళ్ళు వెళ్ళడం గమనిస్తూనే గబగబా స్నానం చేసి పక్క దులిపి వేసి చక్కగా ముస్తాబయింది. సెల్ తీసి నాగరాజుకి కాల్ చేసింది. లిఫ్ట్ చెయ్యలేదు. మళ్ళీ ట్రై చేస్తుంటే రింగ్ టోన్ గుమ్మందగ్గరే వినిపించింది. సంతోషంగా కిటికీ లోంచి చూసి అప్పుడు తలుపుతీసింది. నాగరాజు లోపలికి వచ్చీ రాగానే అల్లుకుపోయింది.

“ఎన్నాళ్ళయింది నిన్ను చూసి? అంది నిండుగా చూసుకుంటూ “

వదినా వాళ్ళు సినిమాకెళ్ళారు. మనం ఫ్రీ” అంది చేతులు బార్లా చాస్తూ.

“తెలుసు, శంకరం చెప్పాడు. మన కోసమే వెళ్ళాడు. వాడికి అసలు ధియేటర్ కి వెళ్ళడం ఇష్టం ఉండదు.” మంచం మీద కూర్చుంటూ అన్నాడు. సరోజ సంతోషంగా కబుర్లు చెప్తూ వంట చేసింది. మూడు గంటలు మూడు నిమిషాలలా గడిచిపోయాయి. టైము చూసుకుని నాగరాజు వెళ్ళిపోయాడు.

పార్వతి గమనించలేదు కాని శంకరం సరోజ ముఖంలోకి చూసీ చూడనట్టుగా చూసాడు. ఆ అమ్మాయి ముఖం ఆనందంతో కళకళలాడుతూ ఉంది.

శంకరానికి ఇలాంటి విషయాలు నచ్చవు. కాని నాగరాజు ప్రాణమిత్రుడు. మంచివాడు. వాడిలాంటి పని చేయడమేమిటి? నిజానికి సరోజని చూపులతోనే గర్బవతిని పసికట్టేసిన రాములమ్మ నచ్చక సరోజ దగ్గరకు రావడం మానేసింది. మానేయడమే కాదు దార్లో ఎదురుపడ్డ నాగరాజుని కోప్పడింది కూడా.

నాగరాజు బాధపడ్డా సరోజ దగ్గర ఏం చెప్పలేదు. నాగరాజు ఒక్క శంకరం సమక్షంలోనే తెరచిన పుస్తకంలా ఉంటాడు. అతనితో చెప్పి బాధపడ్డాడు. అతను మాత్రం ఏం చెయ్యగలడు? నోరుజారినా, కాలుజారినా తీసుకోలేం. అనుసామెత ఊరికే పుట్టలేదు కదా! అనుకున్నాడు.

అది మొదలు శంకరం ఇరవై రోజుల కొకసారి పార్వతిని సినిమాకు తీసుకెళ్ళడం మొదలు పెట్టాడు. ఎప్పుడూ లేనిది ఈ వింత ఏమిటో పార్వతికి అర్ధం కాలేదు. ఇద్దరే లింగూ లిటుకూ మంటూ ఉండడం. విసుగ్గా ఉందేమో అనుకుంది.

శంకరం ఒకసారి రాజుకి ఫోన్ చేసినప్పుడు అన్నాడు నవ్వుతూ. 

“అరెభాయ్! నీవల్ల నా బడ్జెట్ తప్పుతోంది రా!” 

రాజు అర్ధం చేసుకుని పకపకా నవ్వాడు.

“అస్తమానం సినిమాకే వెళ్ళాలనే ముందిరా! సోమవారం శివాలయం, మంగళవారం ఆంజనేయస్వామి, బుధవారం వినాయకుడు, గురువారం బాబా గుడి.... ఇలా మనకు దేవుళ్ళకు కొదవేముందిరా బాబూ! మమ్మల్ని కాపాడరా!”

ఆ మాటతీరుకు శంకరం నవ్వుకున్నాడు కాని నాగరాజు స్వభావంలో కొట్టొచ్చినట్టు కనపడే మార్పు అతను జీర్ణించుకోలేక పోతున్నాడు.

తప్పు చేయడమెంత తప్పో, తప్పుకు సహకరించడం కూడా అంతే తప్పు. తనూ ఏదో అనుకుని తప్పు చేస్తున్నాడేమో అని మథనపడ సాగాడు.

కొన్నాళ్ళు గడిచే సరికి పార్వతికి ఇదంతా ఎందుకో అర్ధమైంది. కరాఖండిగా చెప్పేసింది.

“ఇన్నాళ్ళు లేనిది అస్తమానం ఈ సినిమాలు, షికార్లు ఎందుకో నాకు అర్థమైంది, పిచ్చిదాన్ని ఇదంతా నా మీద ప్రేమేమో అనుకున్నాను. ఈ నాటకాలు అక్కర్లేదు మీ ఫ్రెండ్ ని రాదల్చుకున్నప్పుడు వచ్చి పొమ్మనండి. తప్పు చెయ్యకుండానే ఉండాలి, కాని తప్పుని కప్పి పుచ్చుకునేందుకు ఇంకొక తప్పు చెయ్యకూడదు. నేను సరోజతో  కూడా మాట్లాడతాను. అన్నట్లే సరోజతో కూడా చెప్పింది.

“మీవైపు నువ్వు తలుపు వేసుకో, మా వైపు నేను వెయ్యను. నీకు ఏదైనా అవసరం అయినప్పుడు పిలు మా తలుపులు ఇటు ఎప్పుడూ తెరిచే ఉంటాయి.”

సరోజకి అర్ధమయింది, తలవంచుకుని బుర్ర ఊపింది.

ఒకసారి అనుకోని సంఘటన జరిగింది. అనుకోకుండా నాగరాజు వచ్చినప్పుడు అక్కడికి దగ్గరగా ఉన్న హాస్పటల్ కి లక్ష్మి చెకప్ కి వచ్చింది. దగ్గరే కదా! అని లక్ష్మి పార్వతిని చూడడానికి వచ్చింది, పార్వతి లక్ష్మిని ఆహ్వానిస్తూ సరోజ రూమ్ తలుపు నెట్టింది. సరోజ లోపల గొళ్ళెం పెట్టడం మర్చిపోయింది. నాగరాజుని చూసి నిర్ఘాంతపోయింది. చటుక్కున తలుపు దగ్గరకు లాగి “రా! లక్ష్మీ బెడ్రూంలో కూర్చుందాం.” అంటూ లోపలికి తీసుకుపోయింది.

నాగరాజు బిక్క చచ్చిపోయాడు. లక్ష్మి నాగరాజుని గమనించలేదు. లోపలికి వెళ్ళిపోయింది. నాగరాజు వాళ్ళు లోపలికి వెళ్ళగానే చటుక్కున వీధిలోకి వెళ్ళిపోయాడు. ఒక్క మాటైనా మాట్లాడకుండా నాగరాజు వెళ్ళిపోవడం సరోజకు బాధ కలిగించింది. ఆరోజు రాత్రి పార్వతి శంకరానికి గట్టిగా చెప్పింది దీనికి ఏదో ముగింపు చూడమని, ఇది తనకు నచ్చటం లేదని శంకరం తల ఊపాడు.

మళ్ళీసారి నాగరాజు వచ్చినప్పుడు సరోజ అతని దగ్గర కన్నీళ్ళు పెట్టుకుంది. 

“వెధవ దొంగబతుకయి పోయింది నాది” అంటూ నాగరాజు కూడా బాధపడ్డాడు. 

“మనము ఇదంతా ముందరే ఆలోచించలేదు, ఆలోచిద్దాం ఏం చేయాలో అన్నాడు.

“లక్ష్మికి విడాకులిచ్చి నన్ను పెళ్ళి చేసుకోరాదా! చాలామంది అలా చేస్తూనే ఉన్నారుగా” అంది తన పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ.

“లక్ష్మీం చేసింది?” అన్నాడు. 

సరోజ అతన్ని గమనించకుండానే 

మంచి కారెక్టర్ కాదని పెడితే విడాకులు తొందరగా వస్తాయిటగా అంది. నాగరాజు కళ్ళు ఎర్రబడిపోయాయి.

“లక్ష్మి కారెక్టరు మంచిది కాదా! తప్పు మనం చేస్తూ నింద తనమీద వెయ్యడమా? ఏమంటున్నావ్ అంటూ లేచిపోయాడు.

అదికాదు... అంటూ ఏమో చెప్పబోయింది తీవ్రంగాచూసి వెళ్ళిపోయాడు. 

పెళ్ళాం మీద అంత ప్రేమున్నవాడు నన్నెందుకు తెచ్చినట్టో అంటూ గింజుకుంది సరోజ.

ఆ తర్వాత పదిరోజులు నాగరాజు ఇటు తొంగి చూడలేదు. శంకరంతో చెప్పి లక్ష్మిని చూసొస్తానని బావమరిది ఇంటికి వెళ్ళిపోయాడు.

సరోజ డెలివరీ డేట్ దగ్గరకు వస్తోంది.

*****

(సశేషం)

ఆరోజు సత్యం మళ్ళీ ఫోన్ చేసాడు. స్టేషన్లో ఏదో గొడవ జరగడంలో అసలే తిక్కగా ఉన్న నాగరాజు రెచ్చిపోయాడు.

“ఏం చేస్తావ్? 498ఎ సెక్షన్ కేసు పెడతావు. పెట్టుకో. ఏమవుతుందో అదీ చూస్తాను. అవును నేను ఇంకో అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాను. ఐతే ఏంటి?” బి.పి. పెరిగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు.

గుడ్! రాజుగారూ! అసలు విషయం మీ నోటిలో మీరే చెప్పారు. ఇది చిలక్కొట్టుడు కాదని, రెండో సెటప్పని ఒప్పుకున్నారు. “గట్టిగా నవ్వాడు సత్యం నెత్తిమీద కెక్కిన దెయ్యం దిగినట్టయింది నాగరాజుకి. ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉన్నాడు.

“ఐతే నీకేం కావాలి? కేసు పెడతావా? ఇది ఆధారంగా విడాకులడుగుతావా? లేకపోతే ఉద్యోగం పోగొడతావా?” అన్నాడు నాగరాజు. నాకు ఇవేవీ అక్కర్లేదు. నువ్వు సిన్సియర్గా ఉంటావనీ, లక్ష్మితో బాగానే ఉంటావని నాకు తెలుసు. నువ్వు అన్న వాటిలో ఏది జరిగినా లక్ష్మి బాధపడుతుంది. అది నిన్ను చాలా ఇష్టపడుతుందని నాకు తెలుసు. నాకు నాచెల్లెలి సుఖం కావాలి. ఇప్పటివరకు దానికీ విషయాలేం తెలియవు. నేను చెప్పను కూడా. అయితే ఇదేదో నీమీద ప్రేమనుకునేవు. ఇప్పుడు దానికి నెలలు నిండి పండంటి పాప నెత్తుకొని మూడు నెలలు నిండేక నీ దగ్గరకి పంపిస్తా. అంటే ఇంకా ఏడెనిమిది నెలల టైముంటుంది. ఈ లోపులో ఆ అమ్మాయి విషయం ఎలాసెటిల్ చేస్తావో నాకు తెలియదు. వదిలించుకో!

లేకపోతే నేను కేసులు పెట్టి కోర్టుల చుట్టు తిరిగి, తిప్పి లక్ష్మిని బాధపెట్టను. దాన్ని అంటే నీ భాషలో నీ రెండో భార్య, నా భాషలో నువ్వు ఉం..... న్న దాన్ని. పైకే పంపేస్తాను. ఇదే లాస్ట్ వార్నింగ్ ఏది ఎలా చేయాలో నాకు బాగానే తెలుసు.” ఫోన్ పెట్టేసాడు.

నాగరాజు బిక్కచచ్చిపోయాడు. 

ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. నవనాడులూ కుంగిపోయాయి.

ఏదో అనుకుని తెస్తే ఏదో జరిగి పాతాళానికి పడిపోయినట్టయింది. బాధపంచుకుందామంటే శంకరాన్ని వేరే స్టేషన్ కి ట్రాన్సఫర్ చేసారు. అయినా వాడినప్పుడు ఊళ్ళోలేడు. తలబద్దలవుతున్నట్టుంది. స్టేషన్ విడిచి బయటికి వెళ్ళడానికి కూడా లేదు. చుట్టూ ఏం జరుగుతోందో కూడా తెలిసే స్థితిలో లేడు. ఎలాగో ప్రాణాలుగ్గబెట్టుకొని డ్యూటీ టైమయ్యేంతవరకు గడిపాడు. ఎక్కడికెళ్ళాలో తెలియక పిచ్చివాడిలా వెళ్ళి పార్కులో కూచున్నాడు. అలా ఒక మూలకెళ్ళి ఆ గడ్డిలో పడుకున్నాడు. కొండచిలువ చుట్టేసి ఊపిరి ఆడకుండా చేసినట్టుంది. తల నరాలు చిట్లినట్లయింది. అలా నిస్తేజంగా ఉండిపోయాడు.

పార్కు మూసే టైముకి వాచ్ మెన్ వచ్చి పిలిచాడు. కాకి యూనిఫారమ్ ధర్మమా అని సార్! సార్! అంటూ టైమయింది సార్! అన్నాడు వెళ్ళమన్నట్టు, నాగరాజు శరీరం తూలుతున్నట్టయింది. సైకిలు స్టేషన్లోనే వదిలెయ్యడం వల్ల నడవలేక మెల్లిగా ఆటోఎక్కి ఇల్లు చేరాడు.

కళ్ళు ఎర్రబడి జుట్టు రేగిపోయి, షర్టునిండా అంటుకున్న గడ్డి పరకలు చూసి లక్ష్మి దిమ్మెరపోయింది. గమ్మున వచ్చి వాటేసుకుంది.

“ఏమయింది? ఏమైనా స్టేషన్లో గొడవా? ఉండు, వేడిగా కాఫీ పట్టుకొస్తాను. వేణీళ్ళు పడేస్తాను, స్నానానికి కాఫీ తాగి స్నానం చేస్తే కాస్త హాయిగా ఉంటుంది.” అంది అనునయంగా.

“వద్దు లక్ష్మి! నువ్వు మంచం మీద కూర్చో. నీ ఒళ్ళో తల పెట్టుకు పడుకుని పదినిమిషాలు రిలాక్స్ అవనీ!” అన్నాడు భార్యను బెడ్ రూంలోకి నడిపించుకుంటూ వెళ్తూ.

లక్ష్మి అయోమయంగా నడిచింది. 

లక్ష్మి పొట్టచూస్తూ నీకు బరువనిపించినప్పుడు నిస్సంకోచంగా దిండు మీదకు జరుపు అన్నాడు.

కాళ్ళు చాపుకు పడుకుంటూ 

లక్ష్మి తల నిమురుతూ, నుదురు రాస్తూ కూర్చుంది. 

పదినిమిషాలలో నాగరాజు కుదుటపడ్డాడు కాస్త.

నీ చేతుల్లో ఏదో మహిమ ఉంది లక్ష్మీ! అంటూ రెండుచేతులూ ముద్దుపెట్టుకున్నాడు. కాస్త వేడి కాఫీ తెచ్చిపెట్టు అన్నాడు అలాగే పడుక్కుని.

కాస్త రిలాక్స్యి వేణీళ్ళతో స్నానంచేసి బుజ్జిగాడితో ఆడుకుంటూ కూర్చున్నాడు.

నాగరాజు మనసుకు కాస్త ఉపశమనం పై పూతగా నవనీతం చిలకరించి నట్టయింది. కాని లోపల... పచ్చి పుండు అలానే ఉంది.

తనే చెప్పేస్తే జరిగిందంతా..! వద్దు ఇప్పుడు కాదు. ఇద్దరూ గర్భవతులు, రెండు ప్రాణాలు, రెండు పసి ప్రాణాలమీద ఆ ప్రభావం ఓర్చుకుందాం. జాగ్రత్త పడదాం ఆరు నెలలు....

గట్టిగా అనుకున్నాడు.

లక్ష్మి అన్నం పెట్టి....... టాబ్లెట్ ఇచ్చింది. రాజు ఆ మాత్రలు మూడు నాలుగు ఉండేట్టు జాగ్రత్త పడతాడు. లక్ష్మికి తెలుసు సున్నితమైన నాగరాజు ఏదైనా కేసులో బాధపడినప్పుడు ఆ మాత్రలే వేసుకు పడుకుంటాడు.

శంకరం నాలుగు రోజులన్నవాడు వారం పట్టింది ఇంటికి రావడానికి.

సరోజ రెండు మూడుసార్లు రమ్మని ఫోన్ చేసింది. ఒక్కద్దాన్ని భయంతో చస్తున్నానని, నాగరాజుకి జాలి వేసింది. ఎవడు కనిపెడుతున్నాడోనని భయంగా అనిపించి వెళ్ళలేకపోయాడు. కాని ఇంకా శంకరం రావట్లేదని ఫోన్ చేసాక ఒక్కసారి వెళ్ళివచ్చాడు. సరోజ గయ్యన లేచింది, ఏమిటి రమ్మంటే రావు? ఇంటి మొత్తానికి ఒక్కద్దాన్నే దయ్యంలా అంటూ, నాగరాజు ఓదార్చి కొంచెం ఎక్కువ సేపు ఉండి ఎన్నో జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడు.

శంకరం పార్వతి ఊరు నుండి వచ్చాక ఊపిరి పీల్చుకున్నాడు. సరోజకి డెలివరీ డేట్ దగ్గర కొస్తోంది. భారంగా తిరుగుతోంది, పార్వతీ జాగ్రత్తగా చూసుకుంటోంది, నాగరాజు శంకరానికి సత్యం చేసిన గొడవ పూర్తిగా చెప్పి నన్ను క్షమించరా! నువ్వు, పార్వతీ కాస్త జాగ్రత్తగా చూసుకోండి అంటూ కొంత డబ్బు చేతిలో పెట్టాడు.

అన్నట్టుగానే సత్యం, చెల్లెల్ని ఏడో నెలరాగానే తీసుకెళ్ళడానికి వచ్చాడు.

ఆలోచనలలో పీక్కుపోయిన నాగరాజుని వదలలేక లక్ష్మి తొమ్మిదో నెలలో వస్తాలేరా అన్నయ్యా లేకపోతే నువ్వూ, వదినా వచ్చి ఇక్కడే ఉండండి అంది.

“ఫరవాలేదమ్మా! నేనేదో ఒక పనిమీద టౌన్ కి వస్తూనే ఉంటానుగా! నేను కలుస్తుంటాలే! బావగారూ! మన ఇంటికి నీ కోసం, బుజ్జిగాడి కోసం ఎలాగూ వస్తారు” అంటూ ఫిట్టింగు పెట్టాడు. వెళ్తూ వెళ్తూ పక్కకి పిలిచి వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళాడు.

*****No comments:

Post a Comment

Pages