విడువ విడువ నింక విష్ణుడ నీపాదములు - అచ్చంగా తెలుగు

విడువ విడువ నింక విష్ణుడ నీపాదములు

Share This

 విడువ విడువ నింక విష్ణుడ నీపాదములు

డా.తాడేపల్లి పతంజలి 




రేకు: 0335-05 సం: 04-206

పల్లవివిడువ విడువ నింక విష్ణుడ నీపాదములు

కడగి సంసారవార్ధి కడుముంచుకొనిన


.1: పరమాత్మ నీవెందో పరాకైయున్నాను

పరగ నన్నింద్రియాలు పరచినాను

ధరణిపైజెలరేగి తనువు వేసరినాను

దురితాలు నలువంకదొడికి తీసినను


.2: పుట్టుగు లిట్టె రానీ భువి లేక మాననీ

వట్టి ముదిమైన రానీ వయసే రానీ

చుట్టుకొన్నబంధములు చూడనీ వీడనీ

నెట్టుకొన్నయంతరాత్మ నీకు నాకుబోదు


.3: యీదేహమే యయిన ఇక నొకటైనాను

కాదు గూడదని ముక్తి కడకేగినా

శ్రీదేవుడవైన శ్రీవేంకటేశ నీకు

సోదించి నీశరణమె చొచ్చితి నే నికను


భావం

పల్లవి:

ఓ విష్ణుడ ! సంసార సముద్రము నన్ను బాగా ఆక్రమించినప్పటికి నీపాదములు విడువను విడువను.


.1:

పరమాత్మనన్ను పట్టించుకోకుండా నీవు ఎక్కడో  పరాకై ఉన్నప్పటికి, నన్ను ఇంద్రియాలు పడగొట్టినప్పటికి,

ఈ భూమిపై చెలరేగి నా శరీరం బాధపడినప్పటికి,పాపాలు నాలుగు దిక్కులా నలువంకలకు పట్టుకొని తీసుకుపోయినప్పటికి ఓ విష్ణుడ ! నీపాదములు నేను విడువను విడువను.


.2:

ఓ విష్ణుడ ! ఎన్నో జన్మలు ఇలా రానీ భూమిలో జన్మే లేకుండా పోనీ!!ప్రయోజనం లేని ముసలి వయస్సు రానీ యౌవనంలో ఉండనీ !నన్ను చుట్టుకొన్నబంధములు  నన్ను చూసినానన్ను  వీడిపోయినా-అతిశయించు అంతరాత్మ నీకు నాకు పోదు.(అనగా అంతరాత్మలో ఎప్పుడు పరమాత్మ ఉంటాడని భావం)


.3:

శ్రీవేంకటేశ ! ఈ శరీరమే నాకు ఉన్నప్పటికి  లేదా నీలో కలిసి పోయి ఒకటయినప్పటికి,కాదు కూడదని ముక్తి పొందినప్పటికి ,శ్రీదేవుడవైన నిన్ను నా అణువణువున శోధించి నీశరణము కోరాను.(ఎప్పుడు నిన్ను విడవనని భావం)

***

No comments:

Post a Comment

Pages