నమస్కారము - అచ్చంగా తెలుగు

నమస్కారము

అంబడిపూడి శ్యామ సుందరరావు 




భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలలో నమస్కారానికి చాలా విలువ ఉంది గౌరవ సూచకంగా మనము నమస్కారము చేస్తాము క్రమముగా పాశ్చాత్య సంస్కృతీ అలవాటు చేసుకొని నమస్కారాలు మానేసి షేక్ హ్యాండులు అలవాటు చేసుకున్నాము దేవుడికి షేక్ హ్యాండ్ ఇవ్వటం లేదు తప్ప మిగిలిన అందరికి షేక్ హ్యాండ్ లేదా హాయ్ అనే పలకరింపులు అలవాటు అయిపోయినాయి.కరోనా పుణ్యమా అని విదేశీయులు మన నమస్కారము విలువ గుర్తించి వారు కూడా షేక్ హ్యాండ్ లను మానేసి నమస్కారాల ను అవలంబిస్తున్నారు ఆ విధముగా ప్రపంచానికి మన సంస్కృతియే దిక్కు అయింది కానీ మనమేమో పాశ్చాత్య సంస్కృతీ వెంటపడుతూ మన సంస్కృతీ సాంప్రాదాయాలను నిర్లక్ష్యము చేస్తున్నాము.ఇంకా పెద్ద వింత ఆశ్చర్యకరమైన విషయము ఏమిటి అంటే మనవాళ్ళు మోటార్ సైకిల్ లాంటి వాహనాల మీద వెళుతున్నప్పుడు దేవాలయము కనిపిస్తే ఆగి గుడిలోకి వెళ్లి దేవుడికి భక్తి పూర్వకముగా నమస్కరించవలసినది పోయి బండి మీద నుంచి దేవుడికి హాయ్  చెపుతున్నారు.అది మనము మన సాంప్రదాయాలకు నేడు ఇస్తున్న విలువ. 

ఎవరెవరికి నమస్కరించాలి?ఎలా నమస్కరించాలి? నమస్కరించటం లో పరమార్ధము ఏమిటి? నమస్కారాలు ఎన్ని రకాలు ? వంటి విషయాలను తెలుసుకుందాము నమస్కారము అనే మాట "నమస్సు" అనే సంస్కృత పదము నుండి వచ్చింది.నమస్సు లేదా నమః అంటే మనిషిలో గల ఆత్మను గౌరవించుట. ఈ సంప్రదాయము భారతదేశంతో పాటు దక్షిణాసియాలో ఎక్కువగా వాడుకలో ఉంది. ప్రత్యేకంగా హిందూజైనబౌద్ధ మతావలంబీకులలో సాధారణంగా కానవస్తుంది. ప్రపంచ సంస్కృతులలో ఎదుటి మనిషిని గౌరవించు అతి చక్కని ముద్రగా నమస్కారము పరిగణింప బడుతుంది  .గురువులు, పెద్దవారు, గౌరవనీయులు ఎదురైతే రెండు చేతులు జోడించి నమస్కరించాలి నమస్కారం అనేది మనిషి యొక్క సంస్కారం,నమస్కారానికి ప్రతిగా నమస్కరించడం మానవుని సంస్కారం. మనం తోటివారికి నమస్కరించేటప్పుడు అది సంస్కారవంతంగా ఉండాలి. మనల్ని ఎదుటివారు ఎంతగా గౌరవించారో, వారిని అంతకు మించి గౌరవించని పక్షంలో ఆ నమస్కారం తిరస్కారానికి ప్రతీకగా భావం వస్తుంది. నమస్కారానికి ఆశీర్వాదం పొందే శక్తి ఉంది. మార్కండేయుడు పదహారేళ్లకే చనిపోతాడని కొందరు జ్యోతిష పండితుల ద్వారా తెలుసుకున్న అతడి తండ్రి మృకండుడు  నారదుణ్ని వేడుకున్నాడు. తన పుత్రుడు నిండు నూరేళ్లు జీవించేలా ఏదో ఒకటి చేయాలని ప్రార్థించాడు. అందుకు ఆయన కనిపించిన ప్రతి వ్యక్తికీ మార్కండేయుడితో పాదాభివందనం చేయించాలన్నాడు. అదే విధంగా అందరికీ పాదాభివందనం చేస్తూ సాగిపోయిన అతణ్ని వారందరూ 'దీర్ఘాయుష్మాన్‌ భవ' అని దీవించారు. అలా నమస్కారాలు చేయడం ద్వారా అందరి ఆశీస్సులూ పొందిన మార్కండేయుడు అంతిమంగా దీర్ఘాయుష్మంతుడైనాడు
 నమస్కారం చేసినప్పుడు చేతులు జోడిస్తాం. అవి హృదయానికి దగ్గరగా నిలుస్తాయి. అది సమర్పణకు ప్రతీక. ఆ సమర్పణతో, గుండెపై ఒత్తిడితో పాటు అహమూ తగ్గుతుంది. అది ఒక ఆరోగ్యకరమైన చర్య  నమస్కారంలోని సంస్కారాన్ని ఎందరో దేవతలతో సహా  ఆచరించి చూపారు  
ఎవరెవరికి ఎలా నమస్కరించాలో అయిదు రకాలుగా శాస్త్రాలలో పేర్కొన్నారు. 
1. దేవతలకు తలపై నుదిటిపైన మణికట్టు అంటేలా నమస్కరించాలి దీనిని  విన్నపము అంటారు. 
2. గురువులకు నుదిటి వద్ద చేతులు జోడించి నమస్కరించాలి ఇది ధ్యాన ముద్ర. కానీ శిష్యులు గురువుకు సాష్టాంగ నమస్కారము చేయాలి  మనస్సు, బుద్ధి, అభిమానం, రెండు పాదాలు, రెండు చేతులు, శిరస్సు అను ఈ ఎనిమిదింటితో చేయు నమస్కారమే సాష్టాంగ నమస్కారం. ఇందులో ఒక వ్యక్తి యొక్క శరీరంలోని అష్ట భాగాలు భూమిని తాకుతూ బోర్లా పడుకొనే మాదిరిగా దేవునికి ఎదురుగా పడుకొని నమస్కారం చేస్తారు. స్త్రీలు సాష్టాంగ నమస్కారము చేయరు రెండు పాదాల వేళ్లు, రెండు మోకాళ్లు, తల భూమిపైనుంచి రెండు చేతులను తలవద్దచేర్చి అంజలి చేయుట పంచాంగ నమస్కారం. ఇది ఎక్కువగా స్త్రీలు చేస్తారు
3.సన్యాసులకు పౌరాణికులకు  వక్షస్థలం వద్ద చేతులు ఉంచి నమస్కారము చేయాలి దీనిని ప్రార్ధనా ముద్ర అంటారు. 
4.తల్లిదండ్రులకు పెదవుల మధ్యగా చేతులుంచి నమస్కరించాలి.
5. స్నేహితులకు హృదయము వద్ద చేతులుంచి నమస్కరించాలి దీనిని వినమిత మస్తకము అంటారు.
భక్తి శ్రద్దలతో పాదాభి వందనము చేయటమే అత్యుత్తమమైన నమస్కారము.
 భారతదేశ వ్యాప్తంగా హిందూమత సంబంధమైన విధులు నిర్వర్తించేప్పుడు, మతాచార్యుల ఎదుట, భగవంతుని ముందు ప్రవర చెప్పి నమస్కరిస్తూంటారు. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణస్య శుభం భవతి. <గోత్రనామం> గోత్రస్య <వంశానికి చెందిన ముగ్గురు ఋషుల పేర్లు> త్రయార్షయ ప్రవరాన్వితః <గృహ్యసూత్రం పేరు> సూత్రః <అభ్యసించే వేదం> శాఖాధ్యాయీ <నమస్కరిస్తున్న వారి పేరు> అహంభో అభివాదయే అంటూ నమస్కరించడం వైదిక విధానం. చేతి వేళ్లను చేవుల వెనుకకు చేర్చి ముందుకు కాస్త వంగిన భంగిమలో పై సంస్కృత వాక్యాన్ని ఉచ్చరిస్తారు. మనుష్యులకు నమస్కరించేప్పుడు కుడిచేయిని ఎడమచెవికి, ఎడమచేయిని కుడిచెవికి చేర్చి ప్రవర చెప్పాలి. దేవతలకు నమస్కరించాల్సివస్తే ఎడమచేతిని ఎడమచెవికి, కుడిచేతిని కుడిచెవి వెనక్కి చేర్చి ప్రవర చెప్తారు. 
యోగశాస్త్రంలో 'నమస్కారాసనం' ప్రసక్తి ఉంది. యోగాసనం, ప్రాణాయామం, మంత్రము మరియూ చక్ర ధ్యానం కూడుకుని చేసే సంపూర్ణ సాధనే సూర్య నస్కారాలు. బ్రహ్మమూహూర్తంలో చేస్తే చాలా ఫలితాన్ని ఇస్తాయి. వేద పురాణాలలో సూర్యనమస్కారాల ప్రస్తావన ఉంది. రావణాసురిడితో యుద్దానికి ముందు రాముడుకి అగస్త్య మహముని సూర్య నమస్కారాలను బోధిస్తాడూ. ఈ శ్లొకాలు వాల్మీకి రామాయణం యుద్ధ కాండలో ఉన్నాయి.  సూర్య నమస్కారాల వలన ఊపిరితిత్తులు, జీర్ణకోశం, నాడీ మండలం, గుండె మొదలైన అవయవాలన్నీ బలపడి రక్తప్రసారం సక్రమంగా జరిగి అంగసౌష్టవం పెరుగుతుంది. నడుము సన్నబడుతుంది. ఛాతీ వికసిస్తుంది. వీటి వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.పన్నెండు భంగిమలతో కూడిన సూర్యనమస్కారాలలో ఒక సంక్షిప్తమైన ప్రాణాయామం, ధ్యానం సమ్మిళితమైన వ్యాయామం ఇమిడి ఉన్నాయి. శ్వాస పై ధ్యాస,వేదాత్మక ప్రార్థనలు వంటి వాటితో ఈ ప్రక్రియలను జోడించాలి. శరీరంలో ఉండే ప్రతి అవయవంలోని విష పదార్థాలను సహజ సిద్ధంగా తొలగించగల ప్రక్రియలివి. సూర్యోదయం వేళలో సూర్యునికి అభిముఖంగా నిలబడి సూర్య నమస్కారాలు చెయ్యాలి.  మానవుని సంస్కారం నమస్కారం కాబట్టి ఈ సమాజంలో అందరిని( పెద్దలను) గౌరవిద్ధాం ఆదర్శంగా నిలుద్ధాం. 

***

No comments:

Post a Comment

Pages