కోడలంటే... - అచ్చంగా తెలుగు
 కోడలంటే...
  భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు


నీ జీవితపు మూడవదశలో
ఖేదంతో నువ్వున్నపుడు
చిన్నప్పటిలా నీ ఆలనా పాలనా 
మీ అమ్మ చూడలేనపుడు,
అర్ధాంగి అలక్ష్యానికి అర్ధంకాని కారణాలతో 
నువ్వు గురిఅయినప్పుడు,
నీపరిస్థితిని, మనఃస్థితిని 
అర్ధంచేసుకునిమరీ నిన్ను ఆదరించి 
అన్నంపెట్టే ఆదర్శమూర్తిరా కోడలంటే!
మొదట్లో నువ్వు మూర్ఖత్వంతో 
ఆమెని అవమానించినా మౌనం వహిస్తూ,
అప్పుడప్పుడూ ఆమెని ఏదోఒకటి అంటూ ఉన్నా 
నీపై ఉన్న బాధ్యతతో వాటిని భరిస్తూ,
నీ చివరిదశలో నువ్వుసణుగుతున్నా 
సహనంతో నిన్ను సహిస్తూ,
నీ జీవిత నావని 
ఆవలి ఒడ్డుకు ఒడుపుగా చేర్చే 
దేవుడిచ్చిన బిడ్డరా కోడలంటే!
ముద్దుగా చెప్పాలంటే 
నీకు మూడవ అమ్మరా కోడలంటే!

***

No comments:

Post a Comment

Pages