అనసూయ ఆరాటం - 5 - అచ్చంగా తెలుగు

అనసూయ ఆరాటం - 5 

చెన్నూరి సుదర్శన్  


విశ్వనాథాన్ని పట్టిచ్చింది రాజయ్యేనని  ములుగుల అతని కదరు పెరిగింది.

                                         ***

          లింగారెడ్డికి సుత విశ్వనాథం కథంతా తెల్సింది. నీయతి కల్గిన పోలీసు రాజయ్యను కలిసి.. బుచ్చయ్య, సమ్మయ్యలకు ఇండ్లిప్పియాలను కున్నడు. కాని ఆ జమాన్ల ఒక పోలీసును కలుసుకోవాలంటే మాటలు కాదు. ‘కాలుకేత్తే ఏలుకేత్తరు.. ఏలుకేత్తే కాలుకేత్తర’నే భయం. ‘పోలీసుతోని దోస్తాని చెయ్యద్దట.. ఇంటి ముందల రేగు చెట్టు పెట్టద్దట’ అనే సామెత సుత వాడుకల ఉన్నది.

          ‘ఒకరికి మంచి చేసే మనిషికి అంతా మంచే జర్గుతది’  అన్నట్టు..  తాను కలుద్దామనుకున్న పోలీసు రాజయ్య కిరాణ సామాను కోసం ఆమర్నాడే లింగారెడ్డి దుకాణానికచ్చిండు.  

          రాజయ్యను చూసి లింగారెడ్డి గల్ల మీదికెల్లి లేచి నిలబడి రెండు చేతుల తోటి దండం పెట్టిండు.

          “సార్..”  అంటూ వచ్చిన పని చెప్పమన్నట్టు పబ్బతి పట్టిండు లింగారెడ్డి. ఇంతల బుచ్చయ్య, సమ్మయ్య    రాజయ్యకు దండం పెట్టుకుంట వచ్చి రాజయ్య పక్కకు నిలబడ్డరు.

          “కిరాణ సామాను కావాలె” అన్కుంట తన పెండ్లాం బతుకమ్మ, సురేందర్ తోటి రాయించిచ్చిన పట్టీ తీసి లింగారెడ్డికిచ్చిండు.

          “సెనంల సామానంత మీ ఇంటికి పంపిత్త గట్ల జరంత సేపు కూకోండ్లి సారూ..” అన్కుంట చేతి కింది పొలగానికి సైగ జేసిండు లింగారెడ్డి. పొలగాడు చిన్న టూలు తీస్కచ్చేసిండు. పోలీసు రాజయ్య సమఝ్ చేసుకున్నడు ఏదో తనన్ని అడగాలని సూత్తాండ్లని.

“లింగారెడ్డీ.. నేను ఖాతా పెడ్దామనుకుంటాన. నెల, నెలా.. కొన్ని పైసలు కట్టి కిరాణ సామాను తీసుకుంట. అప్పుడప్పుడు మా బాబు సురేందర్ సుత సామానుకత్తాంటడు.. ఏమంటవ్..” టూలు మీద కూకుండుకుంట అడిగిండు రాజయ్య.

“అయ్యో..! అదెంత బాగ్గెం.. సారూ.. మీరు అడగాల్నా.. ఆర్డరియ్యుండ్లి. మీకు చెయ్యి తిరిగినప్పుడే.. పైసలు జమజేయుండ్లి. సుక్తా కట్టుమని మేము అడుగం..” ఎంతో వినయంగ అన్కుంట సేట్లను చూసిండు లింగారెడ్డి. సేట్లు సుత తల్కాయెలూపిండ్లు ‘సరే అన్నట్టు’.

          లింగారెడ్డి తన చేతిలున్న పట్టీ పొలగానికిచ్చి ఇషార చేసిండు చాయె తెమ్మన్నట్టు.

          “సారూ.. చిన్న సాయం చెయ్యుండ్లి” అన్కుంట చేతులు నల్సుకోబట్టిండు లింగారెడ్డి.

          “శాలోల్ల ఇండ్ల సంగతేనా నువ్వు అడిగేది” సిన్నంగ నవ్విండు రాజయ్య.

          ఔనన్నట్లు తలూపిండు లింగారెడ్డి. “బుచ్చయ్య, సమ్మయ్య సేట్లు ఇద్దరూ శాలోల్లే.. వాల్లకు ఇండ్లు..”

          లింగారెడ్డి మాట పురంగ గాకముందే రాజయ్య అందుకున్నడు. సేట్లను సూసుకుంట “ఆ ఇండ్లు మన శాలోల్లకోసమే సేట్లూ.. నేను పోలీసు నౌకరి చేత్తాన కన్క నా కొడుకు పేరు మీద కిరాయకు తీసుకున్న. ముందుగాల మీరైతే ఆ ఇండ్లల్ల సంసారాలు పెట్టుండ్లి. శాలయ్యల తోటి ఇండ్లన్నీ నిండినంక ఒక సంఘాన్ని పెట్టుకుందాం. ఎవ్వలకూ కిరాయి ఇచ్చేది లేదు. నేనున్నగదా.. మీకేమీ భయం లేదు” అని అభయమిచ్చిండు పోలీసు రాజయ్య.

          సేట్లు ఏర్పడకుంటే.. సంకలెగిరేసిండ్లు.

***

          యాడాది తిరిగెటాల్లకు ఇండ్లన్నీ.. శాలోల్లతోటి.. చేతి మొగ్గాల తోటి నిండి పొయినై.

          “శ్రీ వెంకట రమణ చేనేత సహకార సంఘం“ వెల్సింది. వీవర్స్ కాలనీ పోయి ‘పద్మనగర్ కాలనీ’ అని పేరు మారింది.

సర్కారుకు రాసుకున్న విన్నపాలు ఫలించినై. మరో యాడాదికి సర్కారు సంఘానికి సర్వాధికారాలిచ్చుకంట ఉత్తర్వులు జారీ సేసింది.

 సమ్మయ్య తన ఇద్దరు కొడుకుల పేరు మీద.. తన పేరు మీద.. మూడిండ్లు తీసుకున్నడు. బుచ్చయ్య సుత మూడిండ్లు తీసుకున్నడు. ఒక ఇల్లు తన బిడ్డ పేర.. ఇల్లుటం వచ్చిన పెద్ద అల్లుడు రమేషుకిచ్చిండు. తన పేరున ఉన్న  ఇంట్ల లింగారెడ్డిని ఉండుమన్నడు. కొడుకు రవీందర్ పేరు మీద ఉన్న ఇంట్ల తనూ.. పెండ్లాం ఉన్నరు.

రవీందర్ వరంగల్ హాట్టల్ల ఉండుకుంట సదువుతాండు.

ఇంకో ఐదేండ్లు గడిసే టాల్లకు బుచ్చయ్య, సమ్మయ్య ఐదేల్లకు ఐదు ఉంగరాలచ్చినై..

***

          1969వ. సంవత్సరం,,

          ‘జై తెలంగాణ’ మెల్లంగ, మెల్లంగ రాజుకుంటాంది.

సురేందర్ పదకొండో తరగతి పట్టిండు. అప్పుడు ఎచ్చెస్సి అనేటోల్లు. సదువు లేదు సందె లేదు. బళ్ళు బందు..

          ఉస్మానియా యూనివర్సిటీల జార్జిరెడ్డి ఆమరణ నిరార దీచ్చ చేత్తాండు. ఆయనకు మద్ధతుగా యూనివర్సిటీ బందు..

వరంగల్ల సదువైనంక బుచ్చయ్య కొడుకు రవీందర్ అదే యూనివర్సిటీల ఇంజనీరింగుల షరీకయ్యుండె.

ఓ రోజు పట్నం నుండి రవీందర్ వచ్చి ములుగు బల్లె మీటింగు పెట్టిండు.  జార్జిరెడ్డి గురించి చెప్పిండు. తెలంగాణ కోసరం కొట్లాడాలని నూరి పోసిండు. సురేందర్‌కు ఎక్కడలేని ఉషారు తనం వచ్చింది. రవీందర్‌, సురేందర్ కలిసి ఊరూరూ తిరుక్కుంట తెలంగాణా కోసం ప్రచారం మొదలు పెట్టిండ్లు.  బస్సులల్ల  టిక్కట్లు తీసుకోకుంట ‘జై తెలంగాణ’ అనేటోల్లు.

సురేందర్ చేతి రాత బాగుంటది. ఓ రోజంతా బస్సుల ‘ఏ.పి.’ అచ్చరాల మీద  నల్ల రంగు పూసి ‘టిజి’ అని తెల్లచ్చరాలు దిద్దిండు.

ఇంటికి రాంగనే రాజయ్య “అరేయ్ సురేందర్.. నీ పేరు పోలీసు ఠానల ఎక్కింది. బస్సుల మీద పేర్లు ఎందుకు రాసినవ్.. హీరో అనుకుంటానవా..” అని కొడుకును బెదిరిచ్చిండు. 

“నాయ్నా.. మనకు తెలంగాణ గావాల్నే.. అందుకేమైనా చేత్త. జైలుకైనా పోత” అన్నడు సురేందర్ ఆవేసంగ.

“రేపు నీకు నౌకరి రాదు. పోలీసు రికార్డులల్ల నీ పేరుందని ఎతిరాజ్ చేత్తరు” అని ఇంకో ధంకీ ఇచ్చిండు. అయినా సురేందర్ బెదిరిపోలేదు.

“నాయ్నా.. మనకు తెలంగాన వచ్చినంక కేసులన్నీ కొట్టేత్తరు.. నీకు తెల్వదా.. పోనీ కొట్టేయలేదనుకుందాం.. ఏమైతది.. నేను దొంగతనం చేత్త లేను. ఒక మంచి పని కోసరం కొట్లాడుతాన” అని తల్కాయె ఎగిరేసి  చెప్పిండు.

కొడుకు ధైర్యానికి అప్సోసైండు రాజయ్య.  

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages