రెండు జీవితాల కథ - అచ్చంగా తెలుగు

 రెండు జీవితాల కథ

ప్రతాప వెంకట సుబ్బారాయుడు


ఆకలితో నకనకలాడుతూ ఊబిలో కూరుకుపోతున్న వ్యక్తి తలకి కొద్దిగా పైన ఉన్న చెట్టు కొమ్మకి పండిన జామకాయలు వేళాడుతుంటే..?

అదే జీవితం!

***

 ఫైల్లో ఉన్న సర్టిఫికెట్లు మరొక్కసారి చూసుకొని బయటకు అడుగుపెట్టి, ఫైల్ ని రెండు కాళ్ళ మధ్య పెట్టుకుని రూం కి తాళం వేసి, పదో ఇంటర్వూకి బయలుదేరబోతుంటే చూశాను, సరిగ్గా నా రూం కి ఎదురుగా ఉన్న ఇంటి గుమ్మంలో నుంచుని నా వంక చూస్తున్న ఆమెని. 

ఇదేం మొదటిసారి కాదు. ఆమెని అలా చాలా సార్లు చూశాను. సినిమాల్లోని తారలా కాకపోయినా, సినిమాకొచ్చే అమ్మాయిలా సాదాసీదాగా ఉంటుంది. 

అయినా నాకే ఠికానా లేదు, ఈ యవ్వనానికి గిలిగింతలొకటా?

ఉద్యోగం వస్తే అప్పుడు ప్రొసీడవ్వొచ్చు అనుకుని,

మనసును ఇంటర్వూ మీద కాన్సంట్రేట్ చేస్తూ షేర్ ఆటో ఎక్కి, అక్కణ్నుంచి సిటీబస్సులో డాట్ సాఫ్ట్ సొల్యూషన్స్ లోకి అడుగెట్టాను. 

సెంట్రల్లీ ఏసి తనువును మనసును గిలిగింతలు పెట్టింది. మా రూం పైన రేకులు. రాత్రైనా పగలైనా గదిలో రోస్ట్ అవాల్సిందే. అద్దె పెట్టుకోలేని నాలాంటి నిరుద్యోగికి అగ్గిపెట్టైనా, అద్దాల భవనమే ( పాజిటివ్ థింకింగ్). ఉద్యోగం వచ్చినా, రాకపోయినా ఇక్కడ కాసేపు చల్లగా ఉండొచ్చు. 'భగవంతుడా, నా పేరు లిస్ట్ లో చివర్న ఉండేలా చూడు' అనుకుంటుండగానే నన్ను పిలిచారు. అదిరే గుండెతో, తడబడే అడుగులతో లోపలికి వెళ్ళాను.

టేబుల్ కు అటువైపున ముగ్గురు మగాళ్ళు, ఒకామె కూర్చున్నారు. వాళ్ళను చూసి వాళ్ళ పొజిషన్ ను, శాలరీని అంచనా వేయొచ్చు. చిన్న పొజిషన్ కి, శాలరీకి నన్ను సెలెక్ట్ చేయడానికి వాళ్ళ పెద్ద (నాలెడ్జ్ లో?) మెదళ్ళను సానబట్టి, ఊహాతీతమైన ప్రశ్నలు సంధించారు. నా మెదడు తికమకపడింది. అది వాళ్ళు పట్టేశారు. నేను వాళ్ళను తీవ్రంగా నిరుత్సాహపరచినట్టు కళ్ళలో, ముఖంలో, పెదాల్లో ప్రతిఫలింపజేసి 'విల్ లెట్ యూ నో' అన్నారు ఇహ నన్ను వెళ్ళ మన్నట్టుగా.

నేను బయటకు అడుగెట్టాను. 'ఇప్పటిదాకా ఏసీ లో దాక్కుంటావా..హమ్మా' అన్నట్టుగా ఎండవేడి గట్టిగా చుట్టేసింది.

రూంకొచ్చి చాప మీద పడుకుండి పోయాను.

మరుసటిరోజు బాల్కనీలోని అమ్మాయి కళ్ళు నేను ఇంటర్వ్యూలో ఫెయిలయ్యానన్న విషయం పట్టేశాయి.

ఆమె ముఖంలో నిరుత్సాహం. బహుశా నాకు ఉద్యోగం వస్తే రెక్కల గుర్రం మీద తనను ఎగరేసుకుపోతానన్న ఆశాకోరికలేమో? 

***

ఆరోజు ఎదురింటి అమ్మాయిని ఆ ఇంట్లోవాళ్ళు ముస్తాబు చేశారు.

ఎందుకో ఈసారి బాల్కనీలోకి వచ్చిన ఆమెని నా కెమెరా కళ్ళు ఫోటో తీసి మనసులో ముద్రించాయి. 'ఈ అమ్మాయి అందం సినీతారలకు ఏ మాత్రం తీసిపోదు' మొదటిసారి మనసులో అనుకున్నాను.

కొంత సేపటికి వాళ్ళింటి ముందు రెండుకార్లు, రెండు బైకులు ఆగాయి. కార్ లోంచి టిప్ టాప్ గా ఉన్న కుర్రాడితో అతడి తల్లిదండ్రులు దిగారు.

వాళ్ళందరిని సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకెళ్ళాడు అమ్మాయి తండ్రి.

బహుశా ఆ అమ్మాయికి పెళ్ళి చూపులనుకుంటా.. మనసు ఎందుకో కలుక్కుమంది.

కొంతసేపటికి అందరూ వెళ్ళిపోయారు.

రెండు మూడు రోజులు కనిపించలేదుగాని తర్వత బాల్కనీలోకి వచ్చిందామె.

నిరాశాపూరిత ఆమె కళ్ళు 'పెళ్ళిచూపులు ఫెయిల్' అన్న భావాన్ని నా కళ్ళకి ట్రాన్స్ఫర్ చేశాయి.

నా మనసు ఆనందపారవశ్య నృత్యం చేసింది. బహుశా తనెప్పటికైనా నా సొంతమవుతుందన్న ఆలోచన దానికి కారణమేమో?

***

రైటర్ పెన్-


చూసి, పెదవి విరిచి వెళ్ళిపోయే సంబంధాలతో విసిగిపోయిన ఆమె, ఎప్పటికైనా అతను సాహసం చేసి తనకు జీవితాన్నిస్తాడనుకుంటోంది.

సంస్థల ఎంట్రన్స్, ఎగ్జిట్ల మధ్య తిరిగీ.. తిరిగీ విసిగి వేసారిపోతున్న తనకు చిన్నపాటి ఉద్యోగం దొరికినా, వాళ్ళింటికెళ్ళి ఆమెనడిగే ధైర్యం చేయొచ్చనుకుంటున్నాడతను.

మనసుల మధ్య ఏర్పడ్డ వారధి ఆ ఇద్దరినీ కలుపుతుందా..ఏమో? రెండు జీవితాల కథ కంచికి చేరకుండా రిటన్ అవ్వాలని కోరుకుందాం.


***


No comments:

Post a Comment

Pages