నాకు నచ్చిన నాకథ - జీవనది - అచ్చంగా తెలుగు

నాకు నచ్చిన నాకథ - జీవనది

Share This

జీవనది (కథ)

కొత్తపల్లి ఉదయబాబు 


"ఎంతసేపు ఉద్యోగము వృత్తి ధర్మమేనా? 45 ఏళ్లు దాటాయి. ఇకనైనా ఆధ్యాత్మిక తత్వం అలవాటు చేసుకుని, రోజూ సంధ్యావందనం చేయి నాయనా! సూర్య నమస్కారాలు చేసావంటే యోగా చేసినట్లే. ఒక్క పది నిమిషాల పాటు శ్వాసపై ధ్యాస ఉంచి ధ్యానం చేసావంటే నీ టెన్షన్స్ అన్నీ తగ్గి మానసిక శాంతి కలుగుతుంది . తద్వారా ఆరోగ్యం బాగుంటుంది. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడివి. నువ్వు ఎంత కష్టపడి బోధిస్తావో నాకు తెలుసు. నీ ఆదాయం అంతా నీ కష్టార్జితం. అంటే నువ్వు చెమటోడ్చి సంపాదించిన డబ్బు. దానిని మొక్కు పేరుతో దేవునికి వెచ్చించేకన్నా మానవత్వాన్ని చూపించడానికి ఖర్చు పెట్టు. నీ జన్మ ధన్యం అవుతుంది. చాదస్తంతో చెబుతున్నాను అనుకోకు. అర్థం అయిందా?"


ఇంట్లో ఉన్నన్ని రోజులు అమ్మ నా నరనరానా ఇంకిపోయేలా చెప్పిన మాటలను వేదవాక్కు గా భావించి, అనుసరిస్తూ కార్తీకమాసంలో యాత్రకు బయల్దేరాను కుటుంబంతో సహా.


ఇకపై ప్రతీ కార్తీకమాసంలో ఒక రోజు యాత్ర చేద్దాం అన్న సంకల్పం పెట్టుకున్నాను.ఆ నిర్ణయానికి నా భార్య, పిల్లలు ఎంతో సంతోషించారు.


టాక్సీ మాట్లాడుకుని ఉదయం అయిదింటికల్లా బయల్దేరాం .ఆకలేస్తే దారిలో తినడానికి కావలసిన పదార్ధాలను ఓపికగా అర్ధరాత్రి ఒంటిగంట కే లేచి సిద్ధం చేశారు నా భార్య ప్రభావతి, కుమార్తె గాయత్రి.


అనుకూలవతి అయిన భార్య, వినయ విధేయతలు కలిగిన పిల్లలు ఉండడమే భగవంతుడు నాకు ప్రసాదించిన వరం.


మా యాత్ర పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి దర్శనం తో ప్రారంభమైంది.

దారిలో పెనుగొండలో వాసవీ కన్యకా పరమేశ్వరి క్షేత్రం, లక్ష్మీనారాయణ కోవెల, అష్టలక్ష్మీ దేవాలయం దర్శించడం జరిగింది.


రావులపాలెం మీదుగా ద్వారపూడి దర్శించుకుని, ద్రాక్షారామం లో అభిషేకం చేయించుకుని కోటిపల్లి  క్షేత్రానికి చేరుకున్నాం.


కోటిపల్లి దేవాలయం మూసివేశారు. మరో రెండు గంటలలో తెరుస్తారట.  స్వామిని దర్శించుకునే వెళ్దాం అని నిర్ణయించుకున్నాం.


అందుచేత కారు మళ్లీ ఎంచుకుని గోదావరి తీరానికి చేరుకున్నాం .గుడికి కొద్దిదూరంలో గోదావరి గలగలా  ప్రవహిస్తోంది.


అక్కడకు అప్పటికే మాలాగా చేరుకున్న ప్రయాణికులు రావి చెట్టు చుట్టూ కట్టిన అతి విశాలమైన గట్టుమీద సేద తీరుతున్నారు. కొందరు తింటున్నారు .


యువకులు గోదావరి తల్లి ఒడిలో జలకాలాడుతున్నారు .పెద్దలు హెచ్చరిస్తూనే ఉన్నారు.


చంటి పిల్లలు గంతులు వేస్తున్నారు .నీళ్ళల్లో కేరింతలు కొడుతూ ఆడుతున్నారు. గోదావరి మీద నుంచి రివ్వున వీస్తున్న చల్లటి గాలులు ఆ మధ్యాహ్న సమయంలో ప్రాణం పోసే అమృతధారల్లా సృశిస్తున్నాయి.  శరీరంతో పాటు మనసు ఆహ్లాదంతో తేలిపోతోంది. అంతరంగం తెలియని ఆనందంతో పరవశమై ఒక అద్భుత అనుభూతిని ఆవిష్కరిస్తోంది. శ్రీమతి, పిల్లలిద్దరూ గట్టు మీద కూర్చున్నారు.


నేను మీ మెట్లు దిగి రేవులోకి వచ్చాను.  కుర్రాళ్ళు అటూ ఇటూ ఈదుతున్నారు.


పదేళ్లు ఎనిమిదేళ్లు ఉన్న ఇద్దరు పిల్లలు మాత్రం నీళ్ళల్లో నుంచి బయటికి వచ్చి నా కేసి ఆశగా చూస్తున్నారు.  తెల్లని కళ్ళతో,నల్లని నలుపుతో ఒక పూట తింటే మరొక పూట తినని వాళ్ళలా ఉన్నారు వారిద్దరూ.


పెద్ద వాడీకి ముందు రెండు పళ్ళు ఊడిపోయాయి .చిన్నవాడు గుండుతో ఉన్నాడు. వాళ్ల ఒంటిమీద ఉన్న నీలం రంగు నిక్కరు తన ఉనికిని నామమాత్రంగా మిగుల్చుకుని శిథిలావస్థలో ఉంది.

ఎండ పడిన  వారి తడి శరీరఛాయ వింత కాంతితో మెరుస్తోంది.


మందపల్లి శనీశ్వర స్వామి వారసుల్లా  నన్ను పరిశీలించి నా వంక చూస్తూ ఉంటే " ఏం కావాలి ?" అని అడిగాను.


" గోదాట్లో డబ్బులు ఎయ్యరా?" అడిగాడు పెద్దాడు.


"వాళ్ళు అలాగే అడుగుతారు. మీరు వెయ్యకండి మాష్టారు" అని ఈదుతున్న కుర్రవాళ్ళ లో ఓ పెద్ద కుర్రాడు అరిచాడు.


" వేస్తే ఏం చేస్తారు?" అడిగాను.


" ఏసీ సూడండి' అన్నాడు  వెకిలిగా నవ్వుతూ.


నాకు మళ్లీ అమ్మ జ్ఞాపకం వచ్చింది.


చిన్నతనంలో రాజమండ్రి పిన్నిగారి ఇంటికి రైల్లో వచ్చినప్పుడల్లా నాకు ఒక చిల్లర నాణాన్ని ఇచ్చి గోదావరిలో వేయమనేది .తను కూడా వేసేది. ఆ తర్వాత కన్నులు మూసి నమస్కరించుకుని నా చేత నమస్కారం పెట్టించేది.


"ఎందుకలా చెయ్యాలమ్మా?" అని అడిగాను ఓసారి .


"ఆ తల్లి జీవనది. జీవనది అంటే  కాలం తోనూ  ఋతువులతోనూ సంబంధం లేకుండా నిరంతరము ప్రవహించేది. ఎండిపోనిది. ఆ తల్లి దయ వల్లే మనకు ఎన్నో రకాల పంటలు పండుతున్నాయి. ఆ పంటలు తినే  మనం జీవిస్తున్నాం బ్రతుకుతున్నాం. మనకు జీవనాధారమైన ఆ తల్లికి నమస్కరించుకోవాలా వద్దా?"


నేను మళ్ళీ మాట్లాడలేదు .


అమ్మ మళ్ళీ నాతో ఇలా అంది "మా చిన్నప్పుడు రాగి నాణేలు వేసేవాళ్ళం. అందువల్ల నీళ్లు ఎంతో పరిశుభ్రంగా ఉండేవి. ఇప్పుడు అంతా వ్యర్థ పదార్థాల కాలుష్యం, ప్లాస్టిక్ సంచులు, అల్యూమినియం లోహాలతో చేసిన నాణేలు. అందుకే ఇకమీదట ఎపుడూ నాణాలు  వెయ్యకు. నీకు చేతనైతే ఆకలితో ఉన్న పేదవాడికి ప్రాణం నిలబెట్టే 'టీ' తాగడానికి ఆ నాణేలు దానం చేయి."


నేను ఉద్యోగం సంపాదించాక గోదావరి మీద ప్రయాణం లో చిల్లర వేయడం మానేశాను. నమస్కారం చేసుకుంటూ అమ్మ చెప్పినట్టుగా ప్రార్థించడం అలవాటు చేసుకున్నాను.


రైల్లో ప్రయాణికుల పిల్లలు  విసిరినప్పుడు రైలు వేగానికి అవి నేరుగా గోదావరి నీళ్లలో పడకుండా బ్రిడ్జి కి తగిలి దాని మీద పడి పోయేవి.  'నీకు వేయడం రాదు' అని పెద్దలు పిల్లల్ని కోప్పడేవారు.


" చిల్లర వెయ్యమని ఆ గోదారి తల్లి అడగలేదు కదా?" అన్నా ఒకసారి.


" నువ్వు అడగడం లేదని ఆ తల్లిని  నీరివ్వడం మానేసిందా?"అంది ఆవిడ ఎదురు ప్రశ్న వేసి.


మరి మాట్లాడలేదు నేను. అప్పటి నుంచి నాణేలు వేసే వారిని చూసి నవ్వడం తప్ప సలహాలు ఇవ్వడం మానుకున్నాను.


ఆ సందర్భమే గుర్తొచ్చింది నాకు ఇప్పుడు.


జేబులోంచి నాణెం తీసి విసిరాను. సరిగ్గా నాణెం పడిన చోటులో రెప్పపాటుకాలంలో దూకేశాడు పెద్దోడు.


నా గుండె గుభేల్ మంది. దానికి కారణం రెండు నిమిషాలైనా వాడు పైకి రాకపోవడం. అయోమయంగా చూస్తున్న నాకు గొంతు తడారిపోయింది. ఒక్కసారిగా నీటిమీద తేలాడువాడు.


వాడి అరచేతిలో తడిగా ఉన్న నాణెంపై సూర్యకాంతి పడి నా కళ్ళల్లోకి పరావర్తనం చెందింది. ఆ నాణాన్ని నాకు ఇస్తాడు అనుకున్నాను. వాడు  తన జేబులో వేసుకున్నాడు.


"ఆడికేసారు. మరి నాకు ఎయ్యారా?" అడిగాడు చిన్నాడు .


"నీకూ ఈ విద్య వచ్చా?"


"ఓ ఎయ్యండి బాబు" అన్నాడు జాలిగా.


మరో రూపాయి వేసాను.  వాడు నాణెం పడ్డ చోటే సరిగ్గా దూకేసాడు.


ఈసారి నేను కంగారు పడలేదు. వాడు అలాగే నాణెం తో పైకి వచ్చాడు.  దాన్ని జేబులో వేసుకున్నాడు.


" ఇప్పటికీ ఎంత పొగయింది రా?" అడిగాడు పెద్దాడు తన జేబులో ఉన్న గుడ్డముక్కలో కట్టిన చిల్లర నాణాలు లెక్కపెడుతూ.


"38. మరి నీకు ?"


"42" అన్నాడు పెద్దవాడు.


" అయ్యగారు! అమ్మ గారి చేత, పాపల చేత కూడా వేయించండి" అన్నాడు జాలిగా.


" మీరిద్దరూ చదువుకుంటున్నారా?" అడిగాను.


" ఆడు అయిదు సదువుకుంటున్నాడండి. నేను ఒకటి సదువుకుంటున్నాను." చిన్న వాడి సమాధానం.


" మరి ఈ వేళ స్కూలు ఉందిగా. వెళ్లలేదే?"  నా మాట పూర్తికాకుండానే -


"అదిగో మాస్టారు. అక్కడ ఉన్నారు మీ శిష్యులు ఇద్దరూను. వెళ్లి పట్టుకోండి" అన్న మాటలు వినబడి వెనక్కి తిరిగాను.


" ఒరేయ్ వెధవల్లారా! ఇక్కడ జలకాలాడుతున్నారా? మీ చదువులు కాదు గానీ మా ప్రాణాలు తీసేస్తున్నారు. మీకోసం మధ్యాహ్నం భోజనం సిద్ధంగా ఉంది దయచేయండి" అంటూ మెట్లు హడావుడిగా దిగబోతూ తడబడి పడబోయి తమాయించుకున్న పంచ కట్టు మాస్టారు మా దగ్గరగా వచ్చాడు.


" ఈయాల మా కోటా ఇంకా పూర్తి కాలేదు సారూ. మా అన్నం మీ కాడే ఉంచండి. లేదంటే మీరు మాకు అన్నం సరిగా పెట్టటంలేదని  పెద్ద సార్ వచ్చినప్పుడు సెప్పెట్టాను"అన్నాడు చిన్నవాడు.


"ఒరినీ అసాధ్యం కూలా. చివరికి బ్లాక్మెయిల్కు దిగావన్నమాట.  ఈ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా పని చేయడం కన్నా అడుక్కుతినడం అనుకోండి మాస్టారు." అన్నాడతను నన్ను ఉద్దేశించి.


నేను అతని గుర్తు పెట్టాను.


" మీ పేరు  శంకరమేనా? మీరు మచిలీపట్నం లోనే బీఈడీ చేసారు కదూ" అడిగాను ఉత్సుకతతో.


"అవును మీరు... మీరు... రాజశేఖరం కదూ. ఒరేయ్ .ఎంత కాలం అయింది నిన్ను చూసి? ఇంతకీ ఎక్కడ ఏం చేస్తున్నావ్?''నా భుజాలు గుచ్చిపట్టుకుని ఉత్సాహంగా అడిగాడు శంకరం.


అంతే.కబుర్లలో పడిపోయాం.ఉభయ కుశలోపరి తో ప్రారంభించి పావుగంట మాట్లాడుకున్నాం.

ఫోన్ నెంబర్లు పరస్పరం మార్చుకున్నాకా "ఇంక వెళ్తానయ్యా శేఖరం. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు. నాకున్న పిల్లకాయలలో వీళ్ళు పిడుగులు.అన్ని పనుల్లోనూ తల్లో నాలుకలా ఉంటారు. వీళ్ళ అమ్మ ఎయిడ్స్ పేషెంట్ .మంచం లో పడి ఉంది. వీళ్ళిద్దరూ ఎయిస్ పేషంట్లే. ఇలా డబ్బు సంపాదించి ఆ తల్లికి వైద్యం చేయిద్దామని వారి ఉద్దేశం . అందుకే వాళ్లు అంటే నాకు కోపం రాదు. గుండెలనిండా జాలి ఉంది. బడికి రాకపోయినా హాజరు మేనేజ్ చేస్తూ ఏదో నాకు తోచిన ఇతరత్రా సహాయం చేస్తూ ఉంటాను. వస్తానోయ్ మరి. ఏమర్రా.. మీరు వచ్చేది ఏమైనా ఉందా? అడిగాడు శంకరం వారిని ఉద్దేశించి.


" అక్కడ భోజనాలు పూర్తయ్యేపాటికి వచ్చేత్తామ్ సార్ "అన్నాడు పెద్దవాడు.


" వస్తాను శేఖరం" అంటూ పంచ సరికుంటూ వెళ్ళిపోయాడు శంకరం.


" పిల్లలు ఇలా రండి!" అంటూ వారిని పిలిచాను దగ్గరగా.


వాళ్ల మాస్టారు నా స్నేహితుడు అని తెలిసేసరికి వారికి నా మీద భయం పుట్టుకు వచ్చినట్టుంది.


"సెప్పండయ్యా!" అన్నాడు వినయంగా చేతులు కట్టుకుని పెద్దవాడు. అది చూసి రెండోవాడు కూడా చేతులు కట్టుకున్నాడు.


" మీ అమ్మ దగ్గరకు నన్ను తీసుకు వెళ్తారా?" అడిగాను


"ఓ రండి సారు" అంటూ చిన్నవాడు చెయ్యి పట్టుకున్నాడు చనువుగా.


వాళ్లని తీసుకొని ప్రభావతికి దగ్గరగా వచ్చిన నేను నా క్యాష్ బాగ్ అడిగి తీసుకుని


"గుడి తెరిచేలోపు వచ్చేస్తాను ప్రభా! ఇక్కడే ఉండండి కంగారు పడకండి" అని పెద్దవాడిని వాళ్ళ ఇల్లు చూపమని అనుసరించాను .వారి ఇల్లు గుడి వెనుక సందు చివర ఒక పూరిపాక.


మంచంలో జవసత్వాలు కోల్పోయిన శరీరంతో 20 లోనే 60 వచ్చినట్టుంది వారి తల్లి కుక్కి మంచం లో.


పిల్లల అలికిడికి -

"బడికి పోయి వణ్ణం తిన్నారా లేదా?" అంటూ ఇటు తిరిగిన ఆమె నన్ను చూస్తూనే ఒక్కసారిగా లేచి నిలబడి కట్టుకున్న పాత ముతక చేనేత చీర కొంగును భుజం చుట్టూ కప్పుకుంది.


"అమ్మా. మన శంకరం సారుగారి స్నేహితులంట. నిన్ను సూడాలని వచ్చారు" అన్నాడు పెద్దోడు.

చిన్నోడు గోడవారగా ఉన్న ఫైబర్ కుర్చీ తెచ్చి వేశాడు.


" నువ్వు తల తుడుచుకుని వెళ్లి మీ శంకరం సార్ ని నేను ఇక్కడికి రమ్మన్నాను అని చెప్పి దగ్గరుండి తీసుకురా" అన్నాను.


"అలాగేనయ్యా" అంటూ రెండోవాడు తారాజువ్వలా పరిగెట్టేసాడు.


" మీరు కూసోండి బాబు. అరెయ్ .పెద్దోడా.నువ్వెల్లి టీ అట్రా!" నేను వద్దు అనేలోగానే పెద్దవాడు తల్లి మాట వింటూనే తుర్రుమన్నాడు.


" నీ పేరు?"


" లచ్చమ్మ బాబు"


" ఏం చేస్తున్నావ్?"


" మా మామ మా ఊర్లో అందరి కుర్రాళ్ళతో సావాసం చేసి సెడిపోయాడు బాబు.అట్టాంటోడని తెలిసి బాగుపడతాడని ఆడికి నన్నిచ్చి మనువు సేశారు. ఆడికి  ఎయిడ్స్ జబ్బు ఉందంట. రెండోవాడు పుట్టినాక ఏడాదికి సచ్చిపోనాడు.  ఆ జబ్బు నాకు అంటుంకుందంట. అందుకని ఏ పని సేద్దాం అన్నా నన్ను ఎవరూ పనిలోకెట్టుకోడంలేదు బాబు. పైగా అదేదో మాయదారి జోరం వచ్చి కుంగదీత్తావుంటే మంచం లో పడి ఉంటన్నాను. ఈ ఇద్దరు ఎదవలకి ఓ అచ్చరం ముక్క వత్తే, ఏ చిన్న పనైనా చేసుకుని బతుకుతారని ఆశ.  నా జబ్బు నా పిల్లలకి కూడా సోకిందంట. ఆ ఎదవలకి ఈ ఇసయం తెలీదు. సిన్నతనం. రోజు శంకరం మాట్టారుగోరు వచ్చి తీపి మాత్తర్లు ఇచ్చి ఎళ్తారు . ఇదండి బాబు మా బతుకు. బతికుండి ఎవరికి ఉపయోగం లేని బతికయిపోయినాది బాబు" అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది ఆమె.


"బాధ పడకు లచ్చమ్మా.  నీ బిడ్డలు బాగా చదువుకోవాలి అంతేగా.ఎయిడ్స్ వచ్చినంత మాత్రాన మనిషి వెంటనే చచ్చిపోడు.  నువ్వు ధైర్యం తెచ్చుకుని పిల్లలకు నీకు చేతనైనంత వరకు మంచి చెడు  తెలిసేలా చెప్పు. వాళ్లే తెలుసుకుంటారు." అన్నాను నేను.


అంతలోనే శంకరం తో చిన్నోడు, వారి వెనుక పెద్దాడు  - 2 టి గ్లాసులతో లోపలకువచ్చారు. చెరో టీ గ్లాసు అందుకున్నాను.


" ఇదేంటి శేఖరం ?ఇక్కడికి వచ్చారు." ఆశ్చర్యపోతూ అడిగాడు శంకరం.


" చెప్తాను... పిల్లలు... మీ ఇద్దరూ అలా కూర్చోండి'అన్నాను.


వాళ్ళిద్దరూ నేలమీద మఠం వేసుకుని కూర్చున్నారు.


"" మీ ఇద్దరూ చదువు మానేసి నీళ్లలో దూకి డబ్బు సంపాదిస్తున్నారు కదా . బడి మానేస్తే చదువు ఎలా వస్తుంది?" అడిగాను తప్పు చేసిన వాళ్ళలా శంకరం కేసి చూసి తల దించుకున్నారు వారిద్దరు.


" నిజం చెప్పండి. మీ అమ్మ మీ ఎదురుగా ఉంది. నిజంగా మీకు చదువుకోవాలని ఉందా?"


" మా అమ్మ మీద ఒట్టు సారు. బాగా సదువుకుని పెద్ద ఉద్యోగం చేసి అమ్మ కి వైద్దెమ్ సేయించాలని ఉంది. కానీ అంతవరకు ఎలా ఉండగలం ?అమ్మకేమో జొరం.అమ్మ లేకపోతే మాకు ఇంకా దిక్కెవరు  సారూ" అన్నాడు పెద్దాడు బేలగా .


"అందుకని నీళ్లలో దూకి గోదావరి తల్లి డబ్బులు తీసేసుకుంటే ఆ అమ్మ బాధ పడి నిన్ను  శపించదా ?"


"శపిత్తాదా? అంటే ఏంటి సారు?" చిన్నోడు అడిగాడు


" వీడికి అన్ని ధర్మసందేహాలే. శాపం అంటే తిట్టు రా .నీ దగ్గర ఉన్న డబ్బులు ఎవరైనా లాక్కుంటే  బాధపడతావ్ గదా. అలాగే గోదారమ్మ డబ్బులు లాక్కోవడం తప్పు కదా !"అన్నదమ్ములిద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు


"తప్పే సారూ"


"మరి ఆ డబ్బులతో మీ అమ్మకి వైద్యం చేయిస్తే  బాగుఅవుతుందా?" అడిగాను నేను .


"ఉహు"అని తల అడ్డంగా ఊపారు వారు.


" మరి అమ్మ కి తగ్గాలంటే ఏం చేయాలి?"


" ముందు బాగా చదువుకోవాలి .నీ చదువు చూసి  ఎవరైనా సరే మంచి ఉద్యోగం మీకే ఇవ్వాలి. మరి ఇక నుంచి మానకుండా బాగా చదువుకుంటానని అమ్మ మీద ఒట్టు వేయండి... మీ సారు చేతుల్లో ."అన్నాను.


"సారీ.ఒట్టేత్తే... అమ్మ కి ఏమన్నా అయితే?" పెద్ద వాడు సందేహపడ్డాడు భయంగా.


" అమ్మకి ఏమీ అవ కూడదు అనుకుంటే శ్రద్ధగా బడికి మానకుండా రండి . బాగా చదువుకోండి "అన్నాడు శంకరం


" అలాగే సారు అమ్మ మీద ఒట్టు గా బాగా చదువుకుంటాము. ఏరోజు మేడం బడి మానము."


" మరి అమ్మ అంటే ఎవరు ?"


"తల్లి దైవము. తండ్రి ధనము. గురువుని మించిన దైవం లేదు. మాకు రోజు స్కూల్లో సేబుతారు సారూ"అన్నారు వాళ్ళిద్దరు.


నేను శంకరం వైపు తిరిగాను.


"ఈనాటి వ్యవస్థలో ఉపాధ్యాయులు కావడం మన అదృష్టం .నువ్వు ప్రాథమిక పాఠశాలలో అయితే నేను ఉన్నత పాఠశాల లో. ఇంత యాదృచ్చికంగా నిన్ను కలుస్తాను అని నేను అనుకోలేదు. మా అమ్మగారు చెప్పినట్లు ఆచరించదలుచుకుని ఈ ప్రయాణం ప్రారంభించాను.


నా ఉద్యోగం వచ్చినప్పటి నుంచి నెలకు 500 చొప్పున పోస్టల్ ఆర్డి కట్టాను. నేను తీర్థయాత్ర చేయవలసి వచ్చినప్పుడు ఆ సొమ్మును నిత్యాన్నదాన పథకం నిర్వహించే  కోవెలకు విరాళంగా ఇవ్వాలని అనుకున్నాను. కానీ మా అమ్మగారు మానవ సేవే -  మాధవ సేవ, దైవత్వానికంటే మానవత్వానికి విలువ ఇవ్వు నాన్న . ఆ మానవత్వం లోనే దైవత్వాన్ని దర్శిస్తావు నువ్వు." అని చెప్పారు.


మనిషి జీవితానికి అమ్మ ఒక జీవనది అలల మీద బ్రతుకు నావను నడిపించుకునే పిల్లలలం మనం. ఆమె లోని ప్రతి అణువు అమృతం చిలికిస్తుంది. ప్రతి మాట మనల్ని చుక్కానిలా నడిపిస్తుంది .


అందుకే ఆ స్వామివారి అన్నదాన పథకానికి తెచ్చిన సొమ్మును ఈ అమ్మను బ్రతికించుకోవాలనుకునే ఈ పిల్లల చదువు నిమిత్తం నీకు అందచేస్తున్నాను.వారు ఎంతవరకు చదువుకోగలరో అంతవరకు ఈ డబ్బు ఖర్చు చేయి. ఒకవేళ చాలకపోతే నాకు ఉత్తరం రాయి .మళ్లీ పంపిస్తాను . ఈ ఒక్క సహాయం చేసి పెట్టు.  ఒక ప్రముఖ శైవ క్షేత్రంలో ఒక మంచి పని చేశాను అన్న తృప్తి నాకు మిగలనివ్వు. సరేనా?" అన్నాను బ్యాగ్ తెరచి   60,000  అతనికి అందిస్తూ .


నీళ్ళు నిండిన కళ్ళతో శంకరం నన్ను గాఢంగా హత్తుకున్నాడు.


"నాకు ఇదంతా కలగా ఉంది శేఖరం. అమ్మ విలువ తెలిసిన వాడివి నువ్వు. నిన్ను కన్న తల్లి నిజంగా జీవనది. నీ కోరిక సిద్ధించేలా నా వంతు కృషి చేస్తానని, నేను నమ్మిన శివుని సాక్షిగా మాట చేస్తున్నాను" అన్నాడు నా చేతిలో చేయి వేసి ప్రమాణం చేస్తున్నట్టుగా.


కోవెల తెరిచినట్టుగా దూరం నుండి గుడిగంటలు తదేకంగా వినిపించసాగాయి!!!


 ***


No comments:

Post a Comment

Pages