నాకూ మనసుంది - అచ్చంగా తెలుగు

నాకూ మనసుంది 

లక్ష్మీ మురళి 



కార్తీకమాసపు చల్లగాలులు నెమ్మదిగా వీస్తున్నాయి. రాత్రంతా నైట్ క్వీన్ పరిమళాలతో కలిసి ఆడిన గాలి అప్పుడే తెరిచిన తలుపులో నుంచి లోపలికి వచ్చింది.


రోజూలాగే సరోజ, పక్కింటి శారదమ్మ స్నానానంతరం పెరట్లోకి వచ్చారు పూజకి పూలు కోయడానికి.సరోజ శివ పంచాక్షరీ చదువుతూ పూలు కోస్తోంది.


"సరోజా!నీ కూతురికి త్వరగా పెళ్ళి చేయకపోతే,ఎవరో ఒకరు ఎత్తుకు పోతారు.మార్గశిరంలో మంచి ముహూర్తాలు ఉన్నాయిట." ఆటపట్టిస్తూ అంది శారదమ్మ.


"నా కూతురు బంగారు తల్లి.దాన్ని ఎత్తుకెళ్ళాలంటే,ఏ రాకుమారుడో రావాలి" అంది సరోజ నవ్వుతూ.


నిజమే..సుధ సన్నజాజి తీగ.చిదిమితే కందే బుగ్గలు, పొడవాటి జడ.అంతకు మించిన సంస్కారం.ఈమధ్యే ఒక కాలేజీలో ప్రొఫెసర్ గా ఉద్యోగం వచ్చింది.ఒక్కతే కూతురని గారాబం చేసినా;బాధ్యత, సంప్రదాయాలను నేర్పుతూ పెంచారు సరోజ, రామారావు దంపతులు.


శారదమ్మ నోటి చలవో ఏమో, ఒక బ్యాంక్ ఆఫీసర్ సంబంధం వెదుక్కుంటూ వచ్చింది రెండు రోజుల్లోనే.ఇద్దరూ ఒకరికొకరు నచ్చడంతో,మార్గశిరం లో పెళ్లి వైభవంగా జరిగింది.


అప్పగింతలప్పుడు ఎంతో ధైర్యం చెప్పాడు సుధ, అత్తమామలకి. అన్నట్లే ఎంతో బాగా చూసుకునేవాడు. సుధ మూడు నెలలు శలవు పెట్టి,అధికారులను రిక్వెస్ట్ చేసి,నందన్ ఉన్న ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకుంది.

  ***** 

తను కలలుగన్న రాకుమారునే పతిగా పొందినందుకు పొంగిపోయింది సుధ.వాళ్ళకి రెండేళ్ల కొడుకు,సుధన్.


చుట్టుపక్కల వాళ్ళంతా ఇంచుమించు ఇంట్లో ఉండే బ్యాచే.


సుధ, అప్పుడప్పుడు పలకరించినా ఏదో ఒక పుల్లవిరుపు మాట అనేవారు.అవన్నీ నవ్వుతూ స్వీకరించడం అలవాటైపోయింది సుధకి.


వాళ్ళలా ఇరుగూ పొరుగు వారిపై చాడీలు, అత్తగారు,భర్త గురించి మాట్లాడదు సుధ.సుధ,నందన్ ల అన్యోన్యత కూడా వాళ్ళకి కంటగింపే.నందన్ తో అంతా బాగానే ఉంటారు.ఆ ఈర్ష్యంతా సుధ పైనే చూపిస్తూ, ఎక్కువ పలకరించరు.

  ***** 

నందన్ మంచివాడే.సుధ అడిగినదేదీ కాదనడు.పనిలో కూడా ఒకరికొకరు సహాయంగా ఉంటారు.చుట్టుపక్కల స్నేహితులుగా చెప్పుకునే వారు లేరు.బంధువులు, తల్లి దండ్రులు ఎక్కడో దూర తీరాల్లో. ఒక్కోసారి బాధనిపించినా, నందన్ ప్రేమతో అన్నీ మర్చిపోతుంది.


పెళ్ళైన సంవత్సరానికి, డిగ్రీలో రాఖీ కట్టే సుమంత్ ఫోన్ చేస్తే..ఆ రోజంతా నందన్ విసుగ్గా మాట్లాడడం, రెండు రోజులు ముక్తసరిగా జవాబివ్వడం సుధకి చాలా బాధ కలిగించింది.మొదటిసారి భర్త అలా ప్రవర్తించడంతో చిత్రంగా అనిపించింది.


ఒకరోజు సుధ కొలీగ్ రవి, కొత్త సంవత్సరానికి రాత్రి పన్నెండుకు మెసేజ్ పెడితే,"వేళాపాళా లేదా, మెసేజ్ పెట్టడానికి?" అని విసుక్కున్నాడు నందన్.


మర్యాదకోసం రిప్లై ఇవ్వాలనుకుని కూడా ఆగిపోయింది సుధ.రవి చాలా మంచివాడు.సుధ కంటే ఐదేళ్ళు చిన్నవాడు.సిన్సియర్ గా పనిచేసే సుధంటే చాలా గౌరవం.


"మేడమ్!మీరూ,సర్ ఏ సంబంధం చూసినా, కళ్ళు మూసుకుని చేసుకుంటాను. మాయింట్లో పెళ్ళిగోల ఎక్కువైపోయింది" అనేవాడు సుధతో.


కానీ, నందన్ తో ఇలా రెండు మూడు సార్లు జరిగేసరికి, తల్లిదండ్రులు చెప్పినట్లు భర్తకు అనుకూలంగా నడుచుకోవాలని ఇక స్నేహితులెవరి ఫోన్లూ రిసీవ్ చేసుకోవడం మానేసింది సుధ.


తన కొలీగ్స్ లోని జెంట్స్ తోకూడా మాట్లాడడం తగ్గించేసింది. దానివల్ల, చాలా మంది సుధకి అహంకారం అనుకునేవారు.


ఇక్కడా స్నేహితులు లేరనే బాధ ఉన్నా,భర్తకి తనపై ఉన్న ప్రేమతో పాటు సుధన్ పుట్టాక పూర్తిగా బిజీ అయిపోయింది సుధ.


మామూలుగానే,సుధ కాలేజ్ లో ఎక్కువ మాట్లాడదు.తన పనితో పాటు, అవసరమైనంత మేరకు సమాధానమివ్వడం చదువుకునే రోజుల్లో కూడా అలవాటు తనకి.


మధ్యతరగతి సంప్రదాయ కుటుంబంలో పెరిగిన సుధకి మొదటి నుంచీ బాధ్యతగా ఉండడం, పెద్దలకు మర్యాదివ్వడం అలవాటు.


నందన్ తో మాత్రం తన కొలీగ్స్, చుట్టుపక్కల బ్రాంచెస్ లో పని చేసే జూనియర్స్ ఆడ,మగ వాళ్ళు కూడా వర్క్ విషయాలతో పాటు తమ స్వవిషయాలు కూడా తరచూ ఫోన్లో మాట్లాడుతూనే ఉంటారు.ఎవరికే అవసరమైనా,నందన్ కే కాల్ చేస్తారు తన మంచితనం వల్ల.

 **** 

ఒకరోజు నందన్ కి చిన్న యాక్సిడెంట్ అవడంతో కొలీగ్స్ అంతా వచ్చారు.వాళ్ళందరికీ టీ పెట్టి ఇచ్చింది సుధ.


ఆ బ్రాంచ్ లో కొత్తగా జాయినయిన జాస్మిన్ సోఫాలో స్థలం లేకపోయినా, ఇరుక్కుని ఇంచుమించు నందన్ ఒళ్ళో కూర్చున్నట్లే కూర్చుంది.


మిగతా వాళ్ళు సుధని అదోలా చూడడంతో, మొదటిసారి సుధకి నందన్ ప్రవర్తన ఏదోగా అనిపించింది.


తనకి పరోక్షంగా పెళ్ళైన కొత్తలోనే ఎలా ఉండాలో నేర్పిన నందన్,'తనైనా దూరంగా వచ్చి,తన దగ్గర కూర్చోవచ్చు కదా!'అనుకుంది.


అంతలోనే,'ఇంత చదువుకున్న తనూ ఇలా ఆలోచిస్తోందేంటి?' అని,'ఇలాంటి ఆలోచన నందన్ గురించి అసలు రాకూడదు.' అని అనుకుంది సుధ. వాళ్ళకి తగిన మర్యాదలు చేసి పంపింది.


రాత్రి నిద్ర పట్టకపోవడంతో బాల్కనీలోకి వచ్చింది.'నందన్ ఎంత మంచివాడైనా,అవతలి లేడీస్ కి అంత చనువివ్వడం సరికాదేమో!' అనుకుంది మనసులో. నందన్ కి తనే సర్వస్వం కాదేమో' అనే ఆలోచన కలిగింది మొదటి సారి.


'అందునా జాస్మిన్ చాలా స్పీడు, పెళ్లి కాని పిల్ల.ఎవరైనా లేనిపోనివి పుట్టిస్తే?'తర్వాత రోజు మళ్ళీ నందన్ ప్రేమగా మాట్లాడేసరికి ఆ విషయం మర్చిపోయి, మామూలైపోయింది.


నందన్ మాత్రం;తన చిన్ననాటి స్నేహితులు, కొలీగ్స్, ఫ్రెండ్స్ ఎవరినీ ఒదులుకోడు.చిన్నప్పటి స్నేహితురాలు కమల తరచూ ఫోన్ చేస్తుంది.


ఒకోసారి సుధతో కూడా రెండు నిమిషాలు మాట్లాడుతుంది.తనెందుకో పెళ్లి చేసుకోలేదు. కారణం తను లావుగా,నల్లగా ఉండడమే అని చెప్పాడు నందన్ ని అడిగితే.


పెళ్ళైన పదేళ్ళకి సికింద్రాబాద్ స్టేషన్ లో మొదటి సారి చూసింది కమలని.వాళ్ళ సిస్టర్ ఇంటికి వచ్చిందిట.ఫోన్ పరిచయం ఉండడంతో,సుధ కూడా తనని పలకరించింది ఆప్యాయంగా.


ట్రైన్ ప్లాట్ ఫాం పై ఉండడంతో,ఐదు నిమిషాలు కూడా మాట్లాడనీకుండా సుధని కంగారుగా, "ట్రైన్ ఎక్కేంద్దాం పద" అని మూడో ప్లాట్ ఫాం కి ఎస్కలేటర్ మీంచి తీసుకెళ్ళాడు.


 లగేజ్ అంతా సర్దాక ప్రమాదం అని సుధ అరుస్తున్నా వినకుండా, మొదటి ప్లాట్ ఫాం లో ఉన్న కమల దగ్గరకు మధ్యలో ట్రాక్ దాటి వెళ్ళి అరగంట మాట్లాడుతూ, చిన్ననాటి కబుర్లేమో..తెగ నవ్వుకుంటున్నారు.


బ్యాంక్ ఆఫీసర్ గా ఎప్పుడూ టెన్షన్స్ తో ఉండే నందన్,ఇలా చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుంటూ, చాలా ఎక్సైట్ అవుతూ మనఃస్పూర్తిగా నవ్వడం చూసిన సుధ చాలా ఆనందించింది,ఆ క్షణంలో.


కానీ సెండాఫ్ ఇవ్వడానికి వచ్చిన అత్తగారు,"డోర్ దగ్గరకెళ్ళి పిలువమ్మా.వాడికి కమలంటే ఉన్న అభిమానానికి ట్రైన్ కదిలినా పట్టించుకోడు." అనే సరికి వెళ్లి పిలిచింది.


' వస్తాడండీ' అన్నట్లు ఆ అమ్మాయి చెయ్యి ఊపింది గానీ,నందన్ వెనక్కి తిరిగి కూడా చూడకపోవడం మనసుకి ముల్లు గుచ్చినట్లైంది.


అలా ఐదు సార్లు బెర్త్ నుంచి డోర్ కి పరుగెత్తించింది అత్తగారు సుధని, ముసిముసిగా నవ్వుకుంటూ.పుండు మీద కారం జల్లినట్లైంది సుధకి.


తనకీ లోకంలో భర్త, కొడుకు తప్ప ఎవరూ అంత దగ్గర వాళ్ళు లేరు.కనుక భర్తతో ఎప్పుడూ ఇలాంటి బాధలు పంచుకోదు.తనలో సుడిగుండాలు తిరుగుతున్నా, ఎదుటివారికి చెప్తే,అది చిన్న అలలా అనిపించవచ్చు.


సుధని కూడా ఎప్పుడూ కట్టడి చేయకపోయినా, పరోక్షంగా అసహనం వ్యక్తం చేస్తాడు నందన్.తనతో కంటే,బయటి వారితో మాట్లాడేటప్పుడు ఎక్కువ సంతోషంగా ఉంటాడు.


అతనికి ఇష్టం లేని పనులేవీ చేయదల్చుకోక, స్నేహాలు కూడా పెంచుకోకుండా భర్త,కొడుకే లోకంగా సంతోషంగానే ఉంటోంది సుధ. నందన్ చెడ్డవాడు కాదు.


లేడీస్ ని కూడా అక్కాచెల్లెళ్ళు, స్నేహితుల్లానే చూస్తాడు. కానీ,అతని మంచితనానికి, తెలివికి అతి చనువు తీసుకుంటారు చాలా మంది.అదే చెప్తే, తేలిగ్గా తీసుకుంటాడు నందన్.

 **** 

చాలా రోజుల తర్వాత ఇద్దరికీ శలవులు దొరకడంతో, సాయంత్రం మరువం,మొల్లలు కలిపి మాల కడుతోంది మెట్లపై కూర్చుని సుధ.


"చుట్టు ప్రక్కల గుడులవీ చూడాలంటున్నావుగా, రేపు వెళ్దాం" అన్నాడు నందన్, ఆఫీస్ నుంచి వస్తూ.


సుధకి కూడా కొంచెం మార్పు కావాలనిపించి, "సరేనండీ" అంది సంతోషంగా.


"అన్నీ గుళ్ళేనా?" అన్నాడు సుధన్."మధ్యలో వాటర్ ఫాల్స్ కూడా ప్లాన్ చేశానురా నీకోసం" అన్నాడు నందన్,సుధన్ ని గిరగిరా తిప్పుతూ.

 *** 

"ఏంటండీ! సైలెంట్ గా డ్రైవ్ చేస్తున్నారు?" అని నవ్వుతూ ఎఫ్ఫెమ్ ఆన్ చేసింది."ఈ మంచుకి తలపోటుగా ఉంది.సౌండ్ తగ్గించు" అన్నాడు నందన్.


తనకి మ్యూజిక్ అంత ఇష్టం ఉండదని తెలిసిన సుధ, ఎఫ్ఫెమ్ ఆపి,జండూబామ్ వ్రాసింది నందన్ నుదుటన.


ఓ గంట తర్వాత, దారిలో జాస్మిన్ కనబడింది. పుట్టింటికి వెళ్తోందిట. నందన్ కి ముందే తెలిసినా, తనతో షేర్ చేసుకోకపోవడం బాధనిపించింది సుధకి. కారాపి, ఎక్కించుకున్నారు.


పలకరింపుగా నవ్వింది సుధ.


అప్పటివరకూ తలపోటని విసుగ్గా డ్రైవ్ చేస్తున్న నందన్, జాస్మిన్ లు దిగేవరకూ బిగ్గరగా ఆఫీసు విషయాలు, అధికారులు, కొలీగ్స్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు.


మధ్యలో ఒక్కసారైనా సుధని  పలకరించాలనే స్పృహ లేదు నందన్ కి.గంట తర్వాత జాస్మిన్ వాళ్ళ ఊరిలో దిగిపోయింది "బై" చెప్పి.


ఆ గంటా ఏం చేయాలో తోచక,ఓపక్క తన ఉనికే తెలీనట్లు బిహేవ్ చేసిన నందన్ తనకు మానసికంగా చాలా దూరమై పోయాడనిపించింది.


అలాని వాళ్ళు మాట్లాడే మాటల్లో ఆఫీసు విషయాలు తప్ప, ఏమీ లేవు.


మొదటి గుడి చూసి,"ఇక ఇంటికి వెళ్దామండీ" అంది సుధ."అదేంటీ! ఈరోజు నీ కిష్టమైన వన్నీ చూపిస్తాను.." అంటూ హుషారుగా ఏదేదో మాట్లాడుతున్నాడు నందన్.


" మీ తలపోటు తగ్గి చాలా సేపైందే?! ఇప్పుడు నాకు విపరీతమైన తలనొప్పిగా ఉంది. వెళ్ళిపోదాం" అంది.కారు వెనక్కి తిప్పాడు నందన్.వాటర్ ఫాల్స్ క్యాన్సిల్ అయినందుకు సుధపై అలిగి కూర్చున్నాడు సుధన్.


తెలియని అసంతృప్తితో, వద్దన్నా వస్తున్న ఆలోచనలతో, కళ్ళు మూసుకుని,సీటు వెనక్కి తల ఆన్చింది.'ఇన్నేళ్ళూ కుటుంబం, ఆఫీస్ అనే లోకం తప్ప, స్నేహితులు లేకుండా చేసుకున్నాను.


దానివల్ల సుధన్ ఐఐటీలో సీటు సంపాదించే స్థాయికి రావడం సంతోషమే.ఇప్పుడు సుధన్ కూడా దూరంగా వెళ్ళిపోతాడు.


తన సంతోషం, దుఃఖం పంచుకునే వాళ్ళెవరూ లేరు.పెద్దవాళ్ళైన తల్లిదండ్రులను బాధపెట్టలేక, ఏ విషయం ఎప్పుడూ చెప్పుకోలేదు.


చెప్పుకునేంత పెద్ద విషయం కాదు, భరించేంత చిన్న విషయం కాదు ఒక సామాన్య స్త్రీకి.'


లోకమంతా ఒక్కసారిగా చీకటై, చంద్రుడు కూడా నీకు తోడు రానన్నట్లు మబ్బుల చాటున దాగి,విపరీతమైన ఒంటరితనం ఆవరించింది.


"బ్రతకడం కోసం రాజీ పడడం కంటే నీకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్ధం చేయడమే ఉత్తమం." ఎవరో అన్న మాటలు గుర్తొచ్చాయి. 


భర్తకు దూరమయ్యేలా కాదు; తనకీ కొన్ని ఆనందాలు, అభిరుచులు, స్నేహితులు ఉండడం ఇక అవసరం అనిపించింది సుధకి.


ఇల్లు చేరే ముందు,"న్యూఇయర్ పార్టీ ఫ్యామిలీస్ తో ప్లాన్ చేస్తున్నారు మా ఆఫీసులో.నువ్వు తప్పక రావాలి." అన్నాడు నందన్.


" సోరీ అండీ!ఇందాకే,మా పీజీ, డిగ్రీ వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అయ్యాను.పీజీ గ్రూప్ మీట్ అదే రోజు.ఈసారి తప్పక వెళ్లి, అందర్నీ కలవాలనుకుంటున్నాను."


కొన్నేళ్ల క్రితం, చాలా సార్లు తనని గ్రూపులో చేరుస్తానన్న మాధురిని గుర్తు చేసుకుంటూ నిశ్చయంగా చెప్పింది సుధ.


ఎప్పుడూ ఫ్రెండ్స్ మీట్ కి వెళ్ళని సుధని నిశ్చేష్టుడై చూస్తుండిపోయాడు నందన్.


***

No comments:

Post a Comment

Pages