ఈతరం అమ్మాయి పెళ్ళి చూపులు - అచ్చంగా తెలుగు

ఈతరం అమ్మాయి పెళ్ళి చూపులు

Share This

ఈతరం అమ్మాయి పెళ్ళి చూపులు

ప్రతాప వెంకట సుబ్బారాయుడు 


" నేను ప్రేమించిన ఓ నా ప్రణయ ప్రణవీ-


'ఒరేయ్, నువ్వు లేకుండా నేను పెళ్ళి చూపులకు వెళ్ళి, సంప్రదాయబద్ధంగా నేను అడిగిన ప్రశ్నలకు ఆ పిల్ల సమాధానం చెబితేనే మనింటి కోడలు అవడానికి పచ్చ జండా ఊపుతాను, అంతేకాని- నువ్వు ప్రేమించావని ఆ పిల్లని ప్రత్యేకంగా పరిగణించడం, కొన్ని మార్కులు అదనంగా వేయడం ఉండదబ్బాయ్' అని నాతో అని, మీ ఇంటికొచ్చిన మా అమ్మని పెళ్ళికి ఎలా ఒప్పించావు? మన ఈ మొదటి రాత్రికి ఎలా కారకురాలివయ్యావు. చెప్పవూ" మొదటి రాత్రికి మస్తుగ ముస్తాబై తనలోని కాముణ్ని ప్రేరేపిస్తూ గదిలోకి అడుగుపెట్టిన తన ఆరాధ్య అందాల గని ప్రణవి ముందు మోకాళ్ళ మీద కూచుని, పరిపూర్ణ వికసిత గులాబీని ఆమెకిస్తూ నాటకీయంగా అన్నాడు శ్రీకర్.


"చెబుతాను మహాశయా, మమ్మల్ని ఇష్టపడి ప్రేమించేది మీరు, కట్టుకోడానికి నా నా కష్టాలు పడేది మేము.


ఇంతకీ అత్తయ్యగారు మా ఇంటికొచ్చిన రోజు ఏం జరిగిందంటే.."


ప్రణవి జరిగిన సంఘటనల మాలకట్టి, శ్రీకర్ మనసుకు అందిస్తోంది.


***


"రండి.. రండి" అమ్మాయిని చూడ్డానికి వచ్చిన శ్రీకర్ తల్లిదండ్రులను సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించి, సోఫాలో కూర్చోబెట్టి మర్యాదలు చేశాడు ప్రణవి తండ్రి పురుషోత్తం.


అమ్మాయిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టింది వాళ్ళమ్మ కాత్యాయని.


చిదిమి దీపం పెట్టుకునేంత అందంగా, చలాకీగా ఉన్న కాబోయే కోడలు పిల్లని చూసి అత్తగారు ధరిత్రి  సంతృప్తినొంది, ఏవైనా కొన్ని ప్రశ్నలడగాలని నోరు తెరిచేలోపు-


"ఆంటీ, వంటొచ్చా, పాటలొచ్చా, కుట్లు అల్లికలొచ్చాలాంటి సోకాల్డ్ టైంపాస్ ప్రశ్నలేయొద్దు. నేనే ఓ పది నిమిషాలు నన్ను నేను పరిచయం చేసుకుంటా, నచ్చితే థంబ్ అప్ చేయండి, లేదా డౌన్. కాని నన్ను డౌన్ చేసే అవకాశం మీకు రాదు, ఇవ్వను. ఇది నా ఆత్మవిశ్వాసం.


నాకు వంట చేయడం వచ్చు. ఎప్పుడూ ఒకే పదార్థాలు ఒకే విధంగా కాకుండా యూ ట్యూబ్ లో వెరైటీలు చూసి, చేసి.. తిండి మీద ఆసక్తిని కలిగిస్తాను. మీముందు ప్లేట్లోని స్వీట్ ఎక్కడా దొరకదు. నేను ప్రత్యేకంగా చేసింది. రుచి చూసి ఎలా ఉందో  చెప్పండి" అంది. 


ధరిత్రి దంపతులు రుచిచూశారు. ఆ చక్కటి రుచికి ఫిదా అయిపోయి మరో రెండు నోట్లో వేసుకొని కరిగించారు. 


"అలాగే ఇదిగో డ్రాయింగ్ రూంలోని ఆర్టికల్స్, అన్నీ నేను యూ ట్యూబ్ నుంచి ఆసక్తిగా నేర్చుకొని, చేసినవే" వాటిని చూడమన్నట్టు కొద్దిగా ఆగింది.


ధరిత్రి చూసింది. అన్నీ జీవంతో అందాలొలుకుతూ గదికి కొత్తందాలు సంతరింపజేస్తున్నాయి.


"నాదీ మీ అబ్బాయి చదువే. సాఫ్ట్ వేర్. మీ అబ్బాయికి కోడ్ రాయడంలో, సమస్యలు వస్తే పరిష్కరించడంలో నావంతు సహకారం పుష్కలంగా ఉంటుంది. తెలివైనదాన్నని మా ప్రాజెక్ట్ లీడ్స్ అంటారు, అందుచేత నా కరీర్ అద్భుతంగా ఉంటుంది. మా ఇద్దరికీ హంగులు ఆర్భాటాలకు పోవడం, లోన్లు తీసుకొని ఈ ఎం ఐ లకు బానిసలవడం నచ్చదు. ఇంటి అవసరాలు తీరుస్తూ, దుబారాను అరికడుతూ ఆర్థికంగా సమతుల్యతను సాధించే సత్తా ఉంది. ఫలితంగా ఇద్దరి సంపాదన మనింటికి ఏ లోటు రానివ్వదు. భవిష్యత్తు కాంక్రీట్ తో కట్టినట్టు స్ట్రాంగ్ గా ఉంటుంది.


రేపు పెద్దతనాన మీకేదైన అనారోగ్యం వస్తే పని ఒత్తిడిలో పడి మీ అబ్బాయి రాలేకపోయినా, నేనే మిమ్మల్ని బాధ్యతగా డాక్టర్ కన్సల్ టేషన్ కు తీసుకెళ్ళి మందులిప్పిస్తాను. అడ్మిట్ అయినా జాగ్రత్తగా చూసుకొంటాను.


మా ఆయనతో సహా ఎవరికి, ఏ విషయంలోనైనా మెయిల్స్ పంపగలను. 


ఇంటి నిర్వహణ విషయంలో మీ అబ్బాయిది, నాది సమాన నిర్మాణాత్మక పాత్ర ఉంటుంది. 


మన ఇల్లు, మనం కొంతమందికి మోడల్ గా ఉండాలనేది గోల్. 


ఇంకా మీకేవన్నా డౌట్స్ ఉంటే ఈ క్వశ్చన్, ఆన్సర్ సెషన్ లో క్లియర్ చేసుకోవచ్చు. అన్నట్టు కట్న కానుకల బాల్ మాత్రం మా నాన్నగారి కోర్ట్ లో ఉంది" అంది ప్రణవి.


గుక్కతిప్పుకోకుండా, తను అడగాల్సిన అవసరం లేకుండా నూటికి నూరు మార్కులేయించుకునే సమాధానాలు చెప్పిన ప్రణవిని ఆశ్చర్యానందాలతో చూస్తూ "థమ్సప్ ఇలాగేనా" అని బొటన వేలేత్తి వాళ్ళాయన్ని అడిగింది ధరిత్రి. అవునన్నట్టుగా తలూపాడాయన!


"మా అబ్బాయిది, నీది అద్భుతమైన సెలెక్షనమ్మా, ఒకరి కోసం ఒకరంటారే అలా. కట్న కానుకలు అవీ వద్దు. ఇందాక నువ్వన్నవాటికి కట్టుబడి, లక్ష్మీదేవిలా మా ఇంటి కొచ్చి దీపం పెట్టి, వెలుగులు పంచితే చాలమ్మా, అన్నయ్యా, త్వరలో నిశ్చయ తాంబూలాలకి, ఆ వెంటనే పెళ్ళికీ మంచి ముహూర్తాలు పెట్టించు మరి" అంది.


***


"అదిగో అలా అత్తయ్యగారొప్పుకున్న వెంటనే మన పెళ్ళి..దాంతర్వాత.."సిగ్గులమొగ్గైంది ప్రణవి.


"ఇదిగో..ఇక్కడ.. ఇలా మొదటిరాత్రి" పూర్తి చేశాడు శ్రీకర్ గులాబీల దండని చేతిలోకి తీసుకుంటున్నంత సుకుమారంగా ఆమె చేతులను అందుకొని, గుండెలకు హత్తుకుంటూ..

***


No comments:

Post a Comment

Pages