చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 8 - అచ్చంగా తెలుగు

చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 8

Share This

 చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల)  - 8

అనువాద కర్త : గొర్తి వేంకట సోమనాధ శాస్త్రి(సోమసుధ) 
ఆంగ్ల మూలం :  The Moonstone Castle Mystery
నవలా రచయిత : Carolyn Keene


@@@@@@@@@@@@@@
(అప్పుడు వచ్చిన తుఫాను గురించి మాట్లాడిన ముగ్గురు అమ్మాయిలు మిసెస్ థాంప్సన్ని తాము చూసిన కోట గురించి అడుగుతారు  ఇక్కడ వివరాలేవీ తనకు తెలియవని, వాణిజ్య ప్రాంతంలో ఉన్న బ్రాస్ కెటిల్ టీ షాపు యజమాని మిసెస్ హేంస్టెడ్ ని కలవమని ఆమె నాన్సీ బృందానికి చెబుతుంది.  అక్కడ రెస్టారెంట్లో అపరిచిత వ్యక్తి డ్రూ గురించి మాట్లాడటం గమనించి నాన్సీ పక్కకు తప్పుకొంటుంది.  సీమన్ అన్న ఆ వ్యక్తిని తాను వెంబడించి, ఎక్కడకు వెళ్తున్నాడో చూస్తానని జార్జ్ తన కజిన్ బెస్ తో అంటుంది. తరువాత . . . .)
@@@@@@@@@@@@@@@ 

"నా గురించి చింతించకు.  నేను జాగ్రత్తగానే ఉంటాను" అని మాటిచ్చింది.  "కేవలం అతను ఎక్కడికి వెళ్తాడో చూస్తాను."

  సంతృప్తి చెందిన బెస్ టీ రూము వైపు తిరిగి, నాన్సీ కూర్చున్న బల్ల దగ్గరకు వెళ్ళింది.  

  "గుడ్ బై మిసెస్ హేంస్టెడ్! . . .మళ్ళీ కలుస్తాను" అని సీమన్ చెబుతుండగా, జార్జ్ తన వీపు విశ్రాంతి మందిరం వైపు ఉండేలా తిరిగి, చేతి పర్సులో దేనికోసమో వెతుకుతున్నట్లుగా తల దించింది.  

  ఆ వ్యక్తి బయటకు నడిచి, వెంటనే ఆ రెస్టారెంటుని విడిచిపెట్టాడు.   జార్జ్ అతన్ని అనుసరించింది.

  అపరిచితుడు బ్లాకు తరువాత బ్లాకును దాటుకొంటూ ప్రధాన వీధి వైపు నడిచాడు.   అతని నడక వేగం పెరగటంతో జార్జ్ కూడా అలాగే పెంచింది.  

  "ఈ ప్రపంచంలో అతను ఎక్కడకు పోతున్నాడు?" ఆమె తనలో తాను ప్రశ్నించుకొంది.  "నేను తనను అనుసరిస్తున్నట్లు గమనించి, నన్ను దారి తప్పించాలని అతను చూస్తున్నాడేమో అనిపిస్తోంది."  

  ఏమైనప్పటికీ, ఆమె పట్టుదలగా ముందుకు వెళ్తోంది.  చివరకు, ఆ పట్టణ సరిహద్దులో జార్జ్ ఒక ఆగి ఉన్న కారుని చూసింది.  ఈ వ్యక్తి దాన్ని సమీపించగానే, దాని తలుపు హఠాత్తుగా తెరుచుకొంది.  అతను దాని లోపలకు దూకాడు.  తక్షణమే కారు దూసుకుపోయింది.

  ఆ నల్ల కారు నంబర్ని వ్రాసుకోవటం తప్ప, మరేమీ చేయలేనంత దూరంలో ఆమె ఉంది.  దాని డ్రయివరు ఒక స్త్రీ అని మాత్రం జార్జ్ గమనించింది.  ఆ ప్రాంతం చీకటిగా ఉండటంతో, అంత కన్నా డ్రయువరైన ఆ స్త్రీ గురించి ఎక్కువ తెలుసుకోలేకపోయింది.  యువ గూఢచారి జార్జ్ వెనక్కి తిరిగింది.  

  టీ రూములో నాన్సీ, బెస్ రాత్రి భోజనానికి ఆర్డరిచ్చారు.  ఏ క్షణంలోనైనా జార్జ్ తిరిగి రావచ్చునని వాళ్ళు నెమ్మదిగా భోజనం చేస్తున్నారు.  వాళ్ళు తినటం పూర్తయ్యింది, కానీ జార్జ్ యింకా తిరిగి రాలేదు.  ఇద్దరు అమ్మాయిల్లో కంగారు మొదలైంది.  జార్జ్ కేం జరిగి ఉంటుంది?

    "నేను ఆమెను ఒంటరిగా వెళ్ళనివ్వకూడదు" బెస్ తనను తాను తిట్టుకొంది.  "జార్జ్ అలాంటి ప్రమాదకరమైన అవకాశాలే తీసుకొంటుంది.  దాని వల్ల ఆమె ఏమి సంపాదించిందో ఆ దేవుడికే తెలియాలి."

  మిస్టర్ సీమన్, జార్జ్ తనను అనుసరిస్తున్నందున, తను బయట పడకుండా ఉండటానికి ఆమెకు హాని చేస్తూండవచ్చని నాన్సీ భయపడింది.  

  "జార్జ్ ఈ నిమిషం బందీయై ఉండొచ్చు!" బెస్ భయంతో చెప్పింది.  

  దాన్ని నాన్సీ అంగీకరించినప్పటికీ, యిలా వ్యాఖ్యానించింది, "తనను తాను ఎలా కాపాడుకోవాలో జార్జ్ కి తెలుసు.  అదే జాగ్రత్తతో మనం ఆమె కోసం వెతకాలని అనుకొంటున్నాను."  

  అమ్మాయిలు త్వరగా తమ బిల్లులను చెల్లించి, టీ రూం నుంచి బయల్దేరారు.   వాళ్ళు పక్క వీధిలో అటూ యిటూ చూసి, ప్రధాన వీధి వైపు బయల్దేరారు.  జార్జ్ కనుచూపు మేరలో లేదు.  

  "బోవెన్లకు ఫోను చేసిన వ్యక్తి ఆ సీమనే అయి ఉంటాడు" అంది బెస్.  ఆమె దాదాపు కన్నీటి పర్యంతమైంది.  "బ. . .బహుశా ఆ బెదిరింపు ప్రమాదం . . . . .యిప్పటికే పురోగతిలో ఉన్నట్లుంది!"

  అమ్మాయిలిద్దరూ వీధి వెంబడి ఆదరాబాదరాగా తిరుగుతుంటే, కాలిబాటలో ఆడుకొంటున్న ఒక చిన్న పిల్లాడు వీళ్ళను చూసి నవ్వాడు.  

  నాన్సీ తిరిగి నవ్వుతూ, "మేము మా స్నేహితురాలి కోసం వెతుకుతున్నాం" అంటూ జార్జ్ గురించి విపులంగా వర్ణించి చెప్పింది.  "అలాంటి అమ్మాయిని ఈ చుట్టుపక్కల ఎక్కడైనా చూశావా?" 

  "చూశాను" చిన్న పిల్లాడు బదులిచ్చాడు.  "ఆమె అటు వైపు వెళ్ళింది." 

    ఈ చిన్న ఆధారంతో నాన్సీ, బెస్ చిన్నపిల్లాడు చూపించిన దిక్కులో కంగారుగా వెళ్ళారు.  వాళ్ళు పట్టణ సరిహద్దుకు చేరుకొన్నారు కానీ వారి అన్వేషణ ఎలాంటి ఫలితాన్ని యివ్వలేదు.  నిరుత్సాహంతో వాళ్ళు వెనుదిరిగారు.  

  "ఓహ్! జార్జ్ కిడ్నాప్ చేయబడిందని నాకిప్పుడే అర్ధమైంది!" బెస్ భయాందోళనతో ఏడవసాగింది.  

@@@@@@@@@@@@

"నేను మీ అమ్మాయిలకు ఆ పని అప్పగించలేదు" అంది నాన్సీ.  "జార్జ్ కి ఏమైనా జరిగితే, నన్ను నేను క్షమించుకోలేను." 

  బెస్ కన్నీటిపర్యంతమైంది.  ఆమెకు, జార్జ్ కి మధ్య అపార్ధాలు చాలా తక్కువ.  కొన్ని సందర్భాల్లో ఒకరి తప్పులను ఒకరు ఎత్తి చూపి ఉండొచ్చు.  కానీ యిద్దరు అమ్మాయిలు చాలా సాన్నిహిత్యం కలిగినవారు.  జార్జ్ బందీయై ఉండొచ్చు అన్న ఆలోచననే బెస్ తట్టుకోలేకపోతోంది.  

  "ఆమె నెలాగైనా కనుక్కొవాలి!" అంటున్న ఆమెకు గొంతు నొక్కేసినట్లయింది. 

  "కొద్ది నిమిషాల్లో జార్జ్ అన్వేషణలో పురోగతి కనిపించకపోతే, పోలీసులకు చెబుదాం" అని నాన్సీ అంగీకారాన్ని తెలిపింది.  "తిరిగి టీ రూం కెళ్ళి, సీమన్ నివాసమేదో మిసెస్ హేంస్టెడ్ నుంచి తెలుసుకొందాం.  తరువాత తిన్నగా అతని యింటికి వెళ్దాం."

  అమ్మాయిలు కంగారుగా వెళ్తున్నారు.  "బెస్!  ఇప్పటికీ నా గుర్తింపుని రహస్యంగానే ఉంచాలని అనుకొంటున్నాను.  ఇరేన్ పేరుతో. . . ఉచ్ఛస్వరంతో మాట్లాడే . . .లజ్జిత బాలిక పాత్రలో నేను నటించిన నాటకం నీకు గుర్తుందా?" నాన్సీ చెప్పింది.

  "నేనెప్పటికీ మరిచిపోలేను" అంది బెస్. 

  "సరె! నేనిక్కడ గూఢచర్యం చేస్తున్నంత సేపు ఇరెన్ గా మారుతాను" అని నాన్సీ ప్రకటించింది.  

  అమ్మాయిలు టీ రూం చేరుకొనే సమయానికి దాన్ని మూసేయబోతున్నారు.  హేంస్టెడ్ తన డోలిక కుర్చీలో కూర్చుని ముందుకి వెనక్కి ఊగుతూ ఒక మంత్రాన్ని కూనిరాగం తీస్తోంది.  పరిస్థితి యొక్క గాంభీర్యతను బట్టి, బెస్ నాన్సీలా తన ముఖాన్ని నిటారుగా ఉంచలేకపోతోంది.  నాన్సీ తన సాధారణ స్వరం కంటే ఉచ్ఛస్వరంలో, ఎనిమిది కన్నా ఎక్కువ స్వరంతో ఆమె తనను పరిచయం చేసుకొంది.  తరువాత  ఆమె అడిగింది,  "పట్టణంలోని ప్రతి ఒక్కరు మీకు తెలుసునని నేను అర్ధం చేసుకొన్నాను.  మిస్టర్ సీమన్ ఎక్కడ ఉంటున్నాడో మీరు చెప్పగలరా?"

మిసెస్ హేంస్టెడ్ ముందుకు వంగి ముసిముసిగా నవ్వింది.  "మీరు అతనికి స్నేహితురాలా?" పనికిరాని సుద్దులకు గడియ తీస్తున్నట్లు అడిగింది.  

  నాన్సీకి సమాధానం చెప్పే అవకాశం యివ్వలేదు.  మిసెస్ హేంస్టెడ్ ఏదేదో ఊహించుకొంటూ మాట్లాడింది. "సీమన్ చాలా మంచివాడు, నమ్మకస్తుడు" అంటూ కన్నుకొట్టింది.  "ఆ రకమైన వ్యక్తే ఒక అమ్మాయికి భర్తగా ఉండదగ్గ వాడు."  

తరువాత వచ్చిన విరామంలో, తను కూడా ఏదో మాట్లాడి ఈ నాటకాన్ని కొనసాగించాలని బెస్ భావించింది.  అందుకే ఆమె, "నిజానికి మిస్టర్ సీమన్ కొంచెం బరువు తగ్గించుకోవాల్సి ఉంటుంది.  ఇరెన్ సన్నని పురుషులను యిష్టపడుతుంది" అని వ్యాఖ్యానించింది.

  మిసెస్ హేంస్టెడ్ గట్టిగా నవ్వి నాన్సీ వైపు తిరిగింది.  "అతన్ని పెళ్ళాడాక, కొంచెం తిండి తక్కువ పెడితే సరి" నాన్సీతో అంటూ మరొకసారి కన్నుకొట్టింది.  

  నాన్సీ ఆటను కొనసాగిస్తూ, తను కూడా నవ్వింది.  "ప్రస్తుతానికి అతని యిల్లు ఎక్కడో తెలుసుకోవాలన్న ఆసక్తి మాత్రమే ఉంది.  దాని గురించి అతను నాకెప్పుడూ చెప్పలేదు."  

  "సరె!  ఇప్పుడు నేను కూడా చెప్పలేను" ముసలామె అంది.  "అదెక్కడో ఊరి బయట ఉంది.  కానీ అదెక్కడ ఉందో, అతను నాకు చెప్పలేదు."

  నాన్సీ తన నిరాశను వ్యక్తపరిచింది.  అకస్మాత్తుగా ఆమె విషయాన్ని మార్చింది.  "మిసెస్ హేంస్టెడ్!  డీప్ రివర్లో నేను ఈ ప్రాంతాన్ని యిష్టపడతానని మీరు అనుకొంటున్నారా?" 

  "ఎందుకు నచ్చదో నాకు తెలియటం లేదు.  నేను నా జీవితమంతా యిక్కడే నివసించాను.  ఇప్పటికీ దృఢంగా, సంతృప్తిగా లేనా?"

  మారువేషధారి నమ్మకం లేనట్లు నటించింది.  "ఈ పట్టణంలో ఏవో విచిత్ర సంఘటనలు జరిగాయని విన్నాను" అందామె.  

  "ఓ! అది చెడ్డది కాదు" మిసెస్ హేంస్టెడ్ భుజాలెగరేసింది.  "కావచ్చు. . ."  కొద్ది క్షణాల పాటు నిశ్శబ్దం.  తరువాత ముసలావిడ హుషారైంది.  డోలకం కుర్చీలో తిన్నగా కూర్చుని, కోపంతో కుర్చీలో ముందుకి, వెనక్కి ఊగింది.  "అయితే, యిక్కడ ఒక కోట ఉంది.  వదిలేయాల్సినంత చెడ్డది.  అది ఒకప్పుడు అందమైన ప్రాంతం. . . .ఏభై ఏళ్ళ క్రితం డీప్ రివర్లో ఒక ప్రదర్శనాస్థలం."

"దాని యజమాని ఎవరు?"  ఇరేన్ పాత్రలో నాన్సీ ప్రశ్నించింది.  ఆ పాత్రలో తను ఉచ్ఛస్వరంలో మాట్లాడుతుంటే, మిసెస్ హేంస్టెడ్ స్వరానికి తగ్గ స్థాయితో దాదాపుగా సరిపోలింది. 

  "కొంతమంది విదేశీయులు దాన్ని నిర్మించారు.  అది దయ్యాలకొంపలా మారే వరకూ అక్కడే నివసించారు" మిసెస్ హేంస్టెడ్ బదులిచ్చింది.

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages