మానవత్వం పరిమళించింది - అచ్చంగా తెలుగు

మానవత్వం పరిమళించింది

Share This
మానవత్వం పరిమళించింది 
దినవహి సత్యవతి




విశ్వాన్ని అదృశ్య మహమ్మారి ఆవరించి 
పెనుభూతమై పీడిస్తున్న తరుణాన , 
మానవాళి మదిపొరలలో నిక్షిప్తమై 
సుషుప్తావస్థలోనున్న మానవత్వం మేలుకుంది! 
  
రోగి ప్రాణానికి తన ప్రాణం 
అడ్డం వేసి రేయీపవలూ 
సేవలు చేస్తున్న వైద్యుడి రూపాన,

కన్నబిడ్డ రోదిస్తున్నా తన ఒడిని చేర్చి 
ఓదార్చలేని నిస్సహాయతకు వగస్తూ 
వృత్తి ధర్మానికి తలవొగ్గిన నర్సు రూపాన,

లాఠీ త్రిప్పుతూ రోడ్లపైనే వసిస్తూ 
జనాలనే కాదు కొరోనాను కట్టడి
చేయగలమంటున్న ఖాకీల రూపాన, 

ప్రజకు రోగాలంటకుండా చేయడమే 
మా కర్తవ్యమంటూ శ్రమపడుతున్న 
పారిశుధ్ధ్య కార్మికుల  రూపాన,  

ఛిన్నాభిన్నమైన బ్రతుకుభారాన్ని 
మోయలేకున్న పేదలు, వలస కూలీల  
అన్నార్తిని తీరుస్తున్న దాతల రూపాన ,

పార్థివ దేహాన్ని భుజస్కంధాల పై నెత్తి
మతంకంటే మానవత్వమే  మిన్నయనీ 
రాం రహీం ఒక్కరేనని చాటిన యువత రూపాన  

 ప్రజా సేవే పరమావధియని తలంచి  
అహర్నిశలూ పాటుపడుతున్న 
నిబధ్ధత కలిగిన నాయకుల రూపాన…….

తన ఉనికిని చాటుకుని  నన్ను మించిన
 నేస్తం నీకు లేడని మానవాళికి నిరూపించి, 
నలుదిశలా పరిమళాలను వెదజల్లుతోంది....మానవత్వం
                                           
 *** 

No comments:

Post a Comment

Pages