అతనిని వదలలేని అమ్మ - అచ్చంగా తెలుగు
 అతనిని వదలలేని అమ్మ 
 భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.




నిన్నటి వరకు అతనికి నిత్య వ్యాపకమైన అమ్మ
ఈనాటినుండి సత్య జ్ఞాపకమైపోయింది.
లాలిపాడి పెంచిన అమ్మ లీల ఐపోయింది
ప్రేమకుప్రతి రూపమైన అమ్మ గోడపై చిత్రమైపోయింది.
గదిలోని తన నివాసాన్ని అతని మదిలో కి మార్చుకుంది.

అప్పుడు కంచంలో తను తినే భోజనాన్ని 
ఇప్పుడు విస్తరిలో పెట్టించుకుంటోంది.
అప్పుడు నలుగురితో మాటలాడుతూ తినే ఆహారాన్ని, 
ఇప్పుడు నలుగురు మంత్రాలు చదువుతుంటే తింటోంది.
అప్పుడు జీవంతో నడయాడుతు తినే పదార్ధాలను 
ఇప్పుడు పెట్టేవారి భావంలో కదలాడుతు భుజిస్తోంది.

వెళ్ళిపోయిన అమ్మ కదలికలు అలలులా వచ్చి
అతనిని కలవరపరుస్తున్నాయి.
మళ్ళిపోయిన అమ్మ అలవాట్లు అదేపనిగా గిచ్చి
అతనిని అయోమయానికి గురిచేస్తున్నాయి.
నాన్న నిన్నలో కలిసిపోయినా,అమ్మ మాత్రం 
నేటిలోనే నిలిచినట్లు అతనికి అనిపిస్తోంది.

అమ్మ అబద్దం కాదని, నిబద్దమేనని అతనికి కనిపిస్తోంది.
అమ్మని మరవటం కుదరదని, అమ్మ జ్ఞాపకం చెదరదని 
అతని మనసు అదేపనిగా చెబుతోంది.
తనువును వదిలినా అతని మనసును వదలనని 
అమ్మ చెబుతున్నట్లు అతనికి అర్ధమౌతోంది.
అమ్మ లేదని చుట్టుఉన్నవాళ్ళు చెబుతున్న మాట వ్యర్ధమౌతోంది.
దేవతలాంటి అమ్మకి తన ఆలోచనలు అర్ఘ్యమిస్తున్నట్లు,
తన భావాలు ఆమెని భజిస్తున్నట్లు,
తన ఉహలు ఆమెని ఉపాసిస్తున్నట్లు,
తన సంకల్పాలు ఆమెని సేవిస్తున్నట్లు,
తన దయ ఆమెని ధ్యానిస్తున్నట్లు,
తనప్రేమ ఆమెని పూజిస్తున్నట్లు,
తన ఆర్ద్రత ఆమెని అర్దిస్తున్నట్లు,
తన మౌనం ఆమెముందు మోకరిల్లినట్లు,
తన నిర్లిప్తత ఆమెకి నైవేద్యమైనట్లు 
అతనికి అనిపిస్తోంది.

అలా అతను మరవలేని అతని అమ్మ 
అతనిని  వదలలేని అమ్మై 
అతనిగదిలో,అతని మదిలో 
అతని ఆలోచనలలో,అతని ఆర్ద్రతలో
అతని ఉహలలో,అతని సంకల్పాలలో
అతని భావాలలో,అతని బ్రతుకులో 
నిత్యమై,సత్యమై  శాశ్వతమై నిలిచిపోయింది.
                 
 ***

No comments:

Post a Comment

Pages