శివం - 77 - అచ్చంగా తెలుగు

శివం - 77

(శివుడే చెప్పిన కథలు)

రాజ కార్తీక్ (హర సిద్దు కి వచ్చిన కల నిజమైంది.. తన జన్మ ధన్యమైందని భావిస్తున్నాడు హార సిద్దు, తనకు వచ్చిన కల నిజం అవ్వటంతో )


నా వైపు, తన ప్రతిష్టించిన లింగం వైపు, నన్నే చూస్తూ, తలుచుకుంటూ ఎంతో ఆనందంగా ఉన్నాడు నా ప్రియమైన భక్తుడు హార సిద్ధుడు..
ఎందుకంటే తను ఇప్పటి వరకు జీవితంలో సరైన ధనం లేకపోవడం వల్ల ఎంతో బాధపడ్డాడు. మనుషులకు విలువ ఇచ్చేది తమ దగ్గరున్న ధనం వల్ల చేతనే గాని తమ గుణం వల్ల కాదని హార సిద్దు జీవితంలో చాలా ఆలస్యంగా తెలుసుకున్నాడు... అందరి దగ్గర చిన్నప్పుడు ఎంతో చనువుగా ఆడిపాడిన సిద్ధుడు, పెద్దయ్యే కొద్దీ తన ధనం దూరం అయ్యే కొద్ది, అంతే చనువుగా, అంతే రాజసంగా ఉండటంచేత సిద్ధుని అందరు తప్పుగా అపార్థం చేసుకున్నారు. తను తెలుసుకున్నది ఏంటంటే అంతకు ముందు తన దగ్గర ఆస్తులు, ఆభరణాలు ఉన్నాయని, తర్వాత అన్ని కరిగి పోయాయని, అందుకే తమకు గౌరవం విలువ తగ్గిపోయాయని, తెలుసుకోలేకపోయాడు. గతంలో తమతో ఎంతో గొప్పగా ప్రవర్తించిన వారు, ఇప్పుడు ఎందుకు గొప్పగా ప్రవర్తించటంలేదన్న దానికి కారణం కేవలం ధనమని తెలుసుకోవడానికి చాలా సమయం పట్టింది.
ఇప్పుడు చిన్నా పెద్ద ధనం ఏమీ కాదు, కేవలం తన తల్లికి తన బాధ్యతగా తను ఇంతవరకు ఏం చేయలేక పోయినందుకు కొంత ధనాన్ని ఏర్పాటు చేస్తే, తన తల్లి కష్టపడకుండా హాయిగా బతుకుతుందన్న ఉద్దేశం మీద మాత్రమే ధనాన్ని కోరుకున్నాడు.
కానీ అనుకున్నాం కదా లౌక్యం తెలియని హర సిద్ది మనసు.. నాకు తప్ప ఎవరికి తెలుసు? విధివశాత్తు.. హార సిద్దు జనాల చేతిలో మోసపోయి ఆర్థిక అభివృద్ధి సాధించలేక అలా అయిపోయాడు గాని, లేకపోతే కచ్చితంగా రోజుకి కొన్ని వందల మందికి అన్నదానం చేసే స్థాయి కలిగిన వాడు...

పళ్లెంలో ఉన్న డబ్బులు చూసి.. తను తన తల్లి గురించి ఆలోచించసాగాడు. ఇక మేము కష్టపడాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూర్చుని హాయిగా తినొచ్చు దర్జాగా, అని ధీమాగా.. ఆలోచించాడు. కొంతలో కొంత తన తల్లి రుణం ఇలా తీర్చుకునే వాడిని అవుతానని.. ఎంతో ఆనందపడ్డాడు..

అంతేకాకుండా ఆ గుడిలో మరొకచోట చిన్న హుండీ ఉంది. ఆ హుండీలో నియమం ఏంటంటే... 60 ఏళ్లకు ఒకసారి ప్రతిష్టించిన లింగం కోసం.. సాక్షాత్తు నేనే పంపించే మనిషికి.. ఇవ్వటానికి.. అందులో కాలక్రమేణా దక్షిణ వేస్తూ ఉండటంవల్ల.. అలాంటి హుండీలు చాలా ఉన్నాయక్కడ.

మహారాజు "హర సిద్ధు అవి నీ కోసమే బాబు.. ఆరోజు బొజ్జ లింగం ప్రతిష్ఠ జరిగిన తర్వాత మొట్టమొదటి సారి.. మా రాజ్యం వాళ్లు అందరం కలిసి.. అలా శివుడు పంపించే స్వామికి దక్షిణ ఇవ్వటానికి మనం ఇచ్చిన హుండీ ఏర్పాటు చేద్దాం, అందులో మనకు తోచిన బంగారు నాణాలు వేద్దాం.. 60 ఏళ్లకు అవి ఎన్ని అవుతాయో అవి మొత్తం పరమేశ్వరుడు పంపిన ఆ దూత కి ఇద్దామని అనుకున్నాం.. అంటూ ఆ రోజు జరిగిన కథలో మరో కోణాన్ని చెప్పాడు.

హర సిద్ధుడు.. ఆ చిన్న చిన్న హుండీలో ఉన్న బంగారం అంతా తనది చేసుకుంటే.. అసలు ఇక తనకి ఆజన్మాంతం ఎటువంటి ఆర్థిక బాధ ఉండదని తెలుసుకొని, ఆ రోజు కుంభన్న రూపంలో నేను చెప్పిన "నీకు ఎటువంటి భయం లేదు హర సిద్ధ, నీకు ఒక మంచి అవకాశం ఇస్తానని" నేను చెప్పిన మాటలు తలుచుకొని కన్నీటి పర్యంతమయ్యాడు.

ధర్మయ్య మాత్రం హర సిద్దుని.. "ఊరుకో హార సిద్దు.. నేను చెప్పా కదా ఆ దేవుడు నీ కోసం ఏదో పెద్ద పెట్టాడు. అందుకోసమే నీకు పరీక్షా కాలం పెట్టాడు ఆ పరీక్ష గెలిచావు... భయపడవాకు హార సిద్ధ.. మహా దేవుని నమ్మిన వాడెవడూ చెడిపోడు. అటువంటిది మహాదేవుడే ఎంచుకున్న వాడివి నువ్వు ....   ఎందుకు గాభరా పడతావు?" అని అడిగాడు.

హార సిద్దు "మహారాజా.. ఒక్క నేనొక్కడినే, అంత ధనం తీసుకోవటం భావ్యం కాదు. ఈ గుడికి ఒక శాశ్వత మూలధనాన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దయచేసి నాకు అనుమతివ్వండి. ఎందుకంటే ఈ గుడి పోషణ అంతా చూసేది మీరే కాబట్టి."

మహారాజు కొంచెం గట్టిగా "నాయనా నువ్వు మూలధనం ఇస్తే మేము చేయటం ఏంటి.. ఈ రాజ్యము, రాజ్యాంగము అంతా ఆ కుంభన్న స్వామి పెట్టిన భిక్ష.. మేము అనుకున్న విధంగా ఆ జనమంతా, ఆ బంగారం అంతా, నీదే కాదు ఇంకా కావాలంటే చెప్పు మా ఖజానా నుంచి నీకు ఎంత కావాలో అంతే నీకు ఏర్పాటు చేస్తాం.. అంతేకానీ నీ ధనము నువ్వు తిరిగి గుడికి ఇవ్వాల్సిన అవసరం లేదు. అవసరం అయితే మీ ఊరిలో ధర్మకార్యాలు కోసం కొంత వినియోగించి ఈసారి, జాగురూకతతో వ్యవహరిస్తూ, ఇదంతా నిలబెట్టుకో. మంచితనం అనే ముసుగులో జనం ఎప్పుడూ మోసం చేయడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళతో మాత్రం జాగ్రత్త నాయనా.." అని హితవు పలికారు.

ధర్మయ్య మాత్రం "హర సిద్దు.. చూడు నాయనా నువ్వు ఏమంత ధనం కలిగిన వాడవని ధర్మకార్యాలు చేయటానికి? ముందు కొంత ధనాన్ని సంపాదించుకొని, నీవు సుఖంగా బతుకుతూ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకొని, తర్వాత ధర్మకార్యాలు కోసం ఉపయోగిస్తే నీతో పాటు ఉన్న అందరూ ఆనందపడతారు."

హార సిద్దు "లేదు బాబాయ్, జీవితంలో మరీ అంత అవసరం వచ్చి, ఈ డబ్బంతా ఖర్చయింది అనుకో. అప్పుడు నా స్వహస్తాలతో, నా చేతులతో నేను భగవంతుడికి ఏమీ చేయలేక పోయిననే బాధ ఉంటుంది. ఎందుకంటే, నాకు ఎలాంటి పరిస్థితులు వస్తాయో నాకు తెలుసు కదా!"

మహారాజు, ధర్మయ్యా ఇద్దరూ హర సిద్ధుని ఆలోచన ధోరణికి ఆశ్చర్యచకితులయ్యారు.. ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద ఆలోచన చేస్తున్నాడు అని.. అనుకుంటూ తన ధనాన్ని తను తీసుకోవాల్సిందిగా మొహమాటం లేకుండా.. గట్టిగా నొక్కి వక్కాణించారు.. హర సిద్దు మహారాజు కి ఎదురుగా ఇంకా ఏమీ చేయలేక ఉన్నాడు..

కొత్తగా వచ్చిన హుండీ కనపడింది, ఎందుకంటే ఈ రోజున అన్ని హర సిద్దు కోసం ఇచ్చేస్తారు కదా..
పాత హుండీ ఉన్న స్థానంలో కొత్త హుండీ ని పెట్టి , ఒక హుండీలో కొంత బంగారం తీసి తదుపరి 60 సంవత్సరాల తర్వాత వచ్చే తనలాంటి మరొక వ్యక్తి కోసం ముందుగా కొంత ధనాన్ని వేశాడు."

"ఇది ఒక్కటి కాదని చెప్పకండి మహారాజా! దయచేసి ఇది ఒకటి నన్ను చేయనివ్వండి.. అంతేకాకుండా ఈ ఆలయంలో జరుగుతున్న అన్నసంతర్పణ లో ఈ రోజు మా పితృదేవతల. పేరు మీద అన్నదానం జరిగేలా.. ఎంత ధనం అవసరమవుతుందో అంత ధనాన్ని ఆలయం ఖాతాలో వేస్తాను. ఆ కుంభన్న దగ్గర.. ఆ కుంభన్న పంపిన నేను.. ఆ కుంభన్న సాక్షిగా, ఇది చెయ్యడానికి మీరు కాదని అనరని నమ్మకంగా అడుగుతున్నాను మహారాజా!" అని మహారాజు చేతులు పట్టుకొని విన్నవించుకున్నాడు.

తనకు ఉన్న దాంట్లో ఎప్పుడూ పదిమందికి అన్నం పెట్టాలని ఉన్న హరసిద్ధు ఆలోచనలకు పులకించిపోయారు మహారాజు మరియు ధర్మయ్య..
ధర్మయ్య "సరే ఇది ఒకటి చెయ్యి మిగతాదంతా వృధా చేసుకోకు. దాన్ని ఎలా వాడుకోవాలి అనేది.. మా ఆర్థిక మంత్రి చేత నీకు సలహాలు ఇప్పిస్తాను అని చలోక్తులు విసిరి నవ్వాడు.

హర సిద్దు  "ఈ ధనమును నేను ఎట్లా తీసుకెళ్లాలి?  అన్ని డబ్బులు నేను ఏం చేయాలో నాకు అర్ధం కావట్లేదు." అని ఆశ్చర్యంగా అన్నాడు.

ధర్మయ్య "సరే సిద్ధ నీకు ఒక విషయం చెప్తాను, ఈ ధనం మొత్తము మా అధీనంలో  ఉంచుకొంటాము. సరిగ్గా వచ్చే పౌర్ణమికి.. నువ్వు మళ్లీ మా రాజ్యానికి రా.. గుర్తుంచుకో .. తప్పకుండా రా.. ఆ ధనాన్ని అంతా ఇప్పుడు అమలవుతున్న ఆర్థిక వ్యవస్థలోకి మార్చి.. నువ్వు చెప్పిన విధంగా అన్నదానానికి మినహాయించి మిగతా అంతా నీకు చేతికి అప్పజెప్పి.. తర్వాత వాటిని ఏం చేయాలనేది చూద్దాం" అని భరోసా ఇస్తాడు మా రాజు కనుసైగ ద్వారా..

మహారాజు,"రానున్న పౌర్ణమికి నువ్వు మళ్ళీ ఇక్కడికి రావాలని మేము చెప్పింది ఎవరికీ చెప్పవద్దు." అన్నాడు.

ధర్మయ్య ప్రకారం తమ రాజ్యంలో మంచి కొలువు ఇవ్వాలనుకున్న ఏ వ్యక్తికైనా.. తమ రాజ్యంలో ఎన్నుకోబడతాడని ఎవరికీ తెలియకుండా ఉంచటం తమ రాజశాసనం లో ఒక భాగం..

మహారాజు, ధర్మయ్యా హర సిద్ధుని తో ఆలయం మొత్తం తిరిగి ఆలయాన్ని ఎంతో శోభాయమానంగా చెక్కిన విధానం చూసి హర సిద్ధుని పనితనం, శౌర్య పరాక్రమం వ్యూహరచన అన్నిటినీ స్తుతించి ఎంతో మెచ్చుకొని సెలవు తీసుకున్నారు ..

మహారాజు ని కాపాడటం చేత ,ఆలయాన్ని బాగు చేయడం చేత, అంతేకాకుండా సాక్షాత్తు పరమేశ్వరుడు పంపిన మనిషి అనే ముద్ర ఉండటం చేత,  పరిసరాల్లో ఎంతో మంచి పేరు వచ్చింది..

ధర్మయ్య హర సిద్దు ఇద్దరు చలోక్తులు వేసుకుంటూ ఉండగా.. అక్కడికి మరొకరు వచ్చి తమ దగ్గర ఒక ఆలయం ఉందని, అది కూడా శిథిలమై స్థితిలో ఉందని అది బాగు చేయవలసిందిగా  హర సిద్దుని కోరారు..
అతగాడు వచ్చింది తన ఊరి పక్కనుంచి..
తప్పకుండా చేస్తానని. తన చిరునామా తీసుకొని తానే ఒక నాలుగైదు రోజుల్లో అతని దగ్గరికి వస్తానని వాగ్దానం చేశాడు  హర సిద్దు..

ధర్మయ్య "అరే ఎందుకు ఒప్పుకున్నావు.. మరి ఇంకా చాలా పని ఉంది" అని చనువుగా విసుక్కున్నాడు.

హర సిద్దు "బాబాయ్, అది మా పక్క ఊరి నని ఆ శివాలయం ఎప్పుడు శిథిలమైపోయిందని, దాన్ని తను బాగు చేయాలనుకున్నానని, కాకపోతే తన దగ్గర తగిన స్థోమత లేక ఆగిపోయానని, ఆలయం బాగు చేయడం కోసం అతను సంకల్పించి ప్రజల దగ్గర కొంత నిది సేకరించాడనీ.. ఒకవేళ ఇప్పుడు నేను ఊరికి వెళ్ళినా కూడా తదుపరి నేను చేయవలసిన పని అదేనని.. అది ఒక వారంలో అయిపోతుందని చెప్పాడు. పోనీలే నేను అనుకున్న పని, అతను అడిగిన పని, మహాదేవుడు నన్ను చేయమన్న పని అన్ని ఒకటే అని అని, అతని మనవి ఒప్పుకున్నాను. కాకపోతే.. తను కావాలనే తన పక్క ఊరి వాడినని చెప్పలేదని.. తర్వాత ఆ గుడి బాగుకోసం వారిచ్చిన ధనాన్ని ఆ గుడి మూలధనంగా ఏర్పాటు చేస్తాను.. అలా వాళ్ళని ఆశ్చర్యానికి గురి చేద్దామని నేను.. ఒప్పుకున్న బాబాయ్."అంటూ తన మనసులో మాట బయట పెట్టాడు.
.
ఆరోజు ప్రతిష్ఠ కార్యక్రమం ఎంతో గొప్పగా ముగిసిపోయింది.. అందరూ.. హర సిద్దుని అతను చేసిన అన్ని విషయాలకు అభినందించ సాగారు..
పాత బొజ్జ లింగాన్ని నిమజ్జనం చేయడానికి వెళ్లిన ధర్మయ్య.. సిద్ధుడు.. మంచిగా మాట్లాడుకో సాగారు.

అంతా సజావుగా సాగుతుంది.. మ నహర సిద్ధుడు ఇక కథానాయకుడు అయ్యాడు.. అని అందరు అనుకోసాగారు..

మహారాజు దగ్గర, ధర్మయ్య దగ్గర, ఆ వూరి ప్రజల దగ్గర సెలవు తీసుకుని మళ్లీ తనకు తోచిన విధంగా తప్పక తిరిగి వస్తానని.. పౌర్ణమి రోజు తిరిగి వచ్చేది రహస్యంగా ఉంచి...

హుండీలు మొత్తం ధర్మయ్య బాబాయ్ కి అప్ప చెప్పి, తనకు పళ్ళెంలో వచ్చిన ధనాన్ని మాత్రం తీసుకొని బయలుదేరాడు.
రాజుగారు రాజా మర్యాదలతో వీడ్కోలు ఏర్పాటుచేసినా, అవి తనకు వద్దని తన కోసం రాజ సొత్తు ను వృధా చేయవద్దని.. ఒక అశ్వాన్ని మాత్రం తీసుకొని.. కథానాయకుని లక్షణాలతో తన ఊరి వైపుగా, తన రాజ్యం వైపుగా, తన తల్లికి ఇక కష్టాలు ఉండవన్న ఆలోచనతో ఆనందంగా ముందుకు బయల్దేరాడు మన హర సిద్దు.

చూద్దాం ఇక ఏం జరగబోతుందో.. హర సిద్దు వల్ల జరగవలసింది, నేను చేయవలసినది ఇంకా చాలా ఉంది.. అవన్నీ చేయగల సమర్థుడు నా ప్రియమైన హార సిద్ధుడు.

(సశేషం)

No comments:

Post a Comment

Pages