శ్రీరుద్రంలో విశేషాలు ‌- 5 - అచ్చంగా తెలుగు

శ్రీరుద్రంలో విశేషాలు ‌- 5

Share This
శ్రీరుద్రంలో విశేషాలు ‌- 5
శ్రీరామభట్ల ఆదిత్య 




వందే పంచముఖాంబుజం త్రినయనం వందే లలాటేక్షణం,
వందే వ్యోమగతం జటాసుముకుటం చంద్రార్ధగంగాధరమ్ ।
వందే భస్మకృతత్రిపుండ్రనిటలం వందేఽష్టమూర్త్యాత్మకం,
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్ ॥

ఏడవ అనువాకం:
"నమో దున్దుభ్యాయ చా హనన్యాయ చ..." అనే మంత్రంతో ఈ అనువాకం ప్రారంభం అవుతుంది. ఇందులో మొత్తం 16 మంత్రాలున్నాయి. వీటిని నమస్కారమంత్రాలని అంటారు. దుందుభి మోగిస్తే వచ్చే శబ్దం పరమేశ్వరుడే అని, మోగించే కర్రకూడా పరమేశ్వరుడే అని చెప్పారు ఈ అనువాకంలో... అంటే అంతరార్థంలో కర్త, కర్మ, క్రియ అన్నీ పరమేశ్వరుడే అని చెప్పుకోవచ్చు. 

యుద్ధంలో వెన్నుచూపనివాడిగా, శత్రువుల రహస్య సమాచారాన్ని పరిశీలించేవాడిగా, దూతగా, సేవకుడిగా, కత్తిపట్టుకునేవాడిగా, వేగంగా కత్తిసాము చేసేవాడిగా, పదునైన బాణాలు చేతగలవాడని, వివిధ రకాల ఆయుధాలు కలవాడని, అద్భుతమైన ధనుస్సు కలవాడని, చిన్న,ఇరుకుదారులే కాకుండా వెడల్పుగా ఉన్న దారులలోనూ నడిచేవాడిగా చెప్పారు.

కాలువలలో కొలువైనవాడిగా, వాగులలో ఉన్నవాడిగా, చిన్న తటాకంలో ఉండేవాడిగా, సరస్సులోనూ ఉండేవాడిగా, నదిలో ఉండేవాడిగా, చెరువులోనూ ఉండేవాడిగా, బావిలో ఇంకా అనేక జలధారలలో ఉండేవాడిగా, వర్షపునీరు తానే అయినవాడిగా, వర్షము పడని ప్రదేశాలలోనూ ఉండేవాడిగా,  మబ్బులలో ఉండువాడని, మెరుపులు కూడా ఆయన రూపమే అని, వర్షమూ, సూర్యుడు, ఆకాశమూ ఆయనే అని, తూఫానుగానూ ఉండువాడని, భీషణమైన వడగాలలుగానూ ఉండువాడని ఈ అనువాకంలో చెప్తారు. 

ఇంట్లో ఉండే ప్రతివస్తువు ఆయనే అని, ఇంటిని కాపాడే వాస్తుపురుషుడి రూపంలోనూ ఉంటాడని ఈ అనువాకం చెప్తుంది. ఈ అనువాకంలో ముఖ్యంగా మనకు ప్రకృతిలో కనిపించే ప్రతినీటివనరులోనూ పరమేశ్వరుడు ఉంటాడని తెలుస్తోంది. కానీ మనం అభివృద్ధి పేరుతో వాటిని కలుషితం చేస్తున్నాం.... అందుకని అందరమూ జలకాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. అసలు ఇవే కాదు, ప్రకృతి అంతా పరమేశ్వరుడే అని అర్థం చేసుకుంటే చాలు. మనకు పంచభూతాలలింగక్షేత్రాలలో భూమి, ఆకాశం, తేజము, వాయువు, జల రూపాలలో సదాశివుడు ఉంటాడు. జంబుకేశ్వరంలో జలలింగరూపంలో ఉన్నాడు శివుడు......

( ఇంకా వుంది )

No comments:

Post a Comment

Pages