శివం - 76 - అచ్చంగా తెలుగు

శివం - 76

రాజ కార్తీక్ 




(హర సిద్ధుడు గుడిలో బందిపోట్ల ని ఎదుర్కొని, మహారాజు ని కాపాడిన తరువాత, మహారాజు అంతఃపురం లో ధర్మయ్య కోరికమేరకు విందు ఆరగించాడు.

హర సిద్ధుడు బొజ్జ లింగానికి అభిషేకం చేస్తున్నాడు. హరసిద్ధుని చేతిలో ఉన్న పెద్ద పళ్లెంలో, ధనమున్న మూటలు తనకు దక్షిణగా గా మోయలేనంత పడ్డాయి. అటు తరువాత...)

కళ్ళు తెరిచి చూశాడు హర సిద్దుడు..
రాజు గారి విందులో భోజనం చేయడం వల్ల, కాసేపు అలా గాఢ నిద్ర పట్టింది..

పక్కనే ధర్మయ్య కూడా నిద్ర పోతున్నాడు.

హర సిద్దు నిద్ర లేపి, ధర్మయ్య తో "చూడు బాబాయ్ ఎందుకు మనకు ఈ విందులు వినోదాలు అని చెప్పాను. నా మాట విన్నావా, మహారాజుగారి కొద్ది సేపట్లో వస్తాను అని చెప్పి వెళ్లారో లేదో.. అప్పుడే ఎంత పెద్ద కునుకు తీశాం.. మనకి ఈ సౌకర్యం ఎప్పుడైనా కల్పించుకో గలమని నమ్మకం వచ్చినప్పుడే, కొత్త సుఖాలకు అలవాటు పడాలి బాబాయ్, లేకపోతే కొత్త సుఖాల కోసం కొత్త కొత్త తప్పు దారి వేతకాల్సి వస్తుంది..."

ధర్మయ్య "సరిగా చెప్పావ్ నాయనా, ఎంతో సున్నితంగా చెప్పావ్, సూక్ష్మంగా చెప్పావు."

హర సిద్దు "ఈ కాసేపటి నిద్రలోనే ఎంతో ధనం సంపాదించినట్లు.. కల వచ్చింది బాబాయ్, కల కదా నిజమే అనుకుంటాం. లేనిపోని కొత్త ఆశలు పెట్టుకుంటాం," అని అడియాసగా అన్నాడు.

ధర్మయ్య "పర్లేదులే సిద్ధ, కలలు కని వాటిని సాకారం చేసుకోవాలి. కాకపోతే ఆ కలలు ధర్మ మార్గం వైపు ఉండాలి... సరేలే నీకు చెప్పేంత  వాడినా?

ఏదో మనసులో కాంక్షించి ఉంటావు, పోనీలే హార సిద్ద నిజంగానే ధనం సంపాదిస్తావేమో.. సాక్షాత్తు లక్ష్మీ మాత కి కుబేరుడి ధనం ఇచ్చింది శివుడు.. అట్లాంటి వాడు నీ పంచన ఉంటే.. ఇప్పటిదాకా లేదు అనే బాధ వలదు.. అన్నీ కలిపి ఇస్తాడు.. ఎట్లాగో వాటిని సమర్థవంతంగా సత్కార్యాలకు వినియోగిస్తావు కాబట్టి.. ఇప్పటిదాకా ధనం విలువ తెలియజేశాడు, ముందు తొందరగా కళ్యాణం చేసుకో నాయనా"
అన్నాడు.

ఈలోపు మహారాజుగారు వచ్చారు.

మహారాజు "విందు ఎలా ఉంది హార సిద్దు?"

హర సిద్దు "బ్రహ్మాండంగా ఉంది, కానీ మహారాజా మీ ముఖకవళికల లో ఏదో గందరగోళం దాగి ఉంది."

మహా రాజు "నన్ను చంపబోయిన నాగయ్యను ఖైదు చేశాను కదా.."

హర సిద్దు "నాగయ్య తో పాటు అతని కొడుకుని కూడా మీరు ఖైదు చేయాలి."

మహారాజు "వారు మా సైన్య పర్యవేక్షణలోనే ఉన్నారు.. నాగయ్య భార్య వచ్చి ఈ ఒక్కసారి క్షమించండి ప్రభు అని నన్ను అర్ధిస్తోంది... ఈ ఒక్క తప్పుకు మరణ దండన విధించాలా ఇక చివరి హెచ్చరిక జారీ చేసి, క్షమించి కారాగారంలో పడి వేద్దామా అని ఆలోచిస్తున్నా."

హార సిద్దు ఆజ్ఞ స్వరంతో "ఏమంటున్నారు తమరు మహారాజా. చిన్న తప్పా.. ఎంతటి ప్రణాళిక రచించాడు. అతని ప్రణాళిక తను అనుకున్న ప్రకారం జరిగి ఉంటే ఏమైపోయేది మీ రాజ్యం.. మీరు ప్రాణాలతో ఉండేవారా.. చుట్టుపక్కల రాజులు మీరు లేరని తెలిసి.. ఈ రాజ్యాన్ని కబళించేవారు.. అలా జరిగి ఉంటేనే మీరు పెద్ద తప్పుగా పరిగణించేవారా.. మహారాజా గుర్తుపెట్టుకోండి. కరుణ చేసేటప్పుడు పరమశివుడు లాగా.. శిక్ష వేసేటప్పుడు వీరభద్రుడి లాగా, శాంతి కోరుకునే మనలాంటి వారి జోలికి వస్తే శరభుడి లాగా ప్రవర్తించమని చెప్పటానికే పరమేశ్వరుడు ఆ లీలలు చూపించింది.. పాలకడలిపై నవ్వుతున్న విష్ణుమూర్తి లాగా చిరుమందహాసం అన్నిసార్లూ పనికిరాదు మహారాజా, నరసింహుడి గర్జన దేశద్రోహుల గుండెల్లో శత్రువుల గుండెల్లో సింహనాదం చేస్తాయి.. మహారాజా నేను చిన్నప్పుడు చదువుకున్న ధర్మాల్లో,
నాకు మా తాత గారు బామ్మ గారు ఎంతో నేర్పారు, నేను ధనం లేని వాడిని కానీ నాకున్న విచక్షణ, తెలివి ఈ రెండూ వాడి న్యాయపరమైన తీర్పు చెప్పటంలో లో నేను సిద్ధహస్తుడు ని.. స్నేహితుడు కదా, మరణశిక్ష బదులు రాములవారు లక్ష్మణస్వామి ని రాజ్య బహిష్కారం చేసినట్టు చేద్దామని ఆలోచించవద్దు.."

హర సిద్ధుడు ఆవేశంగా మాట్లాడటం చూసి  రాజు గారి ముందు కొంచెం స్వరం తగ్గించుకోవాలని తన చేతిని  హరసిద్ద భుజాలమీద పాముతూ తెలియజేస్తున్నాడు...

మహారాజు "సరిగ్గా నేనూ మనసులో అదే అనుకున్నాను రాజ్య బహిష్కరణ చేద్దామనుకున్నాను."

హర సిద్ధుడు "బహిష్కరణ చేస్తే భక్తితో ఉంటానికి లక్ష్మణస్వామి కాదు, పన్నాగాలు పన్నీ, అంతఃపుర రహస్యాలు మీ శత్రువులు అందరికీ చెప్పి, ప్రతీకారం కోసం ఏమైనా చేయగలడు, ఇలాంటి నమ్మకద్రోహుల కి అందరూ చూస్తుండగా శిక్ష విధిస్తే మరొకడు ఆ తప్పు చేయడానికి భయపడతాడు, రాజ్యం ప్రజలని కాపాడుతుంది. అదే రాజ్యం ద్రోహులను శిక్షిస్తుంది.."

మహారాజు "నా సోదరి సమానురాలైన నాగయ్య భార్యకు ఏం సమాధానం చెప్పాలి?"

హర సిద్దు "మహారాజ ఒకవేళ ఈ పక్షంలో నేనున్నా నన్ను కూడా మీరు అంతే చేయాలని అడిగేవాడిని.. న్యాయం ఎవరికైనా ఒక్కటే, రేపటి రోజున ఒకడు ఇంతే ద్రోహం చేసి, పట్టుబడి, అతనికి శిక్ష విచారణ సమయంలో ఆ రోజు ఆ నాగయ్యకు ఎందుకు శిక్ష వేయలేదు అని మిమ్మల్ని ప్రశ్నిస్తే, ధర్మ దేవత తన చేతిలో ఉన్న కాట నేల మీద పడేయవలసి వస్తుంది."

ధర్మయ్య "మహారాజు న్యాయం చేసే క్రమంలోనే నాగయ్య భార్య తన సోదరి సమానురాలు ఆలోచిస్తున్నారు సిద్ధూ."

హర సిద్దు "ఆమెకి మీ న్యాయాధికారుల చేత విషయం విశదీకరించి కాకపోతే తన జీవితానికి సరిపడా అన్ని ఏర్పాట్లు ఒక సోదరునిగా చేయండి మహారాజా."

మహారాజు "అద్భుతం హార సిద్దు."

ధర్మయ్య "గట్టివాడేనయ్యా మా శివుడు ఎంచుకున్న ఈ పిడుగు."

మహారాజా "ఇక మీరు విశ్రమించండి, నాయనా ఎంతో చిన్నవాడైన నీవు ధర్మోపదేశం చేశావు, నా ప్రాణాలను కాపాడావు.. నా రాజ్యాన్ని కూడా కాపాడావు.  బొజ్జ లింగ ప్రతిష్ట దగ్గరుండి చేయించాలి ఇక్కడే విషయాలన్నీ ధర్మయ్య చూసుకుంటాడు. అంతఃపురంలోనే నువ్వు మా అతిథి గా ఉండు."

హర సిద్దు "వద్దు మహారాజా! నేను, ధర్మయ్య బాబాయ్ ఆ గుడిలో నే ఉంటాం.. నాకు చేతనైనంత వరకు ఆ గుడిని ఇంకా మలుస్తాను.. దానికి తగ్గ పరివారాన్ని నాకు  ఏర్పాటుచేసిన సంతోషం మహారాజా! "

మహారాజు "నీకేం కావాలన్నా ధర్మయ్య ని అడుగు, అన్ని ఏర్పాట్లు చేస్తాడు అలాగేనా" అంటూ వెళ్ళిపోతూ హార సిద్ధుని మీద.. లాలనగా చేయి వేసి  తల మీద చెయ్యి పెట్టి, చిన్నపిల్లల్ని లాగా బుగ్గ నిమిరి "ఆజన్మాంతం అన్ని సుఖాలు అనుభవించాలని , అటు పిమ్మట శివుని చేరాలని" తన ఆశీర్వాదం తెలియజేశాడు..

మహారాజు వాత్సల్యం గమనించిన హర సిద్ధుడు.. మహారాజుకి పాదాభివందనం చేసి.. "మీ వంటి వారు నా వెనక ఉంటే, ఎంత గొప్ప కార్యమైనా చేయగలను మహారాజా.. మీ అభిమానానికి కృతజ్ఞతలు.." అంటూ కుంభన్న గా తనతో నేను చెప్పిన మాటలు, తనతో నేను చేసిన చేష్టలు అన్నీ తలచుకొని,
ధర్మయ్య చెప్పినట్టు, నా సన్నిధి పొందిన తను ఎంత అదృష్టవంతుడు అని తలచుకొని, ఇక మీద తన జీవితంలో ఏ రకమైన అవమానాలు, విదిలింపులు, మానసిక స్పర్ధలు ఉండవని ఆశావంతంగా ఆలోచించ సాగాడు..

అంతఃపురం లో సెలవు తీసుకొని
 బొజ్జ లింగం గుడికి బయల్దేరారు ఇద్దరూ...

కార్తీకమాసం అవ్వడం వల్ల.. ప్రజలు ఎంతో మంది ఉండగా.. భక్తులందరూ తమ సమయాన్ని వెచ్చించి, నా పూజ, అర్చన, జపం చేసకున్న  తర్వాత ఆలయాన్ని పూర్తిగా శుభ్ర పరిచి తగిన మార్పులు చేర్పులు చేసే ప్రణాళికను ఎన్నో భాగాలుగా విడగొట్టి... అందరి చేత ఒక్కొక్క పని చేయిస్తూ.. చాలా కొద్ది సమయంలో గుడిని సుందరంగా ఉన్నతంగా ఆధునీకరించాడు హర సిద్ధుడు..

ధర్మయ్య మహారాజుతో కలిసి ఏదో ఆలోచిస్తున్నాడు హర సిద్దు గురించి.

ఈ ఆలయం ప్రతిష్ట అయిన తర్వాత, హర సిద్దు కి తగిన రాజ్య కొలువు ఇవ్వవలసిందిగా.. ఆలోచిస్తున్నారు.. తమ రాజ్యంలో  పౌరుడు కాని వ్యక్తికి రాజ్య కొలువు ఇవ్వాలంటే.. తన రాజ్య మండలం సమావేశం చేసి ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.. దానికిగాను సుమారు ఒక పక్షం పడుతుంది... సరే ఈ విషయం హరసిద్ధునితో చెప్పకుండా.. "ఈ పౌర్ణమి బొజ్జ లింగ ప్రతిష్ట జరిగిన తర్వాత, వచ్చే పౌర్ణమి కి మరొకసారి రాజ్యానికి రావాల్సిందిగా మనం అడుగుదాం మహారాజా!" అని సెలవిచ్చాడు..

 చెప్పలేదు కదూ, ధర్మయ్య మహారాజు ఆంతరంగికుడు లో ఒకరు. గూడచారి కూడా.. ధర్మయ్య చెప్పిన విషయాలు మహారాజు కి ఎంతగానో నచ్చాయి.. ధర్మయ్య కూడా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే తన నాయనమ్మ తను గొప్ప కొలువులో చూడాలని కోరుకుంది. అది నెరవేరితే తన నాయనమ్మ కోరికతో పాటు హర సిద్దు కష్టాలు కూడా తీరిపోతాయి..

బొజ్జ లింగం వైపు ఎంతో ఆనందంగా చూస్తున్నాడు హర సిద్దు.. ఎన్నో సంవత్సరాల తర్వాత తన జీవితంలో అన్ని పరిస్థితులు ఇప్పుడు అనుకూలంగా కనబడుతున్నాయి ... తన నాయనమ్మ తనకు చెప్పిన ఈ విధంగా.. ఎప్పుడు లింగాకార మే కాకుండా ఆ కనబడుతున్న బొజ్జ మీద తాను చూసిన కుంభన్న మొహం చెక్కుదామా అనే ఆలోచనలో ఉన్నాడు.. అనుకుంటూ అనుకుంటూ కునుకు తీశాడు..హర సిద్దు కలలో నేను కనబడి "హర సిద్దు, ప్రస్తుతానికి ఆ బొజ్జ లింగాన్ని అంతే ఉండనివ్వు. నీవు అనుకున్న విధంగా గా అతి త్వరలోనే మరొక విగ్రహం చెక్కుదుగానీ " అన్నాను. అంతే అతడు నిద్రలేచి "అలాగే" అని అన్నాడు ..

నా ప్రియమైన హర సిద్ధుని ముఖ కవళికలు చూసి నేను కూడా నవ్వుకున్నా.

కార్తీక పౌర్ణమి బొజ్జ లింగ ప్రతిష్ట... ఆ రోజంతా ఘనంగా జరుగుతుంది.. ప్రతిష్ఠకు సంబంధించిన తంతు శాస్త్రోక్తంగా ప్రారంభమైంది.. బొజ్జ లింగం నీవు ప్రతిష్టించాల్సిందే. బొజ్జ లింగం కథలో అది నా ఆజ్ఞ , హర సిద్దు..అన్నాను.

హర సిద్దు మనసులో "నాకు అర్హత ఉన్నా లేకపోయినా ఇంత గొప్ప ఘనకార్యాన్ని జన్మ సార్ధకతను కలగ చేశాడు.. కుంభన్న"
అలా ప్రతిష్ట జరిగిన తర్వాత.. నా పాదుకలు తీసుకువచ్చి .. అందరి తల మీద శఠగోపం లాగా పెడుతున్నాడు..

అప్పుడు నిజంగానే హర సిద్దు చేతిలోని పళ్లెంలో, మహారాజు ధర్మయ్య పురప్రముఖులు అందరూ ఎంతో ధనం వేశారు .. అంటే అది దక్షిణ అనమాట..

తనకు వచ్చిన కల అలా నిజమైంది....
చూద్దాం హార సిద్దు ఎటువంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నాడో!
(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages