మానసవీణ - 23 - అచ్చంగా తెలుగు

                                           మానసవీణ - 23

కొత్తపల్లి ఉదయబాబు


(ఒక అనాధాశ్రమంలో పెరుగుతున్న మానస సేవా మార్గంలో పయనిస్తూ, స్వయంకృషితో ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఆమెను ప్రేమిస్తారు రాజేష్, అనిరుధ్ లు. కాని, మానస లక్ష్యం వేరు...)

ఎపుడో తెల్లవారుఝామున నిద్రలోకి జారుకున్న మానసకి ఝాము పోద్దెక్కాకా మెలకువ వచ్చింది. తన పుస్తకాల అలమారు దగ్గర అటు తిరిగి ఉన్న సమీరను చూసి "సమీరా?” అని పిలిచింది.

సమీర గతుక్కుమని వెనక్కు తిరిగి " అరె... అక్కా....లేచావా? రాత్రి నిద్రపట్టలేదా? " అని అడిగింది దగ్గరగా వచ్చి మంచం మీద కూర్చొంటూ.

"అవునమ్మా. ఏమిటో... ఒకటే పిచ్చి ఆలోచనలు. అది సరే గానీ... ఏమిటి పొద్దున్నే నా గదికి వచ్చావ్.మళ్ళీ ఏమైనా సందేహాలా?"

తల ముందు అడ్డంగా వూపబోయి తరువాత అవునన్నట్టు తల వూపింది సమీర.

"టిఫిన్ చేశావా?” "లే..లే..లేదక్కా.” కంగారుపడుతున్నట్టు అంది సమీర. ఆమె చూపులు కూడా.

"ఏమిటలా ఉన్నావ్? ఏదైనా సమస్యా?" భృకుటి ముడుస్తూ అనుమానంగా అడిగింది మానస. సమీర మానస చేతిని తన చెంపకు ఆనించుకుని అంది. "నాకు ఈ లోకం లో ప్రాణప్రదమైన స్నేహితురాలు మా అమ్మ. నిన్న నువు ఒక తల్లి బిడ్డకు నేర్పుతున్న రీతిలో నా సందేహాలు తీరుస్తుంటే నాకు అమ్మే గుర్తుకువచ్చిందక్కా. అలాగే నేను తప్పు చేసినప్పుడల్లా ఆ తప్పు ఎందుకు చెయ్యకూడదో తెలియచెప్పి, ఒకవేళ అది జరిగిఉంటే జరిగే పర్యవసానాలు కూడా అమ్మ నాకు విశదపరిచేది. మళ్ళీ నా చదువు పూర్తి అయి అమ్మను చేరుకునేంతవరకు నాకు 'అమ్మ'లా తోడుగా ఉంటావా అక్కా?" బేలగా అడిగిన సమీరకళ్ళల్లో నీళ్ళు.

ఎవరో తన గుండె తలుపును తట్టినట్టు ఉలిక్కిపడింది మానస. ఎవరైనా "అమ్మా" అన్న పదం ఉచ్చరిస్తే చాలు తన తనువు తీగ తెగిన వీణలా మూగబోతోంది. మధురమైన రాగం ఆలపిస్తున్న పాట ఎక్కడో అర్ధాంతరంగా చటుక్కున ఆగిపోయిన భావన. అమ్మ” అన్న పదమంత కమ్మనైనా పదం అసలు మనిషి” జీవితంలో ఉంటుందా? ఒక్కసారి అమ్మ ప్రేమను పొందగలిగితే?

మానస మదిలో శ్రావణి మెదిలింది. చేతులు చాస్తూ రా అమ్మా మానసా..." పిలుస్తున్నట్టే అనిపించింది.

అక్కా నిన్నే...” సమీర చెయ్యిపట్టి అడుగుతోంది. తేరుకున్న మానస సమీర చేతిలో చేయి వేస్తూ "తప్పకుండానమ్మా. ఈవెల్టీనుంచి నీకు మీ అమ్మ అంత కాకపోయినా నీకు తోడు నీడగా ఉంటానని హామీ ఇస్తున్నాను. అయితే ఒక్కటి. నువ్వు నాతో స్వచ్చమైన స్నేహం చేయగలిగినపుడే నా ప్రాణం అడ్డు వెసైనా సరే నిన్ను కాపాడుకుంటాను. ఈ హామీ చాలా...?” అంటూ సమీర చేతిలో చేయివేసింది మానస.

నువ్వెంత మంచి దానివి అక్కా....తప్పకుండా..” అంది సమీర.

"సరే... నేను స్నానం చేసి ఫ్రెష్ అయి నీ రూమ్ కి వస్తాను. ఇద్దరం టిఫిన్ చేసి వచ్చాకా నీ సందేహాలు తీరుస్తాను.”

"సరే.ఎదురు చూస్తూ ఉంటాను." సమీర వెళ్లిపోయింది.

మానస లేచి అరగంటలో అప్పుడే అరవీరసిన మంకెనపువ్వులా తయారైంది. తన బల్లమీద ఉన్న బిడ్డకు పాలిస్తున్న తల్లి బొమ్మకు మనస్ఫూర్తిగా నమస్కరించుకుంది.

"అమ్మను మించిన ప్రత్యక్ష దైవం ఏముంది? ఈ ప్రపంచం అంతా ఆ 'అమ్మ' కరుణ మీదనే నడుస్తుంది. నవమాసాలు మోసి, కనీ, అష్ట కష్టాలను భరించి తమ అంత పెంచి పెద్ద చేసిన తల్లికి ఎవరు ఏమిచ్చి రుణం తీర్చుకోగలరు? పుట్టిన క్షణం నుంచి తనకాళ్లమీద తాను నిలబడేంతవరకు బిడ్డకు అన్ని విధాలుగా ఆలంబనగా నిలబడే తల్లి, యే క్షణం లో అయినా తన బిడ్డ ప్రవర్తన చూసి 'కాదనుకుంటే’ అపుడే పెంచిన చేతులతోనే చంపేయ్యగలదు. కానీ ఈ ప్రపంచంలో ప్రతీ తల్లికి తన పెంపకం మీద నమ్మకం. పుట్టిన క్షణం నుంచి యేనాడు ఎవరికి ఉపయోగపడకపోయినా కనీసం తనకు కూడా తాను ఉపయోగపడకుండా ఉన్నా... వాడికీ ఒక రోజు వస్తుంది. వాడిలా మరే బిడ్డ ప్రవర్తించకూడదు అనే ఉదాహరణగా అయినా వాడు మిగిలి సమాజానికి ఆదర్శమవుతాదని – అన్న నమ్మకంతోనే పెంచుతుంది. అందుకే ఈ లోకంలో మగవాడి ఆటలన్నీ సాగుతున్నాయి. తన తల్లి, సోదరి తప్ప మరే స్త్రీ కనిపించినా కళ్ళల్లో కామం కురిపిస్తూ అవకాశమొస్తే కాటేసే ప్రబుద్ధులే లోకమంతా ఈవేళ.

ఆమె మనసులో ఒక మగవాడి బొమ్మ మెదిలింది. వెలుగుపడినవైపు అనిరుధ్, చీకటివైపు రాజేష్ ఆకారాలు గోచరించాయి ఆమెకి. తన ఆలోచనకు నవ్వొచ్చిందామెకు. వెలుగు వైపు రాజేష్ ను వూహించినా, చీకటివైపు అనిరుధ్ ను వూహించినా అసలు ఏమీ గోచరించలేదు. అంతా చీకటిగా నల్లగా అనిపించింది. వాళ్ళు వాళ్ళు చేసే పనులను బట్టి ఒకరిమీద ఒకసారి అభిప్రాయం ఏర్పడ్డాకా అవి మారవేమో. అని నవ్వుకుని సమీర దగ్గరకు వచ్చింది మానస. ఇద్దరూ కాంటీన్ కి వెళ్ళి టిఫిన్ చేశారు. తమతోనే టిఫిన్ ఆఖరు. 'ఏంటమ్మా? ఈవేళ బాగా ఆలస్యంగా వచ్చారు?” కేంటీన్ ఆయా అడిగింది. ఆమెలోను శ్రావణి కనపడింది మానసకి.

"పరీక్షలు వస్తున్నాయి కదా ఆయా... చదువుకుంటూ ఉండిపోయాను.” మృదువుగా చెప్పింది మానస.

"రాత్రిపూట ఎక్కువ మెలకువగా ఉండకండమ్మా.” అని రాక్ లో ఒక గిన్నెలో దాచిన విరిసిన పందిరిమల్లె పూల మాలను రెండు ముక్కలు చేసి తెచ్చి "చెరిసగం పెట్టుకొండమ్మా... మహాలక్ష్ముల్లా ఉంటారు." అని ఇచ్చింది ఆయా. ఒకమాల తీసుకుని ఆయాకి ఇచ్చి "నువ్వే పెట్టు ఆయమ్మా...” అని మరొక మాలను తాను సమీర జడలో పెట్టింది మానస. మానస బుగ్గలు చిదిమి మెటికలు విరిచింది ఆయా. "మనపాలతను పెరట్లో పూసాయటమ్మా. దేవుడికి పటానికి వెయ్యమని ఇచ్చాడు. ఎపుడూ వేసేదే కదా... నాకెందుకో మీకు ఇవ్వాలనిపించిందమ్మా. మిమ్మల్ని చూస్తుంటే నా పిల్లలకి జడేసి పూలు పెట్టిన రోజులు గుర్తొస్తున్నాయి,” అంది ఆయా.

మానసకి ఆ మాటలకి ఎంతో సంతృప్తి అనిపించింది. తనకు తల్లి లేకపోయినా అమ్మ జీవితంలోని అనుభూతులు కొద్ది కొద్దిగా అవగతమవుతున్నాయి.

"పేపర్ చూస్తారా అమ్మా..." అడిగింది ఆయా.

"వీలైతే భోజనానికి వచ్చినప్పుడు చూస్తాలే. కాసేపు చదువుకోవాలి.” ఆయాకి చెప్పి ఇద్దరు సమీర రూమ్ కి వచ్చారు.

ఒకవేళ మానస పేపర్ చదివి ఉంటే లోపలి పేజీలలో ఒక దానిలో కృషీవలరావు కారు ప్రమాదం వివరాలు చదివి ఉండేది. ఆమె దృష్టి అంతా సమీరకు సందేహ నివృత్తి అయితే తాను చదువుకోవాలని. సమీర అడిగిన సందేహాలు వివరిస్తుంటే ఎక్కడెక్కడో ఆలోచిస్తూ వింటున్న ఆమె దృష్టిని పసికట్టి అడిగింది మానస.

"ఏమిటి సమీర? ఎక్కడో ఆలోచిస్తున్నావ్? నిన్న వినడంలో చూపించిన వుత్సాహం ఈవేళ కనిపించడం లేదే?” సమీరలో ఏదో తత్తరాపాటు.

"లేదక్కా వింటున్నాను.”

"అలాగా...అయితే నేను చెప్పింది నీకు ఏం అర్ధమైందో చెప్పు నాకు?” సమీర వింటేగా...

నీతో ఒక విషయం చెప్పాలక్కా...” అంది మొహమాటంగా మానస సూటిగా చూసింది.

"నీకు ఉదయమే చెప్పాను. మన ఇద్దరి మధ్య స్నేహం కొనసాగాలంటే దాపరికాలు ఉండకూడదు అని.” "ఆ తప్పు నీకు నేను మాట ఇవ్వక ముందు జరిగిపోయిందక్కా... అందుకే భయపడుతున్నాను.”

మానస పుస్తకం మూసేసింది. "నీ మాట నమ్ముతున్నాను. అదేమిటో చెప్పు.” అంది అంతలో మానస ఫోన్ మోగింది. పేరు లేని నెంబర్. నిన్న రాత్రి కూడా వచ్చింది ఆ నెంబర్ నుంచి కాల్. అలాంటివి అసలు తాను లిఫ్ట్ చేయ్యనని అవతలివాళ్ళకి తెలియదు పాపం. రింగ్ ఆగిపోయాక ఫోన్ వైబ్రషన్ లో పెట్టేసింది మానస.

"ఈరోజు ఉదయమే ఆరు దాటాకా ఎవరో ఒక కుర్రాడు వచ్చాడు. నువు తనకు తెలుసునని, తాను నిన్ను మనస్పూర్తిగా ప్రేమిస్తున్నాడని, తాను పెళ్లి చేసుకుంటే నిన్ను తప్ప మరెవ్వరిని చేసుకొననీ, తన విషయాలన్నీ నీకు ఎప్పటికప్పుడు చేరవేసి నీ మనసు తనవైపు తిరిగేలా చెయ్యమని చెప్పాడు. ఒకవేళ అతను చెప్పినట్టు నేను వినకపోతే నన్ను చంపేస్తానన్నాడు. పొద్దున్నుంచి ఈ విషయాలు నీకు చెప్పాలని నీ గదిలోకి వచ్చాను. నువు లేవలేదు. ఇక నీకు మాట ఇచ్చాకా ఎలాచెప్పాలా అని చూస్తున్నాను. ఇపుడు నా మనసు తేలికపడింది అక్కా.” అంది సమీర మానసను కౌగలించుకుని.

ఆమాటలు తేలికగా కొట్టి పారేసింది మానస. ఆమె ప్రత్యేకత అదే.

"పిచ్చి పిల్లా... ఇందుకా నువు అన్యమనస్కంగా ఉన్నది... దీన్లో రెండు జరగని విషయాలు ఉన్నాయి. ఒకటి - రెండు హృదయాల మధ్య ప్రేమ ఒక పూలమొక్క సహజంగా మొగ్గలు ఎలా వేస్తుందో అంతా సహజంగా మొగ్గ తొడగాలి. కనుక వాడిని నేను ప్రేమించే ప్రసక్తి లేదు. రికమెండషన్ లతో ఎవరూ ఎవరిని ప్రేమించరు. రెండు - వాడు నిన్ను చంపుతాను అని బెదిరించడం. నేను పక్కనుండగా నీమీద ఎటువంటి దుష్ట ఆలోచనా వాలదు. అలా జరగాలంటే ముందు నా ప్రాణాలు పోవాలి. ఇక ఈ విషయం ఆలోచించడం మానేసి వెళ్ళి కాసేపు ప్రశాంతంగా పడుకో. భోజనాలు అయ్యాకా నీ సందేహాలు తీరుస్తాను. అపుడు కూడా శ్రద్ధ పట్టలేదనుకో... నీ చదువు నువ్వే చదువుకో. సరేనా....”

"లేదక్కా... అస్సలు ఆలోచించను. లంచ్ కి నేనే నీ రూమ్ కి వస్తాను. ఇద్దరం వెళ్లాం.బై” చెప్పి వెళ్లిపోయింది సమీర.

మానస వెళ్ళి తన పుస్తకాల గూటిలోనుంచి పైనున్న పుస్తకం తీసుకుని వచ్చి మంచం మీద వాలింది. ఆమె వాలిన వెంటనే ఆ పుస్తకం లోంచి ఒక నాలుగు మడతలకాగితం నిశ్శబ్దంగా పక్కకు జారిపోయి దానిపై పడిన ఆమె పైట అసంకల్పితంగా దాన్ని కప్పేసింది. మానస ఆ పుస్తకం తెరిచింది. అది ఒక కవితా సంపుటి. ఒక వర్ధమాన రచయిత రాసింది. అందులో "అమ్మ ఒక పాలపుంత” అన్న కవిత తనకు చాలా ఇష్టం. మనసు బాగుండక అమ్మ గుర్తుకు వచ్చినప్పుడల్లా తాను ఆ కవితా చదువుకుంటే మనశ్శాంతి గా అనిపిస్తుంది. అది తీసి చదవసాగింది. అందులో ప్రతీ వాక్యం తనకిష్టమే.

"సూర్యోదయం కాకుండానే / మా పెరటి ఆవు - కామధేనువుకు / అమ్మలేని లోటు / తీర్చే దెవరకున్నారు? / "అమ్మే !"/ ఆ ప్రేమమయి అమృతహస్తం / తన పొదుగు నిమరగానే/ చర్మం జలదరించి పాలాక్షతలతో / అమ్మను ఆశీర్వదించేది ఆవుతల్లి / నునుసిగ్గుతో అమ్మ పాలపుంతై/ పరవశించిపోయేది." చదివి చదివి మననం చేసుకుంటున్న కొద్దీ ఆమె మనసు నిండా ఏదో తెలియని ప్రశాంతత, ప్రేమతత్వం పరుచుకోసాగింది. ఆ గోమాతలో శ్రావణి ని దర్శిస్తూ కళ్లుమూసుకుంది మానస.

(సశేషం)

No comments:

Post a Comment

Pages