లేడీస్ టైలర్ - అచ్చంగా తెలుగు

 లేడీస్ టైలర్

 (మాజొన్నవాడ కధలు)

టేకుమళ్ళ వెంకటప్పయ్య (9490400858)


సమయం ఉదయం 9గం. దాటుతోంది. భక్తులు దేవళానికి గుంపులు గుంపులుగా నడుస్తున్నారు. దేవళంలోపల మైకులో కామాక్షమ్మ అర్చనలు వినిపిస్తున్నాయి.  శ్రీరాములు అమ్మపెట్టిన ఉప్మాతిని, నెల్లూరు  బయలుదేరడానికి తయారవుతున్నాడు. క్యారియర్ సంచిలో పెట్టుకొని అమ్మ పాదాలకు నమస్కారం చేస్తుండగా.. "రంగమ్మొదినా! ఎట్టెట్టుండారు.. ఏంకతా?" అంటూ లోనకు వచ్చింది ఆదెమ్మ. 

"రా.. రా! ఆదీ..  శానా రోజులైంది నిన్ను జూసి…పిలగాడు షాపు తీసేటైమైందని పోతున్నాడు. కూర్చో! వాణ్ణి బిన్నా పంపించేసి వస్తా..కూకో! " 

"నీ కొడుకు శ్రీరామచంద్రుడొదినా! ఈరోజుల్లో ఇలాంటి పిలకాయలుండడం నీ అదురుష్టమనుకో!"

"ఏం అదృష్టంలే ఆదీ... సీత కష్టాలు సీతవి….పీత కష్టాలు పీతవన్నట్టు.. భగవంతుడు మా ఆయన్ని పెళ్ళయిన పదేళ్ళకే తీసుకొనిపాయె! మీమిద్దరం ఎన్ని బాధలు పడ్డాం చెప్పు? కొంతలో కొంత రాముడికి ఆడాళ్ళ గుడ్డలు గుట్టడం బాగా వచ్చింది గాబట్టి మాకు ఏ లోటూ లేకుండా జరిగిపోతున్నాది"

"నేనొస్తానమ్మా టైం అయింది" అని బయటికి నడుస్తుండగా ఆదెమ్మ కల్పించుకొని "ఆగవయ్యా అల్లుడూ!  నీకొక మందల జెప్పాలని వచ్చా! నువు గూడా ఉండాల! కూకో ఆడ కాసేపు."

"ఆదత్తా…. షాపు దీసే టైమైంది...చెప్పు తొందరగా బోవాల" కంఠంలో విసుగు ధ్వనించింది.

"చెప్పనీ నన్ను...అదిగాదు రావుడూ...మీ మరదలు సీత కష్టపడి ఊక్సు గుట్టడమూ..చేతిపనీ… అన్నీ నేర్చుకున్నాది"  

"అయితే షాప్ బెట్టుకోమను.."

"అది ఇంకేడా పనిజెయదంట.. నెలనుంచీ….బావ షాపులో నే జేస్తానని ఒకటే గలబా జేస్తా ఉందనుకో "

"అత్తా.. నాకు ఒక పనోడున్నాడు బాగానే చేస్తున్నాడు. సీతకు పగలు పొద్దస్తమానం  నిద్దరే…...హైస్కూల్లో జదివేటప్పుడు  జూళ్ళా.. దానెవ్వారమంతా… అందరూ నిద్రమొహం గరుడసేవ అనేవాళ్ళు" 

"అదేందల్లుడూ…. నువ్వే అట్టంటే ఎట్టా చెప్పు?  ఇప్పుడు ఆమాదిరి లేదులేయ్యా..ఎప్పటికైనా కట్టుకునేది నిన్నేగా!"

"ఆమాటలు ఇప్పుడెందుకులే ఆదీ…..తర్వాత జూద్దాం.. పిలగాడు షాపులో ఖాళీ లేదంటున్నాడు గదా! వదిలిపెట్టు… వాణ్ణిబోనీ..." అన్న రంగమ్మ మాటలకు రోషం వచ్చి "అది నీ షాపులో బెట్టుకోకపోతే చస్తానని జెప్పమంది...ఆనక మీఇష్టమయ్యో!" అంది లేచి నిలబడి. "అయ్యో! అవేం మాటలే ఆదీ…..ఆలోచించుకోని జెపతాం రేపు రా!  నువ్వెళ్ళు రావుడూ! వీడికేమో ఆడపిలకాయలంటేనే.. సిగ్గూ... అని గొణుక్కుంటూ వాళ్ళను పంపించి తలుపేసుకుంది రంగమ్మ. 

- ఆరోజు రాత్రి 10 గంటలు. 

"అమ్మా షాపులో గోవిందు వాళ్ళక్క పెళ్ళని ఒంగోలు బొయ్యాడు. చేతిపని చేసే వాళ్ళు లేరు. అన్నీ నేనే జేసుకోవాల.. రేపటినుంచీ నేనొచ్చేతలికి కాస్తా ఆలస్యమవుతుంది. నువ్వు బువ్వ దిని పణుకో!" అన్నాడు చేతులు కడుక్కుంటూ..

"అదేందిరా! గుడ్డలు కాస్తా నిదానంగా ఇస్తానని  జెప్పు! అంతంత సేపు పని చేస్తే నీ ఆరోగ్యం పాడవదా నాయనా!"

"ఈరోజుల్లో ఆడపిల్లలెట్టున్నారని?  గమ్ముగుండరమ్మా రచ్చలు.. రచ్చలు.. జేస్తారు"

" పోనీ...ఆది కూతురును గోవిందయ్య వచ్చేదాకా… రమ్మని జెబదామా!"

"నిద్దర మొహంది. సరిగ్గా కుట్టకపోతే నా పరువు బోద్ది"

"అట్టగాదులే అయ్యా! బాగా కుట్టకపోతే వద్దని జెప్పొచ్చులే!"

"నా బైక్ మీద మాత్రం దాన్ని దీసుకోంబోను. అందరూ తలా ఒక మాటంటారు"

"సరే! రేపటినుంచీ షాపుకు పంపమని జెపతా ఆదికి" అంది నవ్వుతూ

- మరుసటిరోజు 11 గంటల సమయం.

 రాముడు షాపులో బిజీగా ఉన్నాడు. ఆదికూతురు సీతమ్మ ఆరుగిన్నెల క్యారియరులో భోజనం, తినుబండారాల తిత్తి దీసుకుని షాపు వెదుక్కుంటూ లోపలికి వచ్చి "ములుమూడి బస్టాండ్ పక్కన్నే అన్నావు.. సంతపేట మొత్తం దిరిగా.. తల్దిరిగి ముద్దనోట్లోకి వచ్చింది" అని పెద్దగా నవ్వింది. ఆ నవ్వుకు పక్కన చిల్లరంగడిలో ఉన్న సిద్దన్న షాపులోకి వచ్చి "ఏమైందన్నా!" అని అడిగాడు.

" అరే..నువ్‌బోరా సిద్దా! ఏమి కొంప ముణగలేదులే!  అన్నిటికి పెద్ద...బుడ్డ ముణిగిపొయినట్టొస్తుంటావు.. పో! “ 

“సీతమ్మా! ఇదుగో.....నీ క్యారియరు…మూటలు ఆడ… అరలో బెట్టుకో!   నీ నవ్వు జూసి ఏదో డైనాసారు వచ్చిందని జనాలు బయపడతా ఉన్నారీడ.. ఇది…. టవున్… జాగర్తగుండాల. జొన్నాడ మాదీరి కాదు”  అని కొన్ని జాగ్రత్తలు చెప్పి, ఈ జాకెట్లకు హుక్సులు జాగర్తగా గుట్టు. " అని నాలుగు రవికలు ఇచ్చి తన మళ్ళీ పనిలో నిమగ్నమయ్యాడు.

గంటయింతర్వాత  "సీతమ్మా..రెవికలు అయ్యాయా?" అని అడిగిన ప్రశ్నకు సమాధానం లేకపోయేసరికి లేచి చూసే సరికి సీత గోడకానుకుని గురకలు పెడుతోంది. "సీతమ్మా!" అని పెద్దగా మూడు సార్లు అరిచినా జవాబు లేదు. అక్కడున్న స్కేలు తీసుకున్న నెత్తిమీద ఒక్కటిచ్చేసరికి ఉలిక్కిపడి లేచి "అబ్బా.." అని లేచింది.

“సీతమ్మా! నీకు పనికి చుక్కెదురుగానీ... రేపట్నించి రాబాకు, నా చావు నేను జస్తా గానీ..

"అయ్యో! అదేంది బావా..అట్టా కొప్పడతావు? పొద్దున్నే తిని, నీ షాపు కోసం తిరిగి తిరిగి ఫ్యాన్ కింద కూచ్చున్నాన్నా. నిద్ర పట్టేసింది" అని మళ్ళీ నవ్వితే ఏం ఉపద్రవం వస్తుందోనని జాకెట్టు కుట్టడానికి మొదలు పెట్టింది.

ఇంతలో ముగ్గురు ఆడపిల్లలు లోపలికి వచ్చారు. ఒకమ్మాయి "ఇదిగో టైలరబ్బాయో! జాకెట్లు మళ్ళీ….. డ్రెస్సులు… కుట్టాల, చీరలకు ఫాల్సు గూడానయ్యో...  చానా బాగుండాల..." అని బ్యాగులోని గుడ్డలు టేబులు మీద కుప్ప పోసింది.

"ఆది జాకెట్టు ఉందా?" అని అడిగిన ప్రశ్నకు "ఉళ్ళా..నాకాడ. ఉంది గానీ….. ఒంటి కొలతలు దీసుకుంటే మంచిదిగదా!" అంటూ ఇచ్చింది.

"నేను తీసుంటా ఆది" అని సీత లేవబోయేసరికి రాము వద్దంట్లు సైగ జేసి "ఏం బల్లేదులే!" అంటూ ఆది జాకెట్ దీసుకుని ఆమె వైపు జూస్తూ..టేపుతో ఆది జాకెట్ కొలుస్తూ.. "నడుం కొంచెం లూజు పెంచాల..చేతులు లూజు అయ్యాయి. కొంచెం తగ్గించాల అంతేనా?"  

వచ్చినమ్మాయి ముక్కున వేలేసుకుంది. నా నోట్లో ఉన్న మాట ఎట్టాజెప్పావు అన్నట్టు ఆశ్చర్యంగా చూసింది.

"నేంజెప్పలా..రామూ అంటే అంతే.. చూపుల్తోనే కొలతలేసేస్తాడు" అంటూ నవ్వింది కూడా వచ్చినమ్మాయి. సీత మూతి తిప్పుకుంది బాగనే ఉంది సంబడం అన్నట్టు.

- సమయం సాయంత్రం 5 గంటలయింది. 

"సీతా ఇవాళ కాస్తా బయటకు బొయ్యే పనుంది. నువ్వు ఏడు...ఆ ప్రాంతంలో షాపు మూసేసి బీగాళు ఇంట్లో ఇచ్చెయ్! లైట్లు ఫ్యాన్లూ...అన్నీ జాగర్తగా చూసుకోని ఆర్పు.."

"అట్నేలే బావా!"

* * *

ప్రక్కరోజు ఉదయాన్నే తాళం తీయబోతున్న రాముకు షాపులో కాలిన వాసన వచ్చింది. కంగారుగా తలుపులు తీయగానే షాపులో మొత్తం పొగ. ఉన్న గుడ్డలు మొత్తం కాలిపోయి ఉన్నాయి. ఇస్త్రీపెట్టె నల్లగా మాడిపోయి ఉంది. దాని తీగలు కాలి గుడ్డలకు అంటుకున్నాయి. రాముకు ఒక్క నిముషం భూమి గిర్రున తిరిగినట్టయింది. చెమటలు పట్టాయి. ఏమి చెయ్యాలి ఇప్పుడు? వెంటనే ఫ్యూజ్ ఆఫ్ చేసి షాపు మూసేసి బయటకు నడిచాడు. కస్టమర్లు తన్ను నమ్మిచాలా ఖరీదయిన గుడ్డలు ఇచ్చారు..  గుడ్డలు, చీరలు, కుట్టుమిషనూ...బల్లలూ..ఫర్నిచరూ అవీ ఇవీ అన్నీ  కలిపి.. రెండు లక్షలు పైన్నే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకు ఏమి చెప్పాలి. నడుస్తున్నాడు. నడుస్తున్నాడు…ఎక్కడికి నడుస్తున్నాడో తెలీలేదు. ఆలోచనలతో ఊరు చివర పెన్నా నది దాకా వచ్చాడు. జేబులో కొంత డబ్బు ఉంది. టీ అంగడి ప్రక్కన ఆగి ఉన్న లారీ వాడిని ఎక్కడికి వెళ్తుందని అడిగాడు?   ఒంగోలు..  వస్తావా?   అన్నాడు డ్రైవరు. వెంటనే ఎక్కాడు.

* * *

ఒంగోలులో దిగి...రోడ్డు క్రాస్ చేస్తుండగా ఒక కారు దాదాపు గుద్దినట్టుగా ఆగింది. ఆ తాకిడికి ముందుకు తూలి పడ్డాడు. కారు తలుపు తీసిన పెద్దమనిషి "బుద్దుందా! ఇంకో సెకండ్ బ్రేక్ వెయ్యడం లేటయితే చచ్చే వాడివి" అన్నాడు.

"చచ్చినా బాగుండేది"

"ఓహో.. చావడానికి నా కారే దొరికిందా?". రామూ ఏమీ మాట్లాడకుండా నిలబడ్డాడు.

"ఏమయింది? ఏంది నీ బాధ? చూడ్డానికి చక్కగా సినిమా యాక్టరు లాగున్నావు. ఏమి కథ"

"నిన్నటి వరకూ బాగానే ఉన్నాను. ఇవళే.."అంటూ ఏడుపు మొదలెట్టాడు.

"ఛీ ఆడపిలకాయలమాదిరి ఏడవబాక..కారెక్కు"

ఐదు నిముషాలు అయ్యాక.."నేను యిప్పుడు చీరాల్లో మా ఫ్రెండ్ రెడీమేడ్ షాపు..టైలరింగ్ షాపు ఒపనింగుకు బోతా ఉన్నా..వస్తావా?  ఇప్పుడు జెప్పు నీ కథేందో"

"నా పేరు రాము. మాది జొన్నవాడ..." అంటూ జరిగిందంతా వివరంగా జెప్పాడు.

"ఓరి నీయమ్మ బడవా నువ్వూ టైలరువేనా? మా ఫ్రెండుకు పరిచయం చేస్తాను.  నువ్వేం దిగులుపడమాక. అట్నే మీ అమ్మకు జరిగింది చెప్పి దిగులుపడొద్దను. ఆమెకు డబ్బులు పంపించి ఫోన్ లో మాట్టాడు ఎల్లమాక గొడవలు అవుతాయ్! జీవితంలో కష్టాలు..సుకాలు వస్తా ఉంటాయ్. పోతా ఉంటాయ్. మనం దైర్ణంగా ఉండాల"

చీరాల్లో కారు దిగి స్నేహితుణ్ణి కౌగలించుకుని...ఈ అబ్బాయి మనోడే.. శేఖర్..   చెప్తా..ముందు ఒపనింగ్ కానీ"

ఆ వూరి ఎం.ఎల్.ఏ ఒపనింగ్ చేసి వెళ్ళాడు. అతిధులందరూ కూల్‌డ్రింకులు తాగి వెళ్ళిపోయారు. ఫ్రెండు శేఖర్తో పాటూ రవి ఇంటిలోకి వెళ్తూ.."రామూ..రా..." అని పిలిచాడు షామియానా క్రింద  ఒక మూల కూర్చొని ఉన్న రామూను.

"శేఖర్.. ఇతని పేరు రామూ.. లేడీస్ టైలరంట..యమాగా గుడతాడంట ఆడపిలకాయల జాకెట్లూ..డ్రస్సులూ" అంటూ విషయం మొత్తం పూసగుచ్చినట్టు చెప్పాడు.

ఒరే..రవీ.. ఈ పరిస్థితుల్లో రాము వాళ్ళ ఊరికి వెళ్తే జనం గొడవ జేస్తారు. అందుకని పైన మేడ మీద ఒక గది ఉంది. లేడీస్ టైలర్స్ పెట్టించనా!"

"నా మనసులో ఉన్న మాట జెప్పావ్" అంటుండగా అన్నీ గమనిస్తున్న శేఖర్ చెల్లెలు రేఖ అందరికీ టీలు తీసుకుని వచ్చి ఇచ్చింది.

"రేకమ్మో! లేడీసు టైలరంట!" అన్నాడు శేఖర్.

రేఖ "అన్నా… ఒక పరీక్ష..ఇప్పుడే ఒక జాకెట్ కుట్టమను. ఎంత బాగా కుడతాడో చూద్దాం" అనింది.

జాకెట్టు..ఆది జాకెట్టు తెచ్చి ఇచ్చి.."అబ్బాయ్..కొంచెం మార్పులు చెయ్యాల" అన్నదానికి నాకు తెలుసన్నట్టు తల ఊపాడు.

"జాకెట్ చెడగొట్టమాక!" అని లోపలికి వెళ్ళింది. స్నేహితులిద్దరూ మాట్లాడుకుంటుండగానే అరగంటలో కుట్టేసి ఇచ్చాడు. రేఖ వచ్చి జాకెట్ తీసుకుని లోపలికి వెళ్ళి వేసుకుని వచ్చింది. "ఎలా ఉంది రేఖా!" అన్న శేఖర్ మాటలకు.."సూపర్ గా గుట్టాడన్నా..అడ్జస్ట్మెంట్లు నేను చెప్పకుండానే చేశాడు. మనూళ్ళో పెట్టమను..లక్షలు సంపాదిచ్చొచ్చు" అంది.

"నువ్వు నాకు నచ్చావోయ్..అన్న శేఖర్ మాటలకు "నాక్కూడా నచ్చాడు" అని యాదాలాపంగా రేఖ అన్న మాటలకు శేఖర్ కోపంగా చూసేసరికి..చిరునవ్వుతో నెత్తి కొట్టుకుని.. నాలుక కొరుక్కుంటూ లోనకు వెళ్ళింది.

* * *

ఒక సంవత్సరం ఇట్టే గడిచిపోయింది.  జొన్నవాడలో కొంత మంది కొడుకును గురించి వాకబు చేసి తల్లి తెలీదనడంతో గమ్ముగుండిపోయారు. నెల నెలా రామూ మనీ ఆర్డర్ చేస్తున్న డబ్బులు అందుకుంటూ... ఈ విషయం ఎవరికి చెప్పొద్దని పోస్ట్‌మాస్టర్ రాజయ్యను బతిమాలుకుని గుట్టుగా నడుపుకొస్తోంది.

చీరాలలో ఎవరూ మంచి టైలర్ లేకపోవడం వల్ల,  పని బాగా రావడంతో …జీతం మీద కాకుండా.. కుట్టినందుకు చెరిసగం డబ్బులు అనే ఒప్పందంతో బాగానే వెనకేశాడు రాము. రాముకు రేఖ సహాయకురాలిగా ఉండి అంగడి వ్యవాహారం మొత్తం నడిపిస్తున్నది.

ఒకరోజు..శేఖర్‌తో తను జొన్నవాడ వెళ్ళిపోతానని చెప్పడంతో..శేఖర్ ఎందుకు..ఇక్కడే ఉండిపో.. మీ అమ్మను కూడా పిలిపిచుకో..డబ్బులు బాగానే వస్తున్నాయి కదా!" అన్నాడు.

రేఖ అన్నయ్యను లోపలికి పిలిచి తను రామును ప్రేమిస్తున్నాని..రామూ చాలా మంచి వాడని.. లేడీస్ టైలరయినా ఆడపిల్లలను కనీసం తాకడం కూడా తాకడని.. పెళ్ళి చేసుకుంటానని చెప్పడంతో..శేఖర్ బయటకు వచ్చి "మీ అమ్మను ఒక్కసారి తీసుకురా..ఆ తర్వాత వెళ్దువు గాని" అన్నాడు.

రామూ అమ్మను తీసుకురావడము..రేఖ-రామూల పెళ్ళి జరగడమూ ఒక నెలలోపు జరిగిపోయింది.

* * *

కారు దిగి క్రొత్త దంపతులు నేరుగా కామాక్షమ్మ దేవళానికి వెళ్ళి అర్చన చేయించారు. బయటికి వస్తుండగా..పెద్ద ఏడుపు వినిపించింది. ఎవరా అని చూసే సరికి సీత వెక్కిళ్ళుపెట్టి ఏడుస్తున్నది. "రామూ...నా కన్యాయం చేశాడత్తా అంటూ రంగమ్మను పట్టుకుని ఒకటే ఏడుపు. అందరూ సర్ది చెప్పి ఓదార్చారు.  "కొంపదీసి దీన్ని గానీ లైనులో పెట్టావా? నీకోసం తెగ ఫీలయిపోతున్నాది”  అని చెవిలో చిన్నగా అడిగి మోచేత్తో ఒక్కటి పొడిచింది రేఖ. "అంత సీనులేదు ఆ నిద్దరమొహం గరుడసేవకు..”అని చిరునవ్వు  నవ్వాడు. నాకు తెలుసులే వూర్కే అన్నా! అనింది. ఏ సంఘటన ఎందుకు జరుగుతుందో తెలిసేది.. ఆ భగవంతుడికొక్కడికే.. అని మనసులో అనుకుంటూ మనస్ఫూర్తిగా శివయ్యకు నమస్కారం చేశాడు రాము.  

 

* * *


No comments:

Post a Comment

Pages