దైవమా నీవే దయాధర్మము దలచు టింతే (22-06-21) - అచ్చంగా తెలుగు

దైవమా నీవే దయాధర్మము దలచు టింతే (22-06-21)

Share This

దైవమా నీవే దయాధర్మము దలచు టింతే (22-06-21)

(అన్నమయ్య కీర్తనకు వివరణ)

డా.తాడేపల్లి పతంజలి 




రేకు: 0335-01 సం: 04-202

పల్లవి

దైవమా నీవే దయాధర్మము దలచు టింతే

వావిరి నౌగాదన నవ్వల నిక నెవ్వరో


.1: యెంచగ నీదేహమిది యింద్రియాదులకు జెర

వంచనతో విడిపించువారలెవ్వరో

పంచభూతాలకు జర బ్రదికేటి బ్రదుకెల్ల

యించుకంత దయజూడ నిక నెవ్వరో


.2: పోరచి నామనసిది పుణ్యపాపాలకు జర

మారుకొని విడిపించ మరి యెవ్వరో

తీరని నాజన్మ మిది దినభోగాలకు జర

యీరీతి విడిపించ నిక నెవ్వరో


.3: ఆతుమ యనాదినుండి హరి నీభక్తికిజర

ఆతల నెవ్వరికైనా నరుహమౌనా

యీతల శ్రీవేంకటేశ యిటు నీవే కాతుగాక

ఘాతల నీదాసులకు గతి యెవ్వరో


భావం

పల్లవి:

 దైవమానీవే దయాధర్మము తలచాలి.ఇంతే.

అధికంగా నువ్వు వీడిని రక్షించాలావద్దా అని ఆలోచన చేస్తే (ఔగాదను), ఇక నన్ను రక్షించేవారెవరున్నారు? ( నువ్వే కాపాడాలని భావం)

.1:

స్వామీ !  నువ్వు ఇచ్చిన శరీరమిది.శరీరం లోని ఇంద్రియాలు చేసే మోహాలనే నిర్భంధపు మోసాన్నుండి విడిపించే వారెవరున్నారు?  (నువ్వే మోహాలనుండి కాపాడాలని భావం)

భూమి మొదలైన పంచభూతాలకు (1. పృథివి, 2. జలము, 3. తేజస్సు, 4. వాయువు, 5. ఆకాశము.) అధీనమైన బ్రతికే  నా బ్రతుకుపై కొంచెము పాటి

దయ చూపేవారు ఎవరున్నారు? (నువ్వే పంచభూతాల కష్టాలనుండి కాపాడాలని భావం)

.2:

 విపరీతమైన లక్షణాలు కలిగినది నా మనస్సు.ఈ మనస్సు చేసే  పుణ్యపాపాల నిర్భంధము నుంచి నన్ను విడిపించేవారెవరు? (పుణ్యపాపాల ప్రభావమునుంచి తప్పించి వాటికి అతీతమైన మోక్షం కలిగించువాడు స్వామి అని భావం)

తీరని నాజన్మములో  కోరిక ఎప్పుడూ తీరనిదిఇది ప్రతిరోజూ భోగాల అధీనంలో ఉంటుంది.అటువంటి ఈ శరీరాన్ని నిత్య భోగాల  అధీనం నుంచి తప్పించేవారెవరు? ( నువ్వే దిక్కని స్వామికి నివేదన)

.3:

 హరీ వేంకటేశా ఈ ఆత్మ చిరకాలము నుంచి  నీభక్తికి అధీనం.  ఇక ఎవరికైనా ఈ ఇటువంటి అర్హత ఉన్నదా? (ఎవరికి లేదని వేంకటేశుడే అధికుడని భావం). శ్రీవేంకటేశనువ్వు రక్షించకపోతే సంసారపు దెబ్బలు తిను  నీదాసులకు గతి ఎవరు? (ఎవరూ లేరని వేంకటేశుడే రక్షించాలని భావం)

స్వస్తి 

 

No comments:

Post a Comment

Pages