నెగి(పాజి)టివ్ (కథ) - అచ్చంగా తెలుగు

నెగి(పాజి)టివ్ (కథ)

Share This

                                    నెగి(పాజి)టివ్ (కథ)                                    

 సుజాత తిమ్మన 


జైలు నుంచి విడుదల అయినట్టుగా ఉంది స్వాతి కి. గుండెల నిండా ఊపిరి పిల్చుకొని హాస్పిటల్ ఆవరణ దాటింది తల్లి వెంటరాగా.

అమ్మా! వినోద్ ఎందుకు రాలేదు..అసలు ఫోన్ చేసావా నాకు నెగిటివ్ వచ్చిందని, ఇప్పుడు బాగున్నానని చెప్పావా? ” తల్లి భర్తకి చెప్పిందో లేదో అన్న అనుమానంతో అప్పటి నుండి మూడో సారి ప్రశ్నించింది స్వాతి ఆతృతని ఆపుకోలేక.

ఇక చెప్పేది ఏమీ లేదు అన్న ధోరణిలో మౌనంగా ఉండి పోయింది సుగుణ నిజాన్ని చెప్పలేక. ఎందుకంటే అతనికి, అతని ఇంటివాళ్లందరికీ స్వాతిని ఇంటికి తీసుకెళ్లటం ఇష్టంలేదు. కరోనా పాజిటివ్ వచ్చి ట్రీట్ మెంట్ తీసుకుని ఇంటికి వచ్చినా, వాళ్లనుంచి వైరస్ వేరేవాళ్ళకు పాకుతుంది అనే  అపోహ ప్రజల్లో బలంగా నాటుకు పోయింది. అదే కోవకు చెందినవాళ్లు వీళ్లూను. “నెగిటివ్ వచ్చినా మళ్ళీ తిరగబెట్టవచ్చు, ఎన్నో పోస్టులు చూస్తున్నాము..ఈ కరోనాని అస్సలు నమ్మలేము  అత్తయ్యా! అమ్మ వాళ్లు స్వాతిని ఇంటికి తీసుకురావడానికి ఒప్పు కోవడంలేదు, నిజానికి మాకు ఎంత అవమానంగా ఉందో మీకేం తెలుసు అత్తయ్యా! చుట్టు ప్రక్క వాళ్ళెవరూ మాతో మాట్లాడటం లేదు. కనిపిస్తే కరోనా వచ్చేస్తుందేమో అన్నట్టు ప్రవర్తిస్తున్నారు అర్ధం చేసుకోండి అత్తయ్యా!  మీ ఇష్టం మరి” అంటూ కాల్ కట్ చేసాడు వినోద్. మనసులో మననం చేసుకుంది ఇంతకు మూడు గంటల ముందు జరిగిన వాస్తవాన్ని సుగుణ.

మూతికి ముక్కుకు కలిపి కట్టుకున్న మాస్క్ ని సరి చేసుకుంటూ  నీరసంగా ఉన్న కూతురి చెయ్యి పట్టుకుని గేటు బయిటికి వచ్చింది సుగుణ ఆటో కోసం చూస్తూ. వీళ్ళిద్దరిని గమనించిన ఒక ఆటో అతను దగ్గరకు వచ్చి తల బయిటికి పెడుతూ ఎక్కడికి వెళ్ళాలి అన్నట్టు చూసాడు . అతని ముఖంలో మిలమిలా మెరిసే కళ్ళు తప్ప ఏమీ కన్పించటం లేదు ఎందుకంటే అతను మూతికి కట్టుకున్న నల్లని మాస్క్ అతని మేని ఛాయతో కలిసి పోయింది.

కాస్త ఉలిక్కి పడినా తెరుకుని తను వెళ్ల వలసిన స్థలం పేరు చెప్పింది సుగుణ. ఎక్కండి అన్నట్టు చూస్తూ రెండొందలు అన్నాడు.

ఈ కరోనా టైములో రావడమే గొప్ప అనుకుని సరే పద అంటూ ముందు కూతురిని ఎక్కమని చెప్పి తరువాత తాను ఎక్కి కూర్చొంది సుగుణ. ఇంట్లో కారు ఉన్నా తీసుకుని రావడానికి రాని భర్తపై విపరీతంగా కోపం వస్తుంది సుగుణకి. ధరణికి గిరి భారమా! అన్నట్టు తనకు బిడ్డ భారమా... నా బిడ్డను నేను కాకపోతే ఎవరు చూసుకుంటారు,’  అనుకుంటూ ఆలోచిస్తుంది సుగుణ.

  *****

 స్వాతి పెళ్లి జరిగి ఎనిమిది నెలలు అవుతుంది. స్వాతి అత్తగారు వాళ్లది ఉమ్మడి కుటుంబం. పాతకాలం అలవాట్లు, కట్టుబాట్లు ఎక్కువ. అలా అని స్వాతిని కష్టపెట్టేవాళ్లు కాదు. కోడలు అంటే ప్రేమే. వద్దు వద్దు అంటున్నా వినకుండా తన స్నేహితుడి పెళ్లి అని వేరే ఊరు తీసుకెళ్ళాడు వినోద్. ఒక రోజంతా పెళ్లి హడావిడిలో గడిపారు. వచ్చిన తరువాత రెండో రోజు నుండి గొంతు మంటగా ఉండి కొద్దిగా జ్వరం వచ్చింది. మామూలే కదా అని జ్వరానికి టాబ్లెట్ వేసుకుని పడుకుంది. మరో రోజుకు తుమ్ములు, దగ్గు అయినా జలుబుకు మాత్ర వేసుకుంది. మిరియాల కషాయం పెట్టిచ్చిన అత్తగారికి థాంక్స్ చెపుతూ త్రాగింది. జ్వర తీవ్రత ఎక్కువ కావడంతో దగ్గరే ఉన్న

 క్లినిక్ కి వెళితే ఎందుకైనా మంచిది పరీక్ష చేయించండని అక్కడి డాక్టర్ చెప్పటంతో శాంపిల్స్ ఇచ్చి, వాటి ఫలితాలు వచ్చేవరకు మరో రెండు రోజులు గడిచిపోయాయి. విపరీతమయిన ఆయాసంతో బాధ పడసాగింది. అత్తగారు వాళ్ళు అనుమానంతో సుగుణమ్మకి తెలియజేశారు. సుగుణ వెంటనే వచ్చి హాస్పిటల్ లో జాయిన్ చేసింది పాజిటివ్ అని తెలియగానే. పచ్చగా ఉన్న పిల్ల జీవితం ఈ కరోనా మహమ్మారి కాటుకు బలి అవ్వలిసిందేనా?’ అనుకుంటూ బాధ పడుతూ భర్త బలరాంకు  తెలియజేసింది సుగుణ. అతను చాలా బాధ పడ్డాడు “అయ్యో! అసలు బయిటికి ఎందుకు వెళ్లారు, అట్లా పెళ్ళికి వెళ్ళటం తప్పు  కదా! ఇంత వైరస్ విజృంభిస్తూ ఉంటే తెలిసి కూడా బిడ్డని తీసుకుని పోతాడా అల్లుడు” అంటూ కోపంతో కాసేపు తిట్టుకున్నాడు బలరాం. కొడుకు అశోక్ కూడా కాసేపు చెల్లెలికి పాజిటివ్ అని తెలిసి వాళ్లందరినీ తిట్టుకున్నాడు “ప్రభుత్వం ఇంత చెపుతుంది. అన్నీ మద్యమాలలో ప్రచారాలు చేస్తున్నారు, రోజూ వందల సంఖ్యల్లో కేసులు వస్తున్నాయి.. అయినా ఇట్లాంటి వాళ్ళు ఉండబట్టే ఇలా అవుతుంది.” అనుకుంటూ... కోడలు వాసంతి మాత్రం “మీరు జాగ్రత్తగా ఉండండి అత్తయ్యా” అని ఒక్క మాటే మాట్లాడింది.

 ***

తల్లి మవునంగా ఉండటంతో ఇంక ఏవిధమైన ప్రశ్నలు వేయలేదు స్వాతి. ఇంటి ముందు ఆటోలోంచి దిగి గేటు తీసుకుని  లోనికి వెళుతూ వసారాలో కూర్చుని పేపర్ చదువుతున్న తండ్రిని చూడగానే ‘నాన్నా!’ అంది గుండెల్లో బాధ తన్నుకు వస్తుంటే ఆపుకునే ప్రయత్నం చేస్తూ.

కూతురిని చూసిన బలరాం లోన ప్రేమ పొంగుతున్నా కప్పిపుచ్చుకుంటూ తప్పించుకోవాలనే ఉద్దేశ్యంతో,  చూడనట్టే లోపలికి వెళ్లిపోయాడు. కొంచం విస్మయం చెందినా ‘నాన్న చూడలేదనుకుంటా’ అని సమాధానపరుచుకుంటూ ఇంటి గుమ్మంలోనికి అడుగు పెట్టింది స్వాతి. వంట చేస్తున్న వదిన వాసంతి టీ.వి. చూస్తూ సోఫాలో కూర్చొన్న అయిదేళ్ళ కొడుకు మోహిక్ ని తన రూంలోకి ఇంచు మించు లాక్కుని వెళ్ళినట్టే వెళ్ళి తలుపు వేసుకుంది.

నీటి కుండలయిన కళ్ళతో తన వెనుకే వచ్చిన తల్లిని వాటేసుకుని బోరుమంది విషయం అర్థమవుతూ ఉంటే తమాయించుకోలేక స్వాతి.

ఇవన్నీ ఇలానే జరుగుతాయని ముందే ఊహించిన సుగుణ కూతురిని  వేరే గదిలోనికి తీసుకుని వెళ్లి “ముందు  నీవు కొంచం  అలసట తీర్చుకో.. గీజర్ ఆన్ చేస్తాను స్నానం చేద్దువు గాని, నేను కాఫీ కలుపుకుని వస్తా... సరేనా.. ఇవేవీ పట్టించుకోకురా... బంగారు కదూ!” తల నిమిరి ఓదార్చి వెళ్లింది సుగుణ.

                             *****

స్నానం చేసి వచ్చి తల్లి ఇచ్చిన వేడి కాఫీ త్రాగి మంచం మీద ఒరిగింది స్వాతి. తలుపు దగ్గరగా వేసి బయటకు  వచ్చేసరికి సుగుణ తో వాసంతి "అత్తయ్యా! స్వాతి ఇక్కడే ఉంటుంది అంటే నేను బాబుని తీసుకుని మా అన్నయ్య ఇంటికి వెళ్లిపోతాను. మీరు వేరే విధంగా అనుకోవద్దు. మోహిక్ చిన్నవాడు. ఏదైనా జరగవచ్చు. అప్పుడు ఎవరిని ఏమి అన్నా ప్రయోజనం ఉండదు. అందుకే ముందు జాగ్రత్తగా దూరంగా ఉండటం మంచిది.” సూటిగా చెప్పింది.

ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా చూసింది కోడలివైపు.

అంతలోనే భర్త కూడా మాట కలుపుతూ " సుగుణా! ఒక్క సారి ఆలోచించు, అమ్మాయి చెప్పింది కూడా నిజమే కదా, ముందే చిన్న పిల్లవాడు ఉన్నాడు.  ఎవరికి ఏమి అయినా ఇబ్బందులు మనవే కదా" సమాధాన పరచబోయాడు బలరాం.

"నాకు నా కూతురు ముఖ్యం, ఎవరు ఎలాటి నిర్ణయం తీసుకున్నా నేను కాదనను. మీరన్నది నిజమే కానీ అటు భర్త రానివ్వడం లేదు, ఇటు మనం కూడా ఇంటికి తీసుకుని రాకపోతే తను కోలుకునేది ఎట్లా? ముందే  ప్రాణాంతకమైన జబ్బు (కరోనా) తో పోరాడి బయట పడింది బిడ్డ, కరోనా కంటే ఎక్కువ భయం భయపెట్టేస్తుంది. అందులో నుండి బయటకి రావాలంటే బిడ్డని తల్లిగా నేను కాక ఎవరు గుండెల్లో పెట్టుకుంటారు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఉండండి. నేను మాత్రం నా కూతురితో నే ఉంటాను ఈ ఇంట్లో." కచ్చితంగా చెప్పింది సుగుణ కళ్ల నీళ్లు ధారలుగా కారుతున్నా తుడుచుకోవాలన్న విషయం  కూడా మరచిపోయి.

వాసంతి వెంటనే  వాళ్ళ అన్నయ్యకు కాల్ చేసింది వస్తున్నా అని.

పది నిముషాల్లో బట్టలు సర్దుకుని కొడుకుని తీసుకుని వెళ్ళిపోయింది.

నిద్ర పట్టక అలసటగా పడుకున్న స్వాతికి బయిట జరిగేది అర్ధం అవుతూనే ఉంది. కంటి నీళ్లు కూడా రాకుండా గాజు కాళ్లుగా మారిపోయాయి ఆలోచనల ఆవిరిలో.

సాయంత్రం అవుతూ ఉంటే కొడుకు కాల్ వచ్చింది "అమ్మా! స్వాతికి ఎలా ఉంది. నెగిటివ్ వచ్చిందా! అయితే  మంచిదే, అయినా జాగ్రత్తగా చూసుకో, నేను కూడా  మా బావ ఇంటికి వెళుతున్నా, కొన్నాళ్లు అక్కడే ఉంటాము మేము. నా కోసం చూడవద్దు. ఏదై నా అవసరం అయితే కాల్ చెయ్యి. డబ్బు పంపిస్తా, ఖర్చులకు వెనుకాడవద్దు" అంటూ అచ్చం ఓ వ్యాపారవేత్తలాగా మాట్లాడాడు అశోక్.

బలరాం కూడా తన గది లోనే ఉంటున్నాడు. గది దాటి బయటికి రావడం లేదు. అన్ని పనులు సుగుణ ఒక్కతే చేసుకుంటూ స్వాతిని కంటికి రెప్పలా చూసుకుంటుంది.

స్వాతి కరోనా వల్ల త్వరగానే కోలుకుంది 'నాకు అందరు ఉన్నారు' అన్న ధైర్యంతో, కానీ కోవిడ్  తగ్గి నెగిటివ్ వచ్చిన  తరువాతే తన అనుకున్న వాళ్ళ  ప్రవర్తన వల్ల పూర్తిగా మానసికంగా కృశించి పోసాగింది.

తల్లి ఎంత దైర్యం చెపుతూ ఉన్నా లోలోన మథన పడసాగింది.

"నేను అక్కడే చనిపోయినా బాగుండేది అమ్మా!  వినోద్ కూడా ఇలా నన్ను ఇగ్నోర్ చేస్తాడని అసలు అనుకోలేదమ్మా!" కుళ్ళికుళ్ళి ఏడుస్తున్న కూతురిని ఎలా ఓదార్చాలో కూడా తెలియని పరిస్థితిలో సుగుణ కూడా దిగులుతో చిక్కి శల్యమవుతుంది.

                                 *****

బాగా ఆలోచిందింది సుగుణ. ఊరిలో తనకున్న పొలాన్ని  ఇద్దరు పాలేర్లను పెట్టుకుని  సేద్యం చేయించుకుంటూ, వచ్చిన పంటలో కొంత  పిల్లలకు పంపించి, తనకు కొంత ఉంచుకుని మిగిలినది అమ్మగా వచ్చే ఆదాయంతో ఒంటరిగా అయినా ఇష్టంగా, ఆరోగ్యంగా జీవిస్తున్న సుగుణ తల్లి సావిత్రమ్మకి కాల్ చేసి కూతురి విషయం అంతా వివరంగా చెప్పింది.  ఆవిడ వెంటనే “స్వాతిని తీసుకుని వచ్చేయి, ఈ కరోనా  గడ్డుకాలం పూర్తయే వరకు బిడ్డని మనం కడుపులో పెట్టుకుని చూసుకోవాలి గాని అందరిలా  మనమూ వదిలేస్తామా! ఆ తరువాత అల్లుడుబాబుకు కాస్త బుద్ధి చెప్పి, అత్తమామలతో కూడా మాట్లాడుదాం.

 “మీ బిడ్డ అయితే ఇట్లాగే చేస్తారా? లేదా మీకే కరోనా వస్తే అట్లనే ఉంటారా ?” అని అడుగుదాం.  ఇంట్లో ఉన్న మా అల్లుడికి కూడా గాటుగా తగిలించాలి. కన్న కూతురు జబ్బున పడి కోలుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వస్తే.. కనీస ధర్మం కూడా మరచిన  ఆయనకు అతని ప్రాణం ముఖ్యమైనదా.. మరి కూతురేం కావాలనుకున్నాడు?  బిడ్డా! నువ్వేం  దిగులు పెట్టుకోకు. ఎట్లాగో కారు మాట్లాడుకుని ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడ ఏమి భయం లేదు. కరోనాను బాగా కట్టడి చేసారు. జాగ్రత్తగా రండి” అంటూ పిలిచిన తల్లికి లోలోనే కృతజ్ఞతలు తెలుపుకుంటూ...

 “అమ్మమ్మ దగ్గరకు పోదాం, కొన్నాళ్లు అక్కడే ఉందాం తల్లీ! కాస్త వాతావరణం  మారితే మనసు కూడా నెమ్మదిస్తుంది.” అని స్వాతికి నచ్చజెప్పింది సుగుణ. స్వాతి కూడా సరే అనడంతో కారు మాట్లాడుకుని అమ్మమ్మగారి ఊరు ప్రయాణం అయింది స్వాతి తల్లితో కలిసి. బలరాం మాటలు రానివానివలె మౌనం వహించి చూస్తూ ఉన్నాడు కారు కను మరుగు అయేంతవరకు.

                       **** సమాప్తం****

 

 

నా మాట:-

 ( ప్రస్తుత పరిస్థితులలో కరోనా మహమ్మారి బారిన పడి ఎందరో ప్రాణాలను కోల్పోయారు. అలాగే పూర్తిగా తగ్గి నెగిటివ్ వచ్చి ఇళ్లకు వచ్చి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు నిజం చెప్పాలంటే ఎక్కువే ఉన్నారు. అలా కరోనా తగ్గి నెగిటివ్ వచ్చిన తరువాత స్వాతిలాగా అంటరాని వాళ్ళని చూసినట్టు, వాళ్ళు కనిపిస్తేనే ఎక్కడ కరోనా వాళ్లకు అంటుకుంటుందో అని దూరంగా పెట్టే వాళ్లనే ఎక్కువ మందిని చూస్తున్నాం. ఈ అవగాహన మనందరి లోను రావాలి. టైఫాయిడ్, మలేరియా ఎలా వచ్చి తగ్గుతాయో  అలానే కరోనా కూడా జాగ్రత్త లు తీసుకుంటే తగ్గి పోతుంది. ఇది నిజం. ముందే ప్రాణాలతో పోరాడి బ్రతికి బైటపడిన వాళ్లను మానసికంగా ఇంకా కృంగదీయకూడదు. జాగ్రత్తలు పాటిస్తూ వాళ్లకు మానసికంగా ఓదార్పుని ఇవ్వాలి. 'నీకు మేము ఉన్నాం' అన్న ధైర్యాన్ని ఇవ్వాలి. అంతే కానీ వాళ్ళ మనసును ఇంకా బాధపెట్టకూడదు).

  *****  

  

No comments:

Post a Comment

Pages