అనసూయ ఆరాటం -2 - అచ్చంగా తెలుగు

                                                    అనసూయ ఆరాటం -2 

                                                                             చెన్నూరి సుదర్శన్ 


(ఏదైనా వ్యాపారం పెట్టాలని చూస్తున్న సమ్మయ్య, బుచ్చయ్య సలహా కోసం పంతులుని సంప్రదిస్తారు)

“సైసు పోదురు గాని.. మీతోటి కొంచెం మాట్లాడాలె.. జరసేపు గా యాప చెట్టు కింద కూకుందాంపా..” అని బతిలాడి నట్టు సూసుకుంట మూతి మూరెడు సాపిండు. 

సైకిలు తొక్కిన యాట్ట కొద్ది ‘సరే..’  అన్నట్టు లింగారెడ్డి ఎన్కాల్నే సైకిల్లు నూక్కుంట పోయిండ్లు. సమ్మయ్య, బుచ్చయ్యలొకల మొకం ఒకలు ఏంమాట్లాడుతడో.. ఏందో..! అని పెదువులిర్సుకుంట సైగలు చేసుకున్నరు.

లింగారెడ్దిది పర్కాల దగ్గర శాయంపేట. శాన తెలివి కల్లోడు. పేరుకు రెడ్డోల్లో గాని ప్యాద కుటుంబం. తను ఐదో తరగతి సదువుతాంటే తమ్ముడు పుల్లారెడ్డి పుట్టిండు. పుల్లారెడ్డి పుట్టెంటుకలు తీద్దామని సంబురంగ కచ్చురం కట్టుకొని కొమురెల్లికి పోయిండ్లు. తిరిగి  వత్తాంటే.. కచ్చురాన్ని లారీ టక్కరిచ్చింది. కచ్చురం డోరగిల్ల పడ్డది. అయ్యా, అవ్వ కాలం చేసిండ్లు.  

తమ్ముడు తాను మిగిలిండ్లు. నలుగురేమనుకుంటరో..! ఏమో..! అని మంది భయానికి వాల్ల మేనత్త పిల్లలిద్దర్ని సేరదీసింది. 

లింగారెడ్డికి రోషమెక్కువ. మాటంటే పడడు. ఓరోజు ‘పోరగాండ్లు అయ్యా అవ్వను మింగి కూకోని ఇప్పుడు నా మెడకు సుట్టుకున్నరని’ మేనత్త ఎవలతోనో అనంగ విన్నడు లింగారెడ్డి.  ఎంటనే తమ్మున్ని తీస్కోని బైట పడ్డడు. నాయ్న సంపాయించిన గుడిసెల బతుకు ఈడ్సుకత్తాండు. కూలి నాలి చేస్కుంట.. కమస్కం పదేండ్లు హరిగోస పడ్డడు. 

పుల్లారెడ్డికి సదువబ్బలే.. గాని పనికోర్తడు.  లింగారెడ్డిది బక్క పానం.. ముక్కు సూటి మనిషి అన్నట్టు ముక్కు కొచ్చెగుంటది. మనిషి ఆరడుగుల పొడవు ముట్టుకుంటే మాసిపోతడన్నట్టు తెల్లగుంటడు. పాంటు తన పొడుక్కు సాలక ధోతి కట్టుడు అలవాటు చేసుకున్నడు. పంచె కట్టుడు చూసి ఊళ్ళె అందరు ‘పటేలా’ అని పిలుత్తాంటరు. అదే పేరును నిలబెట్టుకోవాలను కొన్నడు లింగారెడ్డి. కూలి నాలి చెయ్యాలంటే ఎన్కా.. ముందు సూత్తాండు. మీదికెల్లి దినాలు గడ్తాంటే పానం శాతగాకచ్చింది. అదే మాట ఊరి కరణం దగ్గర చెప్పుకుంట మిడ్కిండోరోజు. లింగారెడ్డి ఉషారు తనం చూసి  కరణం తన చేతికింద ఉంచుకున్నడు. లింగారెడ్డి చేతి రాత ముత్యాల్లెక్క ఉండెటాల్లకు జాగ కాయితాల రాత పూతలు.. నకల్లు రాసుడు పని అప్పజెప్పిండు.  దాంట్ల అన్ని దొంగ లెక్కలు కనబడేటాల్లకు లింగారెడ్డికి నచ్చక  బతుక్కు ఇంకో దారి సూసుకోవాలని ఆరాట పడ్తాండు.

ఎండకాలమాయె.. అంబటాల్లకే ఎండ బగ్గుమంటాంది. యాపచెట్టు నీడ తాకెటాల్లకు పానం హాయిమన్నట్టు బుచ్చయ్య, సమ్మయ్యలు నెత్తికి సుట్టుకున్న తువ్వాలలిప్పి దులిపి ఆరాంగ కూకున్నరు. వాల్ల కెదురుంగ లింగారెడ్డి కూకోని ‘ఎట్ల మొదలు పెట్టాలె’ అన్నట్టు సోంచాయించబట్టిండు.

“ఏందో మాట్లాడ్తనన్నవ్..” చెప్పమన్నట్టు సమ్మయ్య కండ్లెగ రేసిండు.. లింగారెడ్డిని సూసుకుంట.

“కానియ్యి. ఎండముదిరెటాల్లకు మల్ల మాఇండ్లు చేర పోవాల్నాయే”   అని ఏగిర పెట్టిండు బుచ్చయ్య.

“గట్ల గీఎండల్ల తిరుక్కుంట బట్టలమ్మే బదులు ఒక్కతాన కూకోని అమ్ముకుంటే ఎట్లుంటదంటరు” తాత్పరంగా అన్నడు లింగారెడ్డి.

“ఆ.. బలే చెప్పచ్చినౌ పటేలా.. గిట్ల చెట్టు కింద బట్టల మూటిప్పి కూకుంటె వచ్చి కొంటరా..” అని ముస్కురా యించుకుంట సుట్ట ముట్టిచ్చిండు సమ్మయ్య. సమ్మయ్యకు గంట సుట్టంటే పానమిడ్తడు. యాల్లకు బువ్వ లేకున్నా మంచిదే గాని సుట్ట లేంది ఉండడు.

“చెట్టు కింద కాదు సేటూ.. ఒక మంచి అడ్డ చూసుకోవాలె..”

“చెప్పేదేందో కొంచెం సమఝయ్యేటట్టు చెప్పు పటేలా..” అన్నడు బుచ్చయ్య.

“ఆడికే వత్తాన సేటూ.. నా మైండుల ఒక ఆలోసన ఉన్నది. అది మీ చెవుల ఏద్దామని శాన రోజుల సంది అనుకుంటాన. ఇయ్యాల మీరే ఎదురైండ్లు” అని మెల్లంగ తన మెదట్లున్నది బైట పెట్టబట్టిండు.

“ములుగు ఇప్పుడిప్పుడే డెవలపైతాంది. నేను ఓపాలి పోయి మొత్తం తిరిగచ్చిన. ఏదైనా దుకానం పెడ్తే బాగుంటదనిపిచ్చింది. కాని నాతాన వీపు పలగ్గొట్టినా.. పెద్దకొత్త ఎల్లదాయే.. ఎవలతోటైనా దుకానం పెట్టిచ్చి నేను అందుల పని చూసుకోవాలనే ఆలోసన ఉన్నది. బాగా పైసలున్నోల్లకు గమండెక్కువ. మీ అసోంటల్లైతే కట్టపడి పని సేత్తరని మీ తోని ఇసారిత్తాన.     

(సశేషం)


No comments:

Post a Comment

Pages