జయహో! మేజర్ సాబ్... - అచ్చంగా తెలుగు

జయహో! మేజర్ సాబ్...

Share This
జయహో! మేజర్ సాబ్... 
కోసూరి ఉమాభారతి 


“మేజేర్ సాబ్,  ఇక మీరు హ్యాపీగా వెళ్ళండి.  రెండేళ్లగా మీ పరిచయం, మీ స్నేహం మేము మరువలేము.  ఇకనుండి మీరిక్కడ ఉండబోరు అనుకుంటే కాస్త బాధగానే ఉంది.  అయినా ఈ ఆర్మీ  సైకియాట్రిక్ హాస్పిటల్ నుండి  మీరు  విడుదలవడం  ఆనందంగా ఉంది.  టేక్ కేర్ సార్” ఆత్మీయంగా కరచాలనం చేసారు డాక్టర్ గారు. “డేవిడ్, ఇలా వచ్చి మేజేర్ గారికి సాయం చేయి”  అసిస్టెంటుకి చెప్పి డెబ్బైరెండేళ్ళ మేజర్ సూర్యనారాయణ వద్ద సెలవు తీసుకుని అక్కడి నుండి కదిలాడు డా. రావ్.
“పదండి సార్, ఈ నాటితో మీకు ఈ సైకియాట్రిక్ హాస్పిటల్ నుండి విడుదల, పిచ్చోడు అన్న ముద్ర నుండి శాశ్వతంగా విముక్తి దొరుకుతున్నాయి”  అంటూ చేతికర్ర అందించి, మేజర్ గారి తలపైని మిలిటరీ కాప్ కూడా సవరించి ఆయన్ని బయటకి నడిపించాడు డేవిడ్. 
హెడ్-నర్స్ తో పాటు మరికొందరు స్టాఫ్, ఆయాలు, కుర్ర నర్సులు చేతిలో పూలగుచ్చాలతో ఆయన కోసం గది బయట వేచి ఉండడం చూసి మేజర్ గారి కళ్ళు చెమర్చాయి.  “ఇకపైన మాకు పామిస్ట్రీ చెప్పేవారు గాని,  సలహాలిచ్చేవారు కాని  ఎవరున్నారు సార్?” అని నర్స్ మాల వాపోతే, “యెన్.టి.ఆర్ లాగా డైలాగ్ చెప్పి..మిమిక్రీ చేసే వాళ్ళు గాని, ఆర్మీ అనుభవాలు కధలుగా వినిపించేవారు గాని ఉండబోరు కదా సార్” అన్నాడు విల్సన్. “అయినా మీరిక్కడ ఉండవలసిన వారు కాదులెండి మేజేర్ సాబ్... అందుకే హ్యాపీగా వెళ్ళండి”  అంటూ వీడ్కోలు పలికాడు తెరపిస్ట్ విష్ణు.  
రెండేళ్ళగా వారితో ఓ స్నేహితుడులా మెలిగిన సూర్యనారాయణ, వారి వద్ద శెలవు తీసుకొని డేవిడ్ ఆసరాతో గేటు బయటకి నడిచాడు.  అక్కడ ఎదురుగా .. ఆయన కోసం...జానకి, ఆమె భర్త మూర్తి నిలబడి ఉన్నారు.  జానకి  గబగబా అయన వద్దకి నడిచి, చేయందుకుని “బాగున్నారా నాన్న?” అంటూ కంటతడి పెట్టుకొంది.
“ముందు సీట్లో కూర్చోండి మామయ్యా’’  అంటూ టాక్సీ డోర్ తీసాడు మూర్తి.  ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చిన వారిద్దరినీ చూసి సంతోషమనిపించినా,  సైకియాట్రిక్ హాస్పిటల్లో పేషంటుగా ఉండవలసి రావడానికి కారణమైన రెండవ కూతురు వైశాలి, ఆమెభర్త ఉమాపతి గుర్తుకొచ్చి ... ఆయన మనస్సు బాధతో బరువయ్యింది..
***
తనకిష్టమైన వంటకాలు చేసి ప్రేమతో దగ్గరుండి వడ్డించిన జానకి గురించి ఆలోచిస్తూ భోజనం ముగించి, అలసటగా గదిలో పక్క మీద వాలాడు సూర్యనారాయణ. ‘మా పట్ల నీకున్న ఆపేక్ష, ఆత్మీయత..చనిపోయిన మీ అమ్మకు, బతికున్న నాకు తెలియనిది కాదు జానికమ్మా’  అనుకున్నాడాయన తనలో తాను. వారి జీవితాలని జానకి ఎంతలా ప్రభావితం చేసిందో, వారి ఆరోప్రాణంగా ఎలా మెలిగిందో గుర్తుచేసుకుంటూ ఒక్కక్షణం కళ్ళు మూసుకోగానే ...నాలుగేళ్ళప్పటి జానకి రూపం, అప్పటి విషయాలు ఆయన మనసున మెదిలాయి.
...సరిగ్గా నలభైయేళ్ళ క్రితం డెహ్రాడున్ లోని ఇండియన్ మిలిటరీ అకాడెమీ నుండి ట్రైనింగయి ఇంటికి వచ్చీరాగానే.. తల్లీ, భార్యతో కలిసి భద్రాచలం తిరణాలకి  వెళ్ళినప్పుడు...తటస్థ పడిన నాలుగేళ్ల బాలికే ‘జానకి. తమ  జీవితాలని ప్రేమమయం చేస్తుందని అప్పుడు ఊహించలేదు సూర్యనారాయణ.  పెళ్ళై ఏడేళ్ళైనా ... సంతానం కలగలేదని అతనికన్నా అతని భార్య శాంత దిగులు పడుతున్న రోజులవి.  భద్రాద్రి సీతా రామచంద్రస్వామి వారి దర్శనం చేసుకుని వస్తుంటే కాటేజీ మెట్లపై... చిరిగిన బట్టలతో, దెబ్బ తగిలి నెత్తురోడుతున్న మోకాలితో, దీనావస్థలో కూర్చునున్న ఓ పసిదాన్ని చూసి కడుపు  తరుక్కుపోయింది ఆ దంపతులకి..  శాంత విలవిల్లాడిపోయింది.  
పోస్టింగ్ వచ్చేలోగా నాలుగు వారాల సమయం ఉండడంతో భద్రాచలంలోనే ఉండి, ఆ పసిదాని గురించి ఆరా తీసారు. అనాధ అని తేలాక...  పోలిస్ వాళ్లకి ఫిర్యాదు ఇచ్చి స్థానిక శిశు సంక్షేమం వారిని ఆశ్రయించారు. వారి సహాయంతో దత్తత  లాంఛనాలు ముగించుకొని,  ఆ పసిదాన్ని ఇంటికి తెచ్చుకున్నారు సూర్యనారాయణ దంపతులు. సాక్షాత్తు ఆ భగవంతుడే  ప్రసాదించిన బిడ్డగా భావించి పసిదానికి  ‘జానకి’ అని పేరు పెట్టుకొన్న శాంతకి, ఆ పసిదే ప్రపంచమయిపోయింది.  జానకిని వారి జీవితాల్లోకి నడిచొచ్చిన అదృష్టంగా భావించారు. 
నెలలోగానే టెరిటోయల్ ఆర్మీలో కెప్టెన్ గా ఎ.ఓ.సి (ఆర్మీ ఆర్డినెన్స్ కోర్) సెంటర్ కి పోస్టింగ్ రావడంతో హైదరాబాద్ చేరిందా కుటుంబం. అదే యేడు వారు ఆశించని విధంగా శాంత కడుపు పండి, ఆడపిల్ల పుట్టింది. వైశాలి అని నామకరణం చేసి..ఆనందం రెట్టింపయ్యిందని భావించారు.  
***
వైశాలి పుట్టాక సూర్యనారాయణ తల్లి వైఖరిలో వచ్చిన మార్పు మాత్రం ఆ దంపతులకి చాలా బాధ కలిగించింది.  జానకితో కఠినంగా వ్యవహరిస్తూ, దాన్ని  వైశాలికి ఓ పనిమనిషిలా చేసిందామె.  జానకిని అనాధ అని తను తిట్టి, తిట్టించేది. అక్కా చెల్లెళ్ళలా మెలగవలసిన పిల్లల్లో వైషమ్యాలు పెంచింది. ఆమె నోటికి, అధికార దర్పానికి భయపడి జానకికి వారి ప్రేమను పంచడం మినహా ఏమీ చేయలేక పోయారు శాంత, సూర్యనారాయణలు.  
ఓ సంక్రాంతి పండుగ నాడు పొద్దుటే అకారణంగా జానకి పై విరుచుకుపడిపోయారు వైశాలి, ఆమె నాయనమ్మ. పలువిధాలా బాధించి... ఇల్లు వదిలి పొమ్మన్న వారి బెదిరింపులకి హడిలిపోయి ..“మిమ్మల్ని వదలి వెళ్ళను నాన్నా,” అంటూ ఏడుస్తూ వచ్చి తండ్రి కాళ్ళని చుట్టేసింది పదేళ్ళ జానకి.  సహించలేని సూర్యనారాయణ కల్పించుకుని ‘జానకి జోలికి వస్తే ఊర్కునేది లేదు” అనడంతో కొన్నేళ్ళపాటు ఒకే ఇంట్లో  రెండు వేరు కుటుంబాలుగా చీలి  మనుగడ సాగించారు ఆ కుటుంబసభ్యులు. అడపాదడపా ఎన్నో అవమానాలు, హేళనలు తట్టుకుని కూడా తల్లితండ్రులని కంటికి రెప్పలా చూసుకొనేది జానకి.  
చదువుపై ఆశక్తి లేని జానకి అతికష్టంగా పదవ తరగతి పాస్ అయింది. ఇంటిపని, వంటపని చేస్తూ,  ఎంబ్రాయిడరీ, కుట్టు, అల్లికలు నేర్చుకుంది.  వైశాలి మాత్రం, నానమ్మ ఆధీనంలో ... మొండిగా, ఓ రాక్షసిలా తయారయింది.   కేవలం జానకి పైనున్న ద్వేషంతో, పెద్దావిడ అవలంభిస్తున్న వైఖరి వల్ల.. తల్లితండ్రులంటే ఖాతర్ లేకుండా ఎదురుతిరిగి అగౌరవ పరిచేది.  
నానమ్మ పెంపకంలో.. వైశాలి పద్నాలుగేళ్ళకే గాయనిగా మ్యూజిక్ బ్యాండ్ లో చేరి,  డ్రింక్ చేసేదని గ్రహించాడు తండ్రి.  కూతురికి మాదకద్రవ్యాల వాడకం, బాయ్ ఫ్రెండ్స్, డేటింగ్ కూడా అలవాట్లుగా మారాయని.. భార్య వద్ద ప్రస్తావించి వాపోయేవాడు.  అతిప్రేమతో మనమరాలు పాడయిపోతుందన్న కనీస జ్ఞానం లేకుండా పల్లెటూరిలోని తన పొలం, ఇల్లు అమ్మేసిన డబ్బునుండి కొద్దికొద్దిగా వైశాలి ఖర్చుకి ఇస్తూన్న తల్లిపట్ల గౌరవం, ప్రేమ సన్నగిల్లాయి సూర్యనారాయణకి.  
... కన్నబిడ్డ వైశాలి గురించి వ్యధ చెంది, అప్పట్లోనే ఆరోగ్యం క్షీణించిన భార్యని తలుచుకుని.. అతని గుండె భారంగా అనిపించి..జ్ఞాపకాల నుండి ఒక్కసారిగా బయట పడ్డాడు. 
కన్నీళ్లతో చూపు మసకబారడంతో, జానకి గదిలోనికి రావడాన్ని కూడా గుర్తించలేదు సూర్యనారాయణ.. 
“నాన్నా ఇంకా నిద్ర పోలేదుగా, కాసిన్ని వేడి పాలు తాగి పడుకోండి.  రేపు పొద్దుటే పెన్షన్ ఆఫీస్ కి, మెడికల్ చెకప్ కి వెళ్ళాలి.  ఓపికుంటే, సాయంత్రం లాయర్ గారి ఇంటికి వెళ్ళాలి”  అని తన చెంగుతో తండ్రి కళ్ళు తుడిచి, కప్పుడు పాలు తాగించి మరీ  గది నుండి వెళ్ళింది జానకి.  
‘కన్నతల్లిలా చూసుకునే జానకి ఎక్కడ? భార్య చనిపోయి మానసికంగా కూడా బలహీనపడిన సమయంలో ..కపట సానుభూతి కనబరుస్తూ దగ్గరచేరి..తల్లి పేరిటనున్న కోట్లు విలువచేసే భూమిని చేజిక్కించేందుకు కుట్ర పన్నిన వైశాలి ఎక్కడ?’ అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు సూర్యనారాయణ. 
***   
ఇండియన్ ఆర్మీ వారి పెన్షన్ ఆఫీస్, ఎ.ఓ.సి సెంటర్ 
మేనేజర్ తెప్పించిన కాఫీ సేవిస్తూ, ఆఫీసర్ కోసం వేచియున్నారు సూర్యనారాయణ, అల్లుడు మూర్తి.  పెన్షన్ ఆఫీసర్, ట్రిబ్యూనల్ జడ్జ్ సంతకాల కోసం తెచ్చిన  ఫైల్లోని కాగితాలని తేదీల వారీగా అమర్చుతున్నాడు మూర్తి.  
“ఏమోయ్ మూర్తి, నన్ను ఒక పిచ్చివాడిగా ముద్రించి, నా పెన్షన్ కూడా నాకు దక్కకుండా చేసి, పిచ్చాసుపత్రిలో పడేసారు నా కన్న కూతురు వైశాలి, దాని భర్త.  అలాంటి కిరాతకం నుండి నన్ను కాపాడ్డం కోసం,  పోరాడి ఇన్ని సాక్ష్యాలు సంపాదించడానికి ఎంత కష్టపడ్డారో కదా.. మీరు,”, “మీ రుణం ఎలాగయ్యా తీర్చుకునేది?” అన్నాడా మామగారు మూర్తి తో. 
“మేము పరాయి వాళ్ళమనే భావిస్తున్నారు మామయ్యా.  మీకు ఈ వయస్సులో ఈ మాత్రం చేయూత నివ్వడం మా భాగ్యంగానే అనుకుంటున్నాము” అంటూ ఫైల్ బల్ల మీద పెడుతుండగా లోనికి వచ్చాడు ఆఫీసర్ శివరాం.   
“నమస్తే మేజర్ సార్.  మీరు నిజమైన సైనికుడు  సార్.  మిమ్మల్ని నేను మళ్ళీ ఇలా ఆరోగ్యంగా చూడగలగడం మహా విశేషం.  ఇదిగో ఈ మూర్తి, మీకోసం ఎన్నోమార్లు నా వద్దకు వచ్చి మీ పెన్షన్ కేసు విషయంగా చాలా పాటుపడి ..తిరుగులేని డిఫెన్స్ సమకూర్చాడు సార్ అంటుండగానే ఆర్మీ ట్రిబ్యూనల్ జస్టీస్ ...అవినాష్ శర్మ కూడా వచ్చారు, 
పలకరింపులయ్యాక ఎదురుగా ఆశీనులయ్యారు. 
రెండేళ్లగా మేజర్ గారికి బదులు కూతురు  వైశాలికి వెళుతున్న అతని పెన్షన్ గురించి సూర్యనారాయణ వేసిన పిటీషన్ పరిశీలిస్తూ ... అసలిలాటి పరిస్థితికి దారితీసిన సంఘటన ఏమిటని ప్రశ్నించారాయన.
గ్లాసుడు చల్లటి మంచి నీళ్ళు తాగి చెప్పడం మొదలెట్టాడు మేజర్. సూర్యనారాయణ.... “నాలుగేళ్ళ క్రితం 68వ యేట..మహవీర్ హిల్స్ లోని నా 1500 గజాల స్థలంలో “ప్రశాంత అపార్ట్మెంట్ కాంప్లెక్ష్” నిర్మాణం చేపట్టాను. పర్యవేక్షణ నిమిత్తం రెండేళ్ళపాటు అవుట్-హౌజ్ లో నివసిస్తూ, ఆరోగ్యపరంగా బలహీన పడినా ... భవంతిని పూర్తిచేస్తున్న సమయంలో .. ఆ భవంతిపై సర్వాధికారాలు నానుండి తస్కరించాలన్న దురుద్దేశంతో నా కుమార్తె  వైశాలి, తన భర్త ఉమాపతితో కలిసి  కుట్ర పన్నింది.  నా వకాలతు, రిజిస్ట్రేషన్ కాగితాలు వారి ఆధీనంలో ఉండిపోడంతో ఏమీ చేయలేకపోయాను”  గొంతు తడారడంతో మంచినీళ్ళు  తాగి మళ్ళీ చెప్పసాగాడాయన.   “..ఎప్పుడో నా భార్య అనారోగ్యానికి లక్షలు ఖర్చు చేసినదానికి బదులుగా..నేను ఆ స్థలాన్ని వాళ్లకి  ఇచ్చినాక కూడా... మతి స్థిమితం కోల్పోయిన నేను ఆ భూమిని ఇంకా నాదిగానే భావించి, ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నానని.. తప్పుడు ఫిర్యాదిచ్చి, కోర్టులోనూ కేసు పెట్టారు. రెండురోజుల జైలు శిక్ష తరువాత నన్ను సైకియాట్రిక్  హాస్పిటల్ కి  తరిలించారు. నా సంక్షేమం దృష్ట్యా.. కూతురైన తనకే నా పెన్షన్ అందించవల్సినదని కోరింది. ఆ ఆరోపణలు, కోర్ట్ కేసులు, ఆ సైకియాట్రిక్ సమస్య  అన్నీ నాపై కుట్రపూరితంగా  మోపబడినవేనని కూడా అన్ని ఋజువులు మీ ముందున్నాయి సార్,”  అని ముగించి ఊపిరి తీసుకున్నాడు సూర్యనారాయణ. 
ఫైల్ లోని రిపోర్ట్స్ అన్నీ వరుసగా, మరోసారి  పరిశీలించిన జెడ్జ్ గారు. “చూడండి మేజెర్.. మీ పెన్షన్ మీకే తప్పక అందుతుంది.  మీరిక ప్రశాంతంగా మీ జీవనాన్ని గడపవచ్చు.”, “ఇది అఫీషియల్.”  అంటూ సానుకూలంగా స్పందించి ఆర్డర్ కాగితాల మీద స్టాంప్ వేసారు. 
*** 
ఇంటికొచ్చి, పెరగన్నం మాత్రం తినేసి రూంలో పడక మీద వాలాడు సూర్యనారాయణ.  గదిలో జానకి కొత్తగా అమర్చిన ఫోటోలు, పువ్వులు పరిశీలించాడు. ఆర్మీ నుండి రిటైర్ అయిన రోజున శాంత, వైశాలీతో తీసుకున్న ఫోటోలో వైశాలీని చూసి మనసుని పిండేసే జ్ఞాపకాలు అతన్నిచుట్టుముట్టాయి. 
....రిటైరయ్యాక సూర్యనారాయణ..తన భార్యతో మారేడుపల్లిలోని వారి సొంత ఫ్లాట్ లోకి చేరేప్పటికే .. జానకికి మూర్తితో పెళ్ళయి ఆరేళ్ళ కొడుకున్నాడు.  వైశాలికి ఉమాపతితో పెళ్ళయ్యాక కూడా... డబ్బు కోసం శాంతని సతాయించి నగో, నట్రో లాక్కునేది.  అనారోగ్యంతో బాధపడుతూన్న తల్లికి సేవలందిస్తున్నజానకిని తూలనాడేది.. 
ఒకరోజు ఊపిరి అందక బాధపడుతున్న శాంతని, హాస్పిటల్ కి తరలించబోతున్న సమయంలో  వైశాలి రావడం, జానకిని తిట్టి వెళ్ళగొట్టడం, హాస్పిటల్ కి వెళ్ళే మనిషి వంటి మీద నగలేమిటంటూ శాంత చేతి గాజులు, నల్లపూసలు, మంగళసూత్రం సహా తీసి తన భర్త ఉమాపతి జేబులో వేయడాన్ని...సూర్యనారాయణ జీర్ణించుకోలేకపోయాడు.. వైశాలి పట్ల అసహనం పెరిగిపోయింది.
మరో వారానికి హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన శాంత, వైశాలి ప్రవర్తన గురించే మదనపడింది. జానకి అండతో కొద్దిరోజులు బాగానే ఉన్నా... ఓ అర్ధ రాత్రి ఊపిరందక, మళ్ళీ హాస్పిటల్ కి తరిలించే లోగానే కన్నుమూసింది. 
..... చరమ దశలో భార్య దుస్థితి, అప్పటి ఆమె మనోవేదన తలుచుకుని... వ్యధ చెంది, పక్క మీద నుండి లేచాడు సూర్యనారాయణ. టైం సాయంత్రం నాలుగయింది.  ఇల్లంతా నిశబ్దంగా ఉండడంతో.. హాల్లోకి  వచ్చి టీవీ ఆన్ చేసి కూర్చున్నాడు...  
కాసేపటికి చేతుల్లో సంచులు, సామానుతో బజార్ నుండి లోనికి వచ్చారు మూర్తి, జానకి.  
“సారీ నాన్నా,  ఇదో ఇప్పుడే టీ పెట్టిస్తా” అంటూ వంటింట్లోకి వెళ్ళింది జానకి.  మూర్తి సామానంతా సర్దేసి, ఫ్రెష్ అయ్యి, లాయర్ గారి కోసం ఫైల్, కవర్స్ కూడా తెచ్చుకొని సోఫాలో కూర్చున్నాడు.  హైదరాబాద్ ట్రాఫిక్ గురించి మాట్లాడుతూ జానకి తెచ్చిన పకోడీ తిని, టీ సిప్ చేస్తుండగా, “లాయర్ ఇంటికి వెళ్లేందుకు ఓపికుందా ఇవాళ?” అని తండ్రికి తల పైకి కాప్,  చేతికర్ర  తెచ్చిచ్చింది  జానకి. 
***
లాయర్ విశ్వనాధ్ గారి ఆఫీస్...
కోర్టు కేసు  విషయంగా సూర్యనారాయణకి అప్డేట్లు ఇచ్చారు లాయర్ గారు.   వైశాలి వద్ద ఉన్న ఆస్థి దస్తావేజు సేకరించగలగడంతో ... అపార్ట్మెంట్స్ అమ్మకాలని ఆటంకం లేకుండా కొనసాగించవచ్చని తెలిసి సంతోషించాడు మేజర్ సూర్యనారాయణ.  కాకపోతే వైశాలి కోర్టులో వేసిన మరో కొత్త కేసు గురించి విని చిరాకుపడ్డాడు. ఏకైక వారసురాలుగా ఆస్థిపాస్తుల పైనే కాక,  తండ్రి సంక్షేమం విషయంగా కూడా తనకే సర్వాధికారాలు ప్రసాదించవలసిందిగా న్యాయస్థానంలో అఫడవిట్ ఫైల్ చేసుకుందట.  
రెండు నిముషాల నిశ్శబ్దం తరువాత, “అయినా ఏమాత్రం బలం లేని వైశాలి గారి అఫిడవిట్ కి మనం కౌంటర్ వేయవచ్చు. సీనియర్ సిటిజెన్ గా ఫాస్ట్-ట్రాక్ కోర్టుకి నివేదించి, తక్షణమే వైశాలి కేసు నుండి పూర్తి విముక్తి పొందవచ్చు”  అని ముగించారు లాయర్.  
అన్నీ విని అర్ధంచేసుకొన్న సూర్యనారాయణ, “విశ్వనాధ్ గారు, న్యాయ స్థానానికి అఫడివిట్ ధాకలు చేద్దాము. నా ఇద్దరు కూతుళ్ళు జానకి, వైశాలికి సెటిల్మెంట్ ఒప్పందం పంపుదాము,”  అని జవాబిచ్చాడు.
ఆయనకి తోచిన రీతిలో అన్ని డాక్యుమెంట్స్ రాయించాడు కూడా.  దత్తపుత్రిక  జానకికి, రెండో కుమార్తె వైశాలికి, ప్రత్యేకంగా నిర్మించిన మూడవ అంతస్తులోని అపార్ట్మెంట్స్ చెరొకటి రాసి రిజిస్టర్ చేయించే ఏర్పాటు చేయించాడు సూర్యనారాయణ.  మహవీర్ హిల్స్ స్థలంలో అపార్ట్మెంట్స్ కట్టించి విక్రయించగా వచ్చిన నిధులతో, తన భార్య పేరిట “ప్రశాంత సేవాసదన్”, ‘ప్రశాంత సేవా ట్రస్ట్’ సంస్థలు స్థాపించాలన్న ఉద్దేశంతో ..సంస్థలని కూడా రిజిస్టర్ చేయించాడాయన.    
*** 
ఉన్నతమైన ఆశయాలతో స్థాపించిన ‘ప్రశాంత సేవ సదన్’ పదేళ్ళలో అత్యున్నతమైన సంస్థగా పేరొంది దశాబ్ది వేడుకలు జరుపుకునేందుకు సంసిద్ధమైంది.  వందలాది ఆశ్రమవాసులు, అనాధ బాలలకి... సూర్యనారాయణ ఆత్మీయ ‘మేజర్ సాబ్’ గా మారాడు. దశాబ్ది వేడుక కార్యక్రమాన్ని విజయవంతం చేసే పనుల్లో... మూర్తి, జానకిల ఆధ్వర్యంలో ఆశ్రమవాసులు మునిగి తేలుతున్నారు.  అంతేకాకుండా ఆశ్రమంలోని వృద్ధులు, వికలాంగులు, అనాధలు ప్రత్యేకంగా సీతారాముల ఆలయ ప్రాంగణంలో.. ‘మేజేర్ సాబ్’ ఎనభైరెండవ పుట్టినరోజు పండుగ జరిపేందుకు ఉవ్విళ్ళూరుతున్నారు.  జానకి ప్రత్యేక ఆహ్వానంపై.. వైశాలి కూడా వేడుకల్లో పాల్గొంది.
వేడుకలో ఆఖరి ఘట్టంగా సూర్యనారాయణ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ..”మీ అందరి ప్రేమ, ఆత్మీయతల కన్నా మించిన పెన్నిధి నాకు లేదు” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు...
“జయహో! మేజర్ సాబ్ “  అన్న నినాదంతో ‘ప్రశాంత సేవ సదన్’ ఆవరణ మారుమ్రోగింది. 
 
***

No comments:

Post a Comment

Pages