ఋష్యశృంగ మహర్షి - అచ్చంగా తెలుగు
 ఋష్యశృంగ మహర్షి
అంబడిపూడి శ్యామసుందర రావు 
రామాయణము లోని బాల కాండములో ఋష్యశృంగ మహర్షి గురించి దశరథుని మంత్రి అయిన సుమంతుడు ఈ వృత్తాంతాన్ని వివరిస్తాడు. దశరథ మహారాజు అశ్వమేథ యాగము, పుత్రకామేష్టి యాగము చేస్తాడని సనత్కుమారుడు ఋషులకు చెప్పుచుండగా తాను విన్నట్లు సుమంతుడు దశరథునితో చెప్పాడు. మన పురాణాలలో వివరించబడ్డ గొప్ప మహర్షులలో ఋష్యశృంగుడు ఒకడు. ఈయన కాలు మోపిన ప్రదేశము సుభిక్షంగా వర్ధిల్లుతుంది. యవ్వనము వచ్చినా ఆడ మగ తేడా తెలియకుండా తండ్రి సంరక్షణలో పెరిగిన వాడు ఋష్యశృంగుడు. ఈయన జననము చాలా యాదృచ్చికముగా జరిగింది.

కశ్యప ప్రజాపతి కుమారుడైన విభాండకుడు అనే మహర్షి ఒక రోజు సంధ్యా వందనము చేసుకొను సమయమున, ఆయనకు ఆకాశమార్గాన పోతున్న ఊర్వశి కనిపిస్తుంది. ఆ ఊర్వశిని చూసి విభండక మహర్షి తన వీర్యాన్ని సరోవరములో విడిచిపెడతాడు. ఆ వీర్యాన్ని త్రాగిన ఒక జింక గర్భం ధరించి, కొమ్ముకల బాలునికి జన్మనిస్తుంది. ఆ జింక పూర్వ జన్మలో చిత్రరేఖ అనే అప్సరస. 

ఇంద్రుడి కొలువులో నాట్యము చేస్తున్నప్పుడు ఆవిడ  నాట్యానికి లేళ్ళు వస్తాయి. అన్ని లేళ్ళను చుసిన చిత్రరేఖ ఏకాగ్రత లోపించి లేళ్ల వైపు చూస్తుంది. ఆగ్రహించిన ఇంద్రుడు లేడిగా జన్మించమని శపిస్తాడు శాపవిమోచన కోసము ఇంద్రుడిని ప్రార్ధించగా,"నీకు మనిషి రూపములో బాలుడు జన్మింస్తే శాపవిమోచనం కలుగుతుందని చెపుతాడు. ఆ విధముగా శాపఫలితముగా చిత్రరేఖ జింక రూపంలో బాలుడిని కని, శాపవిమోచనం పొంది, స్వర్గానికి వెళ్ళిపోతుంది.

తన దివ్యదృష్టి తో విషయము తెలుసుకున్న విభాండకుడు ఆ బాలుడు కొమ్ముతో జన్మించాడు కావున ఆ బాలకునకు ఋష్యశృంగుడు అని పేరు పెడతాడు. ఋష్యశృంగునికి సకల విద్యలు, వేదాలు, వేదాంగాలు, యజ్ఞయాగాది క్రతువులు తానే గురువై, విభండక మహర్షి నేర్పుతాడు. విభండక మహర్షి ఋష్యశృంగుడిని బాహ్యప్రపంచము అంటే ఏమిటో తెలియకుండా పెంచుతాడు. అలా పెరిగిన ఋష్యశృంగునికి లోకములోని స్త్రీపురుష తారతమ్యములు తెలియవు. విషయ సుఖాలంటే ఏమిటో తెలియదు. ఆ ఋష్యశృంగుడు జ్వలిస్తున్న అగ్ని గుండము వలె ఉండేవాడు.

ఆ సమయములో అంగ రాజ్యమును రోమపాదుడు అనే రాజు పాలిస్తూండేవాడు అతనికి సంతానము లేరు. ఒకసారి స్నేహితుడైన దశరథుని ఇంటికి వెళతాడు. అక్కడ దశరధ మహారాజు కుమార్తె శాంతను చూసి ముచ్చట పడి తానూ పెంచుకుంటాను అని దశరధుడుని అడుగుతాడు. మొదట్లో దశరధుడు అంగీకరించడు, కానీ కులగురువైన వసిష్ఠుని సలహామేరకు శాంతను రోమపాదుడికి ఇవ్వటానికి అంగీకరిస్తాడు. ఒక ఆరునెలలు తన దగ్గర, మిగిలిన ఆరునెలలు రోమపాదుడి దగ్గర ఉండటానికి అంగీకరిస్తాడు. రోమపాదుడు తన రాజ్యములో బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేయటము మొదలుపెడతాడు. ఒక బ్రాహ్మణుడు తానూ దానము తీసుకొని తన కొడుకుకు కూడ గోవును దానము ఇమ్మని రాజును అడుగుతాడు. రాజు "బ్రాహ్మణులకు ఆశ ఎక్కువ, ఎంత ఇచ్చినా మీ బ్రాహ్మణులకు చాలదు" అని అవమానకరముగా మాట్లాడు తాడు. ఆగ్రహించిన ఆ బ్రాహ్మణుడు, "నీవు మొత్తము బ్రాహ్మణ జాతిని అవమానించావు. నీ రాజ్యములో వర్షాలు పడవు. దేశము కరువు కాటకాలతో పీడింప బడుతుంది" అని శపిస్తాడు.

పశ్చాత్తాపము చెందిన రోమపాదుడు మిగిలిన పురోహితులతో సమస్యకు పరిష్కారము చెప్పవలసినదిగా వేడుకుంటాడు. వారు రోమపాదుడికి ఋష్యశృంగుని వృత్తాంతము చెప్పి ఋష్యశృంగుడు దేశములో పాదము మోపితే వర్షాలు పడి దేశము సుభిక్షముగా ఉంటుంది. కానీ ఋష్యశృంగుని తండ్రి విభాండకుడు ఋష్యశృంగుని ఆశ్రమము దాటి బయటకు రావటానికి అంగీకరించడు. ఆయన అనుమతి లేనిదే ఋష్యశృంగుని తీసుకురావటం అసాధ్యము అని చెపుతారు. 

అప్పుడు రోమపాదుడు కొంతమంది అందమైన వేశ్యలను విభాండకుడు లేని సమయములో ఆశ్రమానికి పంపి ఆట పాటలతో, మాయ మాటలతో ఋష్యశృంగుని ఆకర్షిస్తాడు. విషయసుఖాలంటే తెలియని, స్త్రీపురుష భేదము తెలియని ఋష్యశృంగుడు వేశ్యలకు ఆర్ఘ్యపాద్యాలిచ్చి పూజిస్తాడు. తపస్సు
చేసుకోవటానికి మా ఆశ్రమానికి రావలసిందిగా కోరి విభాండకుడు వచ్చేలోపు వెళ్ళిపోతారు వేశ్యలు. వెళ్ళి పోతూ  ఋష్యశృంగుడిని గట్టిగా కౌగలించుకొంటారు. వారు కౌగిలించుకొన్న తరువాత విషయ వాంఛలు లేని ఋష్యశృంగుడికి కూడా వారిని చూడాలనే కోరిక పుడుతుంది, వారిని వెతుకుతూ వెళ్ళగా వారు కనిపిస్తారు. వారు ఋష్యశృంగుడిని తమ ఆశ్రమానికి రమ్మంటారు.

ఋష్యశృంగుడు అంగీకరించి వారివెంట అంగదేశములో అడుగు పెడతాడు. అతడు అడుగు పెట్టిన వెంటనే అంగదేశంలో వర్షము పడుతుంది. మోసము చేసి ఋష్యశృంగుడిని తీసుకు వచ్చిన విషయము తెలిస్తే విభాండకుడికి ఆగ్రహము వస్తుందని భయపడి రోమపాదుడు విభాండకుడి అభయాన్ని కోరుతాడు.  రోమపాదుడు తన కూతురైన శాంతను ఋష్యశృంగుడికి కిచ్చి వివాహం జరిపించి విభాండకుడి ఆగ్రహానికి గురికాకుండా ఆయనను  శాంతింపజేస్తాడు. రోమపాదుడు ఋష్యశృంగుని ఆశీర్వాదంతో యాగము చేసి ఒక కొడుకును పొందుతాడు. రోమపాదుడు ఆనందముతో, భక్తితో శాంతా ఋష్యశృంగులను చూసుకుంటూ ఉంటాడు. కొంతకాలానికి వీరందరూ అయోధ్యకు వెళతారు. అక్కడ దశరథమహారాజుకు మగసంతానం లేనందున కులగురువైన వసిష్ఠులవారి సలహా మేరకు ఋష్యశృంగుని ఆధ్వర్యములో పుత్రకామేష్టి యాగము చేస్తాడు. ఆ యాగ ఫలితముగా దశరధుని శ్రీరామ, లక్ష్మణ, భరత,శత్రజ్ఞులు జన్మిస్తారు. యాగాన్ని పూర్తిచేసిన ఋష్య శృంగుడు భార్యతో తండ్రి ఆశ్రమానికి చేరుకుంటాడు. ఋష్యశృంగుడు ద్వాదశ వార్షిక యజ్ఞాన్ని చేస్తాడు, ఋష్యశృంగ
స్మృతి అనే గ్రంధాన్ని  రచించి లోకానికి అందజేస్తాడు. ఆ గ్రంధములో ఆచారము, శుచి, శ్రాద్ధము, ప్రాయశ్చిత్తము, వంటి విషయాలను వివరిస్తాడు. ఆ విధముగా గొప్ప తపస్సంపన్నుడే కాకుండా లోకానికి శ్రీరామచంద్రుడి రాకకు కారణమైన పుత్రకామేష్టి యాగము నిర్వహించిన మహానుభావుడు, సాక్షాత్తు
శ్రీరాముడికి బావగారై, తన పాద స్పర్శతో లోకాన్ని సుభీక్షము చేసిన గొప్ప మహర్షి.

ఋష్యశృంగుడి దేవాలయము ఇప్పటి శృంగేరికి 10 మైళ్ల దూరములో కిగ్గా అనే గ్రామములో ఉంది. శృంగేరికి ఆ పేరు ఋష్యశృంగ మహర్షి వల్లే వచ్చిందని కూడా చెబుతారు. అంతేకాకుండా హిమాచల్ ప్రదేశ్ లోని కులు జిల్లాలో బంజర్ లోయలోని చెన్నికోటలో ఋష్యశృంగుని గుడి ఉంది. అక్కడి ప్రజలు ఈయనను శృంగ ఋషి అంటారు. ఈ గుడిలో ఋష్యశృంగునియొక్క, మరియు భార్య శాంత యొక్క విగ్రహాలు
పూజింపబడతాయి.

***

No comments:

Post a Comment

Pages