ఈ దారి మనసైనది -38 - అచ్చంగా తెలుగు

ఈ దారి మనసైనది -38 

అంగులూరి అంజనీదేవి  


పాయిజన్ ఎఫెక్ట్ లని తట్టుకోలేక కొంత మంది డాక్టర్లు పాయిజనింగ్ కేసులని దూరం నుండే చూస్తారు. కానీ... మన్విత ధైర్యంగా దగ్గరికి వెళ్లి పేషంటిని ట్రీట్ చేస్తోంది. అఖరికి....

" హి ఈజ్ డెడ్.... అంది మన్విత .

ఆ మాటల్ని తట్టుకోలేక పోయారు. వాళ్లలో ఒక వ్యక్తి బయటకెళ్లి వాళ్ల వాళ్లతో చెప్పాడు. అక్కడున్న వ్యక్తి మాత్రం...

“ ఇప్పటి వరకు బ్రతికే వున్నాడు. మీరు సరిగ్గా చూడండి!” అంటూ పేషంటె వైపు చూడకుండా మన్వితనే చూస్తూ అర్థిస్తున్నాడు.

వాళ్లకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఎన్ని సార్లు చూసినా చనిపోయినా మనిషి బ్రతికొస్తాడా? 

ఈ లోపల బయట వున్న పేషంటు తాలూకు మనుషులు వచ్చి ఆమె చూట్టూ చేరారు.

" హాస్పిటల్ కి వచ్చేంత వరకు బ్రతికే వున్నాడు... మీ చేతుల్లోనే చనిపోయాడు. ఇది దారుణం...” అన్నారు అంతా ఒకేసారి. "హాస్పిటల్ కి వెళ్లేంత వరకు బ్రతికితే చాలు - ఆ తర్వాత తప్పకుండా బ్రతకుతాడు” అని వాళ్ల నమ్మకం. హాస్పిటల్ అంటే గుడ్డిగా, డాక్టరంటే దేవుడుగా, భావిస్తారు వాళ్లు...

" మీకు చెప్తుంటే అర్థం కావడం లేదా? నేను చూడకముందే అతను చనిపోయాడు.” అంది మన్విత..

“మేము అబద్దం చెబుతామా? ట్రాక్టర్లో వస్తున్నంతసేపు కదులుతూనే వున్నాడు. ఇక్కడికి వచ్చేదాకా కాళ్లు, చేతులు కొట్టుకుంటూనే వున్నాయి.” అన్నారు.

విషయం అర్థమై ... ఆ పేషంటు తాలూకు వాళ్లకి నచ్చ చెప్పటానికి ప్రయత్నించింది మన్విత. అయినా వాళ్లు వినడం లేదు. వార్డ్ బాయ్, నర్స్ టి.వి. చూస్తున్నట్లు అలాగే నిబడ్డారు.

“మీలాంటి డాక్టర్లు వుండబట్టే పేషంట్ల ప్రాణాలకి విలువ లేకుండా పోతోంది మా లాంటి పేదవాళ్ల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. నువ్వే చంపావ్ వాడ్ని ... నీ మీద కేసేస్తాం ... ఎలా తప్పించుకుంటావో చూస్తాం ....” అన్నారు. 

ఎంత చెప్పినా వినని మూర్ఖులకి బలం ఎక్కువ ... అప్పటి వరకు ధైర్యంగా వున్న మన్విత శిల లాగ నిబడింది. 

ఏం చేయాలో తోచడం లేదు. ఈ గొడవ ఎక్కడిదాకావెళ్తుందో అర్థం కావడం లేదు..

పోలీసుల్ని పిలుస్తాం ... కేసు వేస్తాం ... మీడియాను పిలుస్తాం ... అని బెదించడమే కాకుండా - నీటిలో బాగా పరిచయమున్నా వ్యక్తి వాళ్లలో వుండటం వల్ల ఫోన్ చెయ్యడంతో క్షణంలో మిడియా, పోలీసులు వచ్చారు. అంతా క్షణాల్లో జరిగిపోయింది.

మన్వితను ఒకసారి కలిసిపోదామని అటువైపు వచ్చిన ధీరజ్ ఆ గుంపులో మన్విత కన్పించడం లేదు. అక్కడున్న వాళ్లంతా వాళ్ల ఊరైన పాకాల వాళ్లే అయినందువల్ల విషయం కనుక్కొని .... వాళ్లను తప్పించుకుంటూ వెళ్లి, చనిపోయిన ఆ యువకుడ్ని చూశాడు. ఆశ్చర్యపోతూ ....

వెంటనే మన్విత వైపు చూశాడు ... ఒక రోజు తనని చంపుతానంది ... తెల్లవారే తను చావాలనుకుంది ... ఇప్పుడితన్ని నిజంగానే చంపేసిందా? మన్వితలో తనకి తెలియని ప్రాబ్లమ్ ఏమైనా వుందా? నో ... నో... అటువంటి దేం మన్వితలో వుండి వుండదు. మందు తాగాక బ్రతకడమనేది అరుదు... మన్విత చాలా మంచి హౌస్ సర్జన్. పేషంట్ల విషయంలో చాలా సిన్సియర్గా వుంటుంది. డ్యూటి విషయంలో కూడా డెడికేటెడ్ మైండ్లో వుంటుంది అని మనసులో అనుకుంటుండగా ... మన్విత ఏ మాత్రం ధైర్యం కోల్పోకుండా ....

“ఇందులో నా తప్పేం లేదు సర్ ! అతను ముందే చనిపోయి వున్నాడు.” అంది ధీరజ్ నే చూస్తూ .... ఆమెనలా చూస్తుంటే అమె తప్పేమీ లేదని ధీరజ్ అర్థమైంది.. 

ఆ యువకుని తల్లి ఏడుస్తోంది. ఆమెను చూస్తుంటే హృదయం కదిలేలా వుంది. ఎంత ఆపినా ఆగే శోకం కాదు అది. అతని ప్రియురాలు మాత్రం ఆ ఊర్లో ఏం చేస్తుందో ఏమో ఎవరికి తెలియదు. వాడైతే మందు తాగి చచ్చి ... మన్విత పీకల మీదకి తెచ్చాడు.

ఆ శవం తాలూకు పెద్ద వాళ్లని పక్కకి తీసికెళ్లాడు ధీరజ్.

(ఇంకా ఉంది)


No comments:

Post a Comment

Pages