మానసవీణ -21 - అచ్చంగా తెలుగు

 మానసవీణ -21

పెమ్మరాజు అశ్విని

  అనిరుధ్ ని చూసి ఒక్క క్షణం కలవరపడింది జనని…

"మీరు ఇక్కడేంటి "అంది గబుక్కున ! మళ్ళీ నాలుక కరుచుకుంది." ఇంకేమి చెప్పాలో తెలీక తికమక పడసాగింది.

“ఈ అమ్మాయి మీకు ఏమవుతుందో నాకు తెలియదు కాని తన కడుపులో బిడ్డ కి నేనే తండ్రిని అని బస్ స్టాప్ లో నలుగురి లో గోల చేసింది, నా వల్ల ఎంతైనా ఒక ఆడ కూతురు అల్లరి అవ్వకూడదు, నీకు తాళి కట్టి మా ఇంటికి తీసుకు పోతా "అన్నాడు జేబు లోంచి పసుపుకొమ్ము తీసి .

 "నాన్న కాపాడు ఈ అల్లరి నుండి "అంటూ పెద్దాయన పక్కన చేరింది జనని.

"చూడు బాబు నువ్వు ఎవరో మాకు తెలియదు, మేము పొట్ట కూటి కోసం నాటకాల్లో నటిస్తాము, మొన్నో కుర్రాడు వచ్చి నిన్ను బస్ స్టాప్ లో అల్లరి పెట్టమని డబ్బు ఇచ్చాడు, తప్పని తెలిసినా అతను ఇస్తాను అన్న డబ్బుకు కక్కుర్తి పడ్డాము. మమ్మల్ని క్షమించు"అన్నాడు ఆ పెద్దాయన చేతులు కట్టుకుని.

 “సరే ఈ మాట ఇక్కడ కాదు, అందరి ఎదుట చెప్పాలి పదండి” అంటూ వాళ్ళను తన ఇంటికి తీసుకెళ్లాడు.

అప్పటికే మానస మీద అఘాయిత్యానికి పూనుకుంది తన గ్యాంగ్ అని తెలిసి, మానస కి క్షమాపణ చెప్పేందుకు జి టి ఆర్ ఇంట్లో ఉన్న మానస ని చూడడానికి వచ్చాడు రాజేష్. అదే సమయంలో అనిరుధ్ కూడా జననిని, ఆమె తండ్రి న తీసుకు వచ్చాడు .

           అనుకోకుండా జననిని చూసి ఖంగుతిన్నాడు రాజేష్ ,"ఈ బాబే మాకు డబ్బులు ఇచ్చి మీ గురించి బస్ స్టాప్ లో అలా నటించ మని చెప్పాడు,"అని జనని చెప్పింది.

ఆమె చెప్పిన మాట విని మానస మొహం కోపం తో నిండి పోయింది "ఏంటి రాజేష్ ఇది? నువ్వు మారి మంచి వాడివి అయ్యవనుకుంటే , ఇంత నాటకం ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ ప్రేమ, పెళ్లి వీటికి ఏమి కంగారు వచ్చింది? ఇంకా డిగ్రీ అయినా పూర్తి గాని మనకి జీవితం లో ఒక లక్ష్యం, సామాజిక బాధ్యత ముందు ముఖ్యం. నువ్వు ఇలాంటి నాటకాలు ఎందరి తో వేయించినా అనిరుధ్ ఎలాంటి వాడో చిన్నప్పటి నుండి నేనెరుగుదును."

        "నన్ను క్షమించు మానసా! నీ మీద ప్రేమతో, ఎక్కడ నువ్వు అనిరుధ్ ప్రేమని ఒప్పుకుంటావో అని భయపడి ఇలా చేశా" అన్నాడు రాజేష్ . 

"నీకు ఏమైనా పిచ్చి ఎక్కిందా? మనం ఉన్న వయసు ఏంటి? ఈ ప్రేమ, పిచ్చి గోల ఏంటి? రాజేష్, ముందు మన జీవితాల కి ఒక లక్ష్యం ఉండాలి. నేను శ్రావణి గారిని చూసి తల్లడిల్లితే నాకు ఊతం ఇచ్చి మానసికంగా నాకు తోడు నిలిచిన ఆప్తుడు అనిరుధ్.  నీలాగా పిచ్చి వేషాలు వెయ్యలేదు, నా వరకు శ్రావణి గారి లాంటి అమాయకపు తల్లులకి ఊరట ఇచ్చే సేవా సంస్థ ని స్థాపించాలి అని నా ఆశయం. దానికి అనిరుధ్ లాంటి మనోనిబ్బరం, వ్యక్తిత్వం నాతో నిలిస్తే అంతే చాలు. ఇక ప్రేమ పెళ్లి గురించి ఇప్పుడే నేను ఆలోచించను." ఉద్వేగంగా అంది మానస.

      మానస సమాధానం విని రాజేష్ నిరాశ లోకి జారిపోయాడు. అనిరుధ్ కి సంతోషం తో ఎగిరి గెంతాలి అని ఉన్నా,  పక్కనే ఉన్న తన తల్లిదండ్రులకు ఏమి చెప్పాలో తెలియక చూస్తున్నాడు. కొద్దిసేపటికి మానస తిరిగి ఆశ్రమానికి వెళ్ళింది. 

మానసకి ఎందుకో మనసుకి దిగులుగా ఉంది. ఇలా ప్రేమ ప్రేమ అని వెంటపడతున్నారు, మరి అదే ప్రేమకి ప్రతీకగా పుట్టిన నన్ను అనాధని చేశారు, ఒకపక్క శ్రావణి గారి లాంటి వాళ్ళు బిడ్డల ప్రేమ కోసం తపిస్తున్నారు,తప్పెవరిది?

        ఒక పక్క జి టి ఆర్ ఇంట్లో పెద్ద తుఫాను చెలరేగింది. అమ్మానాన్న, కులం గోత్రం తెలియని పిల్లని కోడలుగా ఒప్పుకోడానికి జి టి ఆర్ దంపతుల మనసు ఒప్పుకోవట్లేదు, అలా అని అనిరుధ్ ని నేరుగా మందలించలేరు, అసలే గారాల కొడుకు వాడు ఏమైనా చేసుకుంటేనో! ఈ ఆలోచన వాళ్ళను నిలువనియ్యట్లేదు. 


No comments:

Post a Comment

Pages