నివేదన - అచ్చంగా తెలుగు
నివేదన
జి.ఎస్.ఎస్.కల్యాణి 
(MyBigBreak సంస్థ వారు నిర్వహించిన సంక్రాంతి కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ ) 


తులసికి వివాహమై పదేళ్లు గడిచినా ఇంకా పిల్లలు కలగలేదు.  తనకు కనీసం ఒక్క పిల్లో, పిల్లాడో పుడతారన్న ఆశతో లెక్కలేనన్ని నోములూ, వ్రతాలూ చేసింది తులసి. కానీ తులసి కోరిక ఫలించలేదు. ఒకసారి తులసి తన చిన్ననాటి స్నేహితురాలైన సీత వద్ద పిల్లల విషయం ప్రస్తావిస్తే, టీ.వీ.లో వచ్చే ఒకానొక ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఒక ప్రముఖ సిద్ధాంతిగారు ఎటువంటి సమస్యకైనా అద్భుతమైన పరిష్కారాలు ఇస్తున్నారని చెప్పింది సీత. వెంటనే తులసి తనకు సంతానం కలిగే మార్గం తెలుపమంటూ ఆ సిద్ధాంతిగారికి ఒక ఉత్తరం పంపింది.

కొద్దివారాలు గడిచాక, ఒకరోజు మధ్యాహ్నం, సీత చెప్పిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని తులసి టీ.వీ.లో చూస్తూ ఉండగా, తను అడిగిన ప్రశ్నకు సిద్ధాంతి గారు సమాధానం ఇస్తూ, "అమ్మా తులసీ!  మీ ఊరిలో రాధామాధవ ఆలయం ఉంది. నీవు ప్రతిరోజూ మడితో పరమాన్నం తయారుచేసి, దానిని మీ ఇంటినుండీ కాలినడకన ఆ ఆలయానికి  తీసుకెళ్లి, ఆ రాధామాధవుడికి ఆ పరమాన్నాన్ని నివేదించాలి. అలా నువ్వు ఆ రాధామాధవుడికి తృప్తి కలిగేదాకా నియమంగా చెయ్యాలి! అప్పుడు ఆ రాధామాధవుడు నీకు బిడ్డను అనుగ్రహిస్తాడు! మీ ఇంట్లో ఎర్రటి పువ్వు పూసే మొక్క కనక ఉన్నట్లయితే, ఆ రాధామాధవుడు తృప్తి చెందిన రోజు, ఆ మొక్కకు ఒక పువ్వు పూస్తుంది! అయితే ఒక్క విషయం! ఈ వ్రతం మొదలుపెట్టిన తర్వాత, ఏ కారణంచేతనైనా నువ్వు ఈ వ్రతనియమం తప్పినట్లైతే, ఇక నీకు ఎప్పటికీ సంతానయోగం కలగకపోయే అవకాశం ఉంది! జాగ్రత్త!!", అన్నారు.

సంతానం కోసం తనకొక మార్గం దొరికిందని సంతోషపడింది తులసి. ఎర్రపూలు పూసే మొక్క ఉందో లేదో చూసేందుకు వాకిట్లోకి ఒక్క పరుగున వచ్చిన తులసికి తమ ఇంటి ఆవరణలో ఎర్ర మందార మొక్క కనపడింది. దానికి పువ్వులు కాదు కదా, కనీసం మొగ్గలు కూడా లేవు!

‘ఇక రాధామాధవుడిని తృప్తి పరచడమే తరువాయి!’, అనుకుంది తులసి.

అంతలో తులసి ఇంటి ముందుకు ఒక ముసలి బిచ్చగాడు వచ్చి, "అమ్మా! కొంచెం అన్నం ఉంటే పెట్టండమ్మా! ఆకలేస్తోంది!", అన్నాడు.

తులసి ఆ బిచ్చగాడిపై చిరాకు పడుతూ, "అడగడానికి వేళాపాళా ఉండక్కర్లేదా? అవతలికి ఫో!", అంటూ కోపంగా తలుపు వేసేసి ఇంట్లోకి వెళ్ళిపోయింది.  

ఆ రోజు సాయంత్రం తులసి భర్త శ్రీపతి ఆఫీసునుండీ ఇంటికి వచ్చాక, సిద్ధాంతిగారు చెప్పిన పరిష్కారం గురించి శ్రీపతికి చెప్పి, "సిద్ధాంతిగారు చెప్పినట్లు నన్ను చెయ్యమంటారా?", అని శ్రీపతిని అడిగింది తులసి. 

దానికి శ్రీపతి చిరునవ్వుతో, "ఆలస్యమెందుకు? నీ ప్రయత్నం వెంటనే మొదలుపెట్టు!", అన్నాడు తులసిని ప్రోత్సహిస్తూ.

ఆ మరుసటి రోజునుండీ తులసి, కమ్మటి నెయ్యి, జీడిపప్పు వేసి తనే స్వయంగా పరమాన్నాన్ని ఇంట్లో ఎంతో రుచికరంగా తయారు చేసి, దానిని మడితో గుడికి తీసుకెళ్లి, భక్తిశ్రద్ధలతో రాధామాధవుడికి ప్రతినిత్యం నివేదించడం మొదలుపెట్టింది. వచ్చిన ఇబ్బందల్లా ఆ గుడి ప్రవేశద్వారానికి ఇరుపక్కలా ఎప్పుడూ బిచ్చగాళ్ళు కూర్చుని ఉండేవాళ్ళు. తులసి శుచిగా వండిన పరమాన్నం మడితో గుడిలోకి తీసుకెడుతూ ఉంటే వారంతా తమకు కొంచెం పెట్టమంటూ చేతులు చాపేవారు. తులసి వారిని చీదరించుకుంటూ, వాళ్ళు తనను ఎక్కడ ముట్టుకుంటారోనని గబగబా గుడిలోకి వెళ్లిపోయేది. 

రోజులూ..వారాలూ..నెలలూ.. గడుస్తున్నాయి. తులసి క్రమం తప్పకుండా ప్రతిరోజూ పరమాన్నం వండి రాధామాధవుడి గుడికి తీసుకెళ్లి భక్తితో నివేదిస్తూనే ఉంది. ఎన్నాళ్లయినా ఎర్ర మందార మొక్క పూయకపోవడంతో తులసి మెల్లిమెల్లిగా సహనం కోల్పోసాగింది. తనకు ఇక పిల్లలు కలిగే యోగం లేదన్న భయంతోనూ, నిరాశతోనూ ఉన్న తులసి, ఒకరోజు యధావిధిగా పరమాన్నం తీసుకుని గుడికెళ్లింది. గుడి ప్రవేశద్వారం వద్ద బిచ్చగాళ్ళు ఎప్పటిలాగే ఆమెకు అడ్డంవచ్చి తమకు ఆ పరమాన్నం పెట్టమని బతిమలాడారు. 

అంతలో ఆ బిచ్చగాళ్ల పిల్లాడొకడు తులసి కట్టుకున్న చీర కొంగును పట్టుకుని కిందకు గుంజి, "అమ్మా! ఆకలేస్తోంది! కొంచెం అన్నం పెట్టవా?", అని అడిగాడు. 

తులసికి ఎక్కడ లేని కోపం వచ్చి, ‘నిజమే! నాకు పిల్లలు పుట్టే యోగం లేదు కాబట్టే ఈ ముష్టివాళ్లు నన్ను ముట్టుకుని నా మడిని మంటగలిపారు!!’, అని తిట్టుకుంటూ, బిచ్చగాళ్లతో, "ఇదిగో! ఈ అన్నమేగా మీకు కావాలీ?? ఇంద! కడుపునిండా తినెయ్యండి!", అని విసురుగా వారందరి చేతుల్లో తలా ఒక గరిటెడు పరమానాన్ని పెట్టింది. 

బిచ్చగాళ్లంతా వరుసలో వచ్చి పరమాన్నం పెట్టించుకున్నారు. చూస్తూ ఉండగా తులసి చేతిలోని గిన్నె ఖాళీ అయిపోయింది! 

అప్పుడు తులసి నిస్సహాయతతో తనకు వచ్చిన పట్టరాని కోపంతోనూ, దుఃఖంతోనూ ఆలయంవంక చూస్తూ, "రాధామాధవా! నేను నీకు ఈ రోజు పరమాన్నం నివేదన చెయ్యలేను! ఇన్నిరోజులూ నియమంతో చేస్తున్న నా వ్రతం ఇవాళ ఈ విధంగా భంగమైపోయింది!! ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా??", అని అడిగింది.

"నాకు తృప్తి కలిగిందమ్మా! నువ్వు వెయ్యేళ్ళు చల్లగా వర్ధిల్లు!! నేను కడుపునిండా అన్నం తిని ఎన్ని రోజులైందో నాకసలు గుర్తే లేదు! ఈ రోజు నువ్వు పెట్టిన గరిటెడు పరమాన్నం నా కడుపు నింపింది!", అంటూ ఆ బిచ్చగాళ్లలోని ఒక వృద్ధుడు తులసి వద్దకు వచ్చి తులసికి దణ్ణం పెట్టాడు.

తులసి మనసు కలుక్కుమంది. ఆ రాధామాధవుడే ఈ వృద్ధుడి నోటివెంట ఆ మాటలు పలికించాడన్న అనుమానం కలిగి ఆలోచనలో పడిన తులసి, మెల్లిగా నడుచుకుంటూ ఇంటికి చేరింది. ఇంట్లోకి ప్రవేశిస్తూ తులసి యధాలాపంగా ఎర్ర మందార మొక్కవంక చూసింది. 

ఆశ్చర్యం!! ఆ మొక్కకు ఒక ఎర్రటి మొగ్గ కనపడింది! అది చూసిన తులసికి అమితానందం కలిగింది. 

సరిగ్గా అదే సమయానికి, దూరంగా కనపడుతున్న రాధామాధవుడి గుడిలో, ‘దీపనాగ్నినై జీవదేహముల అన్నములు తేపుల నఱగించేటి దేవుడనేను...! ఏపున ఇందరిలోని హృదయములోననుందు దీపింతు…’, అంటూ ఎవరో భక్తులు పాడుతున్న అన్నమయ్య పాట తులసి చెవిన పడింది. నిజాన్ని గ్రహించిన తులసికి మనసు పులకించి ఒళ్ళు గగుర్పొడిచింది. 

‘రాధామాధవా! నా చేత నువ్వీరోజు ఆకలితో ఉన్న అభాగ్యుల కడుపును నింపించి, వారిలో ఉన్న నీకు నిజమైన నివేదనను చేయించావు! ధన్యురాలిని తండ్రీ!!’, అంటూ ఆలయం వైపుకి తిరిగి రాధామాధవుడికి మనస్ఫూర్తిగా నమస్కరించింది తులసి. 

మరి కొద్దిరోజులలో మందార పూమొగ్గ అందమైన పువ్వుగా విచ్చుకుంది! ఆ సంఘటన జరిగిన నెలలోపు తులసి గర్భందాల్చి ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. 

శ్రీపతి, అప్పుడే పుట్టిన తమ బిడ్డను తులసి చేతిలో పెట్టాడు. 

లేకలేక కలిగిన తన బిడ్డను ఎత్తుకుని, ఆనందభాష్పాలు నిండిన కళ్ళతో, "ఆహా! వీడు ఆ రాధామాధవుడి ప్రసాదం!! నా నివేదనను కరుణతో స్వీకరించి, నా మనోవేదనను ఇన్నాళ్టికి దూరం చేసిన ఘనత ఆ పరమాత్ముడికే దక్కుతుంది!", అని అంటూ ఆ బిడ్డను ముద్దాడి తన గుండెలకు హత్తుకుంది తులసి.

ఆపై తులసి ఆకలంటూ తమ ఇంటికి వచ్చిన వారిని ప్రేమతో ఆదరించి, వారి కడుపునిండా తృప్తిగా అన్నం పెట్టడం అలవాటు చేసుకుంది!

No comments:

Post a Comment

Pages