లోకల్ రాక్షసి - అచ్చంగా తెలుగు
 లోకల్ రాక్షసి 
పి.ఎస్.ఎం.లక్ష్మి
(MyBigBreak సంస్థ వారు నిర్వహించిన సంక్రాంతి కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ ) 
 

                                                            
పేరేమిటా కొత్తగా వుంది అనుకుంటున్నారా? మా కాలనీలో రాధమ్మ అనో, గోపాలంగారి భార్య అనో, కుమారీ వాళ్ళ అమ్మ అనో అంటే ఆవిడేనని ఎవరికీ తెలియదు.  కానీ లోకల్ రాక్షసి అంటే మాత్రం రెండేళ్ళ పిల్లలు దగ్గరనుంచీ ఆవిడనే చూపిస్తారు.  ఇంతకీ ఆవిడ అంత రాక్షసి ఎలా అయిందో తెలుసా?

అసలు మా రాధమ్మ చాలా మంచిదండీ.   రాధమ్మలాగానే బతుకుతుంది.  అయితే కాలనీలో ఎవరైనా ఎప్పుడైనా ఎదవ్వేషాలు వేస్తే వాళ్ళింటికెళ్ళి మరీ కడిగి పారేస్తుంది.  రాజకీయ నాయకులు వాళ్ళ వాళ్ళ కీచులాటల మధ్య ప్రజలని పట్టించుకోవటంలేదు.  ఎవరో వచ్చి మనకేమీ చెయ్యరు.  కనీసం మన కాలనీ సంగతన్నా మనం చూసుకుందాం అంటుంది.  అందర్నీ కూడగట్టుకుని అవసరానికి ఆదుకుంటుంది.  కాలనీలో ఎవరు తప్పటడుగు వేసినా క్షమించదు. అందుకే మా కాలనీలో ఎవరైనా చెత్త పనులు చెయ్యటానికి దడుస్తారు.   అంత పేరున్న ఆవిడ  కన్నయ్యగాడు చేసిన ఆ దరిద్రప్పనికి లోకల్ రాక్షసి గా మారిపోక వూరుకుంటుందా!?   

ఇంతకీ కన్నయ్య ఏం చేశాడంటారా?  కన్నయ్యగాడు నిజంగా దరిద్రుడండీ.  అంటే డబ్బుల్లేవని కాదు.  గవర్నమెంటు ఆఫీసులో పని చేస్తున్నాడు.  నెల నెలా జీతం వస్తుంది.  పెళ్ళాం, ఇద్దరు పిల్లలు.  నాన్న ఇచ్చిన ఆస్తి సొంత ఇల్లుంది.  ఇంకేం దొబ్బుడాయి చెప్పండి.  హాయిగా బతకచ్చుగా అంటారా?  వాళ్ళకేం?   వాళ్ళు హాయిగానే బతుకుతున్నారు. కన్నవాళ్ళనే అన్యాయం చెయ్యాలని చూశాడు.  

అసలేమయిందంటే, కన్నయ్య తండ్రి రామయ్య ఎక్కువ చదువుకోలేదు. ఒక ప్రైవేటు స్కూల్లో ప్యూన్ గా పని చేశాడు.  కన్నయ్య తల్లి రాములమ్మ కూడా ఒక ప్రైవేటు ఆఫీసులో ప్యూన్ గా చేసింది.  పిల్లలు కన్నయ్య ఒక్కడే.  దానితో వచ్చినదానిలో వాణ్ణి గారాబంగా పెంచటమేగాక  మేమెటూ చదువకోలేక చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నాం, మా కొడుకైనా పెద్ద చదువు చదివి, మంచి ఉద్యోగం చెయ్యాలని మంచి స్కూల్లో, కాలేజ్ లో చేర్పించి బాగా చదివించారు.  ప్రస్తుతం ఇద్దరూ 70 ఏళ్ళు దాటినవాళ్ళే.  కష్టపడి పైకొచ్చినవాళ్ళు. పిల్లాడు ఎదిగేసరికి సొంత గూడు కావాలని వచ్చినదానిలో వాళ్ళకోసం ఏం చేసుకోకుండా, కనీసం మంచి తిండయినా తినకుండా పైసా పైసా కూడబెట్టి ఒక చిన్న ఇల్లు కూడా కట్టించారు.  కట్టుకున్న ఇల్లు కూడా గారాబం కొద్దీ కొడుకు పేరనే పెట్టారు.  కొడుకుని ఒక స్ధాయికి తీసుకొచ్చేసరికి వాళ్ళకంటూ ఏమీ మిగుల్చుకోని అమాయకులు.  అన్నింటి బదులూ కొడుకున్నాడుకదా  చాలనుకున్నారు.  

కన్నయ్యకేం మాయరోగం చెప్పండి.  తల్లిదండ్రుల బుధ్ధి కొంచెమైనా రాలేదు. కడుపు కట్టుకుని అన్నీ అమర్చిన తల్లిదండ్రులకి తనేం అమర్చక్కరలేకపోయినా తిండి పెట్టటం కూడా పెద్ద భారమనుకున్నాడు.  వాడికేం తక్కువయింది?  అల్లారు ముద్దుగా పెరిగాడు.  కోరిన పిల్లని పెళ్ళి చేసుకున్నాడు.  నికరమైన ప్రభుత్వ ఉద్యోగం.  తల్లీ, తండ్రీ తప్ప వేరే బాధ్యతలేమీలేవు.  రామయ్య, రాములమ్మ సాదా సీదాగా, హుందాగా, వుంటారు.  వాళ్ళ సంగతేమిటో వాళ్ళకిగానీ, ఎవరిగురించీ అనవసరంగా పట్టించుకోరు.  కొడుకు సంసారంలో కూడా జోక్యం కల్పించుకోరు.  వాళ్ళ సంసారం, వాళ్ళిష్టం అంటారు.  అంత మంచి తల్లిదండ్రులని ఒక రోజు పొద్దున్నే రెండు బేగుల్లో వాళ్ళ బట్టలు సర్ది చుట్టాలింట్లో పెళ్ళికి పంపుతున్నానని అడిగిన వాళ్ళకి చెప్పి, బైకు మీద ఎక్కించుకుని, దూరంగా వున్న కాలనీలో రోడ్డు మీద దిగబెట్టి, సంచీలు ఫుట్ పాత్ మీద పడేసి, తల్లిదండ్రుల బాధ్యత తీర్చుకుని చక్కా తిరిగి వచ్చి మామూలుగా కుటుంబంతో టీవీ చూస్తూ కూర్చున్నాడు కన్నయ్య.

పాపం  ఆ ముసలివాళ్ళకి ఎక్కడికెళ్ళాలో తెలియలేదు.  బేగులెవరన్నా తీసుకుపోతే బట్టలు కూడా వుండవని బేగులు రెండూ తీసుకుని ఒళ్ళో పెట్టుకుని ఫుట్ పాత్ మీదే కూర్చున్నారు.  కొడుకు రంధిలో పడి చుట్ట పక్కాలతో సరైన బంధుత్వాలు కూడా పెట్టుకోలేదు.  కొడుకు ఖచ్చితంగా తను వాళ్ళని చూడలేననీ, తన ఇంటికి రావద్దనీ చెప్పాడు.  కొడుకు ద్వారా కావాల్సినవి చేయించుకోవటమేగానీ, ఎప్పుడూ అత్తా మామతో ఎక్కువ మాట్లాడని కోడలు ప్రమేయం దీనిలో వుండదని వాళ్ళనుకోలేదు.  పిల్లలా చిన్నవాళ్ళు.  నానమ్మా, తాతయ్యా, ఎదురుగా వుంటే ప్రేమగా మాట్లాడతారుగానీ,  తల్లిదండ్రులని ఎదిరించి ఏదైనా చేసే వయసు వాళ్ళకి లేదు. 

వాళ్ళకి ఈ పరిస్ధితుల్లో తమని  ఆదరించే వాళ్ళెవరని ఆలోచించగా తట్టిన వ్యక్తి అప్పటికే లోకల్ రాక్షసిగా పేరుపడ్డ రాధమ్మ.  కాలనీ మంచి కోసం ఆవిడ పాటుపడుతుంది అని వాళ్ళకి తెలుసు.   పిల్లాడి చిన్నప్పటినుంచీ వాడి విషయంలో ఏదైనా సలహా కావాల్సివస్తే ఆవిడనే అడిగేవారు, కాస్త చదువుకున్నదీ, లోక జ్ఞానం కలదీ అని.  అందుకే ఆవిడ ఫోన్ నెంబరు తెలుసు వాళ్ళకి. ఆవిడకి చెబితే కొడుకేమనుకుంటాడో!?  కాలనీలో వాడి పరువు పోతుందేమో?  అయినా ఈ వయస్సులో మనమెక్కడికి వెళ్తాము?    తినో తినకో కొడుకు పంచన కడతేరాల్సిందేగానీ... మనం కట్టిన ఇల్లుకదా, ఒక గది అన్నా మనకిమ్మందాం.  మా ఆఫీసు వాళ్ళని మళ్ళీ గదులూడ్చే పనిలో పెట్టుకోమని అడుగుతాను.  ఇంత గంజినీళ్ళైనా తాగి గుట్టుగా బతకచ్చు రాములమ్మ సలహా.   గంటసేపు చర్చించుకున్న తర్వాత తప్పని సరై ఎవరిదో ఫోన్ తీసుకుని రాధమ్మకి ఫోన్ చేసి తమ పరిస్ధితి చెప్పారు.  

రాధమ్మ వాడు తీసుకెళ్తే మాత్రం మీరెందుకు వెళ్ళారు?  ఇక్కడే నాకు చెప్పి వుండచ్చుగా?   ఇల్లు కొడుకు పేరున పెట్టద్దన్నానందుకే అని మందలించింది.  ఒక నిముషం ఆలోచించి, మీరు వెంటనే ఆటో ఎక్కి మా ఇంటికి రండి..నేను చూసుకుంటాను, అని భరోసా ఇచ్చి,   ఫోన్ ఇచ్చిన ఆయనతో కూడా మాట్లాడి, ఆయనకి కూడా ధన్యవాదాలు చెప్పి ఆటో మాట్లాడి ఎక్కించమని సహాయం అడిగింది.  దానితో కొంత సేపటి తర్వాత రామయ్య, రాములమ్మ  రాధమ్మ ఇంటిముందు బేగులతో సహా ఆటో దిగారు.  

అప్పటికే ఇంకో నలుగురు పెద్ద మనుషులను పిలిచి సంగతి చెప్పింది రాధమ్మ.  మన కాలనీలో ఇలాంటి సంగతులు జరగటానికి వీల్లేదు.  ఇవాళ కన్నయ్య అయ్యాడు ఈణ్ణి చూసి రేపింకో గున్నయ్య తయారవుతాడు.  ముందే మనం కాచుకోవాల.  అందరం కలిసి వెళ్ళి అడుగుదాం.  కాలనీకి ఒక కట్టుబాటు వుండాల అంది.  రామయ్య, రాములమ్మతో సహా కన్నయ్య ఇంటికెళ్ళారు అంతా.

కన్నయ్య, భార్య, ఇద్దరు పిల్లలు కలిసి టీవీ చూస్తున్నారు.  బయటనుంచే గర్జించింది రాధమ్మ.  ఆ టీవీ కట్టేసి అందరూ ఒకసారి బయటకి రండి అని.  టీవీ కట్టేసి అంతా వచ్చారు కానీ వరండాలో పెద్ద మనుషులను చూసి పిల్లలిద్దరూ లోపలకి వెళ్ళబోయారు.  వాళ్ళని ఆపింది రాధమ్మ.  మీరు కూడా వుండండిరా.  మీకూ తెలియాలి, మీరూ అర్ధం చేసుకోవాలి అంటూ.  తర్వాత కన్నయ్యనడిగింది.  “ఏమయ్యా మీ అమ్మా నాన్నని ఎవరి పెళ్ళికి, ఏ ఊరు పంపించావు?  శుభలేఖ, అడ్రసు సరిగా ఇవ్వకపోతే వాళ్ళెట్టా వెడతారనుకున్నావు.?” అని.  

కన్నయ్య నీళ్ళు నమిలాడు.  సమాధానం చెప్పలేక పోయాడు.  అందరూ మౌనంగా చూస్తున్నారు.  ఇంక మొదలు పెట్టింది మా లోకల్ రాక్షసి.

“కన్నయ్యా, నీ తల్లిదండ్రులు నిన్ను బాగా పెంచారా లేదా  సమాధానం చెప్పు” .. మాట్లాడకుండా వూరుకున్న కన్నయ్యని గద్దించి మరీ అడిగింది.  

“చూశారు” అని చెప్పాడు కన్నయ్య. 

 “బీదోళ్ళంలే అని మామూలు స్కూల్లో చదివించారా లేకపోతే మంచి స్కూల్లో, కాలేజీలో చదివించారా?  నువ్వు కోరుకున్న చదువు చెప్పించారా లేదా?”  

 “చెప్పించారు”  నంగిగా సమాధానం చెప్పాడు కన్నయ్య.  “అంత నెమ్మదిగా కాదు అందరికీ వినబడేటట్లు చెప్పు” మళ్ళీ గర్జన.  దెబ్బకి సమాధానం అందరికీ వినబడింది.  

 “మరి ఆ చదువుతోనే కదా నీకు సర్కారు ఉద్యోగం వచ్చింది.   లేకపోతే వాళ్ళకిమల్లే ఎక్కడో చిన్న ఉద్యోగం చేసుకుంటూ వుండేవాడివి కదా?”  సమాధానం  “అవును.”

ఈ ఇల్లు కూడా వాళ్ళు కట్టుకుందే కదా.  దీన్నికూడా నీ పేరే పెట్టారుకదా.”  దీనికి సమాధానం మాత్రం వెంటనే రాలేదు.   ఈవిడతో మాట్లాడలేం.  దేనికీ దేనికీ మెలిక పెడుతుందో అని తికమకపడి, పెళ్ళాం వంక చూసి ఇంక తప్పదని అవునని చెఫ్పాడు సమాధానం. 

 “నీ పిల్లలకి నువ్వేమయినా కట్టించావా?”

 “లే.  నాకెక్కడ చేతవుతుంది?  అయినా ఈ ఇల్లు వుందిగా!”

“ఈ ఇల్లేం నువ్వు కట్టించావా?  మీ అమ్మా నాన్నలు కట్టించారు.  ఆ సంగతి మా అందరికీ తెలుసు.  చిన్న జీతాలు తెచ్చుకున్న మీ అమ్మా నాన్నకే చేతయినప్పుడు నీకెందుకు చేతకాదు.  అంటే నువ్వు నీ కుటుంబం సినిమాలు చూస్తూ, హోటళ్ళల్లో తింటూ ఇష్టమొచ్చినట్లుండాలి.  తినీ తినకా నీ కింత చేసి, ఈ ఇల్లు ఇచ్చిన అమ్మా నాన్నలకి  మాత్రం పిడికెడు అన్నం పెట్టలేక రోడ్డుమీద వదిలేసి వస్తావా?   మీ అమ్మా నాన్నా కూడా నిన్ను చిన్నప్పుడు పెంచలేమని, చదువు చెప్పించలేమని, ఏ గవర్నమెంటు హాస్టల్ లోనో పడేస్తే నువ్విప్పుడెక్కడ వుండేవాడివి.  అయినా వాళ్ళు పిచ్చోళ్ళయి బయటకెళ్ళారుగానీ అసలు బయటకెళ్ళాల్సింది నువ్వూ, నీ కుటుంబం.  ఇది వాళ్ళ ఇల్లు.  వాళ్ళని తరిమెయ్యటమేగాక నీ పిల్లలకి కూడా ఈ ఇల్లు వుందంటావా?  మనిషివేనా నువ్వు?  అసలు నువ్వు కాదురా దీనికి సమాధానం చెప్పాలింది. అని పిల్లల్ని పిలిచింది.

 “ఒరేయ్ పిల్లలూ, ఇలా రండి.  మీకూ పదేళ్ళు దాటాయి.  మంచీ చెడ్డా తెలుస్తోంది.  నాన్న నానమ్మనీ తాతయ్యనీ బయట వదిలేయటం సరైన పనేనా?”

“కాదాంటీ” పిల్లలిద్దరూ ఒకేసారన్నారు.  

“మరయితే మీరేమనుకుంటున్నారో చెప్పండి.  ఈ కాలంలో పిల్లలకి పెద్దవాళ్ళని మించిన తెలివితేటలుంటున్నాయి.”

“నాన్న వాళ్ళని వదిలేస్తున్నాడని మాకప్పుడే తెలుసు.  మేమిద్దరం అప్పుడే అనుకున్నాము.  మేమూ పెద్దవాళ్ళమయ్యాక మా అమ్మా నాన్నలకి అన్నం పెట్టకూడదనీ, అలాగే రోడ్డు మీద వదిలేసి రావాలని.  అప్పుడు నానమ్మనీ తాతయ్యనీ ఇంటికి తెచ్చుకోవాలనీ డిసైడ్ చేసుకున్నాం.  ఇప్పుడు నాన్న వూరుకోడుకదా.”

వాళ్ళ సమాధానానికి ఖంగు తిన్నారు కన్నయ్య దంపతులు.

“చూడరా వాళ్ళకున్న బుధ్ధి నీకు లేదు.  పెద్దవాళ్ళని చూసే పిల్లలు నేర్చుకుంటారంటారు.  నువ్వు నీ తల్లిదండ్రులను చూసి నేర్చుకోకపోయినా, నీ పిల్లలు నిన్ను చూసి నేర్చుకుంటారులే.  ఈ కాలం పిల్లలుకదా.”  అని కన్నయ్యకి బుధ్ధిచెప్పి మళ్ళీ పిల్లలని “మీరు పెద్దవాళ్ళయ్యేదాకా ఆ ముసలాళ్ళు ఆ రోడ్డు మీద వుండలేరుగానీ ఇప్పుడు మీ ఇంట్లో వుంటే మీరు వాళ్ళు తిన్నారో లేదో చూస్తారా?  అమ్మా, నాన్నా వాళ్ళనేమనకుండా చూస్తారా?” అని అడిగింది.  

“తప్పకుండా ఆంటీ.  నానమ్మా, తాతయ్యా అంటే మాకు చాలా ఇష్టం.  వాళ్ళు మాకు కధలు చెబుతారు..బోలెడు కబుర్లు చెబుతారు.  వాళ్ళు లేకపోతే మాకు బాగాలేదు. ఇక్కడుంటే వాళ్ళకి అన్నం మేమే పెడతాము.  వాళ్ళయితే ఒక్కోసారి మేమెంతో బతిమాలితేగానీ అన్నంకూడా తినరు.  ఎందుకో మాకు తెలియదు.  ఇంకనుంచీ వాళ్ళు తిన్నాకే మేము తింటాము.  అమ్మా, నాన్నా వాళ్ళనేమన్నా అంటే మీకొచ్చి చెబుతాం.  వాళ్ళనిక్కడే వుంచండి.”  పిల్లలిద్దరూ చెరో మాటా చెప్పినా, ఒకే అభిప్రాయం వెలిబుచ్చారు.

పిల్లల తీర్పుకి ఇంకెవరూ ఏమీ మాట్లాడలేక పోయారు కన్నయ్యతో సహా.  వచ్చిన వాళ్ళు మౌనంగానే ఆ సభకు సాక్ష్యం చెప్పారు.  

చూశారా మా లోకల్ రాక్షసి పరిష్కారం.  చిన్న పిల్లలతో తీర్పు చెప్పించేసింది.   కాలనీకొకళ్ళు ఇలాంటివాళ్ళు వుండాలి కదూ.

No comments:

Post a Comment

Pages