నెత్తుటి పువ్వు - 31 - అచ్చంగా తెలుగు

                                                          నెత్తుటి పువ్వు - 31 

మహీధర శేషారత్నం


ఊ! నా అవసరం తీరిపోయింది అమ్మాయి గారికి. ఇంక నేనెందుకు?” కోపం నటించాడు నాగరాజు. 

“అబ్బో! కోపాలే! ఎవరైనా నా రాజుబాబు తరువాతే” చటుక్కున అతని బుగ్గమీద ముద్దు పెట్టుకుంది.

ఆరాటంగా అతనే దగ్గరకు లాక్కున్నాడు. మంచంమీద విశ్రాంతిగా కూర్చున్నాక నెమ్మదిగా శంకరానికి తను ఫోన్ చెయ్యడం, రేవతిని కలవడం, శంకరం తమ ఇంట్లో ఒక గదిలో ఉండమనడం అంతా చెప్పింది.

నాగరాజు మౌనంగా విన్నాడు ఏమీ మాట్లాడలేదు, ఏమిటి? ఇష్టంలేదా? మాట్లాడవు! వద్దంటే వద్దు ఆలోచనెందుకు?” భుజాలు కుదుపుతూ అడిగింది. నిజానికి నా కిష్టంలేదు, ఇబ్బందిగా ఉంటుంది. శంకరం భార్య పార్వతి లక్ష్మికి స్నేహితురాలు. నేను లక్ష్మి మొగుడినని తెలిసిన వ్యక్తి దగ్గర ఉంటే నేను ఎలా రాగలను రోజా! నన్ను చూడకుండా నువ్వు ఉండగలవేమో కాని నేను ఉండలేను. నీ ఇష్టం.. ముభావంగా అన్నాడు.

“నేనూ అదే ఆలోచించాలే! నువ్వు లేకుండా, రాకుండా ఎలా?” ... దిగులుగా అంది సరోజ.

“చూద్దాంలే! అప్పుడే ఉంటాననీ, ఉండననీ ఏం చెప్పకు. నేను శంకరంతో మాట్లాడతాను” వచ్చినప్పటి ఉ త్సాహం తగ్గింది నాగరాజులో లేచాడు వెళ్తానంటూ.

“ఇదుగో! ఇంక ఆలోచించమాకు నే వెళ్ళట్లే! సరేనా? నవ్వు..” కితకితలు పెట్టింది సరోజ బలవంతంగా నవ్వాడు నాగరాజు.

“అబ్బే! అదేం నవ్వు! నవ్వంటే ఎలా ఉండాలి? జల్లున జాజిపూలు రాలినట్లుండాలి..” కితకితలు పెడుతూ అంది.

“ఆఁ! మాటల బలే నేర్చావు? నాకెంత ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళ దగ్గర చూద్దాంలే! నెలలు నిండొచ్చినప్పుడు ఆలోచిద్దాం... ఇంకో నాలుగు నెలలు గడిచాక ...” లేస్తున్న నాగరాజుని మంచంమీద కూలేసి అల్లుకుపోయింది. నాగరాజు మామూలు మూడ్లోకి వచ్చేశాడు.

పొద్దున్నే నాగరాజుకి కాఫీ ఇస్తూనే నోటికి కొంగు అడ్డుపెట్టికొని లక్ష్మి పెరట్లోకి పరిగెట్టి కక్కుకుంది. వెనకాలే కంగారు వచ్చిన నాగరాజు గబగబా కప్పుపక్కనపెట్టి రెండు చెవులూ మూసాడు. లక్ష్మి పూర్తిగా కక్కుకొని లేవలేక అక్కడే ఒక నిమిషం నిలబడింది. గబగబా మగ్గుతో నీళ్ళుతెచ్చి లక్ష్మి నోరు కడుక్కున్నాక మెల్లిగా లోపలికి తీసుకొచ్చి కూర్చోపెట్టి ఫ్యాన్ వేసాడు రిలాక్స్ అవు అంటూ.

“నాకేం ఫరవాలేదు కాఫీ చల్లారిపోతుంది, తెచ్చుకు తాగండి.” 

కాఫీ తాగుతూ “ఏమైంది లక్ష్మీ రాత్రి ఏం తిన్నావు? ఏదైనా పడలేదా?” అన్నాడు. 

“ఏం లేదు మామూలే” అంది నవ్వుతూ 

“వాంతులవడం మామూలేమిటి? ఏమైనా డైజేషన్ ప్రాబ్లమా?” వదలలేదు నాగరాజు. 

“కాదు మహానుభావా! మీరు మళ్ళీ తండ్రి కాబోతున్నారు అంది నవ్వుతూనే. నాగరాజు ఉలిక్కిపడ్డాడు.

“నీకెలా తెలుసు?” అన్నాడు ఆశ్చర్యంగా సరోజకి విషయం మనసులో మెదులుతుండగా “నా మొహం నాకు కాకపోతే మీకు తెలుస్తుందా?” అంది సిగ్గుగా.

నాగరాజుకి అర్థమైంది అమ్మయ్య అనుకున్నాడు కాని మనసులో కాస్త కించపడ్డాడు. ఇద్దరినీ సంబాళించుకోవాలి అనుకున్నాడు మనసులో నవ్వు తెచ్చుకుని “డాక్టరు దగ్గరకు వెళదామా?” అన్నాడు.

“నిన్న పక్కింటి పిన్న గారిని తీసుకుని వెళ్ళి వచ్చాను. రెండు నిండాయని చెప్పింది.”

పెరుగుతున్న సంసార భారానికి కొంచెం భయపడ్డాడు నాగరాజు. ఈ ఎపిసోడ్తో ఎవరికీ చెప్పకుండా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్నాడు.

*****

“కడుపుతో ఉన్న వాళ్ళకి ఏవో కోరికలుంటాయిగా నీకేం కోరిక ఉంది.” చిన్నగా సరోజ పొట్టమీద రాస్తూ అడిగాడు నాగరాజు.

“నీతో కలిసి సినిమా చూడాలని ఉంది.” టక్కున అంది సరోజ తడుముకోకుండా. 

“ఓస్ అంతేనా! ఇంకా పెద్ద కోరికలేవో కోరతావనుకున్నాను.” అన్నాడు జేబులోంచి చిన్న పొట్లం తీస్తూ! 

“ఏమిటది?” కుతూహలంగా అడిగింది సరోజ. 

పొట్లం విప్పి సన్నటి బంగారు గొలుసు తీసాడు, తీసి సరోజ చేతికిచ్చాడు. 

“చూడు ఎలా ఉందో! “

చాలా బాగుంది మీ ఆవిడకా!” కొంచెం ఆశగా, కొంచెం ఆరాటంగా అడిగింది

“అవును, చీటీ పాడాను ఆ డబ్బుతో కొన్నాను, ఎలా ఉంది?” ఓరగా ఆమె మొహంలోకి చూస్తూ అడిగాడు. 

సరోజ మొహం కొంచెం చిన్నబోయింది. కాని ఏమీ మాట్లాడలేదు. 

“ఏమిటి? బాగాలేదా?” రెట్టించాడు. 

“చెప్పానుగా చాలా బాగుందని, అయినా నచ్చాల్సింది మీ ఆవిడకి, నాకు కాదు."

 “ఓహో! అలాగా! నేను మా ఆవిడనే అడుగుతున్నాననుకుంటున్నాను” హాస్యంగా అన్నాడు. 

ఒక్క క్షణం సరోజకి అర్ధం కాలేదు, అర్ధం అయ్యాక ఆ అమ్మాయి మొఖం మతాబులా వెలిగింది.

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages