ఈ దారి మనసైనది - 37 - అచ్చంగా తెలుగు

ఈ దారి మనసైనది - 37 

అంగులూరి అంజనీదేవి  


(జరిగిన కధ: మెడికల్ కాలేజీలో కొత్తగా చేరిన అనురాగ్ తొలి చూపులోనే దీక్షిత కళ్ళలో తనను తాను కోల్పోతాడు. ఆమెకు చేరువ కావాలని ఆరాట పడుతూ ఉంటాడు. అదే కాలేజీలో చేరుతుంది మన్విత. చూస్తుండగానే మెడిసిన్ మొదటి ఏడాది పూర్తవుతుంది. అనురాగ్ అంటే తనకున్న ఇష్టాన్ని, బయట పడనివ్వకుండా చదువు మీదే దృష్టి పెడుతుంది దీక్షిత, అందుకు కారణం ఆమె చాలా పేద కుటుంబం నుంచి కష్టపడి చదివి మెడికల్ కాలేజి దాకా రావడమే. అతి కష్టం మీద మెడిసిన్ లో సీటు సంపాదించి. పట్టుదలగా చదువుతూ ఉంటుంది ఆమె. దీక్షిత, అనురాగ్ కాలేజిలో కలిసి లాబ్ కు వెళ్తారు. తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మన్విత. మన్విత, అనురాగ్ లు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటారు. అనురాగ్ తల్లి ప్రియబాంధవి మన్విత పట్ల ప్రత్యేక వాత్సల్యం చూపిస్తూ ఉంటుంది.  జాతరకు వెళ్తారు, దీక్షిత, మన్విత, అనురాగ్, మిత్రులు. దీక్షితతో అనురాగ్ సన్నిహితంగా ఉండడాన్ని భరించలేకపోతుంది మన్విత. పల్స్ ప్రోగ్రాం టూర్ కి ఢిల్లీ, ఆగ్రా టూర్ వెళ్లి, ముగించుకుని తిరిగి వస్తారు. మెడికల్ కాలేజీ ఎక్సిబిషన్ కి వచ్చిన అనురాగ్ తల్లిదండ్రులకు అంతా తిప్పి చూపిస్తుంది దీక్షిత. ఆత్మహత్య చేసుకోబోయిన మన్విత,  కాపాడబడి, కోలుకుని, కాలేజికి వస్తుంది.)

ఏ అప్యాయత లేకుండా, ఏ అనుభూతి లేకుండా ఎలా బ్రతకడం? తల్లి ప్రేమ లేక... అనురాగ్ ప్రేమ లేక... తనెప్పటికీ ఇంతేనా? మన్వితకి అనురాగ్ కన్పిస్తూన్నాడేకాని.... మాట్లాడే సందర్భాలు తక్కువగా వస్తున్నాయి. కారణం అతని పక్కన కన్పించే దీక్షితే. ఉన్న టైమంతా అమెతోనే స్పెండ్ చేస్తున్నాడు. 

ఒకప్పుడు అలా వుండే వాళ్లను ప్రేమికులు' అనుకునేవాళ్లు. ఇప్పుడలా అంటే ఒప్పుకోరు. సబ్జక్ట్ డిస్కర్షన్లో వున్నారు. అలా డిస్కర్షన్ చేసుకుంటూ కెరీర్లో ఎదిగాక కావాలంటే పెళ్లి చేసుకుంటారు. లేదంటే ఎవరిదారి వాళ్లది అని అనుకుంటారు. మెడిసిన్ చేసేవాళ్లలో తరుచుగా విన్పించే మాటలివి... కానీ వాళ్లిద్దరి మధ్యన 'ప్రేమ' నడుస్తుందని తెలిసినప్పటి నుండి అనురాగ్ ఎక్కడ కన్పించినా బాధగా వుంది అది ప్రేమ వల్లనో లేక దీక్షితను ప్రేమిస్తున్నాడన్న బాధ వల్లనో తెలియదు. అతను గుర్తురాని క్షణం లేదు.

మన్విత మనసు ఇలా పరిగెత్తి, పరిగెత్తి, అలసిపోయి ఒంటరిగా మారినప్పుడు సంజన స్నేహం తోడై ... ఓదార్పుని, మనో బలాన్ని ఇచ్చి కొద్ది, కొద్దిగా మనిషిని చేస్తోంది.

సెకండియర్ పూర్తయి ... థర్డ్ ఇయర్ లోకి వచ్చారు.

థర్డ్ ఇయర్లో ఆప్తాల్మాలజీ, ఇ. ఎన్.టి., కమ్యూనిటి మెడిసిన్ సబ్జక్ట్లు వున్నాయి. .

అందరు అతి శ్రద్దగా, కష్టపడి చదువుతున్నారు. రోజులు క్షణాల్లా మారుతుంటే ... 

ధర్ట్ ఇయర్ పూర్తయి .. ఫోర్త్ ఇయర్ కి వచ్చారు.

* * * 

ఫోర్త్ ఇయర్ లో ... జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పిడియాట్రిక్స్, గైనకాలజి, ఆప్స్ప్రెడిక్స్ సబ్బర్ట్లు వున్నాయి. కష్టపడి చదవకపోతే ఏ సబ్జక్ట్ ఫెయిల్ అయినా ఆరునెలలు గ్యాప్ అయినా వస్తుందన్న భయం అందరిలో వుంది. కానీ... అందరు ముందుకెళ్లలేరు.

మెడిసిన్ ఒక మహాసముద్రం ... లోతు తెలియకుండా బయట నిలబడి చూస్తే చాలా తేలికనిపిస్తుంది కాని, దిగాక తెలుస్తుంది ఆ చదువు పూర్తికావటానికి ఎంత టైం కావాలో, ఎన్ని అవరోధాలను, ఎన్ని ఆటంకాలను తట్టుకోవాలో, ఎంత డబ్బు అవసరమవుతుందో ఎంత హార్డ్ వర్క్ చెయ్యాలో ... లోగడ వాళ్లతో చదివిన వాళ్లు బి. టెక్ లు, డిగ్రీలు పూర్తి చేసి జాబ్స్లో సెటిల్ అయివున్నా ... వీళ్లు మాత్రం మెడిసిన్ చదువుతూ - ఏ మాత్రం టాలెంట్ లేకపోయినా వెనకబడి చదివిందే చదువుతూ కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటారు.

ఆ మహా సముద్రంలో ఈదేవాళ్లు ఈదుతుంటారు. బయట పడేవాళ్లు బయట పడ్తుంటారు.

అనురాగ్, దీక్షిత, మన్విత, సంజన ఫోర్త్ ఇయర్ పాసయ్యారు.

మిగిలిన వాళ్లలో కొంత మందికి కొన్ని సబ్జెక్ట్ పోయి గ్యాప్ వచ్చింది.

***

ఫోర్త్ ఇయర్ పాస్ అయ్యాక...

టెంపరరీ ప్రొవిజనల్ సర్టిఫికేట్, మార్క్స్ మెమో తీసుకుని కాకతీయ మెడికల్ కాలేజీ నుండి బయట కొచ్చారు అనురాగ్, దీక్షిత, మన్విత, సంజన ... 

మెడిసిన్ లో భాగంగా హౌస్ సర్జన్ కోసం ఎం.జి.ఎం. హాస్పటల్ లో జాయిన్ అయ్యారు. అక్కడ జాయిన్ అయిన వెంటనే ... అక్కడికి దగ్గర్లో - ప్రాంతీయ నేత్ర వైద్యశాలకి ఎదురుగావున్న పి.జి&సర్జన్స్ హాస్టల్లో దీక్షిత, మన్విత, సంజన జాయిన్ అయ్యారు.

మన్విత, సంజన కింద ఫ్లోర్లో - రూం నెంబర్ 2 లో వుంటే, దీక్షిత మాత్రం పైన ఫ్లోర్లో రూం నెంబర్ 25 లో వుంటుంది. హౌస్ సర్జన్ లతో ఆ రూములన్నీ నిండిపోయాయి. రూంకి ఇద్దరుంటారు. 

ఆ హాస్టల్ మొత్తం సెరామిక్ టైల్స్తో నీట్గా వుంటుంది. ఎంట్రన్స్ లోంచి లోపలకి వెళ్లగానే డైనింగ్ హాల్ ... అందులో డైనింగ్ టేబుల్స్ వాటి పక్కనే ఫైబర్ చెయిర్స్, గోడకి ఎల్.సి.డి టి.వి అందంగా దర్శనమిస్తాయి. "

హౌస్ సర్జన్లు - డైనింగ్ హాల్లో వున్నంత సేపు చాలా ఉల్లాసంగా కబుర్లు చెప్పుకుంటూ.... జోక్లు వేసుకుంటూ ఆ రోజు డ్యూటి తాలుకు విషయాలను చర్చించుకుంటూ గడుపుతారు

***

ఆ హౌస్ సర్జన్లకి ఆ హాస్పటల్లో ... డాక్టర్లు, పేషంట్లు, ఆపరేషన్లు కొత్త కాదు.

విద్యార్థులుగా వున్నప్పుడు ... వాళ్లంతా ఎన్నో కేసుల్ని పరీక్ష చేసి ప్రొఫెసర్ ముందు సబ్ మిట్ చేసివున్నారు. ఇప్పుడు ఇంకా తెలుసుకోవాలన్న ఆరాటంతో ఎవరికివాళ్లు ఉత్సాహంగా వున్నారు ఎన్నో సంఘటనలు, అనుభవాలు ఎదురువుతున్నాయి.

హాస్పటల్లో మొదట హౌస్ సర్జన్ రౌండ్స్ తర్వాత, అసిస్టెంట్ రౌండ్స్, వొంటి గంటకు చీఫ్ రౌండ్స్ వుంటాయి.

మన్వితలో - మెడిసిన్ మీద శ్రద్ధాసక్తి వున్నందువల్ల హౌస్ సర్జన్ పీరియడని ముఖ్యమైనదిగా భావించి .... కొత్తకేసుల్ని చూడాలన్నా, వాటిని స్టడీ చేయాలన్నా ఉత్సాహం చూపుతోంది. హౌస్సర్జన్ రౌండ్స్లో పేషంట్లను బాగా గమనిస్తూ, వాళ్ల ప్రాబ్లమ్స్ అవగాహన చేసుకుంటోంది. 

కేవలం హౌస్ సర్జన్ స్టేజిలోనే అన్ని సబ్జెక్ట్లలోని కేసులు డీల్ చేసే అవకాశం వుంటుంది. కానీ పి.జి (PG) కి వచ్చాక ఏ పి.జి వచ్చిందో దానికి సంబంధించిన కేసులు మాత్రమే చూడాల్సి వస్తుంది. కాబట్టి మన్విత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకొంది. సందర్భం వచ్చినప్పుడు ... తోటి సర్జన్లతో వాళ్ల వార్డులో ముఖ్యమైన కేసులు ఏమున్నాయో వాటి వివరాలు అడిగి తెలుసుకుంటుంది. 

ఉదయాన్నే - టిఫిన్ చేసి మన్విత ఎం.జి.ఎం. హాస్పటల్ కి వెళ్లింది. ఎప్పటిలాగే అటెండెన్స్ రిజిష్టర్లో సంతకం పెట్టి ముందుగా పిల్లల వార్డులోకి వెళ్లింది. అక్కడ రౌండ్స్ అయ్యాక... ఎదాప్రకారం పిల్లలకి ట్రీట్ మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత అమెదే అవడంతో .... ఆమె డ్యూటీ మొదలైంది. ఒకరిద్దరికి ట్రీట్ మెంట్ ఇచ్చిన తర్వాత మూడో బెడ్ దగ్గరికి వెళ్లగానే ఓ పిల్లాడు ఇంజక్షన్ వద్దని ఏడుస్తుంటే మన్విత ఓపిగ్గా బుజ్జగించి ఇంజక్షన్ వేసి ట్రీటిమెంట్ ఇచ్చింది. ఆ పిల్లాడి తల్లి కృతజ్ఞతాభావంతో చూస్తుంటే మృదువుగా నవ్వి అక్కడ నుండి కదిలింది మన్విత. " ఈ డాక్టరమ్మ చాలా నెమ్మదస్తురాలు. కోపమనేదేవుండదు.” అనుకున్నారు అమె వెళ్తుంటే ... ఆ మాటలు ఆమెకు విన్పిస్తున్నాయి. అలాంటి మాటలు రోజూ వింటూనే వుంది. అలా విన్నప్పుడు తన ఉనికికి ఓ అర్ధం వున్నట్లు ... తనని అందరు గుర్తిస్తున్నట్లు ఈజీగా తెలిసిపోతోంది.

మన్వితలో కాన్సన్ట్రేషన్ పెరిగింది. డిగ్నిటీ పెరిగింది.

ఇంకో బెడ్ దగ్గరికి వెళ్లగానే... ఆ బెడ్ మిద వుండే పిల్లాడికి ఊపిరందడం కష్టంగా వుంది. వార్డ్ బాయ్ ని పిలిచేంత టైం కూడాలేనట్లు త్వరత్వరగా ఆక్సిజన్ స్టార్టు చేసింది. అక్కడే నిలబడి ట్రీట్ మెంట్ ఇచ్చింది. ఆ బిడ్డను బ్రతకించడం కోసం తన శక్తి కొద్ది పోరాడింది ట్రీట్ మెంట్ ఇవ్వడంలో అమె ఏ మాత్రం జాప్యం చేసివున్నా ఆ బిడ్డ బ్రతికే వాడుకాదు.

విషయం తెలిసి... వెంటనే వచ్చి ఆమెను అభినందించాడు ధీరజ్. అశ వదులుకొని, రోదిస్తున్న ఆ తల్లి ... బిడ్డ బ్రతగ్గానే మన్విత కాళ్ల మీద పడింది. నడుస్తున్న మన్విత ఆగి అమె తలపై చేయివేసి... “అయ్యో ! నాదేముందమ్మా ! నీకు ఆ బిడ్డ మీద వున్న ఆశ, ప్రేమ బ్రతికించింది. అంతే !” అంది. ఆమెకు ఇంకా ఇద్దరు పిల్లలు వున్నా ఈ బిడ్డకోసం ఆ తల్లి పడ్డ అవేదన మన్విత కదలించింది. దేవుడు అన్ని చోట్ల వుండలేక 'అమ్మ' ను సృష్టించాడంటారు. ఇలాంటి అమ్మల్ని చూసే కదా ! పండ్లు , ఆట వస్తువులు, పుస్తకాలు, బట్టలు ఒకే ఇంట్లో వున్న పిల్లలు సమానంగా ఎలా పంచుకుంటారో... తల్లి కూడా తన ప్రేమను పిల్లలకి సమానంగా పంచుతుందంటారు. మరి తన తల్లి తన తమ్ముడిని, తనని సమానంగా చూసిందా ... ?

ఓ కేసు విషయం తన కేదో డిఫికల్టీగా అన్పించి ధీరజ్ వెతుక్కుంటూ క్యాజువాల్టీ దగ్గర ఆగింది మన్విత. అక్కడంతా సీరియస్ కేసులే వుంటాయి. అక్కడ కొంత మంది రోగుల్ని చూస్తుంటే ... ఆ రోగాల బాధ భరించలేక, పేదరికం సమస్యలు తట్టుకోలేక, తాము బ్రతకడం వల్ల తమ కుటుంబానికి ఎలాంటి ప్రయోజనం లేదన్నట్లు కన్పిస్తారు. 

కోడళ్లు సరిగ్గా చూడని అత్తలు ... కొడుకులు పట్టించుకోని తండ్రులు, డబ్బులిచ్చే వాళ్లు లేక, అప్యాయత పంచేవాళ్లు లేక, అభద్రతా భావంతో సతమతమవుతున్నారు. చేతనైతే వాళ్లకేదైనా సహాయం చెయ్యాలని వుంది. ఏం చెయ్యగలదు...? ధనవంతులు - బెడ్ రూముల్లో డబ్బుల దుప్పట్లు కప్పుకొని హాయిగా నిద్రపోతుంటే ఇక్కడ వీళ్లు ఏ దుప్పటి లేక నేలపై పడుకొని వణుకుతున్నారు.

ధీరజ్ ను కలిసింది మన్విత.

వాళ్లిద్దరు మాట్లాడుకుంటూ మెడిసిన్ వార్డు వైపు నడిచారు. ఆ రోజు తనకి క్యాజువాల్టీలో డ్యూటి వుందని చెప్పి అటువైపు వెళ్లాడు ధీరజ్.

మన్విత, తర్వాత హాస్టల్ కి వెళ్లింది. సంజన తన గైనిక్ డ్యూటి అయిపోవడంతో తను కూడా హాస్టల్ కి వచ్చింది... గైనిక్ వార్డులో తన అనుభవాలను మన్వితతో చెబుతోంది సంజన. చట్టపరంగానే అక్కడ జరిగే అబార్షన్లు తలుచుకుంటుంటే కళ్లు బైర్లు కమ్ముతున్నట్లు చెప్పింది." భూమ్మీదకు రాక ముందే ... కడుపులోనే మమ్మల్ని హత్య చేస్తున్నారు ఎందుకు? మేమేమైనా హత్యలు చేశామా? అమ్మాయిల మిద యాసిడ్లు పోశామా ? ఐ.టి. కంపెనీలు పెట్టి యువతరాన్ని ప్రాడ్ చేస్తున్నామా? పార్టీలు పెట్టి, పార్టీలు మార్చి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నామా? అంటూ అనెత్తుటి ముద్దలన్నీ ఏకమై ఒక చోట నినాదాలు చేస్తున్నట్లు, ధర్నాలు చేస్తున్నట్లు, నిరాహార దీక్షలు చేస్తున్నట్లు, నా కళ్ల ముందు కదులుతున్నాయి మనీ ! నన్నేం చేయమంటావు ?” అంది సంజన

సంజన చెప్పేది నిజమే ... అబార్షన్లనేవి దారుణమైన చర్య, నెత్తురుకి ఇచ్చే విలువ నెత్తుటి ముద్దలకి ఇవ్వడం లేదు. సంజన భుజం పై చేయి వేసి 'కంట్రోల్ యువర్ సెల్ఫ్' అన్నట్లుగా నిమిరింది మన్విత...

సంజన నేరుగా హాస్టల్ లోపలకి వెళ్లింది.

మన్విత గేటు దగ్గరకి వచ్చి - వాచ్మైనకి , ఏదో తెమ్మని చెబూతూ... 'ఐ' హాస్పటల్ ముందున్న చెట్ల నీడలో నిలబడి వున్న అనురాగ్, దీక్షిత లను చూసింది.

వాళ్లిద్దరు ఏప్రాన్ వేసుకొని చేతిలో స్టెతస్కోప్ ని పట్టుకొని దేని గురించో డీప్గామాట్లాడుకుంటున్నారు.

ఆ నిశ్శబ్దవాతావరణంలో ... ఆ చెట్ల ఆకులు మెల్లగా కదులుతూ ఏం చెబుతున్నాయి అంటే ...? “ అక్కడ రెండు మనసులు ఒక్కటిగా ప్రేమసాగరాన్ని మధిస్తున్నాయ్ ! అనుభూతుల్ని పంచుకుంటున్నాయ్ ! ఎవరూ అటు వెళ్లకండి ! ” అని ... బరువుగా నిట్టూర్చింది మన్విత.

ఇప్పుడు మన్విత మనసులో ఏ భావం లేదు.

ప్రేమలో ఓడిపోయినా ... ఆ ఓటమి నిరాశకు నాంది రాకుండా గెలుపుకి పునాది కావాలని, రోగుల మధ్యన అలసిపోవడంతో తృప్తిని పొందుతోంది. రోగులకోసం జీవించే జీవితంలో విలువల్ని వెతుక్కుంటోంది.

ప్రకాశవంతమైన ఆలోచనలు ఆమె మది గదిలోకి కొద్ది, కొద్దిగా ప్రేవేశిస్తుంటే లోపలకి వెళ్లింది మన్విత. లోపలకి వెళ్లాక వెంటనే ఓ పేపర్ తీసుకొని దాని మిద ...

“మనం ఏదైనా కావాలనుకున్నప్పుడు... అది మనకు అందుబాటులో వుండేదా? కాదా? అని చూసుకోవాలి ... అందుబాటులో లేని దయినప్పుడు దానిని కోరుకోకూడదు... అలాగే మనం కోరుకునేది మనకు అవసరమో కాదో కూడా చూసుకోవాలి... అనవసరంగా అలా కోరుకోవడం వల్ల దు:ఖం మిగులుతుంది. అందుకే ఎప్పుడూ పరిస్థితులు తెలుసుకొని ప్రవర్తించడం మంచిది...” అనిరాసి ఆ పేపర్ని ఎవరు చూసినా చదువకోటానికి వీలుగా మిర్రర్ పక్కన అంటించి... ఎప్పటి లాగే తన దిన చర్యలో పడిపోయింది.

***

మన్విత పిల్లల వార్డులో 15 రోజులు వుండి తర్వాత ఇ.ఎన్.టి లో 15 రోజులు ... ఆర్డో వార్డులో 15 రోజులు... ఆప్తిల్ వార్డులో 15 రోజులు ... ఎస్. పి.ఎమ్ లో 2 నెలలు.. అంటే అక్కడ ఒక నెల ప్రాజెక్ట్ చేసి ఇంకో నెల పి. హెచ్.సిలో ఓ.పి.లు చూసింది. తర్వాత ఇంకో నెల ఆప్స్నల్స్ కావడంతో తనకి ఇష్టమైన రేడియాలజీ, ఎనస్తీషియా పోస్టింగ్లకి అటెండ్ అయింది ... తర్వాత సెంట్రల్ పోస్టింగ్స్ మొదలయ్యాయి. మొదటిగా జి. ఎమ్. హెచ్ హాస్పిటల్ కి వెళ్లింది. అక్కడొక రెండు నెలలు ఓ.పి డ్యూటీల వార్డు పనులతో గడిచిపోయాయి.

అన్ని చికిత్సలకన్నా - మెటర్నిటీ పోస్టింగ్స్ సహజంగా వుండడంతో తనకి అసక్తి కలిగింది... తర్వాత అ పనితోనే కంటిన్యూ కావాలని కూడా సంకల్పించుకొంది. అలా రెండు నెలలు గడిచిపోయాయి.

రోజులు ఫాస్ట్, ఫాస్ట్గా గడచిపోతున్నాయి. 

ఇంకో ఐదు నెలలు గడిస్తే తన హౌస్ సర్జన్సీ అయిపోతుంది.

అది కూడా 2 నెలలు మెడిసిన్... 2 నెలలు సర్జరీ ... 1 నెల క్యాజువాలిటీ ... అంతే !

ఈ 5 నెలలు గడిచిపోతే డాక్టరైపోతుంది.

నైట్ డ్యూటీలతో, డే డ్యూటీలతో టైం తెలియడం లేదు మన్వితకి... హౌస్ సర్జన్ పీరియడ్లో టైం గురించి ఆలోచించకూడదు. అందుకే డ్యూటీలో వున్నప్పుడెప్పుడు త్వరగా వెళ్లాలని చూడదు. ఒక్కోసారి మన్వితను చూసి.. 'ఎందుకే అంత కష్టపడావ్ నీకు రెస్ట్ అవసరం లేదా ?' అంటుంది సంజన.

సంజన మనసులో ఏదీ దాచుకోదు. ఓ ఓ.పి,లో కూర్చున్నాక ఓ గంటలో ఇరవై మందిని చూసి చేతులు దులుపుకోవడం నాకు చేతకాదు సంజనా ! అలాగే రెండ్స్ కి వెళ్లి హడావుడిగా నాలుగు వార్డులు తిరిగి రావడం కూడా నచ్చదు. పేషంట్లు మన మీద ఎంతో నమ్మకం పెట్టుకొని వుంటారు. మన ధర్మాన్ని మనం పాటించాలి...' అంటూ నవ్వేది మన్విత. “మన్విత తన అత్మీయత తోనే రోగాల్ని తగ్గించగలదేమో' అని అప్పుడప్పుడు అనుకునేది సంజన...

ప్రస్తుతం క్యాజువాలిటీలో వుంది మన్విత.

అక్కడ పని పెరిగింది. కేసులు పెరిగాయి ఒకే టైమ్ లో ఐదారు కేసులు కూడా వస్తున్నాయి. సీరియస్ కేసులన్నీ క్యాజువాలిటీకి వస్తుంటాయి ఆ వార్డులో క్యాజువాలిటీ డాక్టర్స్, సి. ఎమ్.ఒ. డ్యూటి డాక్టర్స్. వుంటారు.

రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో పురుగుల మందు తాగిన ఓ పాతికేళ్ల కుర్రాడిని ట్రాక్టర్లో ఎక్కించుకొని హాస్పటల్ కి తీసుకొచ్చారు.పేషెంటిను చూసి వెంటనే పేషెంట్ దగ్గరికి వచ్చింది మన్విత. ముందుగా ఓ.పి. స్లిప్ లో రాసి ... వైటల్స్ చూద్దామనేలోవలే అతను చనిపోయివున్నాడు. తాపత్రయం కొద్దీ, పేషంటిని బ్రతికిద్దామన్నట్లుగా (సి.పి. అర్) కార్డియో పర్మనరీ రీస సైటేషన్ చేసింది. ఫలితం కన్పించలేదు.

ఆ కుర్రాడికి తోడుగా ఇద్దరు మాత్రమే వున్నారు. మిగతా వాళ్లంతా బయటనిలబడివున్నారు. వాళ్లది పాకాల.

'సారీ ! అతను ఆల్ రెడీ చనిపోయాడు,' అంది మన్విత.

" అయ్యో ! చూడండి డాక్టర్ ! ఇప్పటివరకు బ్రతికే వున్నాడు. మళ్లీ ఒకసారి చూడండి ! చనిపోలేదు.” అంటూ పేషంట్ తాలూకు వ్యక్తులు బ్రతిమాలారు. వాళ్లు కాళ్లావేళ్లా పడ్తుంటే... వాళ్లను కాదనలేక, వాళ్ల సాటిస్ఫ్యాక్షన్ కోసం ఆ పేషంట్ గుండె పై అర చేతుల్ని పెట్టి గట్టిగా ప్రస్ చేసి చూసింది.

(ఇంకా ఉంది)


No comments:

Post a Comment

Pages