శివం -72 - అచ్చంగా తెలుగు
శివం -72 
రాజ కార్తీక్ (హర సిద్ధుడు గుడిలో కథ మొత్తం తెలుసుకున్న తర్వాత ధర్మయ్య తో మాట్లాడిన తర్వాత దూరంగా రాజ పరివారం రావడం గమనించాడు)

ధర్మయ్య "చూడు నాయనా! మా రాజు గారు వస్తున్నారు. ఆయన వయసులో వృద్ధులు నేను నీకు చెప్పిన సంఘటన జరిగినప్పుడు అక్కడ ఆయన కూడా ఉన్నారు. కాబట్టి ఆయనకి నీ విలువ స్పష్టంగా తెలుసు, మహా దేవుడు చెప్పిన మనిషి మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు రావడం ఆయనకే కాదు, మా రాజ్యంలో అందరికీ చాలా ఆనందంగా ఉంది. అలాగే నువ్వు నాకు చెప్పిన కథ అంతా మా రాజు గారికి కూడా చెప్పు. ఆయన నిన్ను తగిన విధంగా సన్మానిస్తారు, నేను నీ వెంటే ఉంటా." అన్నాడు.

హర సిద్ధుని మనసు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ఇలాంటి సంఘటనలు కదా తన జీవితంలో తాను కోరకుంది, తన పనితనం అంతా మెచ్చుకోవడం, తన నీతి నిజాయితీ ని అందరు గుర్తించడం, తనని డబ్బుతో పోల్చకుండా, నా ఆశీస్సులు పొందిన వాడిగా చూడటం అతనికి ఎంతో ఆనందం కలిగించింది. కుంభన్న రూపంలో, తను నన్ను అడిగిన సమాధానానికి నేను తిరిగి వేసిన ప్రశ్నకి, తద్వారా అంతర్గతంగా తనకు కలిగిన జ్ఞానానికి, అంతా సరిసమానంగా అనిపిస్తుంది. ఇక హర సిద్ధికి తదుపరి లక్ష్యం ఒకటే.. తన తల్లికి జీవితాంతం కష్టపడకుండా కూర్చుని తినే సౌలభ్యం కల్పించడం!

మహారాజు దగ్గరికి రావడంతో గుడి చుట్టుపక్కల సైనికులు రక్షణ వలయంగా నుంచున్నారు. అతడు ఉన్నతమైన ప్రశంస అందుకో బోతున్నాడని నాకు సంతోషంగా ఉంది. కానీ హార సిద్ధు ఏనాడు ఏ గొప్పలు కోరుకోలేదు. గొప్ప పనులు చేయాలనుకున్నాడు, దాని ప్రతిఫలం పేదలకి దీనులకు అందాలని, తన కుటుంబం, నమ్మి తనతో ఉన్నవారికి ఆ సొమ్ము పంచుదాం అనుకున్నాడు. కానీ తన స్వార్థం చూసుకోవడం చేతగాని పిచ్చివాడు కనుక జీవితంలో అందరికన్నా వెనకబడ్డాడు, ప్రతిభ ఉందని అనుకున్నాడు. కుంభన్న రూపంలో నేను చెప్పిన సారాంశాన్ని అర్థం చేసుకొని తన ప్రతిభ కూడా భగవంతుని దయ అనీ, ఆ ఒక్క గుర్తింపు రావాల్సిన అవకాశం కూడా దేవుని దయ అనీ మనస్ఫూర్తిగా నమ్మాడు. అలా అలా హర సిద్దు మనసులో ఉన్న కొద్దిపాటి మాలిన్యాన్ని దూరం చేశాను. గుర్తుంచుకోండి భక్తులారా, మీకు నేను ఇచ్చిన ప్రతి పని మంచి కోసం ఉపయోగించండి. కొంచెం ఆలస్యం అవ్వచ్చు గాని కాలం కలిసి వస్తుంది. అప్పుడు నిమిత్తమాత్రుడిగా ఉండి మీ బాధ్యతను నెరవేర్చి, ఫలితం నామీద వదిలిపెట్టండి. మీ ప్రయత్నం తప్పక చేయండి, అన్నీ అవే జరుగుతాయి. మీ అచంచలమైన విశ్వాసం నన్ను కట్టిపడేస్తుంది. ఆ ముడులు తీయడం ఎవరి వల్ల కాదు.. 

"రాజాధి రాజ రాజ మహారాజా వేం చేస్తున్నారహో.." 

వృద్ధుడైన రాజుగారు పల్లకీ దిగి నిలబడి, సిద్దు తెచ్చిన బొజ్జ లింగం, దగ్గరికి వెళ్లి... నమస్కరిస్తూ,

"కుంభన్న స్వామి నన్ను, మా రాజ్యాన్ని, మా ప్రజల్ని, ఈ భరత వర్షాన్ని చల్లగా చూడు, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో భగవత్ చింతన తో బ్రతికే విధంగా అనుగ్రహం ఇవ్వు, మీరు చెప్పిన విధంగా మళ్లీ ఈ బొజ్జ లింగాన్ని, ప్రతిష్ట చేస్తాం.." అన్నాడు.

మహారాజు హరసిద్ధి వైపుకు తిరిగి,
"తమరు ఎంతో అదృష్టవంతులు తమరు ఎంతో ఎంతో గొప్ప పని చేసారు..." అన్నాడు.‌ హరసిద్ధు భావావేశానికి లోనయ్యాడు..

ఈ లోపు ధర్మయ్య కల్పించుకొని జరిగిన కథంతా చెప్పి, హర సిద్దు చేత కూడా చెప్పించాడు.

మహారాజు "తమకు జరిగిన ఈ అదృష్టానికి నామనసు కుళ్ళు కుంటుంది. ఎన్ని జన్మల తపస్సు చేశావు? ఎన్ని నోములు చేస్తే నువ్వు పుట్టావు? నీ తల్లిదండ్రులు నీ వంశస్థులు అందరూ స్వర్గంలో ఉన్న కైలాసానికి వెళ్ళిపోతారు," అంటూ హర సిద్ధుని పాదాలకు వందనం చేయబోయాడు.

హరి సిద్దు తీవ్రంగా ప్రతిఘటించి వెనక్కి నడిచి, "తమరు అందరికీ తండ్రి లాంటి వారు, అలాంటి పనులు చేయకూడదు"అని చేతులు పట్టుకున్నాడు.

రాజు గారి వందనం చేయపోయేసరికి అందరికీ కీ హర సిద్ధుడు అంటే ఎంతో అభిమానం ఏర్పడింది.. ఇప్పుడు జరిగింది ఒక సంఘటన..
ఎవరో కొంత మంది గుర్రాలమీద వచ్చి సైన్యం మీద దాడి చేశారు.. ఆ సంఘటనతో మొత్తం మారిపోయింది.. ఈ హఠాత్పరిణామానికి అందరూ విస్తుపోయారు.. అక్కడ ఉన్న కొద్దిపాటి సైనికులు ప్రతిఘటన మొదలుపెట్టారు, మరింత సైనిక బలం కోసం పావురాలని లేఖా సమేతంగా పంపారు.

ధర్మయ్య మాత్రం మహారాజు వెంట ఉన్నాడు..

సంధించిన బాణము వలె ఒక కత్తి వచ్చి మహారాజుని తాకబోయింది.. దాన్ని చాకచక్యంగా పట్టుకున్నా డు హర సిద్ధుడు.... మహారాజు వైపు వస్తున్న బాణాలను తన చేతిలో ఉన్న కత్తిని అదుపుగా పట్టుకొని తగలకుండా నిరోధిస్తున్నాడు హర సిద్ధుడు...

హర సిద్ధుని గురించి ఇక ముందు ముందు మీరు ఇంకా తెలుసుకోవాల్సి ఉంది...

No comments:

Post a Comment

Pages